Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్రాజ్యవాదం పని ఎప్పుడో అయిపోయిందని, అది కొనసాగడం లేదని ఒక పొరపాటు అభిప్రాయం చాలామందిలో ఉంది. వలసాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగి దేశాలు స్వతంత్రం సాధించాక సంపన్న సామ్రాజ్యవాద దేశాలు పాత వలస దేశాల్లోని వనరులపైన తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించాయని, అందుకోసం తమ వద్దనున్న అన్ని రకాల సాధనాలనూ-అక్కడి ప్రభుత్వాలను కూలదోసే కుట్రల నుండి సాయుధంగా జోక్యం కల్పించుకోవడం వరకూ-ఉపయోగించాయని, అయితే ఆ పరిస్థితి ఇంకెంతమాత్రమూ కొనసాగడం లేదని, ఆ దేశాల స్వతంత్రతను అంగీకరించక తప్పలేదని, ఇప్పుడు వివిధ దేశాల నడుమ స్వచ్ఛందంగా జరిగే చర్చల ప్రాతిపదికన అంతర్జాతీయ ఒప్పందాలు జరుగుతున్నాయని, కొన్ని దేశాలను మరికొన్ని దేశాలు దోపిడీ చేయగలిగే పరిస్థితి ఇప్పుడు లేదని వారు భావిస్తున్నారు. .
సామ్రాజ్యవాదపు సారాంశాన్ని వీరు గుర్తించడం లేదు. సామ్రాజ్యవాదం అంటే హింస, బలప్రయోగం ద్వారా లొంగదీసుకోవడం మాత్రమే అని వీరు భావిస్తున్నారు తప్ప సంపన్న పశ్చిమ దేశాలకు, మూడో ప్రపంచ దేశాలకు మధ్య ఉండే సంబంధపు సారాంశం సామ్రాజ్యవాదం అని వీరు అనుకోవడం లేదు. సామ్రాజ్యవాదపు 'రూపాన్ని' మాత్రమే నిజమైన సామ్రాజ్యవాదం అనుకుంటున్నారు కాని 'సారం' ఏమిటో గ్రహించడం లేదు. ఇప్పుడు సామ్రాజ్యవాదం తక్కిన మూడవ ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి హింస, బలప్రయోగం ఇంకెంతమాత్రమూ అవసరం లేదనేది వాస్తవం. పైపైన చూస్తే మూడో ప్రపంచ దేశాలు తమ ఇష్టపూర్వకంగానే వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. కాని వాస్తవం ఏమంటే సామ్రాజ్యవాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
భూ వినియోగంతో సహా ప్రపంచంలోని వనరుల మీద ఆధిపత్యాన్ని కొనసాగించడం సామ్రాజ్యవాదపు సారాంశం. నయా వలస విధానం అని పిలవబడే కాలంలోనే పూర్వపు వలస దేశాలు చాలా పోరాటాల అనంతరం తమ తమ వనరుల మీద పెత్తనాన్ని పొందగలిగాయి. నిజానికి నయా వలసవిధాన కాలపు ప్రధాన లక్షణం ఈ పోరాటాలే. కాని నయా ఉదారవాద ప్రపంచీకరణ యుగంలో సంపన్న పశ్చిమ దేశాలు ఎటువంటి పోరాటమూ లేకుండానే మూడో ప్రపంచ దేశాల వనరులపై తిరిగి పెత్తనాన్ని చేజిక్కించుకున్నాయి.
భారతదేశంలో సైతం ఇదే జరిగింది. 1931లో జరిగిన కరాచీ కాంగ్రెస్ మహాసభ మొదటిసారి స్వతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలన్న అవగాహనకు రూపం ఇచ్చింది. దేశంలోని సహజ వనరులన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, వాటిని ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని ఆ మహాసభ తీర్మానంలో పేర్కొన్నారు. సరళీకరణ విధానాలు మొదలయ్యేదాకా కరాచీ తీర్మానంలో ప్రకటించిన విధానమే ప్రభుత్వ అధికారిక విధానంగా కొనసాగింది. కాని సరళీకరణ కాలంలో మన దేశీయ సహజ వనరులను అభివృద్ధి చేయడం కోసం దేశీయ గుత్తాధిపతులతోబాటు విదేశీ పెట్టుబడిని కూడా ఆహ్వానించారు.
భారతదేశంలో మాత్రమే కాకుండా తక్కిన మూడో ప్రపంచ దేశాలలో కూడా ఇదే విధంగా అంతకు ముందున్న విధానాన్ని తిరగదోడి మళ్ళీ విదేశీ పెట్టుబడికి పెద్దపీట వేయడం జరిగింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ అనే మూడు సంస్థల ద్వారా ఈ విధాన మార్పు మూడో ప్రపంచ దేశాలపై బలవంతంగా రుద్దబడింది. ఆ మూడు సంస్థలూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు గురించి అందరికీ బాగానే తెలుసు. కాని ప్రపంచ వాణిజ్య సంస్థ ఎటువంటి పాత్ర నిర్వహిస్తుందో అంత బాగా తెలియదు.
'స్వేచ్ఛా వాణిజ్యం' అనే ముసుగులో గతంలో వలస పాలన కాలంలో తమ వలసలలోని స్థానిక పరిశ్రమలను, వృత్తులను, వ్యవసాయాన్ని నాశనం చేసి, కొల్లగొట్టిన అనుభవం మన ముందుంది. అయినప్పటికీ మళ్ళీ ప్రపంచ వాణిజ్య సంస్థ అదే 'స్వేచ్ఛా వాణిజ్యం' పేరుతో మూడో ప్రపంచ దేశాల మీద ఒక వాణిజ్య వ్యవస్థను రుద్దుతోంది. ఈ వ్యవస్థ సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు మాత్రమే అనుకూలంగా నడిచే వ్యవస్థ. ఈ అసమానమైన వాణిజ్య వ్యవస్థ వలన కలిగే పర్యవసానాలలోని ఒక అంశాన్ని - మూడో ప్రపంచ దేశాల ఆహార స్వయం సమృద్ధిని నాశనంచేసే అంశాన్ని- మాత్రమే నేనిక్కడ ప్రస్తావిస్తాను. మూడో ప్రపంచ దేశాలు ఆహారధాన్యాల విషయంలో స్వంతంగా తమ కాళ్ళ మీద నిలబడగలిగే స్థితిని దెబ్బ తీస్తే అప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాల వద్ద ఉన్న మిగులు ధాన్యాలను అమ్ముకోవచ్చు. పైగా మూడో ప్రపంచ దేశాలలోని వ్యవసాయ భూముల వినియోగాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చే వీలుంటుంది. పశ్చిమ, శీతల దేశాల్లో చాలా రకాల పంటలు పండవు. ఒకవేళ పండించినా, చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. మూడో ప్రపంచ దేశాలలో సమశీతోష్ణ, ఉష్ణ మండల ప్రాంతాల్లో దాదాపు అన్ని రకాల పంటలూ పండుతాయి. కాబట్టి ఆ సంపన్న దేశాలు తమకు కావలసిన అన్ని రకాల పంటలనూ, ఆకుకూరలు మొదలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పువ్వులు పండించేలా మూడో ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేయగలుగుతాయి. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో ఆహారోత్పత్తిలో సాధించిన స్వయంసమృద్ధిని దెబ్బతీసిన దరిమిలా అక్కడ ప్రస్తుతం సంభవిస్తున్న కరువుకాటకాలనూ, ఆ దుస్థితిలో వాటి మెడలు వంచి తమ దోపిడీని ముమ్మరం చేస్తున్న సామ్రాజ్యవాదుల చర్యలనూ గమనిస్తే మన ముందు పొంచి ఉన్న ప్రమాదం బోధపడుతుంది.
ఈ విధంగా మూడో ప్రపంచ దేశాల ఆహార స్వయంసమృద్ధిని నాశనం చేయడానికి సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న విధానాలు ఏ మాత్రమూ హేతుబద్ధంగా లేవు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆయా దేశాలు తమ రైతులకు అందించే సహాయాలను 'అనుమతించదగినవి', 'అనుమతించదగనివి' అని రెండు రకాలుగా విభజించింది. నేరుగా రైతులకు నగదు చెల్లింపులు చేయడం అనుమతించదగినది గాను, పంటలకు మద్దతు ధరలు గ్యారంటీ చేయడం వంటి చర్యలు అనుమతించదగనివి గాను తేల్చింది. అమెరికా వంటి దేశాల్లో రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ నేరుగా నగదు చెల్లించడం చాలా తేలిక. అదే భారతదేశంలో కోట్లాదిమంది రైతులున్నారు. వారికి తోడ్పాటునివ్వాలంటే మద్దతు ధర అమలు చేయడమే సరైన మార్గం అవుతుంది. ఏదో ఒక చెల్లని ఆర్థిక సిద్ధాంతాన్ని చెప్పి కొన్ని రకాల సహాయాలు అనుమతించదగినవిగా, మరికొన్ని అనుమతించదగనివిగా సూత్రీకరించడం మన దేశంలోని రైతులకు ప్రతికూలంగా పరిణమించే విధానం.
ఇక 'అనుమతించదగని' ఆర్థిక సహాయం ఎంత పరిమితికి లోబడి ఉండాలన్నది కూడా ఒక వివాదాస్పద అంశం. ఒక దేశం తన రైతులకు అందించే సహాయం ఎంత పరిమితిని దాటకూడదన్నది లెక్కించే విధానమే హేతువిరుద్ధంగా ఉంది. అమెరికా, భారతదేశం మీద ఇచ్చిన ఫిర్యాదు ఇందుకొక ఉదాహరణ. గోధుమ, వరి ధాన్యాల ధరలను ఆయా దేశాలతో పోల్చడానికి బేస్ ఇయర్‌గా 1986-88సంవత్సరాల సగటును తీసుకోవాలని నిర్ణయించారు. అప్పటి ధరలు డాలర్ రేటులో ఎంత ఉన్నాయో దానిని, అప్పటి రూపాయి మారకం రేటు డాలర్‌తో పోల్చినప్పుడు ఎంత ఉండేదో దానిని కలిపి పరిగణించి బేస్ ఇయర్లో రూపాయల్లో వరి, గోధుమ ధరల బెంచ్‌మార్క్ ధరలను నిర్ధారించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఆ బెంచ్‌మార్క్ ధర కన్నా ఎంత ఎక్కువగా ఉందో చూసి ఆ తేడాను ఈ ఏడాది పండిన మొత్తం పంట ఎంత ఉందో దానితో గుణించి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీగా అమెరికా తేల్చింది. ఆ సబ్సిడీ మొత్తం పంట విలువలో ఒకానొక శాతానికి మించి వుందని, అందుకు తనకు అభ్యంతరం ఉందని అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గర పేచీ లేవనెత్తింది. 2013-14లో గోధుమ బెంచ్‌మార్క్ ధర రూ.360గా ఉంటే ప్రభుత్వం రూ.1390 మద్దత్తు ధరగా (క్వింటాలుకి) ప్రకటించిందని అందుకు అభ్యంతరం పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది గనుక ఆ వివాదం గురించి లోతుగా ఇక్కడ చర్చించడం సాధ్యం కాదు.
కాని అమెరికా అభ్యంతరం పెట్టడానికి అవకాశం కల్పించిన విధంగా ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉన్నాయనేది ఇక్కడ గమనించాలి. మొదటిది: మొత్తం పండిన పంటనంతటినీ కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశారని అమెరికా ఏ ప్రాతిపదికన నిర్ధారణకు వచ్చింది? వాస్తవానికి మొత్తం పంటలో ఒక చిన్న భాగం మాత్రమే కనీస మద్దతు ధరకు అమ్ముడుపోతున్నది. అటువంటప్పుడు మొత్తం పండిన పంట అంతటికీ లెక్క వేసి అలా వచ్చిన మొత్తం మేరకు ప్రభుత్వం రైతులకు సహాయం అందించిందని ఎలా నిర్ధారిస్తారు? రైతులు పండించే పంటలో ఒక గణనీయమైన భాగం వారి స్వంత వినియోగానికి పోతుందన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ ఎందుకు విస్మరించింది? అంటే ఈ దేశపు ఆహారధాన్య వినియోగం తీరుతెన్నులను, దాని ప్రత్యేక పరిస్థితులను ప్రపంచ వాణిజ్య సంస్థ పరిగణనలోకి తీసుకోలేదు. రెండవది: బెంచ్‌మార్క్ ధరను నిర్ణయించాక అప్పటి బేస్ ఇయర్ నుండి (1986-88 నుండి) ఇప్పటికి వచ్చేసరికి ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందో దానిని కూడా పరిగణన లోకి తీసుకోలేదు. డాలర్-రూపాయి మారకం రేటులో వచ్చే మార్పును కూడా పరిగణన లోకి తీసుకోలేదు. అవన్నీ పరిగణిస్తే అమెరికా అభ్యంతరానికి ప్రాతిపదిక ఉండనే వుండదు. మూడో ప్రపంచ దేశాల రైతాంగానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉన్నాయని, ఈ దేశాల ఆహార స్వయంసమృద్ధిని దెబ్బ తీయడమే ఆ నిబంధనల లక్ష్యం అని దీనిని బట్టే నిర్థారణకు రావచ్చు.
ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ 'స్వేచ్ఛా వ్యాపారం' పేరుతో మూడో ప్రపంచ దేశాలు తమ తలుపులను విదేశీ వ్యాపారానికి బార్లా తెరిచేలా ఒత్తిడి చేస్తాయి. తలుపులు తెరిచాక, మూడో ప్రపంచ దేశాలకు విదేశీ వ్యాపార చెల్లింపుల విషయంలో లోటు తలెత్తుతుంది. ఆ లోటును భర్తీ చేసుకోడానికి సహాయం కోరితే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు 'పొదుపు చర్యలు' పాటించాలన్న షరతు విధిస్తాయి. అంతేగాక ఆ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు మూడో ప్రపంచ దేశాల నుండి ముడిసరుకులను స్థిరమైన ధరలకు ఎగుమతి చేయాలని ఆదేశిస్తాయి. దానికి ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు తోడై, మూడో ప్రపంచ దేశాలలో పంటలను ఆహారేతర పంటలవైపు మారేవిధంగా ఒత్తిడి చేస్తాయి.
గతంలో సాయుధ బలగాలతో సంపన్న పెట్టుబడిదారీ దేశాలు మూడో ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేసి తమకు అనుకూలమైన విధానాలను అమలు చేయించుకున్నాయి. కాని ఇప్పుడు ఏ బలప్రయోగమూ అవసరం లేకుండానే 'శాంతియుతంగా' తమకు కావలసిన విధంగా మూడో ప్రపంచ దేశాలు నడుచుకునేటట్లు చేయగలుగుతున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి సంస్థలను ఏర్పాటు చేసేవరకూ, ఆ సంస్థలు తమ పట్టు సాధించేవరకూ బహుశా సాయుధ బలప్రయోగం మీద సామ్రాజ్యవాదం ఆధారపడిందని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ సంస్థలు తమ పట్టు బిగించాయి గనుక ఇక బలప్రయోగం అవసరం తీరిపోయింది. బలప్రయోగం లేదు గనుక సామ్రాజ్యవాదమే లేదు అని అనుకుంటే అంతకన్నా పొరపాటు అభిప్రాయం మరొకటి ఉండదు. సామ్రాజ్యవాదం నేటికీ తన పెత్తనాన్ని మూడో ప్రపంచ దేశాల మీద చెలాయిస్తూనే ఉంది. విచ్చలవిడిగా వనరులను, సంపదను కొల్లగొడుతూనే ఉంది.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్