Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గురూజీ' ఎమ్.ఎస్. గోల్వాల్కర్ జన్మదినం (ఫిబ్రవరి 27) సందర్భంగా ఆంధ్రజ్యోతిలో త్రిలోక్గారు ఫిబ్రవరి 26న 'నిలువెత్తు దేశభక్తి' అనే వ్యాసం రాశాడు. బాధాకరమైన అంశమేమంటే ఆవ్యాసంలో త్రిలోక్ అన్నీ వక్రీకరణలే చేశారు. వాటిని పరిశీలిద్దాం. ఆ వ్యాసంలో త్రిలోక్ ''స్వామి వివేకానంద అంతర్ దృష్టికీ, ఆచరణాత్మక దృక్పథానికీ దగ్గరగా ఉన్న సంఘకార్యాన్ని గురూజీ తన జీవితానికి ఏకైక లక్ష్యంగా చేసుకున్నారు'' అని రాశారు. కాని వివేకానందుని అంతర్ దృష్టి, ఆచరణలకు గోల్వాల్కర్ పూర్తి భిన్నమైన దృక్పథం కలిగి ఉన్నారు. ఉదాహరణకు వివేకానందుని అంతర్ దృష్టి పరమత సహనంతో కూడినది. సర్వమత మహాసభలో, తన ప్రారంభోపన్యాసంలోనే ఆయన ''సర్వమత సహనాన్నే మేం విశ్వసిస్తాం... ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించబడిన గంట సర్వవిధాలైన స్వమత దురభిమానానికీ, పరమత ద్వేషానికీ, కొందరిలోని నిష్ఠూర ద్వేషభావాలకూ శాంతి పాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను'' అన్నారు.
కాని గోల్వాల్కర్ ఆలోచనలెలాసాగాయి...? ఆయన ఉపన్యాసాల సంపుటి 'పాంచజన్యం' మొదటి అధ్యాయంలోనే ఇతర మతాలను గూర్చి ఇలా చెప్పారు. ''విస్తరణ దాహం గల ఇస్లాం, క్రైస్తవం ఇక ఇప్పుడు కమ్యూనిజం, ఇంకా ఇతర దేశాల్లో జన్మించిన అనేకమంది విశ్వవిజేతల చేతలచే చరిత్ర పుటలు రక్తసిక్తాలయ్యాయి.'' ఆ విధంగా తన పరమత అసహనాన్ని గూర్చి ఆ గ్రంథం మొదట్లోనే (12వ పేజీలోనే) వెలిబుచ్చారు.
ఆ గ్రంథంలో మరోచోట గోల్వాల్కర్ ఇలా సెలవిచ్చారు. ''పంజాబులోని అంబాలా నియోజకవర్గంలో ఉన్న ఒక్కగానొక్క ముస్లిం ఓటరు 1957 ఎన్నికల్లో పోటీ చేశాడు. అయినా ఆ ముస్లిం గెలుపొందాడు. మన జాతి యొక్క ఆత్మహత్యా సదృశ్యమైన ఆత్మవిస్మృతి యొక్క స్థాయి ఇట్టిది. (పాంచజన్యం పేజీ 313).
ఇలా అభ్యర్థి సేవానిరతిని కాకుండా, మతాన్ని చూసి మాత్రమే ఓటు వేయాలని ఆయన ప్రభోదించారు.
ఇక 'మనము, మన జాతీయత నిర్వచనం' అనే చిన్న గ్రంథంలో ముస్లింలు ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా కూడా బతకకూడదనీ, వారిని హిట్లర్ యూదులను చేసినట్టే నిర్మూలించాలని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
వివేకానంద ఈ దేశంలోని పేదలను గూర్చి తీవ్రమైన ఆవేదన చెందాడు. ''ఇక్కడ పట్టెడన్నం పెట్టలేక, స్వర్గంలో శాశ్వతానందం ప్రసాదించే దేవుని నేను నమ్మను. భారత దేశాన్ని మేల్కొల్పాలి. పేదల ఆకలి బాధతీర్చాలి. విద్యను వ్యాపింప జేయాలి.'' (శ్రీవివేకానంద సాహిత్య సర్వస్వం'' సంపుటి 6, పేజీ 371)
మరోచోట మరింత స్పష్టంగా కార్మిక రాజ్యమే ఇప్పుడున్న వ్యవస్థకంటే మరింత మెరుగైనదని వివేకానంద ప్రకటిస్తాడు. ఆయన ఏమన్నాడంటే... ''నేను సామ్యవాదిని. సామ్యవాదం లో లోపాలు లేవని కాదు. అసలు రొట్టెలేకుండా ఉండటం కంటే, సగం రొట్టె అయినా మేలే కదా? అందుచేత నేను సామ్యవాదిని. కొందరికే ఎల్లప్పుడూ సుఖాలు కలుగటం, మరికొందరికి సదా దుఃఖాలు వాటిల్లడం కంటె, ఇతరులను కూడా వాటిలో భాగస్వాములను చేయడం మంచిది కదా?'' (శ్రీవివేకానంద సాహిత్య సర్వస్వం, సంపుటి 10 పేజీ 84).
మరి గోల్వాల్కర్ అంతర్ దృష్టి ఈ విషయంలో ఎలా ఉంది?
''సమాజవాదం ఈ దేశానికి చెందినది కాదు. అది మన రక్తంలోనూ, సంప్రదాయంలోనూ ఇమడలేదు. ఇక్కడున్న కోట్లకొలది ప్రజలకు అది సరిపడని భావం. త్యాగమయమైన జీవితాన్ని శీలాన్ని అది మనలో ప్రోత్సహించలేదు. దీన్నిబట్టి మన జాతీయ జీవనానికి ఆదర్శంగా ఉండదగిన ప్రాధమిక అర్హతలు కూడ దీనిలో లేవని గమనించవలసి ఉంది.'' (ప్రాంచజన్యం, పేజీ 292.)
ఇలా వివేకానందుని అంతర్ దృష్టికి విభిన్నమైన అంశాలే గోల్వాల్కర్ కలిగి ఉన్నారు. పనిలో పనిగా త్రిలోక్గారు చరిత్రను గూడ వక్రీకరించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో ఆయన ఇలా రాశారు. ''స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్ళలో, కాశ్మీర్ సమస్యను పరిష్కరించి, ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి గురూజీ (గోల్వాల్కర్) సరియైన వ్యక్తి అని సర్దార్ పటేల్ భావించారు. ఆయనను ప్రత్యేక విమానంలో కాశ్మీర్ రాజా దగ్గరకు పంపించారు. కాశ్మీర్ భారతదేశంలో కలిసే విధంగా వారు రాజు హరిసింగును ఒప్పించారు. వారి కృషి ఫలితంగానే నేడు మన దేశంలో కాశ్మీర్ ఉన్నది.''
అసలు చరిత్రలో ఏం జరిగింది? ఏ చరిత్ర గ్రంథంలోనైనా ఈ విషయం ఉన్నదా? లేదు. విచిత్ర మేమిటంటే, సంఫ్‌ు పరివార్ ''పూజ్యశ్రీగురూజీ'' అనే పేరు మీద గోల్వాల్కర్ జీవిత చరిత్రను ప్రచురించింది. అది 215 పేజీల పుస్తకం. దానిలో గోల్వాల్కర్ జీవితంలోని అన్ని అంశాలనూ వివరంగా తెలియజేయడం జరిగింది. కానీ, ఇంత వివరమైన పుస్తకంలో కూడా రచయిత అన్నదానం బిదంబరశాస్త్రి పై విషయాన్ని ప్రస్తావన చేయలేదు. అంత ముఖ్యమైన సంఘటనను రాయలేదంటే, ఆ సంఘటన జరగనట్లే కదా? అంటే త్రిలోక్గారు వాస్తవాన్ని వక్రీకరించినట్లే కదా? కాబట్టి దేశ భక్తులైన వారు వాస్తవాలను తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.
- విశ్వం,
సెల్: 9490300449