Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గవర్నర్ల నియామకంలో లేదా రీకాల్ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను ఇచ్చేందుకు రాజ్యాంగానికి సవరణలు చేయాలని ప్రతిపాదిస్తూ కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో సంస్కరణలపై జస్టిస్ పుంచ్చి కమిషన్ చేసిన సిఫార్సులకు స్పందనగా ఈ లేఖ రాశారు. ప్రస్తుతం గవర్నర్‌ను కేంద్రం నియమిస్తున్నందున ఆయన కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగానే వ్యవహరిస్తున్నారు. అందువల్ల గవర్నర్ పాత్రలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని దీర్ఘకాలంగా అందరూ అభిప్రాయపడుతున్నారు. కేరళ ప్రభుత్వ వైఖరిలో కూడా ఇది ప్రతిబింబిస్తోంది. గవర్నర్ తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను నిర్వర్తించే సమయంలో రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్లు తేలితే ఆయనను రీకాల్ చేయాలంటూ సిఫార్సు చేసేందుకు రాష్ట్ర శాసనసభకు అధికారమిచ్చేలా రాజ్యాంగంలోని 156వ అధికరణకు సవరణ తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కోరుతోంది.
ఇటీవలి సంవత్సరాల్లో, 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రం లోని పాలక పార్టీ అవసరాలు, ప్రయోజనాలు నెరవేర్చేలా గవర్నర్ల నియామకం జరగడమనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కొంతమంది గవర్నర్లు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉంటుండగా, మరికొందరు పాలక పార్టీ దృష్టిలో మంచిగా ఉండేందుకు గానూ కేంద్రం ఇష్టాయిష్టాలకు పట్టంగట్టే రాజకీయ నేతలుగా ఉంటున్నారు.
కేరళలో, గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ రాజ్యాంగ నిబంధనలకు ఏమాత్రమూ అనుగుణంగాలేని రీతిలో అసాధారణ వైఖరులు తీసుకుంటున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీని ఉద్దేశించి చేసే ప్రసంగంపై సంతకం పెట్టేందుకు కూడా తొలుత గవర్నర్ నిరాకరించారు. అయితే చివరి నిముషంలో పట్టువీడి పూర్తిస్థాయి ప్రసంగం చేశారు. యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ల నియామకంలో కూడా ప్రభుత్వ యూనివర్సిటీల ఛాన్సలర్‌గా ఆయన పాత్ర వివాదాస్పదంగానే ఉంది. కన్నూర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ను తిరిగి నియమిం చడం చెల్లుబాటు అవుతుందంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ ఉత్తర్వులపై తొలుత గవర్నర్ సంతకాలు చేశారు. కానీ ఆ తర్వాత దానిపై కొన్ని అపోహలు వ్యక్తం చేయడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఇతర బీజేపీ యేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లు కూడా దారుణంగా, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్ క్రమం తప్పకుండా ప్రతి రోజూ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూనే ఉంటారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాధినేతలను మించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడానికి గవర్నర్ ప్రయత్నిస్తూ ఉంటారు. మహారాష్ట్రలో, శాసనమండలికి నియమిం చాల్సిన 12మంది నామినీలకు సంబంధించి ప్రభుత్వం చేసిన సిఫార్సులను గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ తొక్కిపెట్టారు. ఛాన్సలర్‌గా తన హోదాను ఉపయోగించి... యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో... తనకు నచ్చిన రీతిలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గవర్నర్ ఈ రీతిలో జోక్యం చేసుకుంటుండడం, గతేడాది డిసెంబరులో మహారాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక చట్టాన్ని ఆమోదించడానికి దారితీసింది. ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రిని ప్రో-ఛాన్సలర్‌గా నియమించాలని, వైస్ ఛాన్సలర్ల నియామకపు ప్రక్రియలో మార్పులు చేయాలని ఆ సవరణలు ప్రతిపాదించాయి. ఈ సవరణతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు పేర్ల ప్యానెల్ నుండి ఒక పేరును 30రోజుల్లోగా ఎంపిక చేయడానికే గవర్నర్ పాత్ర పరిమితమైంది.
తమిళనాడులో, గవర్నర్ ఆర్.ఎన్.రవి కూడా యూనివర్శిటీల వైస్ చాన్సలర్ల వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిం చారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన నీట్ బిల్లును తిప్పి పంపారు. ఇక్కడున్న సమస్యల్లా, ప్రత్యేకించి ఒక గవర్నర్ లేదా మరొకరు తీసుకున్న తప్పుడు చర్యలు కాదు, అంతకన్నా మరింత లోతైన సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నామినీని గవర్నర్‌గా నియమించా లని ప్రస్తుత రాజ్యాంగ నిబంధన పేర్కొంటోంది. దీనివల్ల గవర్నర్ పదవి అనేది పూర్తిగా కేంద్ర ప్రాతినిధ్యంగా తయారవుతోంది.
నియామకపు అధికారం కేంద్ర ప్రభుత్వానికి వున్నంత వరకు, ప్రజాసేవలో అద్భుతమైన రికార్డు ఉన్నవారిని లేదా రాజకీయేతరులను గవర్నర్లుగా ఎంపిక చేయాలన్న వివిధ ప్రతిపాదనల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాస్తవానికి, రిటైర్డ్ అధికారుల వంటి రాజకీయేతరులను ఈ పదవుల్లోకి తీసుకోవడం వల్ల మరింత అధ్వాన్నమైన పరిస్థితులే నెలకొన్నాయనేది పలు కేసుల్లో రుజువైంది. ముఖ్యంగా రిటైరైన అధికారి అయినట్లయితే తనకు అప్పగించిన ఈ పదవి పట్ల కృతజ్ఞతతో పూర్తిగా కేంద్రం చెప్పుచేతల్లో ఉంటారు.
అందువల్లే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన కమిటీ ప్రాతిపదికన గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలని... కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983లో శ్రీనగర్‌లో జరిగిన సమావేశం సూచించింది.
జస్టిస్ సర్కారియా కమిషన్, పుంచ్ఛి కమిషన్ల ముందు సీపీఐ(ఎం) కూడా ఇదే ప్రతిపాదనను చేసింది. 2008 అక్టోబరులో, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ''కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వ్యవస్థీకరణ విధాన సూచనా పత్రాన్ని'' ఆమోదించింది. ''రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించాలన్న నిబంధన వల్ల అరాచకం నెలకొంటోంది. ఫెడరల్ ప్రజాస్వామ్య రాజకీయాలకు ఇది అనుగుణంగా లేదు. గవర్నర్ పదవిని ఉంచాలనుకుంటే అప్పుడు ఆ వ్యక్తిని రాష్ట్రపతి నియమించాలి. అది కూడా సర్కారియా కమిషన్ నిర్దేశించిన ప్రామాణికాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి సూచించిన ముగ్గు రు ప్రముఖుల జాబితా నుండే తీసుకోవాలి'' అని ఆ పత్రంలో సీపీఐ(ఎం) పేర్కొంది.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో... గవర్నర్ల నియామకపు ప్రక్రియలో, రాజ్యాంగ అధికార విధి నిర్వహణా క్రమంలో ఎటువంటి సంస్కరణలకు అవకాశం లేదు. ఈ తరుణంలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ హక్కుల ఆక్రమణకు, దాడికి గురికాకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడమే ఇప్పుడు చేయగలిగింది. దానితో పాటు, గవర్నర్లు తమకు నిర్దేశించిన ప్రమాణాలను, పరిధులను అతిక్రమించకుండా ఉండేందుకుగానూ యూనివర్సిటీల చట్టం వంటి సంబంధిత చట్టాలను, శాసనాలను అసెంబ్లీలు సవరించుకోవాల్సి ఉంటుంది.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)