Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ ప్రాంతంలో రామ్‌పూర్ నౌదియా, నందా, మత్వార్, హరా వంటి 14 గ్రామాల్లో కోల్ కమ్యూనిటి ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. ఛన్బే నియోజకవర్గం కిందకి ఆ గ్రామాలు వస్తాయి. మిర్జాపూర్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో అది ఒకటి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి అంకానికి సమీపిస్తున్న వేళ ఆ గ్రామ ప్రజలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. అయినప్పటికీ దేశంలోని ఎన్నో గ్రామాల వలె అక్కడ కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. సెకండరీ విద్య, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, మరుగుదొడ్లు, మార్కెట్లు, ఉపాధి అవకాశాలు పొందేందుకు నివాసితులు నిత్యం పోరాడాల్సిందే. అందుకే ఈ ఎన్నికల సందర్భంగా వారంతా ఒక్కతాటిపైకి వచ్చారు. 'రోడ్డు లేకపోతే.. ఓటు లేదు' నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ఎన్నికలను బహిష్కరించారు.
తరాలు మారుతున్నా మారని వారి తలరాతల వెక్కిరింపులే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం. కళావతి (32) ఫిబ్రవరి 22న మృత ఆడశిశువుకు జన్మ ఇచ్చింది. ఆ దుఃఖం ఆమెను జీవితకాలం వెంటాడుతుంది. 'రోడ్డు సరిగ్గా లేనందునే నేను నా బిడ్డను కోల్పోయాను. దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోవాలంటే గ్రామం నుంచి 25 కిలోమీటర్ల మట్టిరోడ్డుపై ప్రయాణించాలి. ఆ రోజు అనుకున్న సమయానికి ముందుగానే నాకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. నా భర్త ముంబయిలో డ్రైవరు పనికి వెళ్లాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఇక్కడికి అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. ఏదైనా ప్రయివేటు వాహనం పెట్టుకోవాల్సిందే. ప్రయివేటు వాహనం పెట్టుకునేందుకు అత్తమ్మ ఇంటింటికీ వెళ్లి డబ్బులు అడిగింది. అలా పోగేసిన డబ్బుతో ఒకరోజు ఆలస్యంగా ఆస్ప్రతికి చేరుకున్నాం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నా బిడ్డ నాకు దక్కకుండా పోయింది' అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆమె చెబుతోంది.
హలాల్ బ్లాక్‌లో ఫోను రిపైర్ షాపు నడుపుకునే అగ్రహారి తన నాలుగేండ్ల కొడుకును తీసుకుని నగరానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. 'నేను ఉంటున్న ప్రాంతం నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. రోడ్లు చాలా అధ్వానంగా ఉంటాయి. ఈ కష్టాలు నా బిడ్డకు వద్దు. అందుకే నగరానికి వెళ్లిపోవాలనుకుంటున్నాను' అని చెబుతున్నప్పుడు అతని మాటల్లో ఆవేదన వినిపిస్తోంది.
సుమన్ (18) హలిలా లోని డిగ్రీ కాలేజీలో బిఎ చదువుతోంది. మత్వార్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే మధ్యప్రదేశ్ సరిహద్దు ఉండడంతో రెండు ప్రయివేటు బస్సులు ఊరిమీదుగా ప్రయాణిస్తాయి. అవి ప్రయాణించేటప్పుడే నగరంలో పనులు చూసుకునేందుకు గ్రామస్తులు వెళతారు. ఒకసారి ఊరు దాటిన తరువాత మళ్లీ ఎప్పుడు వస్తారో చెప్పలేరు. బస్సు రూట్లు మారుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో సుమన్ కాలేజీకీ వెళ్లేందుకు 15రోజులకొకసారి క్లాసులకు హాజరవుతుంది.
రోడ్డు సరిగ్గా లేని కారణంగా రవాణా సదుపాయం లోపించి అనారోగ్యంతో బాధపడుతున్న 35ఏండ్ల మహిళ ఇటీవలె మరణించింది. ఈ తరహా మరణాలు ఆ గ్రామాల్లో తరచూ సంభవిస్తాయి. గ్రామాల్లో వెలిసిన క్లినిక్‌లన్నీ అరకొర చదువులు చదివిన వారివే. దీంతో గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందదు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' కింద నిర్మించిన మరుగుదొడ్లు కూడా పగుళ్లు వచ్చి నిరుపయోగంగా మిగిలాయి. గ్రామాల్లో అత్యధిక మంది మట్టి ఇండ్లల్లోనే నివసిస్తున్నారు.
మొత్తం 14 గ్రామాల్లో 40 వేల మంది జనాభా ఉంటే 20 వేల మంది ఓటు వేయకూడదని తీర్మానించుకున్నారు. ఎన్నికల ప్రచార వాహనం ఈ గ్రామాల మీదుగా ప్రయాణించేటప్పుడు 'నో రోడ్ నో ఓట్' ప్లకార్డులు పట్టుకుంటున్నారు. ఎన్నికలప్పుడు పాలకులు చేసే వాగ్దానాలు ఆ తరువాత బుట్ట దాఖలవ్వడం, మళ్లీ ఎన్నికలప్పుడు అవే వాగ్దానాలతో ప్రజల ముందుకు రావడం మనదేశంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే పాలకులను నిలదీసి అడిగే చైతన్యం ఈ గ్రామస్తుల్లో వచ్చినట్లే ఇతర చోట్ల కూడా వచ్చినప్పుడే సమస్యలు కొంతవరకైనా పరిష్కారమవుతాయి.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్