Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః'' అంటారు. అనగా ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. ఈ మాటే నిజమయితే భారతదేశంలో దేవతలు కొలువుండే అవకాశమే లేదు. ఎందుకంటే మహిళలను హింసిస్తూ మత సాంప్రదాయాలని కొనసాగించేందుకు జరిగే ప్రయత్నాలన్నీ ఈ దేశంలోనే కనిపిస్తాయి. ఇది కొందరికి రుచించక పోవచ్చు కానీ సత్యం. మహిళలపై అత్యాచారాలు జరిగి హత్యలు గావింపబడుతున్నప్పుడు ఏ మత ఛాందసవాద సంస్థలూ నోరుమెదపవు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ఘటనలో మానభంగం జరిగినప్పుడు, హైదరా బాదులో దిశా అత్యాచారంతో హత్యకు గురైనప్పుడు జై శ్రీరామ్ నినాదాలు ఎగిసి పడవు. కానీ ఒక పబ్బుకు మహిళలు వెళ్లి తమ ఆనందాన్ని పంచుకుంటే.. అట్లాంటి మహిళలను జుట్టు పట్టి లాక్కొచ్చి మతానికి అప్రతిష్ట తెస్తున్నారంటూ జైశ్రీరాం నినాదాలు ఎగిసిపడతాయి. మగాళ్ళు మాత్రం అదే పబ్బుల్లో తాగి తందనాలాడొచ్చు! దేశంలోని అరవైశాతం పాఠశాలల్లో మరుగుదొడ్లులేక పిల్లలు చదువులు మానేస్తుంటే, మరుగు దొడ్లు లేక బహిర్భూమికి ఇబందులు ఎదుర్కొంటుంటే జై శ్రీరాం, అల్లఃహు అక్బర్ నినాదాలు వినబడవు. గుజరాత్ కళాశాలల్లో అమ్మాయిల నెలసరిని ప్రశ్నిస్తూ దుస్తులు విప్పజూసిన యాజమాన్యంపై ఆగ్రహావేశాలు రావు! మనలోని వైఫల్యాలపై నిరసనలు వినపడవు. ముస్లిం బాలికలు హిజాబ్ ధరిస్తే మాత్రం పూనకాలొస్తాయి.
కర్నాటకలో సంభవించిన హిజాబ్ వివాదం కేవలం మతపరమైన కోణంలో చూడడానికి వీలు లేదు. అది మహిళలపై భారత సమాజానికి ఉన్న అత్యంత చిన్న చూపుకు నిదర్శనం. మహిళను గౌరవించాలన్న కనీస ఇంగితం ఉంటే అట్లాంటి హేయమైన పనికి ఎవరు పూనుకోరు. నిజానికి హిజాబ్ అయినా మేలి ముసుగైనా పురుషాధిక్యానికి ప్రతీకలే. మహిళల అణచివేత సాధనాలే. అయితే ఇస్లాం మతంలోని ఎన్నో కట్టుబాట్లను ఒత్తిళ్లను అధిగమించి చదువుకుందామని పాఠశాలకు లేదా కాలేజీకి వచ్చిన ఆడపిల్లలకు దక్కాల్సిన గౌరవం ఇదేనా? మహిళను గౌరవిస్తాను అని చెప్పుకోవడం అంటే మనకు నచ్చిన దుస్తులు వేసుకొని మనకు నచ్చిన కట్టుబాట్లతో అణిగిమణిగి ఉండాలని కోరుకోవడమా? ఒక మహిళ ఈ హిజాబ్ ధరించి తమ మతానికి ప్రాధాన్యం ఇస్తుందని ఆక్రోష పడుతున్నారు. తానేమీ మత ప్రచారానికి పాల్పడలేదుగా! నిజానికి ఆర్థిక స్థోమతలేని ఎందరో అమ్మాయిలు చిరిగిన బట్టలు వేసుకొని లేదా వేసుకోవడానికి బట్టలు లేక ఇంట్లో నుంచి బయటకు రాకుండా చదువుకు దూరం అయిన అంశాన్ని తెలుసుకొని బాధపడాలి, స్పందించాలి. ఎవరు విశ్లేషించి చెప్తారు వీరికి ఈ అంశాల్ని? సిక్కు మతస్తులు టర్బన్ ధరించడం కోసం ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోక పోయినా పర్వాలేదు అన్న నిబంధన ఇక్కడ ఎందుకు వర్తించదు? హిందూ మతంలోనే అనేక ఆచారాలున్నాయి. ఒక్కో ఆచారానికి ఒక్కో విభిన్నమైన పద్ధతులున్నాయి. వాటన్నింటినీ అంగీకరించినప్పుడు దీనినెందుకు అంగీకరించ కూడదు..? కేవలం రాజకీయ కోణమే ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నది.
ఒక ఊరిలో, ఒక స్కూల్లో జరిగిన సంఘటనను రాష్ట్రమంతా, దేశమంతా వ్యాపింప చేస్తున్నారంటే దీని వెనుక కారణాలేమిటి? దురదృష్టకర అంశం ఏమంటే కర్నాటక హైకోర్టు హిజాబ్, కాషాయ కండువా రెండూ ధరించకండి అంటూ రెండింటిని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం. కాషాయ కండువాలు వేసుకోవడం విద్యార్థులకు మతపరమైన నిబంధనేమీ కాదు. కానీ, ఇస్లాం మతంలో వారికది నిర్భంధం. ఆ ఆచారాన్ని పాటిస్తున్న విద్యార్థినులను ఎదుర్కోవడానికి, కాషాయ కండువాలు ధరిస్తూ కొందరు విద్యార్థులు ఉన్మాదంలో చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు తన తీర్పు ద్వారా సమర్థించినట్లు అయింది. ఒకవైపు మత ఛాందసవాదులు రాజకీయ సమీకరణాల కోసం ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, కోర్టులు కూడా అదే విధమైన తీర్పులు ఇవ్వడం చాలా బాధాకరం. ఇండ్లలోని పురుషాధిక్యానికి వీధుల్లోని పరమత అసహనానికి మధ్య అన్ని మతాల మహిళలూ సతమతమవుతున్నారు. ముస్లిం మహిళ మరింత నలిగిపోతున్నది.
2014లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైన అవినీతి ఆరోపణలు బాగా ఉపకరించాయి. ఆ రోజుల్లోని బీజేపీ వాగ్దానాలన్నీ కూడా ఆర్థిక పరమైనవే. ఎన్నికల్లో ఇచ్చిన ఈ వాగ్దానాల్లో ఏదీ నెరవేర్చే ప్రయత్నమే చేయలేదు. అయినప్పటికీ బీజేపీ అభేధ్యమైన స్థితిలో అధికారంలో పాతుకు పోయింది. మతపరమైన పాలనా ప్రతిష్టాపన ప్రస్పుటంగా చేసుకోగలిగింది. ఇందుకోసం దేశాన్ని హిందువులు హిందువేతరులు అంటూ రెండు ముక్కలుగా విభజిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పురాణ గాథలను నిజమని నమ్మిస్తూ, జాతీయోద్యమాన్ని వక్రీకరించి హిందూత్వ ఎజెండాలో ఇమిడేటట్లు ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. 20వ శతాబ్దం అంతా మహాత్మాగాంధీని దాదాపు దేవుడితో సమానంగా భావించిన సమాజంలో ఇప్పుడు కొత్త జనరేషన్‌కు ఆయనను ఒక విలన్‌గా, జాతి వ్యతిరేకిగా పరిచయం చేస్తూ వెళ్తున్నది. బీజేపీని సమర్థించే అత్యధికుల్లో ఆర్థిక పరమైన, అభివృద్ధికరమైన పాలనా అంశాలను దృష్టిలో పెట్టుకునే వారి సంఖ్య దాదాపు శూన్యం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాల శాఖల ద్వారా గత నాలుగైదు దశాబ్దాలుగా జరిగిన కృషి వల్ల ఈరోజు మంచిగా స్థిరపడిన వాళ్లంతా ఈ విధానాలను మరో ఆలోచన లేకుండా సమర్థిస్తూ సహాయపడుతున్నారు. నిర్ణయాత్మకమైన మధ్యతరగతి మెదళ్లను ఈ విధంగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి జరిగిన ప్రయత్నాలు ఇప్పుడు రాజేస్తున్న అగ్గికి సరిగ్గా ఉపకరిస్తున్నాయి. అందుకే ప్రతి చిన్న సంఘటన మతపరమైన దిశగా మారుతున్నది. ఒక్కోసారి ఇది దేశ ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా తయారవుతున్నది. కర్నాటకలోని ఈ హిజాబ్ వివాదం భారతదేశానికి అంతర్జాతీయంగా కూడా అత్యంత అప్రతిష్ట తెచ్చిపెట్టింది. నిజానికి అది ఒక యూనిఫామ్‌కు సంబంధించిన అంశమే అయితే కనీసం రాజకీయంగా అందరూ దూరంగా ఉండాల్సింది. కానీ దాని నుంచి కూడా లబ్ధి పొందాలనుకునే వారు రాజకీయం చేసి కాలేజీలో చదువుతున్న హిందూ విద్యార్థులకు కాషాయ కండువాలు పంచిపెట్టి, ర్యాలీలు ధర్నాలు నిర్వహించేలా చేసి, ఒక మతానికి సంబంధించిన వారిని అవహేళన చేస్తున్న దృశ్యాలు ప్రపంచంలో భారతదేశానికి అపఖ్యాతి కాక మరేమిటి తెస్తాయి.
బహుశా మేధావులు ఒక విషయాన్ని ఇప్పటికే గమనించి ఉంటారు. అదేమంటే 1992 బాబ్రీ మసీదు ఘటన తర్వాత హిందూ ముస్లిం మతాల మధ్య దూరం ఏర్పడింది. అది మతపరమైన సమీకరణల వైపు దారి తీసింది. రాజకీయంగా బీజేపీకి లబ్ది చేకూరింది. సంప్రదాయ వాదం నుంచి సంస్కణ దిశగా పయనిస్తూ స్త్రీలను చదువుకు పంపడం, ఉద్యోగాలకు పంపడం వంటివి అప్పుడప్పుడే మొదలైన దశలో ఇస్లాం మతం వెనక్కివెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మనపై, మన సాంప్రదాయాలపై, ఏదో దాడి జరుగుతున్నది, మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఉనికిని మనం వెతుక్కోవలసిన అవసరం పెరుగుతున్నదని ఇస్లాం మత పెద్దలే కాదు, ప్రజలు కూడా భావించే స్థితి వచ్చింది. చాలామంది స్వచ్ఛందంగా బురఖా విధానాన్ని వదిలేసిన వాళ్ళు ఈరోజు స్వయంగా దానిని ధరించి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వారాంతానికి మాత్రమే పరిమితమయ్యే పూజలు, వస్త్రధారణలు నేడు మరింత పెరిగి ప్రదర్శించబడతున్నాయి. మైనారిటీ ప్రజలతంతా పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఏం చేయాలో తెలియని ఒక అభద్రతలో కొట్టుమిట్టాడు తున్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ పీఠాన్ని అధిరోహించడానికి చేస్తున్న కుతంత్రం. దీనిద్వారా విద్వేషాలు పెరుగుతాయో తగ్గుతాయో పౌరసమాజం ఆలోచించాలి. ఇలాంటి వ్యాసాలు చదువుతున్న వారంతా అక్షరాస్యులు, సమాజం పై అవగాహన ఉన్న వారు కాబట్టి ఎవరికి వారే విశ్లేషించుకోవాలి.
జి. తిరుపతయ్య
సెల్: 9951300016