Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 28-29 తేదీలలో జరగనున్న సాధారణ సమ్మె సన్నాహక కార్యక్రమాల మధ్యనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం (వాస్తవానికిది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం) వస్తున్నది. దేశం మొత్తం 75వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకుంటున్న తరుణంలో మన దేశ మహిళలు మరీ ముఖ్యంగా శ్రామిక మహిళలు ఘోరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
దిగజారుతున్న జీవనోపాధి
కోవిడ్ కారణంగా పెద్దఎత్తున నిరుద్యోగం, పాక్షిక నిరుద్యోగం వల్ల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. వేతనాల కుదింపు, శాశ్వతంగా వేతనాలు లేకపోవడంవల్ల పేదరికం మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై - పురుషులకన్నా ఎక్కువ ప్రభావం పడింది. ఈ మహమ్మారికి ముందు కూడా మహిళల ఉద్యోగాలు తగ్గిపోయాయి. కోవిడ్ రెండో దశలో ఏప్రిల్- మే 2021లో దాదాపు 2.2 కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోయారు. 'అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ' సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లారుమెంట్ నివేదిక ప్రకారం మార్చి - డిసెంబరు 2020 మధ్య కాలంలో దాదాపు 47శాతం మంది శ్రామిక మహిళలు శాశ్వతంగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. అదే కాలంలో 7శాతం మంది పురుషులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటికే నెలకొన్న నిరుద్యోగానికి ఈ శ్రామిక మహిళల నిరుద్యోగం తోడైంది. లింగ అసమానతల సూచీలో 2021 నాటికి ఇండియా 28 పాయింట్లు తగ్గి 156 దేశాల జాబితాలో 140వ స్థానానికి పడిపోయింది (భారత్ 2017 నాటికి 108వ స్థానంలో, 2020 నాటికి 112వ స్థానంలో ఉండేది). దీనికి ప్రధాన కారణం మహిళల భాగస్వామ్యం భారతదేశంలో 2019 నాటికి కేవలం 20.3 శాతం మాత్రమే. దీని అర్థం 80శాతం మహిళా కార్మికులు మన దేశంలో (16-59 సంవత్సరాల మధ్య వయస్కులు) తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. మన పొరుగునున్న బంగ్లాదేశ్లో 30.5శాతం, శ్రీలంకలో 33.7శాతం మహిళా కార్మికులు పని చేస్తున్నారు. మన దేశంలో క్రమంగా ఉత్పత్తిలో శ్రామిక మహిళల భాగస్వామ్యం క్షీణిస్తూ వస్తోంది. రెండోవైపు ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి గొప్పగా చెపుతున్నవి.
దీని అర్థం ఏమిటి? 80-85 శాతం మంది శ్రామిక మహిళలు మన దేశంలో ఖాళీగా ఉన్నారా? లెక్కలు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయి, అతి తక్కువ వేతనాలతో మహిళలు బతుకీడుస్తున్నారు. ప్రపంచ లింగ అసమానతలు-2017 నివేదిక ప్రకారం మన దేశంలో 66శాతం మహిళలు వేతనాలు లేకుండా ఉన్నారు. మహిళలు నిర్వహిస్తున్న అనేక పనులను ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణించడంలేదు. గ్రామీణప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా సబ్సిడీ కార్యక్రమాలలో ఉంటుంది. ఈ అవకాశం కూడా 2004-2005 సంవత్సరం నాటికి 25శాతం మాత్రమే ఉంది. 2017-2019 ఆర్థిక సర్వే ప్రకారం 2022 నాటికి 5.7శాతానికి పడిపోవచ్చు. మెజార్టీ మహిళలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. ముఖ్యంగా పశువుల పెంపకం పనులు మహిళలు నిర్వహిస్తారు. చిన్న చిన్న కమతాలలో పని చేస్తుంటారు. ప్రభుత్వం వీరిని రైతులుగానూ గుర్తించడం లేదు. భూమిపై వీరికి ఎటువంటి హక్కులు ఉండవు. ప్రభుత్వ పథకాలు ఈ మహిళలకు వర్తించవు. చట్టపరమైన హక్కులు అసలే లేవు.
కోవిడ్ మహమ్మారి ఈ పరిస్థితులను మరింతగా దిగజార్చింది. జులై-సెప్టెంబరు 2020 నాటికి మహిళా కార్మికుల భాగస్వామ్యం రేటు 16శాతానికి పడిపోయింది. అంటే ఏప్రిల్-జూన్ 2020 నాటికన్నా 15.5శాతం తగ్గిపోయింది (ఈ లెక్కలు ప్రపంచ బ్యాంకు మరియు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్సు వారు చెప్పినవే).
దేశంలో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించవలసిన సమయంలో మోడీ ప్రభుత్వం బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.98 వేలు కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు కేటాయింపులు కుదించింది. గత సంవత్సరం కూడా అంతక ముందు సంవత్సరం కన్నా 40శాతం కేటాయింపులు తగ్గించింది. అనేక రాష్ట్రాలలో ఆరు నెలల నుంచి జీతాలు కూడా చెల్లించడం లేదు.
ఆరోగ్య సంస్థలు, మెరుగైన ఆరోగ్య సేవలు, ఇతర ఆహార భద్రతా పథకాల అవసరాన్ని కోవిడ్ మహమ్మారి తెలియజేసింది. సామాన్య మానవునికి విద్య అందనంత ఎత్తులో ఉంది. విద్యా వ్యవస్థలను నాశనం చేశారు. కోవిడ్ మేనేజ్మెంట్ కోసం ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా, ఇతర ఫ్రంట్లైన్ కార్మికులను, మధ్యాహ్న భోజన కార్మికులను, హెల్పర్లు, ఆహార సరఫరా కార్మికులను బాగా ఎక్కువగా ఉపయోగించుకుంది. కానీ... ఈ సంస్థలను బలోపేతం చేయకుండా, వారి పనిని గుర్తించకుండా ప్రభుత్వం ఈ సంస్థల బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దఎత్తున కోతలు విధించింది. ప్రభుత్వ పథకాలైన ఐ.సి.డి.ఎస్, ఎం.డి.ఎం, ఎ.డి.ఎం వంటి వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించింది.
ఈ కాలంలోనే కేవలం మహిళలే పనిచేస్తున్న రంగాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇంటి పనివారు 98శాతం తమ పనులను కోల్పోయారు. దాదాపు 15నెలల తరువాత వారు తిరిగి పనిలోకి చేరారు. ఈ విధంగా వేతన రహిత కార్మికులుగా మహిళా కార్మికులు మారిపోయారు. ఈ కారణంగా సంప్రదాయకంగా ఉన్న జెండర్ పాత్రని మార్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేతనాల్లో లింగ వివక్ష పెరిగింది. అనేక అధ్యయనాల ప్రకారం స్త్రీ, పురుషుల మధ్య 35.55 శాతం వేతన వ్యత్యాసం ఉందని తేలింది.
పెరుగుతున్న పేదరికం - ఆకాశాన్నంటుతున్న ధరలు
భారతదేశంలో ఇప్పటికే పేదరికం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఎన్ఎస్ఎఓ లెక్కల ప్రకారం 1993-94 నాటికి గ్రామీణ ప్రాంతంలో 58శాతం, పట్టణాల్లో 57శాతం దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారు. 2011-12 సంవత్సరం నాటికి ఈ శాతం 68శాతం 65శాతాలుగా పెరిగింది. కోవిడ్ సమయంలో సరాసరిన 12శాతం ఆదాయాన్ని ప్రతి కుటుంబం కోల్పోయింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నష్టం ఇంకా ఎక్కువ. కొన్ని లెక్కల ప్రకారం 21.8కోట్ల ప్రజలు (16.8 - కోట్ల గ్రామీణ, 5 కోట్ల పట్టణ ప్రజలు) పేదరికం వైపుగా గత సంవత్సర కాలంలో నెట్టివేయబడ్డారు. ఈ సంవత్సరంలో అదనంగా 15కోట్ల నుంచి 19.9కోట్ల మంది ప్రజలు అనగా దేశ జనాభాలో సగం మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ఎన్నడూలేనంతగా ధరలు పెరిగాయి. దీనితో పాటు పెరిగిన పెట్రోల్ ధరలు, పెరిగిన వైద్య ఖర్చులు, సరైన ఆరోగ్య రక్షణ వ్యవస్థ లేకపోవడం, స్కూళ్లు మూతవేయడం, విద్యా వ్యవస్థ కంప్యూటరీకరణ... వంటివన్నీ పరిస్థితిని మరింత దిగజార్చాయి. అధికశాతం ప్రజలు వారి విద్య, వైద్య, ఆహార హక్కులను కోల్పోయారు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఎఫ్.సి.ఐ.కి బడ్జెట్ కేటాయింపులను రూ.65 వేల కోట్లకి తగ్గించింది. సబ్సిడీలు కూడా తగ్గించింది.
మార్కెట్ సిద్ధాంతం ఒకవైపు, హిందూత్వ, మత ఛాందసవాదులు మరోవైపు కలిసి ప్రజల్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ వారి దృష్టిని ఈ వాస్తవాల నుంచి పక్కకు మళ్లిస్తున్నారు. నూతన ఆర్థిక విధానాలు, హిందూత్వ కారణంగా సమాజంలో తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. కోవిడ్, లాక్డౌన్ రెండూ కూడా అణగారిన మహిళల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. గృహహింస విపరీతంగా పెరిగింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా శ్రామిక మహిళలు జిల్లాల వారీగా సేవా రంగంలో, ఆర్థిక రంగంలో ఉన్న యూనియన్లు ఇతర ఆర్గనైజేషన్లు వివిధ మహిళా సంఘాలతో కలిసి కార్యాచరణ కార్యక్రమాలు రూపొందించుకుని నిర్వహించాల్సి ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి కారణంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పెద్దఎత్తున ప్రచారం చేయాలి. ఈ కార్యాచరణ ద్వారా... మార్చి 28-29 నాటి సాధారణ సమ్మెలో... దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలు భారీఎత్తున పాల్గనేలా సన్నద్ధం కావాలి.
మహిళల మెరుగైన జీవనోపాధి కోసం.. పేదరిక నిర్మూలన కోసం... ప్రభుత్వాలు వెంటనే కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. నిరుద్యోగ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలి. మహిలకు ప్రత్యేక ఉపాధి పథకాలు అమలు చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. కనీసం 200పని దినాలను కల్పిస్తూ, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలి. పట్టణ కార్మికులకు కూడా ఈ పద్ధతి విస్తరింపజేయాలి. వేతన బకాయిలను పూర్తిగా చెల్లించాలి. పథకాలన్నిటినీ రెగ్యులరైజ్ చేయాలి. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశా కార్మికులను ఇతర పథకాల్లో పని చేసే కార్మికులను.. కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రతా చర్యలు చేపట్టాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. 45వ ఐఎల్సీ (ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్) సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. మహిళల పనిని గుర్తించాలి. వారిని కార్మికులుగా, రైతులుగా గుర్తించాలి. మహిళల చెల్లించని పనిని, తక్కువ చెల్లిస్తున్న పనిని కూడా దేశ జాతీయ ఆదాయంలో కలిపి లెక్కవేయాలి. మహిళలు పనిచేస్తున్న వేతన రహిత కార్యక్రమాలపై వెసులుబాటు కల్పిస్తూ ప్రతి ఇంటికీ సరిపడా మంచినీటిని సరఫరా చేయాలి. వంటగ్యాస్పై ఇచ్చే సబ్సిడీ ఇవ్వాలి. పిల్లలకు ఉయ్యాల కేంద్రాలు, వృద్ధులకు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సమాన పనికి సమాన వేతనం అన్ని రంగాల్లో అమలు చేయాలి. ప్రసూతి సెలవులు, ఇతర సదుపాయాలను శ్రామిక మహిళలకు మంజూరు చేయాలి. మహిళల భూ హక్కులను కాపాడాలి. ఒంటరి మహిళా కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త చనిపోయిన, భర్తలు వదిలి వేసిన ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతలు కల్పించాలి. పోష్ (లైంగిక వేధింపుల నుండి మహిళలను సంరక్షించే చట్టం) చట్టాన్ని అన్ని పని ప్రదేశాల్లో కఠినంగా అమలు చేయాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం మహిళాలోకం పోరాటాలకు సిద్ధం కావాలి. అందుకు మార్చి 28-29 సమ్మె వేదిక కావాలి.
- ఎ.ఆర్. సింధు