Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు దేశాలైన రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో మనం ఒకే దేశంలోని రెండు మతాల మధ్య కొనసాగుతున్న దాడులు, వివక్ష, అణచివేతల గురించి మాట్లాడుకుంటున్నాం. కర్నాటకలో హిజాబ్ నిషేధ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే, ఈ విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే స్థానిక తాజా చరిత్ర పట్ల కొంత అవగాహన ఉండాలి. గత డిసెంబర్ 31న కర్నాటక ఉడుపీలోని ప్రభుత్వ మహిళా ప్రీ యూనివర్సిటీ కళాశాల తరగతి గదుల్లోకి ముస్లిం యువతులను హిజాబ్ వేసుకుని రాకుండా యాజమాన్యం అడ్డు కోవటంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఒక కళాశాలలో మొదలైన ఈ వివాదం ఎందుకింతగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది? కాషాయ శాలువాలు, హిజాబ్‌కు ఎదురెదురుగా ఎందుకు నిలిచాయి? మీడియాలో ప్రముఖ వార్తగా మారి, ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి, రాజ్యాంగం లోని అంశాల లోతైన చర్చ వరకూ ఎందుకు వెళ్లింది? ముస్లిం సంఘాల సమాఖ్య హిజాబ్ వివాదాన్ని చర్చలతో పరిష్కరించే యత్నం చేసినా, హిజాబ్ వివాదం నెలరోజులకు పైగా ఎందుకు రగులుతోంది? ఈ ప్రశ్నలకు లోతైన సమాధానాలను మనం అన్వేషించాలి.
డిసెంబర్ 31 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఘటనలు, రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే మనకు కొన్ని కారణాలు అవగతమవుతాయి. కాలేజీ ప్రవేశద్వారం వద్ద విద్యార్థినుల నిరసన ప్రారంభం కాగానే కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి హౌదాలో బీజేపీ శాసనసభ్యుడు రఘుపతి భట్ ఒక మీడియా ప్రకటన చేస్తూ తమ కళాశాలలో దాదాపు 60మంది ముస్లిం విద్యార్థినులు చదువుతున్నారనీ, వారిలో కొంత మంది 2021 అక్టోబర్ 31 తరువాత కొత్తగా హిజాబ్ వేసుకొని వస్తూండటంతో వారితో మాట్లాడి ఒప్పించామనీ, అయిదుగురు ముస్లిం యువతులు మాత్రం ఒప్పుకోకపోవటంతో ఆ అయిదుగురినీ యాజమాన్యం కళాశాలలోనికి అనుమతించలేదని అన్నాడు. ఆ తరువాత హిజాబ్ వివాదం జాతీయ, అంతర్జాతీయ అంశం కావడంతో నిరసన తెలుపుతున్న ముస్లిం విద్యార్థినులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకి అనుబంధమైన కేంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) కార్యకర్తల వత్తిడితో హిజాబ్ పేరుతో వివాదం సృష్టించారని రఘుపతి భట్ ఆరోపించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ విద్యార్థి సంస్థ (సీఎఫ్ఐ) తీవ్రవాద సంస్థలనీ, అందువల్లే వారిని అడ్డుకునేందుకు తాము హిందూత్వ సంస్థలను అనుమతించామని బహిరంగంగా ప్రకటించాడు. ఒక మంత్రి మరో అడుగు ముందుకేసి హైకోర్టులో రిట్ వేసేందుకు ముస్లిం విద్యార్థినులకు ఆర్థిక సాయం ఎక్కడ నుంచి వస్తోంది, ఎవరు అందిస్తున్నారని ప్రశ్నిస్తూ ఈ మొత్తం వ్యవహారం భారత దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు నడిచిందనీ, ఇది ఒక అంతర్జాతీయు కుట్ర అనీ ఆరోపించారు. ఒక కళాశాలలో యాదృచ్ఛికంగా ప్రారంభమైనట్లు కనపడే చిన్న ''హిజాబ్ వివాదం''ను నెల రోజుల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ బహుశా తాను ముందే ఇందు కోసం పథకం వేసిందా అన్నట్లు దీన్ని ''అంతర్జాతీయ కుట్ర'' స్థాయికి తీసుకెళ్ళింది.
ముస్లిం మతస్తుల పిల్లలు కాలేజీలు, ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్య వరకూ వెళ్ళటం తక్కువ. ఇప్పుడిప్పుడే వారు ఆ స్థాయికి వస్తున్నారు. ఇక ముస్లిం యువతులైతే 2000 సంవత్సరం నుంచే చెప్పుకోదగ్గ స్థాయిలో విద్యాలయాలకు వస్తున్నారు. ముస్లిం సమాజంలోని సాంప్రదాయ ఆటంకాలను అధిగమిస్తూ విద్యార్థినులు హిజాబ్ వేసుకొనైనా కళాశాల చదువుకు వస్తున్నారు. ఈ పరిణామాన్ని భారతీయ సమాజం చాలా సామాన్య మార్పుగానే స్వీకరించింది. అయితే, బీజేపీ మాత్రం ఉడుపీ పరిసర జిల్లాల్లో గడిచిన ఒకటి, రెండు దశాబ్దాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాన్ని సీరియస్‌గా గమనించి, దాన్ని తన ఫాసిస్టు అజెండాకి అనుకూలంగా మల్చుకుంది. ముస్లిం యువతీ యువకులు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో పోటీ పడుతూ ముందుకు రావటం అనేది ముస్లిమేతర యువతకు ముఖ్యంగా హిందూ యువతకు ప్రమాదకరమని ప్రచారం చేశారు.
కోస్తా కర్నాటక ప్రాంతంలో 1990 దశకం నుంచి హిందూత్వ రాజకీయాలు పెరుగుతున్న క్రమాన్ని మేం నమోదు చేశాం. ఇక్కడి మతకల్లోలాలే కాకుండా, ముస్లింల సాధారణ జీవితంలోని ప్రతీ విషయాన్ని కూడా నేరమయ విషయాలుగా ప్రచారం (క్రిమినలైజేషన్) చేస్తూ దాడి మొదలుపెట్టారు. మొదటి దాడి మసీద్‌పై జరిగింది. ''ముస్లింలు మసీదులుల్లో ఎ.కె.47లు దాచి, హిందువులమీద దాడి చేసేందుకే వాటిని వినియోగిస్తారు'' అని సంఫ్‌ు పరివార్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రభావంతో కొత్త మసీదులు కట్టేందుకు రెవెన్యూశాఖ నుంచి కూడా సమస్యలు తలెత్తాయి.
ఇక రెండో అంశం పశువుల రవాణా పేరుతో ముస్లిం సమాజంపై జరిగిన దాడి. వట్టిపోయిన ఆవులను హిందువులు మధ్యవర్తుల ద్వారా కబేళాలకు విక్రయిస్తారు. కబేళాల నిర్వహణ ఆయా పురపాలక, నగర పాలక సంస్థలు చేపడతాయి. బెంగుళూరు, ఉడుపిలతోపాటు అన్ని జిల్లాల్లో కబేళాలు ఉన్నాయి. పశువులను తరలించే మధ్యవర్తులు సాధారణంగా ముస్లింలే ఉంటారు. వీళ్ళు కొంత మార్జిన్ ('బ్రోకరేజ్') తీసుకుని ఈ పని చేస్తారు. ఈ వ్యవహారాన్ని సమాజం చాలా సాధారణ విషయంగా చూస్తుంది. అయితే, 2001లో ప్రారంభమైన గోరక్షణ ఉద్యమం పేరుతో హిందూత్వ శక్తులు ఈ ముస్లిం మధ్యవర్తులపై దాడులు చేస్తూ, పశు రవాణాను నేరపూరిత విషయంగా ప్రచారం మొదలుపెట్టారు. 2000-2010 సంవత్సరాల మధ్యకాలంలో పశువులను కొని, తరలించే ముస్లిం మధ్యవర్తులపై కనీసం 70దాడులు జరిగాయి. విచిత్రం ఏమిటంటే, పశువులను అమ్మే హిందువులపై కానీ, కోతకు కొనే కబేళా నిర్వాహకులపై కానీ ఎటువంటి దాడులూ జరగలేదు.
ఇక మూడో అంశం ముస్లింల ఆర్థిక కార్యకలాపాలపై జరిగిన దాడి. కర్నాటక కోస్తా జిల్లాల్లో ముస్లింలు నడిపే చెప్పులూ, ఫ్యాన్సీ దుకాణాలపై హిందూత్వ శక్తులు దుష్ప్రచారం చేశాయి. ఆ షాపులకు వెళ్తే హిందూ అమ్మాయిలను, మహిళలను ప్రలోభపెట్టి మతం మార్చి, పెళ్లిళ్లు చేసుకుంటారనీ, వేశ్యా గృహాలకు అమ్మివేస్తారనీ ప్రచారం చేశారు. గత రెండు దశాబ్దాలుగా ముస్లిం యువకులు ఉన్నత విద్యకోసం కళాశాలలకు రావటం, తోటి విద్యార్థినులతో కలిసి తిరగడం పెరగడంతో 'లవ్ జీహాద్' పేరుతో ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటారని ప్రచారం చేస్తూ ముస్లిం యువకులు చదువుకోవటాన్ని కూడా నేరపూరిత విషయంగా మార్చేశారు. కర్నాటకలోని కోస్తా జిల్లాల్లో ముస్లిం మైనారిటీలు దైనందిన జీవితంలో ఎక్కువగా హిందూ సమాజంతో కలిసి మెలిసి జీవించడం చూస్తుంటాం. కానీ సంఫ్‌ు శక్తులు ఆ సమూహ సాధారణ దైనందిన జీవితంలో కూడా, లేని నేర కోణాన్ని వెతికి, వారిని నేరస్తులుగా చిత్రీకరించటమే పనిగా పెట్టుకుంటారు. గడిచిన 12ఏండ్లల్లో ముస్లిం యువతులు విద్యాలయాలకు పెద్దసంఖ్యలో హిజాబ్‌తో వస్తున్న పరిణామాన్ని అధిక సంఖ్యాక సమాజం సాధారణంగా తీసుకున్నా కూడా సంఫ్ుశక్తులు హిజాబ్ధారణను పెద్ద నేరంగా ప్రచారం చేశాయి. కాబట్టి, హిజాబ్ వివాదాన్ని గాలివాటుగా వచ్చిన పరిణామంగా చూడరాదు. సంఫ్‌ుపరివార్ మూడు దశాబ్దాల రాజకీయ కార్యాచరణ ఫలితమే ఇది.
నిజానికి, ఇది కేవలం ముస్లింలపై ఆధిపత్యం కోసమే జరుగుతున్న ప్రహసనం కాదు. ఇది మొత్తం సమాజంపై ఆధిపత్యం కోసం ముస్లింలను బూచిగా చూపిస్తూ జరుగుతున్న దాడి. ఇది ముస్లిం (మైనారిటీ)లకు గల రాజ్యాంగ హక్కులపై మాత్రమే దాడి కాదు. మౌళికంగా ఇది అందరికీ చెందిన రాజ్యాంగ ప్రాసంగికత, నైతికతలపై కూడా దాడి అనేది మనం అర్థం చేసుకోవాలి. మతోన్మాదశక్తులు బలహీనులైన మైనారిటీలపైన్నే దాడులు చేయటం లేదు, మతమౌఢ్యాన్నీ, ఉన్మాదాన్నీ ప్రశ్నించిన ముస్లిమేతర మేధావుల పైనా దాడులు చేస్తున్నారు. మా రాష్ట్రంలోనే ఎం.ఎం కల్బురి, గౌరి లంకేశ్ వంటి గొప్ప మేధావులను మతోన్మాద శక్తులు హతమార్చిన విషయం తెలిసిందే.
హిందూ మతంలోని సాంప్రదాయ ఆధిపత్య కులాలు తమ మనుధర్మ నిచ్చెన మెట్ల సమాజ పునరుద్దరణ కోసం, ఆధునిక కార్పొటీకరణ విధానంతో తమ వర్గాలకే చెందిన కొద్దిమంది చేతిలో దేశ సంపదనంతా ఊడ్చి పెట్టటం కోసం ఫాసిస్టు తరహా పాలానా స్వభావంతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న విధానాల ఫలితాలే ఇవన్నీ. హిజాబ్ నిషేధం, అనంతర రాజకీయ వివాదం అందులో ఒక భాగం. సమాజంలో పెరగగల విద్వేష, విచ్ఛిన్న పూరిత రాజకీయాల నివారణకూ, వాటికి విరుగుడుకూ ప్రజా స్వామిక, లౌకిక చైతన్యంతో పనిచేసే ప్రజా సంఘాల, యువజన, విద్యార్థి సంఘాల పాత్ర ఎంతో ఉంటుంది. అటువంటి వారందరూ విడివిడి గానూ, ఐక్యంగానూ పనిచేస్తూ మన చుట్టూ ఉన్న సమాజాన్ని మానవీయం గా మారుస్తుండాలి. లేదంటే, రాబోయే తరాలకు మనం అనుభవించే పాటి హక్కులు కూడా మిగలవు.
- కె. ఫణిరాజ్
అనువాదం: జహాఆరా, సీనియర్ న్యాయవాది.