Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రామికవర్గాల భద్రత, ఆరోగ్యం, అనుకూల కార్యక్షేత్ర వాతావరణం లాంటి అంశాలను చర్చించడానికి ప్రతి ఏట మార్చి 4న దేశవ్యాప్తంగా 'జాతీయ భద్రత దినం (నేషనల్ సేఫ్టీ డే)' పాటించుట 1972 నుండి ఆనవాయితీగా మారింది. ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, పలు ఉపాధులు, వృత్తులు చేసుకునే సామాన్య ప్రజల ఆరోగ్యం, శ్రమ క్షేత్రంలో భద్రత, ప్రమాదలేమి, రోడ్డు భద్రత, పని ప్రదేశ సానుకూల వాతావరణం లాంటి అంశాల పట్ల తగు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్యాల బాధ్యతగా గుర్తించాలి. శ్రామిక, కార్మికలోకం అత్యంత ప్రమాదకర వాతావరణాల్లో పని చేయాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాపాయం పొంచి ఉంటుందని గమనించి యాజమాన్యాలు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. శ్రామికుల ఆరోగ్యమే సంస్థల ప్రయోజనాలకు, సంక్షేమానికి పునాదులని మరువరాదు. పని ప్రదేశంలో ప్రమాదాల నిర్మూలనకు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలను ఖర్చులకు వెరవకుండా పాటించవలసిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యా లదే అని నమ్మాలి. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించే లాభాలు నిరర్థకమని యజమానులు గమనించాలి. ఇండియాలో కార్మిక మంత్రిత్వశాఖ చొరవతో స్వయం ప్రతిపత్తితో ఏర్పడిన 'నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (భారత జాతీయ భద్రత మండలి)' పర్యవేక్షణలో శ్రామికవర్గాల పని క్షేత్ర భద్రతకు సంబంధించిన అవగాహనలు, సూచనలు, పర్యవేక్షణలు లాంటి అంశాలను చర్చించడం జరుగుతోంది.
మార్చి 4, 1966న పారిశ్రామిక భద్రతను దృష్టిలో ఉంచుకొని 8000సభ్యుల సభ్యత్వంతో ఏర్పడిన 'నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రయివేట్‌రంగ విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగ, శ్రామిక వర్గాల భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ అంశాల పట్ల ముందస్తు జాగ్రత్తలు పర్యవేక్షించబడతాయి. ఉద్యోగుల భద్రతకు అంకితభావం కలిగిన పారిశ్రామిక యాజమాన్యాలు ప్రధానమని, పలు సందర్భాల్లో ప్రమాదాలు జరిగి శ్రామికవర్గాలు తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు సహితం కోల్పోవడం చూస్తున్నాం. పరిశ్రమల్లో ప్రమాదాల నిర్మూలన, అత్యవసర సేవల అనుక్షణ అందుబాటు, కాలానుగుణంగా ఉద్యోగులకు శిక్షణలు, భద్రతా ప్రమాణాల సదస్సులు, కార్యశాలలు, సేఫ్టీ ఆడిట్స్, ప్రమాదాల మూల్యాంకనలు, ప్రమాద నిర్వహణ, రోడ్డు భద్రతా వారోత్సవాల నిర్వహణ, అగ్నిమాపక వారోత్సవాలు, కార్మికులకు భద్రత పట్ల అవగాహన లాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఇదే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 28న 'ప్రపంచ శ్రామికుల భద్రత, ఆరోగ్య జ్ఞాపకార్థ దినం' పాటించుట జరుగుతోంది. శ్రామిక లోకంలో వృత్తి సంబంధ వ్యాధులు, ప్రమాదాలు, ఆనారోగ్యాలు, చివరకు మరణాల పాలు కావడం తరుచుగా వింటున్నాం. పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంధ సంస్థలు, నియంత్రణ యంత్రాంగాలు మార్చి 4 వేదికగా పలు అవగాహన కార్యక్రమాలను, శిక్షణాశిబిరాలను నిర్వహిస్తాయి. పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతతో పాటు కార్మికుల భద్రత అంత కన్నా ప్రధానమని యాజమాన్యాలు గమనించాలి. ఈ ఏడాది జాతీయ భద్రత దినం-2022 నినాదంగా 'సడక్ సురక్ష లేదా రోడ్ సేఫ్టీ' అనే అంశాన్ని తీసుకున్నారు.
భోపాల్ గ్యాస్ విషాదం (1984), విశాఖ గ్యాస్ లీక్ (2020), బాంబె డాక్ విస్పొటనం (1944), చెస్నాల మైనింగ్ డిజాస్టర్ (1975), కార్బె చిమ్నీ కొలాప్స్ (2009), జైపూర్ ఆయిల్ డిపో ఫైర్ (2009), మియపురీ రేడియో లాజికల్ ఆక్సిడెంట్ (2010), విశాఖ రిఫైనరీ బ్లాస్ట్ (2013), నాగారం పైప్‌లైన్ విస్పొటనం (2014), బిలారు స్టీల్ ప్లాంట్ గ్యాస్ లీక్ (2014), తుగ్లకాబాద్ గ్యాస్ లీక్ (2017), కాన్పూర్ అమోనియ లీక్ (2017), బెలూర్ క్లోరిన్ లీక్ (2017), బిలారు స్టీల్ ప్లాంట్ లీక్ (2018) లాంటి పలు పారిశ్రామిక ప్రమాదాల్లో పలువురు కార్మికులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు గాయపడటంతో పాటు అనేకులు ప్రాణాలు సహితం కోల్పోవడం విచారకరం. మానవ వనరులు అమూల్యమైనవని, మనుషుల ప్రాణాలకు ప్రాధాన్యత అధికమని, లాభాలు, ఉత్పత్తులు, నాణ్యతల కన్న శ్రామికవర్గ సంక్షేమమే మిన్న అని అందరం గట్టిగా నమ్మాలి. శ్రామికుల భద్రతకు, ఆరోగ్యాలకు పట్టం కట్టాలి. ఇది గుర్తించని యాజమాన్యాలను, వాటికి వత్తాసు పలికే ప్రభుత్వాలను ప్రజావ్యతిరేక మైనవిగా గుర్తించాలి.
(మార్చి 4 'జాతీయ భద్రత దినం' సందర్భంగా)
డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037