Authorization
Sat April 12, 2025 10:14:58 pm
భారతదేశంలో ముస్లిం పురుషుల కంటే కూడా ముస్లిం మహిళలే ఏక వర్గీయులుగా లేరు. హిందూ మహిళల్లో కుల, మత, వర్గ భేధాలు ఉన్నట్లే ముస్లింల మధ్య కూడా విభజనలు ఉన్నాయి. కానీ నేడు ముస్లిం మహిళలందరిలో కాదనలేని ఒక ఉమ్మడి లక్షణమేమంటే, రాజకీయ చదరంగంలో సంఫ్‌ుపరివార్ వారిని పావులుగా వాడుకుంటుంది. 2019లో బీజేపీ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కొత్తచట్టం చేసిన నాటి నుండి ఇటీవల కాలంలో కర్నాటక రాష్ట్రంలో విద్యా సంస్థల్లోకి హిజాబ్ ధరించిన మహిళలను అనుమతించని వివాదం వరకు సంఫ్‌ుపరివార్, ముస్లిం మహిళలను లక్ష్యం చేస్తూ వస్తున్నది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ తనను తాను ముస్లిం మహిళల రక్షకుడిగా చెప్పుకుంటూ తాను, తన పార్టీ ముస్లిం పితృస్వామిక బంధనాల నుంచి ముస్లిం మహిళలను కాపుడు తున్నామని చెప్పారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ... కాలేజీలకు వెళ్లే దారిలో మన ముస్లిం బిడ్డలు వీధి రౌడీల అల్లరి చేష్టలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే వారనీ, కానీ తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా వారికి భద్రత ఏర్పడిందని చెప్పారు.
చరిత్ర తెలిసిన వారు ముఖ్యంగా 2002లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మితవాదుల మారణహౌమం దాడులకు గురైన మహిళలు ఆయన ప్రసంగాల్లో చెప్పిన విషయాలను విశ్వసించరు. దౌర్జన్యకారులు ప్రధానంగా ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడ్డారు, వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడి, వారి ఇండ్లను లూటీ చేసి, ధ్వంసం చేశారు. అహమ్మదాబాద్‌లోని నరోదాపిటియా ఊచకోతలో గర్భవతి అయిన కౌసర్ బానూ షేక్‌ను మంటల్లో వేసి చంపారు. బతికి బయట పడ్డవారు, సాక్షులు ప్రాణాలను చేతబట్టుకొని సంవత్సరాల పాటు శరణార్థ శిబిరాల్లో గడిపారు. మత ప్రాతిపదికన సమీకరణలు మారడం ద్వారా ఆ దాడుల ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. 2002 తరువాత పుట్టిన తరానికి చెందిన ప్రజలకు ఇప్పుడు ఓటు హక్కు లభించింది. ఆ హింసకు సంబంధించిన జ్ఞాపకాలు వీరికెవరికీ తెలియనప్పటికీ, దాని ప్రభావంతో ఇప్పటికీ వారు బాధపడుతున్నారు.
2014 తరువాత బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మితవాద ప్రభుత్వం చేతిలో ఉన్న రాజ్యాంగ యంత్రాంగం, సంఫ్‌ుపరివార్ శక్తులు ముస్లింలను భయకంపితులను చేస్తూ, నేరస్థులుగా పరిగణిస్తూ, నిర్బంధంలో ఉంచు తున్నారు. ముస్లిం పురుషుల జీవితాలు నాశనం కావడంతో, దాని కొనిసాగింపుగా వారి కుటుంబాలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో 2020 ఢిల్లీ అల్లర్లు, గోరక్షక దళాల పేరుతో చట్ట విరుద్ధంగా అనేక మందిని చంపారు. ముస్లింలకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు నిత్యకృత్యంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను అణచివేసి, విద్యార్థులు, కార్యకర్తలను మూకుమ్మడిగా అరెస్ట్ చేశారు. వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు.
మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపర మైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకుంటే, వారిలో కొంతమంది గొంతెత్తి రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మతాచరణ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతు లైన ముస్లిం యువతులు హిజాబ్ లేదా తల ముసుగు(హెడ్ స్కార్ఫ్) ధరించడం ద్వారా వారికున్న హక్కును మితవాదులకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు. అనేకమంది తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.
దుర్మార్గపు 'సల్లీ ఒప్పందాలు'
జూలై 2021లో ముస్లిం యువతులకు గుణపాఠం చెప్పే ఉద్దేశ్యంతో 'సల్లీ ఒప్పందాలు'(సల్లీ డీల్స్) పేరుతో 'గీత్ హబ్' వెబ్సైట్ వేదిక నుండి ట్విట్టర్‌కు షేర్ చేశారు. 'వేలం కోసం' అని 80మంది ముస్లిం మహిళల ఫొటోలను (మార్పు చేసిన) వారి ఇంటర్నెట్ నుండి వారి అనుమతి లేకుండా పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేయబడిన ఫొటోలు ముస్లిం జర్నలిస్ట్‌లు, ముస్లిం మహిళా కార్యకర్తలు, లాయర్లు, కళాకారులకు చెందినవి. హానా మోహిసిన్ ఖాన్ అనే ఒక పైలట్ పోలీసులకు ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ పిరికి పందలు చేసిన పనికి వారు తగిన మూల్యం చెల్లించేట్లు చేస్తానని ట్విట్టర్లో పేర్కొంది. ఫాతిమా జోరా ఖాన్ అనే ముంబైకి చెందిన న్యాయవాది కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. ఫాతిమా ఖాన్ అనే ఒక రిపోర్టర్ ఫొటో కూడా ట్విట్టర్లో ఉన్న విషయం చూసి, తనకు వెన్నులో వణుకు మొదలైందని చెప్పారు. ఇలాంటివి ఎలా అంగీకార యోగ్యంగా ఉంటాయి? ఈ జాబితా తయారు చేసిన వారికి వేసే శిక్ష ఏమిటి? ముస్లిం పురుషులను చట్టవిరుద్ధంగా చంపుతున్నారు, ముస్లిం మహిళలను వేధిస్తున్నారు, ఆన్లైన్లో వేలం వేస్తున్నారు. ఇది ఎప్పటికి అంతమవుతుంది? అని ఆమె ట్వీట్ చేసింది.
'సల్లీ' అనేది ముస్లిం మహిళలను కించపరిచే ఒక అభ్యంతరకరమైన పదం ''నేటి సల్లీ ఒప్పందం'' అని ప్రతీరోజూ యాప్‌లో ఒక ముస్లిం మహిళ ఫొటో పోస్ట్ చేసే వారు. ఈ యాప్‌ను కేవలం ముస్లిం మహిళలను మాన సికంగా వేధించే, కించపరిచే లక్ష్యంతోనే తయారు చేశారు.
ద్వేషపూరిత రాజకీయ ప్రచారాన్ని ఖండిస్తూ మహిళా హక్కుల కార్యకర్తలు, సంబంధిత పౌరులు ఒక బహిరంగ లేఖ రాశారు. మితవాద హిందూత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గొంతెత్తుతున్న ముస్లిం మహిళా జర్నలిస్టులు, వృత్తి దారులు, విద్యార్థుల డాటాబేస్‌ను సృష్టించడం ద్వారా మహిళలనే లక్ష్యంగా చేసే కుట్ర అనీ, రాజకీయాల్లో వారి భాగస్వామ్యం లేకుండా చేయడం ఆ కుట్ర ఉద్దేశ్యం. తాము సమాన పౌరసత్వాన్ని, సమాన రాజకీయ భాగస్వామ్యాన్ని ఆన్లైన్లో ఆఫ్‌లైన్‌లో ముస్లిం మహిళలకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ క్రూరమైన దాడి సమాజంలోని కొన్ని వర్గాల మహిళలను, ముఖ్యంగా ముస్లిం మహిళలను, ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించే వారిని ద్వేషించే సూచిక అని 'ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' తీవ్రంగా ఖండించింది.
కొన్ని ఫిర్యాదులు చేసిన అనంతరం గీత్ హబ్, ఆ యాప్‌ను మూసేసింది కానీ, ఆరు నెలల తరువాత 'బుల్లీ బారు' పేరుతో పునఃదర్శనం అయింది. ఈసారి ఆ యాప్‌లో పాకిస్థాన్ నోబెల్ లారేట్ మలాలా యూసఫ్ జారు, సినీ నటి షబానా ఆజ్మీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సదాఫ్ జాఫర్, కాశ్మీరీ జర్నలిస్ట్ ఖురాతులైన్ రెహబర్, ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి భార్య, కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి అయిన 65ఏండ్ల ఫాతిమా నఫీస్లతో పాటు మొత్తం 100మంది ముస్లిం మహిళల పేర్లు ఉన్నాయి. మత ప్రాతిపదికన ద్వేషపూరితంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ, జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడుతున్నారని ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ఇస్మత్ అరా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జీవంలేని వస్తువులను ఆన్లైన్లో ఆఫ్‌లైన్‌లో వేలం వేసే పద్ధతిలో మనుషులను వేలం వేసే పద్ధతిని కఠినంగా నిషేధించాలని ఢిల్లీ హైకోర్టు విమన్ లాయర్స్ ఫోరమ్ భారత ప్రధాన న్యాయమూర్తిని కోరింది. 'సల్లీ ఒప్పందాల' కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల నేరస్తులు స్వేచ్ఛగా ఆలోచించే, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే వారి చిత్రాలను ఉపయోగించుకుంటారు.
హిజాబ్ సమస్య దుష్ఫలితాలు
ఆన్లైన్ వేలం కేసుల విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నా, కర్నాటక రాష్ట్రంలో పాఠశాలలో హిజాబ్ చుట్టూ ఉన్న వివాదం ముస్లిం మహిళను జాతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన స్థానంలో అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఉంచింది. కొన్ని రోజుల్లోనే హిజాబ్ సమస్య, సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రభావాన్ని చూపింది. కానీ ముస్లిం ప్రజల్లో ఉన్న భిన్నత్వం వలన పదాల అర్థాలు భిన్నంగా ఉన్నాయి. ఉదా:-బెంగాల్ ముస్లిం జనాభా ఎక్కువగా నివసించే ఢిల్లీ మురికివాడల్లో 'హిజాబ్' అనే పదం విదేశీ పదం. కూలీలుగా పనిచేసే వారి ఇరుగు పొరుగున నివసిస్తూ ఇళ్ళలో పని చేస్తూ, నిర్మాణ రంగంలో పని చేసే మహిళలు ఒక్కోసారి ముసుగు ధరిస్తారు, దానిని వారు 'ఇస్కబ్' అంటారు.
ఇంటిపని చేసే తబస్సుమ్, అక్కడే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు దాన్ని చున్నీ, దుపట్టా, పర్దాV్‌ా లేక పల్లూ(చీరకట్టినప్పుడు) అంటారు. వారు బయటికి వెళ్ళినప్పుడు తలలను కప్పుకుంటారు. కానీ పని చేసే సమయంలో, ఇంట్లో ఉన్నప్పుడు, సైకిల్ తొక్కే సమయంలో వివిధ సందర్భాలలో దానిని ధరించరు. దానితోపాటు పెళ్లి కాని అమ్మాయిలు కూడా వాటిని ధరించరు.
ఖురాన్ పఠనం చేసి, తలపై చున్నీ లేదా పర్దాV్ాలను ధరించే అమ్మాయిలను, పురుషులను మత పెద్దలు ''మంచి అమ్మాయిలు''గా పరిగణిస్తారని తబస్సుమ్ ''ఫ్రంట్ లైన్''కు చెప్పింది. ఎప్పుడైనా ఒకవేళ వారు సినిమాకు, షాపింగ్ మాల్కి వెళ్తే మహిళలు కూడా అవమానించేలా మాట్లాడతారని ఆమె చెప్పింది. పదేండ్ల వయసు నుంచి తబస్సుమ్ ఇస్కబ్ను ధరించడం వల్ల అది ఆమెకు బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఆ ముసుగు లేకుంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని ఆమె చెప్పింది.
కానీ ఆమె బుర్కా అలవాటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంత వరకు బుర్కా ధరించలేదు. బుర్కా ధరిస్తే పని చేయడం సాధ్యం కాదని, ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుందని చెప్పింది. ఖురాన్ చెప్పింది నేను చేస్తాననీ, నేను మంచి వ్యక్తిగా ఉండే ప్రయత్నం చేస్తాననీ, ఎవరో ఏదో అనుకుంటారని బాధపడితే, నేను ఎలా సంపాదించి, ఎలా పిల్లలకు తిండి పెడతానని అంటుంది. భారతదేశంలో హక్కులూ, ఆచారాల మధ్య జరుగుతున్న సమీకరణ చర్చల్లో తబస్సుమ్ లాంటి శ్రామికవర్గ ముస్లిం మహిళకు తన భావాలను వెల్లడించే కొద్దిపాటి స్థలమే ఉంటుంది. అదే నిజమైన విషాదం. ('ఫ్రంట్ లైన్' సౌజన్యంతో)
- దివ్యా త్రివేది
అనువాదం: బోడపట్ల రవీందర్, 984841245