Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తిగతమైన స్వేచ్ఛ, సంక్షేమంతో పాటు సామాజిక లాభాలను పొందటానికి మెరుగైన ఆరోగ్యంతో పాటు, లోకజ్ఞానాన్ని అందిస్తుంది విద్య. మహిళలకి సహజంగా ఆలోచించే శక్తి కలుగుతుంది. అంతే కాదు, సమాజం అభివృద్ధి సాధించా లన్నా మహిళకి విద్య తప్పనిసరి. మహిళలు చదువు కోవడం వలన తమ కుటుంబాల్ని, పిల్లల్ని కూడా కాపాడుకోగలరు. చదువుకున్న మహిళలు పిల్లలకు పౌష్టికాహారం, టీకాలు వేయించటం, అంటురోగాల నిర్మూలన, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, అంటరాని తనం, మూఢనమ్మకాలను జయించటం మొదలైన వాటిని కూడా సాధించగలరు. చదువుకోవడం వల్ల నేడు మహిళ కుటుంబాన్ని, ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తనంతటతానే నిలబడే శక్తిని సంపాదిస్తుంది. జీవితంలో ఏ ఆపదలు వచ్చినా కష్టాల పాలు కాకుండా ధైర్యంగా నిలబెట్ట గలుగుతుంది. కాబట్టి మహిళా విద్య, స్త్రీ సంపద అనేది పిల్లల భవిష్యత్తుకి, కుటుంబ భవిష్యత్తుకే కాదు, సమాజ శ్రేయస్సుకూ, దేశ ప్రగతికీ ఎంతో అవసరం.
ఒక అబ్బాయికి విద్య నేర్పితే ఒక వ్యక్తికి విద్య నేర్పడం అయితే, ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పడం అవుతుంది. అందుకే మహిళలు అక్షరాస్యులు అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకే స్త్రీ విద్య ఇప్పుడు ముఖ్య లక్ష్యం. ఇప్పుడు విద్యతో పాటుగా సాంకేతిక పరంగా కూడా ఎదగడం ముఖ్యం. వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం. అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది. దానికి సాంకేతిక విద్య కూడా తోడు కావాలి.
విద్య భావప్రకటనా సామర్థ్యాన్నిస్తుంది. స్వరాజ్య పోరాటంలో ఒక భాగంగా మహిళా చైతన్యం ప్రారంభమైంది. అందులో ప్రధానమైన అంశం మహిళా విద్య. మహిలకి విజ్ఞాన సముపార్జనతో పాటుగా ఆర్థిక స్వాతంత్య్రం కూడా కావాలి అని గుర్తించారు. అందుకు విద్య అవసరం అని గుర్తించి మహిళా విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు సమకూరుస్తన్న ప్పటికీ ఇంకా చాలా అవగాహన రావాలి.
కుటుంబ కారణాలు, సామాజికపరమైన అంశాల కారణంగా చదువుకున్న వారు, ఉద్యోగాలు చేసే మహిళలు కూడా కొన్ని రంగాలలో ఆసక్తిని కనబరచడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యాలను, పెంపోదించు కోవడంలో కొంత అలసత్వం జరగుతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాగే కొన్ని విషయాల మీద ఇంకా మగవారి మీదే ఆధార పడటం జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకు, ఇన్సూరెన్సు, పెన్షన్ వ్యవహారాలూ, జీవన ప్రమాణ పత్రం సమర్పణ గురుంచి, అదే విధంగా ఆర్థిక పరమైన ముఖ్య విషయాలు చెక్స్ రాయడం, డిడిలు తీసుకోవడం, పాస్‌బుక్ వివరాలు, ఎటిఎం ఉపయోగించడం. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉపయోగించడం ఇప్పుడు కొత్తగా స్మార్ట్‌ఫోన్స్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయడంలో వెనుకబాటు తనం ఉంది. అయితే వీటి గురుంచి అవగాహన పెంచుకొని వివరంగా తెలుసుకుంటూ ఉపయో గించం వల్ల బ్యాంకులకు డబ్బు బదిలీచేయవచ్చు, వెబ్సైట్లను బ్రౌజ్ చేయవచ్చు, ఇమెయిల్స్ పంపుకోవచ్చు, అందుకోవచ్చు, బస్సు, రైలు విమాన టిక్కెట్లు బుక్ చేయవచ్చు. ఇవన్నీ తాము కూర్చున్న చోటు నుంచే చేసుకోవచ్చు. చాల మంది వీటిని ఉపయోగించుకోవాలని ఉత్సాహం చూపించినా ఇంట్లోని వారే నిరుత్సాహ పరచడం వల్ల వాళ్ళ కార్యసిద్ధి నిరుపయోగం అయిపోతోంది. ఇప్పుడు ప్రపంచమంతా సాంకేతిక విజ్ఞానంతో ముందుకు దూసుకొని పోతోంది. రోజువారీ పనిలలో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవు తుంది. ఉదాహరణకు ఫోన్ బిల్, కరెంటు బిల్ లాంటి చెల్లింపులు తేలికగా జరిగిపోతాయి. గర్హించాలసిన సంగతి ఏమిటి అంటే ఈ సందర్భం లో కూడా మహిళలకు స్వేఛ్చ నివ్వకపోవడం, నీ మొహం నీ కేమి తెలుసు? మగవాళ్ళం మాకే కష్టం అలాంటిది మీరేం చేయగలరు అంటూ చాలా మంది వాళ్ళని కట్టడి చేయటం. ఇక్కడ కూడా మహిళల మీద ఒక తేలిక భావం లేదా ఒక అపప్రద ఏమిటంటే 'నువ్వు డబ్బులు ఖర్చు చేసేస్తావు' అన్ని నీ అరచేతిలో చేతిలో ఉంటే అంటూ భయంతో కూడిన ఈసడింపు చేయటం లాంటివి జరుగుతున్నాయి. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఇంకా, ఇప్పటికీ ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొద్దిగా ఈ సాంకేతిక విజ్ఞానాన్ని తెలుసుకునే దిశలో వారికీ అవగాహన కలిగించాలి. ఈ అవగాహన ఇంటినుంచే మొదలవ్వాలి. ఇటువంటి లోపా లను సరిదిద్ది మహిళలను ప్రోత్సహించే విధానాలను చేపట్టడం తప్పనిసరి. ఈ విషయంలో తాజాగా ప్రయత్నం జరగాలని కొత్త పథకాలను కూడా చేపట్టే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం పట్ల మహిళల్లో ఆసక్తిని పెంపొందించాలని చాలా మంది కోరుకుంటున్నారు. అంతర్జాలంలో ఎన్నో విషయాలు పొందుపరచి ఉన్నాయి. ఇప్పుడు ఈ సాంకేతిక జ్ఞానం పొందటం వల్ల వాటన్నిటినీ తెలుసుకోవచ్చు. దేనికైనా ఇరుపార్ష్వాలు ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని లోపాలు భయాలు ఉన్నాయి. అయినప్పటికి కొద్ది పాటి జాగరూకతతో వ్యవహిరిస్తే మహిళలు ఎన్నో పనులను సులువుగా చేసుకో గలుగుతారు. ఇందుకు కొన్ని స్వచ్ఛంద సేవాసంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల గురుంచి అవగాహన పెంచుకుంటూ మహిళలు మరింత క్రియాశీలకంగా ముందంజ వేయాలంటే అందుకు అవసరమయ్యే సహకారం ఇంట్లోనే కాదు, సామాజికపరంగా కూడా అందాలని, మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబమైనా, సమాజమైనా, దేశమైనా, ప్రపంచమైనా సంక్షేమంగా ఉంటుంది అన్న స్వామి వివేకానంద మాట అక్షర సత్యం.
- మణి వడ్లమాని