Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నారాయణ, నారాయణ'' అనుకుంటూ నారదుడు వైకుంఠంలోకి ప్రవేశించాడు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి నాదుడిని సాదరంగా ఆహ్వానించారు.
''అదేమిటి స్వామీ! మీ యోగనిద్రకు భంగం కలిగిస్తున్నాననే అనుమానంతో వచ్చితిని. కాని మీరేమో మేలుకొని ఉన్నారు! పైగా చాలా రోజుల నుండి నిద్రకూడా లేనట్లున్నది. కళ్ళు కాయలు కాచినట్లున్నవి!'' అన్నాడు నారదుడు ఆశ్చర్యంగా
''అవును నారదా! ఆ ఉక్రేయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి స్వామి వారు నిద్రకు దూరమయ్యారు! ఇంతకు పాదములు ఒత్తుతుండగానే నిద్రలోకి జారిపోయేవారు!'' అన్నది లక్ష్మీదేవి బాధగా..
''ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగితే మీరు నిద్రపోకుండా ఎందుకుంటున్నారు దేవా? నాకు తెలిసి ఉక్రెయిన్‌లో గాని, రష్యాలో గాని మీకు భక్తులెవరూ లేరు కదా!'' అన్నాడు నారదుడు.
''అక్కడ నాకు భక్తులు లేకపోయినా, యుద్ధం జరుగుతుంటే నాకు బాధగానే ఉంది నారదా!'' అన్నాడు విష్ణుమూర్తి.
''దేవా! మీరు స్థితికారకులు! పాపం పెరిగినప్పుడు నీవు అవతారం దాల్చుతావు. పాపాత్ములను నిర్జించి, పుణ్యాత్ములను కాపాడతావు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నందున పాపాత్ములు నిర్జించబడుతారు కదా భాదెందుకు?'' అడిగాడు నారదుడు.
''నీవు చెప్పింది నిజమే నారదా! ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి కారణమైనవారు యుద్ధరంగానికి వెలుపల ఉన్నారు! అందుకే నాకు బాధగా ఉన్నది!'' అన్నాడు విష్ణుమూర్తి.
''స్వామీ! నీవు చెప్పింది నాకేమీ అర్థం కావటం లేదు! అంతా అయోమయంగా ఉన్నది'' అన్నాడు నారదుడు.
''నీవొక్కడవే కాదు నారదా! సమస్త భూమండలంలోని ప్రజలందరూ అయోమయంలోనే ఉన్నారు! జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ది తప్పని కొందరు, రష్యాది తప్పని కొందరూ వాదిస్తున్నారు. కాని యుద్ధం జరగటానికి అమెరికానే కారణమనే విషయం చాలా మంది అర్థం చేసుకోవటం లేదు!'' అన్నాడు విష్ణుమూర్తి.
''స్వామీ మీరు కూడా కమ్యూనిస్టుల వలె మాట్లాడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ ఇరుగుపొరుగు దేశాలు. ఆ రెండూ గతంలో సోవియట్ యూనియన్‌లో ఉన్నవే. పైగా రష్యన్ జాతి పెత్తనం కూడా గతంలో ఉండింది. ఆ పాత తగాదాలే మళ్ళీ ముందుకు వచ్చి యుద్ధం జరుగుతుందని అందరూ అంటున్నారు! మీరేమో ఏ పాపమెరుగని అమెరికానే యుద్ధ నేరస్తుడిని చేస్తున్నారు!'' అన్నది లక్ష్మీదేవి.
చిన్నగా నవ్వాడు విష్ణుమూర్తి.
''రష్యా, ఉక్రెయిన్ మధ్య తగాదాలు పెటిÊంది అమెరికానే. నాటోలో చేరాలని ఉక్రెయిన్ను సాగదీసిందీ అమెరికానే. నాటోలో చేరాలని, అందుకోసం అవసరమైతే రష్యాతో యుద్ధం చేయాలని, యుద్ధంలో ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతును ఇస్తామని చెప్పిందీ అమెరికానే. అమాయకంగా అమెరికా మాటలు నమ్మి యుద్ధానికి దిగింది ఉక్రెయిన్'' అన్నాడు విష్ణుమూర్తి.
''సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్రదేశంగా ఉక్రెయిన్ ఏ కూటమిలోనైనా చేరొచ్చు కదా! చేరొద్దు అనటానికి రష్యాకు హక్కు అధికారం లేవు కదా!'' అడిగింది లక్ష్మీదేవి.
''ఉక్రెయిన్ సార్వ భౌమాధికారం గల దేశమే! అదే రష్యాకు నచ్చటం లేదు. ఉక్రెయిన్, నాటోలో చేరితే నాటో సైన్యాల ఆయుధాల పరిధిలోకి రష్యా వస్తుంది. అందుకే ఆత్మరక్షణ పేరిట రష్యా - ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగింది. ఆ రెండు దేశాలు చర్చించుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదే. యుద్ధంలో ఎంతో నష్టం జరుగుతున్నది. ఎప్పుడూనా చర్చలు తప్పవు. అందువల్ల యుద్ధం చేయకుండా చర్చలే చేస్తే సరిపోయేది!'' అన్నాడు విష్ణుమూర్తి.
''అమెరికా సాయం వల్లే ఉక్రెయిన్ ఇంతకాలం యుద్ధంలో నిల్చిందా?'' ప్రశ్నించాడు నారదుడు.
మరోసారి చిరునవ్వు నవ్వాడు విష్ణుమూర్తి.
''యుద్ధంలో ఇంతకాలం నిలవటానికి ఉక్రెయిన్ ప్రజల పట్టుదలే కారణం! యుద్ధానికి ఉక్రేయిన్ని ప్రోత్సహించిన అమెరికా దాని మిత్రదేశాలు యుద్ధంలోకి ప్రత్యక్షంగా దిగటానికి ససేమిరా అంటున్నాయి! కాని యుద్ధానికి అవసరమైన, ఆయుధాలు, మందుగుండు, తుపాకులు, ఫ్రిగేట్లు లాంటి వాటిని ఉక్రెయిన్‌కి సప్లయి చేస్తున్నాయి! అంటే అమెరికా, ఆయుధవ్యాపారం జరుగుతుందన్న మాట! ఇదే యుద్ధరీతి!'' వివరించాడు విష్ణుమూర్తి.
''యుద్ధం జరగకముందు ఆత్మరక్షణ కోసం, యుద్ధం జరుగుతుంటే శత్రువుతో పోరాటం చేయటానికి, అమెరికా ఆయుధాలను సప్లయి చేస్తుంది. ఏటైములో నైనా అమెరికా ఆయుధ వ్యాపారం మాత్రం ఆగకుండా జరుగుతుందన్న మాట!'' అన్నది లక్ష్మీదేవి.
''స్వామీ మరో అనుమానం తీర్చండి! భారతదేశ చరిత్ర నుండి నెహ్రూ ముద్రను చెరిపేసేందుకు విశ్వప్రయత్నం చేస్తూనే, నెహ్రూ అలీనోద్యమాన్ని భారత ప్రధాని ఎందుకు అమలు చేసినట్లు?'' ప్రశ్నించాడు నారదుడు.
''ప్రస్తుత పరిస్థితిలో అలీనవిధానమే దిక్కు. మరో అవకాశం లేదు మరి! అంతే కాదు, క్రమంగా అమెరికావైపు జరుగుతున్న భారత్‌కు ఉక్రెయిన్ స్థితి పెద్ద గుణపాఠం! అమెరికాను నమ్మి యుద్ధంలోకి దిగామని, ఇప్పుడేమో అమెరికాతో సహా ఎవరూ మద్దతు తెలపటం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు గగ్గోలు పెట్టినా పట్టించుకునే దిక్కులేదు. అమెరికాను నమ్మిన ఫలితంగా ఉక్రెయిన్ 30 సంవత్సరాలు వెనక్కి పోయింది. సోషలిస్టు దేశంగా ఉన్నప్పుడు సోవియట్ రష్యా, 1972లో భారత్ పక్షాన నిలిచి అమెరికానే ఢకొీట్టేందుకు సిద్ధపడింది అదీ స్నేహమంటే! అమెరికాతో స్నేహం ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం!'' అంటూ ముగించాడు విష్ణుమూర్తి.
- ఉషాకిరణ్
సెల్:9490403545