Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్పై రష్యా దాడి... యూరప్ పైన, ప్రపంచ వ్యవహారాల పైన దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. రష్యాకు ఉండే భద్రతాపరమైన ముప్పు గానీ, కవ్వింపు చర్యలు గానీ కారణాలేవైనా సరే రష్యా ఇంత పెద్ద ఎత్తున, పూర్తి స్థాయిలో చేపట్టిన సైనిక చర్య సమస్య పరిష్కారానికి ఎంతమాత్రం తోడ్పడదు. తక్షణమే కాల్పులను విరమించి, దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపుల క్రమాన్ని చేపట్టాలి.
రెండు ముఖ్యమైన అంశాలు
ఈ పరిస్థితికి దారి తీసిన రెండు కీలకమైన అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. మొదటి అంశం-సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పటి నుండి చోటు చేసుకుంటున్న పరిణామాలు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఉధృతం చేసేందుకు, సోవియట్ యూనియన్, దాని మిత్రపక్షాలైన తూర్పు యూరప్ సోషలిస్టు దేశాలు ఏర్పాటు చేసిన వార్సా ఒప్పంద కూటమితో సైనికంగా ఘర్షణ పడేందుకు 'నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్' (నాటో)ను ఏర్పాటు చేసిందని సీపీఐ(ఎం) మొదట్నించీ చెబుతూ వస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోషలిజానికి వ్యతిరేకంగా చేపట్టిన సైద్ధాంతిక యుద్ధ సైనిక విభాగమే నాటో. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై పోవడంతో వార్సా ఒప్పందం మనుగడలో లేకుండా పోయింది. అందువల్ల నాటో కొనసాగడంలో కూడా ఎలాంటి హేతుబద్ధత లేదు. ఈ కూటమి మనుగడకు కాలం చెల్లిందనే ఒకే ఒక్క కారణంతో దీన్ని రద్దు చేయాల్సి ఉంది. వాస్తవానికి, 1992 జనవరిలోనే, సీపీఐ(ఎం) 14వ మహాసభల్లో ఆమోదించిన రాజకీయ తీర్మానం ఈ విధంగా పేర్కొంది. ''వార్సా ఒప్పందం రద్దు అయినా నాటో ఇంకా మనుగడలోనే ఉంది. పైగా గల్ఫ్ యుద్ధంలో కలిసి పనిచేస్తోంది. నాటో దేశాలు తమ వ్యూహాన్ని మార్చుకుని, అన్ని సభ్య దేశాలకు చెందిన బలగాలతో కూడిన... సత్వరమే జోక్యం చేసుకునేలా, సత్వర ప్రతిస్పందన బలగాలు (ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్)గా ఏర్పడ్డాయి.'' పైగా, ''ప్రపంచవ్యాప్తంగా గల సైనిక స్థావరాలను మూసివేయడానికి, కొత్త ఆయుధాల ఉత్పత్తిని నిలుపుచేయడానికి, వివాదాస్పద బలగాలను గణనీయంగా తగ్గించడానికి, అణ్వాయుధాలను మరింతగా తగ్గించి, పూర్తిగా అంతం చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా, దాని మిత్రపక్షాలు ప్రధానంగా చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా గల శాంతి శక్తులు డిమాండ్ చేయాలి. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రంచ శాంతి ఉద్యమం మరింత బలోపేతం కావాలి'' అని ఆ తీర్మానం కోరింది.
ప్రపంచవ్యాప్తంగా తన గుత్తాధిపత్యాన్ని పటిష్ట పరుచుకోవాలన్న ఆకాంక్షతో, ప్రచ్ఛన్న యుద్ధానంతర ఘర్షణలతో అమెరికా సామ్రాజ్యవాద శక్తులు, నాటోను కొనసాగించాలని భావించడమే కాకుండా, దాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా తలపెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా సైనిక ఆపరేషన్లకు ముఖ్యంగా యూరప్, సెంట్రల్ ఆసియాల్లో కార్యకలాపాలకు నాటోను ఉపయోగిస్తున్నాయి. నాటోను రద్దు చేయడానికి బదులుగా, తూర్పు దిశగా నాటోను విస్తరించే క్రమాన్ని అమెరికా వేగిరపరిచింది. పైగా యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం జరిగిన అనంతర కాలంలో గోర్బచేవ్కు ఇచ్చిన హామీని విస్మరించింది. 1990లో, నాటోలో 16 సభ్య దేశాలున్నాయి. 1999లో పోలాండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్లు చేరాయి. 2004లో బల్గేరియా, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియాలు చేరాయి. 2009లో అల్బేనియా, క్రొయేషియాలు చేతులు కలిపాయి. 2017లో మాంటెగ్రో, నార్త్ మెసిడోనియాలు కలవగా, 2021లో బోస్నియా, హెర్జెగోవినాలు చేరాయి. ఆ రకంగా, ఉక్రెయిన్, జార్జియాలు మినహా దాదాపు తూర్పు యూరప్ దేశాలన్నీ నాటోలో చేరాయి. రష్యా సరిహద్దుల్లో దాదాపు లక్షా 75 వేల నాటో బలగాలు మోహరించి వున్నాయి.
2008లో ఇతరుల భద్రతను పణంగా పెట్టి ఏ దేశమూ తన భద్రతను బలోపేతం చేసుకోరాదన్న సూత్రం ప్రాతిపదికన యూరప్ దేశాల భద్రతా ఒప్పందాన్ని రష్యా ప్రతిపాదించింది. అయితే, ఇది తిరస్కరణకు గురైంది. తాజాగా నాటో లోకి ఉక్రెయిన్ ప్రవేశాన్ని రష్యా భద్రతకు ముప్పు కలిగించే దూకుడు చర్యగా రష్యా పరిగణించింది.
గత డిసెంబరులో రష్యా-నాటో సభ్యదేశాల మధ్య భద్రతాపరమైన హామీలను రష్యా ప్రతిపాదించింది. (ఎ) నాటోను ఇకపై విస్తరించకూడదు (బి) రష్యా సరిహద్దుల్లో ఎలాంటి ఆయుధాలు మోహరించరాదు. (సి) 1997 నాటి నాటో-రష్యా వ్యవస్థాపక చట్టాన్ని అమల్లోకి తేవాలి... అని మూడు ప్రతిపాదనలు చేసింది. దీన్ని తిరస్కరిస్తూ అమెరికా, ఉక్రెయిన్లో రష్యా వ్యతిరేక పవర్ గ్రూపును ప్రోత్సహిస్తూ వచ్చింది. 2014లో కుట్రకు పాల్పడింది. దాంతో ఉక్రెయిన్ లాంఛనంగా నాటోలో చేరకుండానే ఉక్రెయిన్లో నాటో మౌలిక సదుపాయాలు పెరగడం ఆరంభించాయి.
ఈ ప్రతికూల పరిణామాలన్నింటినీ రష్యా భద్రతకు ముప్పు కలిగించేవిగా రష్యా, పుతిన్లు భావిస్తూ వచ్చారు. అంతిమంగా ఈ పరిణామాలే ప్రస్తుత సైనిక ఘర్షణలకు, దాడికి దారి తీశాయి. అందువల్ల ఈ యుద్ధం ప్రధానంగా రష్యా, అమెరికా-నాటోల మధ్య యుద్ధంగానే పరిగణించాల్సి వుంటుంది. ఉక్రెయిన్ కేవలం ఈ యుద్ధం జరిగే వేదికగా మాత్రమే ఉంది.
గ్రేటర్ రష్యా పునరుద్ధరణవాదం
ఉక్రెయిన్ను తమ అంతర్భాగంగా పరిగణిస్తూ, గ్రేటర్ రష్యాను పునరుద్ధరించాలన్న తన ప్రాజెక్టును పుతిన్ అమలు చేస్తున్నారనేది రెండో అంశం. చాలావరకు, రష్యా చరిత్ర, మతం మొదలైనవన్నీ నేడు ఉక్రెయిన్లో భాగమైన భూభాగాల నుండే వ్యాపించాయి. రష్యా, ఉక్రెయిన్ల చరిత్రలు రెండూ శతాబ్దాల తరబడి పరస్పరం పెనవేసుకుపోయాయి. ఉక్రెయిన్ పశ్చిమభాగంలో ప్రధానంగా కేథలిక్కులు ఉంటారు. తూర్పు ప్రాంతంలో రష్యన్ సాంప్రదాయవాదులదే మెజారిటీ. పశ్చిమ ఉక్రెయిన్ వాసులు ఉక్రెయిన్ భాషను మాట్లాడుతుండగా, తూర్పు ఉక్రెయిన్వాసులు రష్యన్ మాట్లాడతారు.
ఈ పునరుద్ధరణవాదాన్ని అనుసరిస్తున్న పుతిన్ ఫిబ్రవరి 21న జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... వేర్పాటువాద ఉక్రెయిన్ ఏర్పడడానికి కారణాన్ని బోల్షివిక్కులపైనే నెట్టారు. ప్రస్తుత ఉక్రెయిన్ను వ్లాదిమిర్ లెనిన్ యొక్క ఉక్రెయిన్గా పిలుస్తున్నారు. 1922లో ప్రకటించి, 1924లో సోవియట్ యూనియన్ రాజ్యాంగంలో పొందుపరచబడిన, అక్టోబరు విప్లవానంతరం అనుసరించిన, దేశాల స్వయం నిర్ణయాధికారపు హక్కు గురించి పేర్కొంటున్న శాస్త్రీయ, ప్రజాస్వామ్య లెనినిస్ట్ సూత్రమే కారణమంటూ పుతిన్ నిందిస్తున్నారు. పూర్వపు సోవియట్ రిపబ్లిక్కుల్లో జాతీయవాద శక్తుల ఆవిర్భావానికి దారి తీసిన 'అసలైన పాపం' ఇదేనంటూ పుతిన్ మరింతగా దీన్ని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్ రష్యా సామ్రాజ్యవాద జార్ దృక్పధాన్ని ఓడించిన 1917 సోషలిస్టు విప్లవం విజయానికి వ్యతిరేకంగా లెనిన్, బోల్షివిక్కులపై తిరుగుబాటు లేదా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పునరుద్ధరించాలని కోరుకోవడం నేటి ప్రపంచంలో సాధించలేని లక్ష్యం.
కాల్పుల విరమణ.. శాంతి పునరుద్ధరణ..
ప్రపంచ శాంతికి తీవ్ర పర్యవసానాలు కలిగించగలిగేటువంటి ఈ ఘర్షణలు మరింత రెచ్చగొట్టకుండా ఇక్కడితో నిలువరించడం అత్యవసరం. ఘర్షణలను రెచ్చగొట్టే ఈ శక్తులు ఆవిర్భవించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు నెలకొంటాయి. ఎలాంటి వ్యయ ప్రయాసలకు ఓర్చయినా దీన్ని నివారించాలి. తక్షణమే కాల్పుల విరమణ జరగాలి. రష్యా బలగాల ఉపసంహరణ కీలకం. ఇటువంటి పరిస్థితుల్లో నాటో తూర్పు దిశగా విస్తరణను నిలుపుచేయడం కూడా ముఖ్యమే. రష్యా సరిహద్దుల్లో ఆ దేశ భద్రతకు ముప్పు కలిగించేలా మారణాయుధాలను, క్షిపణి వ్యవస్థలను మోహరించడం ఆపివేయాలి. ఉక్రెయిన్ తటస్థ సార్వభౌమాధికార దేశంగా ఉండాలి. రష్యా భద్రతకు ముప్పు కలిగించేలా నాటో క్షిపణులను, ఇతర ఆయుధ వ్యవస్థలను మోహరించడానికి అనుమతించరాదు. ఉక్రెయిన్లో ప్రస్తుతమున్న నాటో మౌలిక సదుపాయాలల్నింటినీ ధ్వంసం చేయాలి.
శాంతి స్థాపనకు చర్చలు కొనసాగించాలి
రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ, మొదటి దఫా చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదు. చర్చలు కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. 2, 3 తేదీల్లో తదుపరి చర్చలు జరగనున్నాయి. ఈలోగా యుద్ధం కొనసాగుతునే ఉంది. శాంతి భద్రతలను నెలకొల్పే దిశగా స్పష్టమైన పురోగతి సాధించడానికి దారితీసేలా చర్చలు జరిగేందుకు గానూ ఈ యుద్ధంతో సంబంధమున్న అన్ని పక్షాలు ముఖ్యంగా అమెరికా, నాటోలను కలుపుకుని విస్తృత పరిధిలో చర్చలు జరగడం కీలకం.
భారతీయుల తరలింపునకు వేగవంతమైన చర్యలు
ఖర్కీవ్ నగరంలో జరిగిన బాంబు దాడిలో భారత్కి చెందిన 21ఏండ్ల నవీన్ శేఖరప్ప మరణించడం తీవ్ర విషాదకరమైన ఘటన. వారి కుటుంబానికి యావత్ భారతదేశం ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అది గల్ఫ్ యుద్ధమైనా లేదా లిబియా సంక్షోభమైనా వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తరలించిన ఘన చరిత్ర భారత్కు ఉంది. యుద్ధ ప్రాతిపదికన భారతీయులందరినీ స్వదేశానికి రప్పించడంపై భారత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి.
- సీతారాం ఏచూరి