Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటీ నువ్వు చేయలేనిది? అని అభ్యుదయ కవి దేవేంద్ర ప్రశ్నించినట్టు సుమారు వంద సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని, సమాన వేతనం, ఓటు హక్కు మొదలైన డిమాండ్ల కోసం మహిళలు కూడా పోరాటాల్లో భాగస్వాములయ్యారు. దానికి గుర్తుగానే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. కానీ అలాంటి చారిత్రాత్మక ఘటనలు సాధారణ వ్యవహారాలుగా మిగిలిపోతుండటం నేటి విషాదం. ఆ ఉద్యమాల చరిత్రను మరుగున పడేసి వాటి స్థానాల్లో వేడుకలను నిర్వహించి లాభాలను తెచ్చిపెట్టే మార్కెట్ ప్రేరేపిత ప్రాజెక్ట్‌లుగా మార్చివేస్తున్నారు.ఇలాంటి ఘటనల వెనుకవున్న చరిత్రను మరుగుపరుస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింస బాగా పెరిగాయి. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వివక్షత, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు సమాన హక్కులు, శ్రమకు గుర్తింపు, సమాన వేతనాలు, సమాన హక్కుల కోసం, మహిళలపై అత్యాచారాలు, హింసను అరికట్టడం, నేరస్థులకు కఠిన శిక్షలు, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు తదితర సమస్యలకు పరిష్కారం కరువైంది.
ఇంటిపని, వంట పని, గృహ నిర్వహణ, పెద్దల పిల్లల, సంరక్షణ, నీళ్ళు, వంట చెరుకు తీసుకురావటం మొదలైన పనులతో మహిళలు రోజు మొత్తం శ్రమిస్తున్నారు. భారతదేశంలో మహిళలు తమ ఇల్లు, పిల్లలు, పెద్దల కోసం చేస్తున్న జీతభత్యంలేని శ్రమ విలువ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 3.1శాతం అని ఐఎల్ఓ తన నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతు, వ్యవసాయ, గ్రామీణ కార్మిక (ఇటుక బట్టీలు, బీడీ మొదలైన) కుటుంబాల్లోని స్త్రీలు వీటితో పాటు పశువుల పెంపకం, వ్యవసాయ పనులు కూడా చేస్తారు. తాగునీరు, వంటచెరకు, పిల్లలు, వృద్ధుల సంరక్షణా కేంద్రాలు, ఆరోగ్య వసతులు అందుబాటులో లేకపోవడంతో ఈ మొత్తం బాధ్యత, పనులు ఆడవారి మీదే పడుతున్నాయి. ఇన్ని బాధ్యతలు మోయవలసి రావటంతో వారి సమయం, శక్తి మొత్తం ఈ వేతనంలేని శ్రమకే వెచ్చిస్తున్నారు. ఇటువంటి వేతనంలేని సంరక్షణ పనుల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రోజులో అత్యధిక సమయం వెచ్చిస్తున్నారు. వీటన్నిటితో పాటు పని ప్రదేశాలలో శ్రామిక మహిళలు వేతనాలు, సర్వీసు కండీషన్లు, గౌరవం, పదోన్నతుల విషయంలో తీవ్ర వివక్షకు, అవమానాలకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 5.70కోట్ల మంది సరైన ఆరోగ్య సంరక్షణ వసతులులేక ఉద్యోగాలు వదిలేస్తుంటే, ఆ ఖాళీలను వేతనంలేని కార్మికులతో నింపుతున్నారు. పీల్చి పిప్పి చేస్తున్న పనిభారం కారణంగా అత్యధిక మంది మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలు వదిలేస్తున్నారు. మన దేశ జనాభాలో సగం మంది మహిళలలో అత్యధిక మంది సంరక్షణ, సేవ పనులు చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, అనుబంధ పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు మొదలైన స్కీమ్ వర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించటం లేదు. ఈ పథకాలను వ్యవస్థీకృతం చేసి విస్తృత అసంఘటిత రంగ మహిళలు, పిల్లలకు ఆరోగ్య, శిశు రక్షణా సౌకర్యాలు కల్పించాల్సిందిపోయి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌లకు నిధులను తగ్గించేసి, ప్రయివేటు వారికి అప్పగించి క్రమంగా మూసేయాలని చూస్తోంది. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు 45, 46ను అనుసరించి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనాలు, పెన్షన్ చెల్లించాలనే దీర్ఘకాల డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వామపక్ష పార్టీలు తప్ప ప్రధాన రాజకీయ పార్టీలేవీ తమ ఎన్నికల ఎజెండాలో శ్రామిక మహిళల డిమాండ్లను చేర్చడంలేదు. ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక మూల మహిళలపై అత్యాచారం, హింస, యాసిడ్ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇండ్ల దగ్గర నుంచి వసతి గృహాల వరకు ఆడపిల్లలను లైంగిక అవసరాలకు వాడుకొనే వికృతి వ్యాపించింది. అత్యాచారం, అక్రమ రవాణా, హత్యలు సాధారణ విషయాలైపోతున్నాయి. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మహిళలు, పిల్లల జీవితాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి. దేశంలో మహిళలు, బాలికలు ముఖ్యంగా దళిత బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో డేటా (ఎన్సీఆర్బీ) ప్రకారం 2018తో పోలిస్తే 2019లో 7.3శాతం మహిళ లపై హింస పెరిగింది. ఇక తెలంగాణ విషయం లో ఈ లెక్కలను పరిశీలిస్తే 18,394మంది మహిళలపై హింసకు సంబంధించిన కేసులు నమోద య్యాయి. ఇది 2018తో పోలిస్తే 2019లో 14.76శాతం పెరిగింది. ఎన్సీఆర్బి డేటా ప్రకారం 2020లో సగటున ప్రతిరోజూ భారతదేశం అంతటా 77 లైంగిక వేదింపు కేసులు నమోదయ్యాయి.
2020లో అత్యాచార కేసుల సంఖ్య 28,046గా నమోదైంది. మొత్తంమీద 3,71,503 మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయి. మహిళలపై 30.2శాతం జరిగిన నేరాలలో ఎక్కువ భాగం భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం కింద నమోదైంది, ఆ తర్వాత ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశంతో 19.7శాతం మహిళలపై దాడి,19.0 శాతం ఆడవారు ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనే విషయాలపై ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలపై హింసకు పాల్పడ్డవారిని శిక్షించటానికి బదులు, ఆంక్షలతో మహిళలకే శిక్ష విధిస్తున్నారు. మహిళలు తమకు నచ్చిన వారిని, మరీ ముఖ్యంగా ఇతర కులాలు, మతాల వారిని జీవిత భాగస్వాములుగా ఎంచుకోకూడదనే ఆంక్షలు పెడుతున్నారు. ప్రభుత్వం ఆడపిల్లల్ని రక్షిద్దాం. ఆడపిల్లల్ని చదివిద్దాం అని చాలా మాట్లాడు తుంది. కుటుంబ నియంత్రణ గురించి కూడా మాట్లాడుతుంది. మహిళా సాధికారత గురించి చెపుతుంది. కానీ మహిళలను పురుషులకన్నా తక్కువని భావించే, పితృస్వామ్య వైఖరి మార్చేందుకు అవసరమైన చర్యలు మాత్రం తీసుకోదు. నిర్భయ సంఘటన జరిగిన నేపథ్యంలో మహిళలపై హింసను అరికట్టటానికి జస్టిస్ వర్మ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టాల్లో మార్పులు చేయాలని, మహిళలపై హింస కేసుల్లో పాటించే క్రిమినల్ ప్రొసీడింగ్స్‌లో మార్పు తేవాలని, పబ్లిక్ ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించే సంస్థాగత చర్యలను చేపట్టాలని కమిటీ సూచించింది. కానీ ఇప్పటికి ఏడేండ్లు గడిచినా ఈ సిఫారసుల అమలుకు నేటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పని చేసే చోట మహిళలు ఎదుర్కొనతరతే పెద్ద సమస్య లైంగిక వేధింపులు. ఇది మహిళలపై తీవ్ర ప్రభావం చూపటమే కాదు, వారి ఆరోగ్యానికి కూడా హానీ కలిగిస్తున్నది. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చి ఐదేండ్లు దాటిపోయినా కనీసం ప్రభుత్వ రంగంలోనైనా ఈ చట్టం సరిగ్గా అమలు కాకపోవటం అన్యాయం. స్థానిక సంస్థలు, పంచాయతీలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ 1992 నుంచి అమలులో ఉంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థల్లో నేడు పదిలక్షల కన్నా ఎక్కువ మంది మహిళలు ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 33శాతం ప్రాతినిధ్యం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉంది. ఈ స్థానాల్లో రాజకీయ భాగస్వామ్యాన్ని అయితే పొందుతున్నారు. కానీ స్వతంత్రంగా ఎంతవరకూ పని చేయగలుగుతున్నారు అంటే మిగిలేది నిరాశే. చట్ట సభల్లో స్త్రీలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో తుంగలో తొక్కేశారు. కాంగ్రెస్, బీజేపీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాయి. కానీ ఇప్పటివరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా హక్కుల సాధన కోసం పోరాట దినంగా నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర పాలకుల మహిళా వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలి. సమానత్వం, శ్రమకు తగిన గుర్తింపును సాధించుకోవాలి.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140