Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే తమ దేశానికి భద్రతా సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనతో రష్యా ఉన్న సంగతి మీడియాలో బాగానే చర్చకు వచ్చింది. అయితే దానితోబాటు సమాంతరంగా సాగుతున్న మరో పరిణామం ఐఎంఎఫ్‌తో ఉక్రెయిన్ పెట్టుకున్న లింకు. దీనిగురించి మీడియా ఏ మాత్రమూ పట్టించుకోలేదు.
సంపన్న పశ్చిమ దేశాలపెట్టుబడి ప్రపంచంలో ఎక్కడైనా చొరబడడానికి వీలుగా దారి చేయడం ఐఎంఎఫ్ చేసే ప్రధానమైన పని. ఏ దేశంలోకి ఆ సంపన్న పశ్చిమ దేశాల పెట్టుబడి చొరబడాలను కుంటుందో ఆ దేశాన్ని ''పెట్టుబడులకు అనుకూలంగా మార్చడం'' ఐఎంఎఫ్ పని. శ్రామిక ప్రజలకు, సామాన్యులకు నష్టం కలిగించే ''పొదుపు'' చర్యలు అమలు చేయడంతోబాటు ఆ దేశానికి చెందిన సహజ వనరులను సంపన్న పశ్చిమ దేశాలు చేజిక్కించుకోవడం లక్ష్యంగా ఉంటుంది. దానికి దోహదం చేసే ''షరతులను'' ఐఎంఎఫ్ విధించి అమలు జరిగేట్టు చూస్తుంది. అందుకోసం ఆయా దేశాలకు రుణాలిస్తుంది. ఆ రుణాలతోబాటు షరతులు అమలవుతాయి. ఇది సాధారణంగా ఐఎంఎఫ్ అనుసరించే వ్యూహం.
దీనితోబాటు ఐఎంఎఫ్ ఒక్కోసారి ప్రత్యేకమైన పాత్రను కూడా పోషిస్తుంది. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధపు లక్ష్యాలను సాధించడానికి ఐఎంఎఫ్ తోడ్పడుతుంది. ఉక్రెయిన్ విషయంలో ఈ విధమైన పాత్రను ఐఎంఎఫ్ మొదటినుంచీ పోషిస్తూనేవుంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను సంపన్న పశ్చిమ దేశాల పెట్టుబడి ప్రవేశానికి అనుకూలంగా మార్చే ప్రయత్నంతోబాటు అమెరికా ప్రత్యేక లక్ష్యాల సాధన కోసం కూడా ఐఎంఎఫ్ పనిచేస్తూవచ్చింది.
2014కు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడుగా విక్టర్ యునుకోవిచ్ ఉన్నాడు. అప్పటినుంచీ యూరోపియన్ యూనియన్‌తో ఉక్రెయిన్ వాణిజ్యపరంగా కలిసిపోడానికి ఐఎంఎఫ్‌తో చర్చలు జరుగుతూవచ్చాయి. వేతనాలను తగ్గించడం మొదలు వైద్యం, విద్య కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం చేసే ఖర్చును కూడా బాగా తగ్గించుకోవాలని, ప్రజలకిచ్చే గ్యాస్ సబ్సిడీని సగానికి సగం తగ్గించాలని ఐఎంఎఫ్ ఫరతులు పెట్టింది. ఉక్రెయిన్‌లో విద్య, వైద్యం పెద్ద ఎత్తున ఉపాధికల్పించే రంగాలుగా ఉన్నాయి. గ్యాస్ సబ్సిడీ వలన ప్రజలకు విద్యుత్తు చౌకగా లభిస్తోంది. ఐఎంఎఫ్ చెప్పిన విధంగా షరతులను అమలు చేస్తే ప్రజలమీద పెనుభారాలు పడతాయని భావించిన యునుకోవిచ్ ఐఎంఎఫ్‌తో చర్చలు నిలిపివేసి దానికి బదులు రష్యాతో చర్చలు ప్రారంభించాడు. ఇది క్షమించరాని నేరం అయిపోయింది సామ్రాజ్యవాదుల దృష్టిలో. ఐఎంఎఫ్‌తో చర్చలు తెగ్గొట్టుకోవడం అంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనానికి లొంగడానికి నిరాకరించడమే కాక, పశ్చిమ సామ్రాజ్యవాదదేశాల ఆధిపత్యాన్ని కూడా ధిక్కరించడమే అవుతుంది. ముఖ్యంగా నాటో, అమెరికాలను సవాలు చేయడం అవుతుంది. నాటో, అమెరికా వేరు, ఐఎంఎఫ్ వేరు అని భావిస్తే పొరపాటు. ఇవన్నీ ఒకే లక్ష్యం కోసం పని చేస్తాయి. యునుకోవిచ్ వైఖరికి కినుక చెందిన అమెరికా మరింత ''నష్టం'' జరగకుండాఉండేందుకు చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్న నియో నాజీలను రంగంలోకి దింపి యునుకోవిచ్ను కుట్ర ద్వారా కూలదోసింది. ఈ కుట్రలో పాలు పంచుకున్నవారంతా ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యంలో భాగంగా మారిపోయారు. కుట్ర అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తిరిగి ఐఎంఎఫ్‌తో చర్చలు ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్‌తో కలిసి వాణిజ్య భాగస్వామ్యం పొందడానికి ఐఎంఎఫ్ ఉక్రెయిన్‌కు 2,700కోట్ల డాలర్ల రుణాన్ని ఇచ్చింది. అందుకోసం ఉక్రెయిన్ ప్రభుత్వం తన ప్రజలకిచ్చే గ్యాస్ సబ్సిడీలో సగానికి కోత పెట్టింది. సాధారణంగా ఈ స్థాయి దేశాలకి ఐఎంఎఫ్ ఇచ్చే రుణానికి ఆరురెట్లు ఉక్రెయిన్‌కు ఇచ్చింది. అది కూడా ఒక అంతర్యుద్ధంలో మునిగివున్న దేశానికి (అప్పుడు) ఇచ్చింది. మామూలుగా అటువంటి అస్థిరత ఉన్న దేశాలకు ఐఎంఎఫ్ అప్పు ఇవ్వదు. కాని, ఉక్రెయిన్‌కి మాత్రం ఇచ్చింది. ముందునుంచే ఈ అప్పు తిరిగి చెల్లించేది కాదని ఐఎంఎఫ్‌కి బాగా తెలుసు. అయినా ఇచ్చింది. ఎందుకంటే అప్పు కింద ఉక్రెయిన్ దేశపు భూభాగాలను సంపన్న పశ్చిమ దేశాలకు కట్టబెట్టవచ్చు. ఉక్రెయిన్ భూముల్లో ఉన్న విలువైన ఖనిజాలను ఆ దేశాలు స్వంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉక్రెయిన్ భూములకింద అపారంగా సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయి.
యునుకోవిచ్ అంగీకరించివుంటే 2014లోనే ఉక్రెయిన్ వనరులు సంపన్న పశ్చిమ దేశాల పరం అయిపోయివుండేవి. కాని అందుకోసం ఐఎంఎఫ్ ఇప్పుడు ఒక అసాధారణమైన మోతాదులో రుణాన్ని ఇవ్వవలసివస్తోంది. ఉక్రెయిన్‌లో ఉన్న కొద్దిపాటి పాలకవర్గ కుటుంబాలు తమ సంపదనంతటినీ యూరోల్లోకి, డాలర్లలోకి మార్చి ఇతరదేశాలకు తరలించుకుపోడానికి అవసరమైన సహకారాన్ని కూడా ఐఎంఎఫ్ అందిస్తోంది.
ఇప్పుడు రష్యా దాడి చేసినతర్వాత ఉక్రెయిన్ ఐఎంఎఫ్‌ను మళ్ళీ సహాయం కోరింది. ఐఎంఎఫ్ ప్రస్తుత డైరక్టర్ క్రిస్టాలినా జార్జీవా సహాయం అందించాలని ఐఎంఎఫ్ బోర్డుకు సిఫార్సు చేశాడు. ఎంతమొత్తం సహాయం అందించబోతున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు కాని ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ యూరప్‌లో మరో గ్రీస్ దేశం మాదిరిగా తయారవుతుంది. గ్రీస్‌కు కూడా గతంలో ఐఎంఎఫ్ ఇదే మాదిరిగా స్తోమతకు మించి భారీ రుణాన్ని ఇచ్చింది. ఆ రుణాన్ని తీర్చలేక గ్రీస్ శాశ్వత రుణ చట్రంలో ఇరుక్కుపోయింది.
1944లో బ్రెట్టన్వుడ్స్లో ప్రారంభం అయినప్పుడు ఐఎంఎఫ్ స్వభావం వేరు. ఇప్పడు బాగా మారిపోయింది. అప్పటి ప్రభుత్వ నియంత్రణలో ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను నియంత్రించే పద్ధతి ఉండేది. ఆ కాలంలో ప్రతీ దేశమూ తన వ్యవస్థలో వాణిజ్యపరంగాను, పెట్టుబడుల రాకపోకల విషయంలోను తన ప్రయోజనాలకు అనుగుణంగా నియంత్రణలు అమలు చేసేది. ఆ కాలంలో విదేశీ వ్యాపారంలో తలెత్తే చెల్లింపుల లోటు సమస్యను ఎదుర్కోడానికి సహాయపడే వ్యవస్థగా ఐఎంఎఫ్ వ్యవహరించేది. కాని నయా ఉదారవాద శకంలో ఐఎంఎఫ్ తానిచ్చే అప్పులకు వ్యవస్థీకృత సర్దుబాటు అనే షరతును ముందుకు తెచ్చింది. ఈ వ్యవస్థీకృత సర్దుబాటు ఆచరణలో ప్రభుత్వ నియంత్రణను ఆధిక్యతను బలహీనపరుస్తుంది. వాణిజ్య పరంగా కాని, పెట్టుబడుల ప్రవాహాల విషయంలో కాని ఎటువంటి నియంత్రణా లేకుండా పోతుంది. సంపన్న పశ్చిమ దేశాల పెట్టుబడులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించ గలుగుతాయి. ప్రభుత్వ రంగంలోని వ్యవస్థలన్నీ ప్రయివేటు పరం అవుతాయి. కార్మిక సంఘాలపై దాడి జరుగుతుంది. కార్మికోద్యమాన్ని బలహీనపరిచి కార్మికుల శ్రమను ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయడానికి వీలు కలుగుతుంది.
ఆ యా దేశాల ప్రభుత్వాలు తమ తమ ఆర్థిక వ్యవస్థలను నియంత్రించడంలో సహకరించే పాత్ర ఒకప్పుడు పోషించిన ఐఎంఎఫ్ ఇప్పుడు ఆ ప్రభుత్వాల నియంత్రణనే ధ్వంసం చేసే సాధనంగా మారిపోయింది. అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి చేతుల్లో ఒక పనిముట్టుగా మారి ప్రపంచంలోని ఏ మూలకైనా పెట్టుబడి యధేచ్ఛగా సంచరించడానికి, కొల్లగొట్టడానికి తోడ్పడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టబడివెనుక ఉన్న శక్తి పశ్చిమదేశాల సామ్రాజ్యవాదం. అందుచేత ఐఎంఎఫ కేవలం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి మాత్రమే కాక. పశ్చిమదేశాల సామ్రాజ్యవాద శక్తులకు కూడా సేవ చేస్తుంది.
పుతిన్ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యానికేమీ వ్యతిరేకి కాడు. ఒక దేశం తన పొరుగు దేశం మీద ఆధిపత్యం చెలాయించ రాదన్న సూత్రం కోసం పాటుపడేందుకు పుతిన్ సోషలిస్టూ కాడు. అతడు కేవలం రష్యా ప్రయోజనాలకోసం మాత్రమే ఉన్నాడు. రష్యాను నాటో నలువైపులా కమ్ముకుని ఇబ్బంది కలుగజేయడానికి ప్రయత్నిస్తోంది కనుక పుతిన్ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడు. అందుకే గతంలో యునుకోవిచ్కి సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. ఐఎంఎఫ్ అమెరికా రాజకీయ ప్రయోజనాలకోసం పని చేయడాన్ని మాత్రమే పుతిన్ వ్యతిరేకిస్తున్నాడు తప్ప ఐఎంఎఫ్ ద్వారా అమలయ్యే నయా ఉదారవాద విధానాలకు పుతిన్ వ్యతిరేకి కాడు. నిజానికి నయా ఉదారవాద విధానాలు తెచ్చిపెట్టే తీవ్ర ఆర్థిక అసమానతలు, పేదరికం ఇప్పటికే పుతిన్ రష్యాలో సాధించేశాడు.
- స్వేచ్ఛానుసరణ ప్రభాత్ పట్నాయక్