Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ మానవాళికి ఆహారభద్రత సమస్యగా పరిణమించింది. ఒక వైపు కరోనా మహమ్మారి మరొకవైపు పర్యావరణ సంక్షోభం దీనికి తోడు అనేక దేశాలలో అంతర్గత యుద్ధాలు వెరిసి ఆకలి చావులు పెరుగుతున్నాయి. కోవిడ్ మరణాల కంటే ఆకలి చావుల సంఖ్య ప్రభుత్వాలకు సవాలుగా పరిణమించింది. పేద దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయని పేదరిక నిర్మూలన కోసం కృషి చేసే ఆక్స్ఫామ్ సంస్థ బాధాకరమైన విషయాలను వెల్లడించింది. ఆకలి కారణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత యేడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య 6 రెట్లుగా ఎక్కువగా ఉందని అంచనా వేసింది.
2021 ప్రకారం ప్రపంచ జనాభాలో 30శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11కోట్ల ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకున్నారని, పజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్టమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం పెరగడం, ఆహార కొరత పెరగడంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 15కోట్ల ప్రజలు ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్నారని నమోదైంది.
దేశంలో 2021-22లో 315 టన్నుల రికార్డ్ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో భారత దేశం స్వయం సమృద్ధి దశకు చేరినా, పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా2018లో 13.8శాతం ఉండగా 2020 నాటికి 15.3శాతానికి క్రమంగా పెరుగుతూ ఉంది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు.
ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 2021లో 116 దేశాల్లో భారతదేశం స్థానం అట్టడుగు 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో భారత్ స్థానం 94 ఉండగా 2021 నాటికి 101వ స్థాయికి దిగజారింది. శ్రీలంక 65వ స్థానం, బంగ్లాదేశ్ 76వ స్థానం, పాకిస్థాన్ 92వ స్థానంలో మనకంటే ముందున్నాయి.
తీవ్రమైన ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తం గా సైనిక సామర్థ్యాన్ని పెంచుకు నేందుకు 5100 కోట్ల డాలర్లు ఖర్చు చేశాయనీ ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచంలోని పేదల ఆకలితీర్చడానికి ఐక్యరాజ్య సమితికి ఖర్చు చేయాలనుకున్న దాని కన్న ఆరురెట్లు ఎక్కువ.
సుప్రీం కోర్టు సూచన పాటించాలి
భారత దేశంలో ఇక ముందు ఆకలి చావులు ఉండకూడదని, ప్రజల సంక్షేమం ప్రభుత్వాల రాజ్యాంగపరమైన బాధ్యత అని, కమ్యూనిటీ కిచెన్లపై ప్రణాళిక రూపొందించి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇక నుంచి ఆకలి చావులు అనే మాట ఉండకూడదని, దీని కోసం కేంద్రం ఎటువంటి ప్రణాళికలు అమలుచేస్తున్నది వెంటనే తెలుపాలని సుప్రీం కోర్టు కోరింది. కమ్యూనిటీ కిచెన్లపై మూడువారాల్లోగా ప్రణాళిక రూపొందించి కోర్టుకు అంద చేయాలని సూచించింది. ఇది కేంద్రానికి చివరి అవకాశం అని, ఆకలి చావులను శాశ్వతంగా నిర్మూలించడానికి దేశ వ్యాప్త ప్రణాళిక ఉండాలని కూడా సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందించాలని, దేశంలో ఆకలితో ఎవ్వరూ చనిపోకూడదని సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ ఏస్వి రమణ అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ కమ్యూనిటీ కిచెన్లను ప్రకటించిన కేంద్రం కార్యాచరణకు ఉపక్రమించాలని, ఆకలిని ఎదుర్కోవడానికి జాతీయస్థాయిలో మోడల్ స్కీమ్ ఏర్పాటు చేయాలన్నారు. కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయ మూర్తీ జస్టిస్ ఎస్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలుచేెయాలి. ఆహారభద్రత అంటే బియ్యం, గోధుమలు ఇవ్వడం కాదు. దారిద్య్రరేఖకు కింద ఉన్నవారికి పౌష్టికాహారం అందించడం. అప్పుడే పేదవర్గాలలో ఆహార భద్రత ఏర్పడుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ఆరోగ్య దాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సురక్షిత పౌష్టికాహారం ప్రజలందరికీ అందించాలి. అన్ని కాలాల్లో ఆర్థికంగా, భౌతికంగా అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి వ్యక్తి సురక్షితమైన పౌష్టికాహారాన్నీ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత కలిగి ఉండాలి. శరీరానికి తోడ్పడే మాంసకృతులు విటమిన్స్, మినరల్స్ వంటి పౌష్టికాహారం అందరూ పొందాలి. నేటికి దేశ జనాభాలో 14శాతం అల్పపౌష్టికాహారంతో బాధపడుతున్నారు.
పిల్లలకు మధ్యాహ్నం భోజనం అందించాలి
ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలు సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలి. అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. అణగారిన వర్గాలకు గిరిజను లకు మురికి వాడల్లో నివసించే వారికి ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా ఆహార ధాన్యాలు అందజేయాలి. ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు విస్తరించాలి. కొద్ది మందికి మాత్రమే జీవనోపాధి, గౌరవప్రదమైన జీవితం ఉండడం సరైంది కాదు. జాతీయ ఉత్పత్తిపంపిణీ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆహారా వృధాను అరికట్టే చర్యలు తీసుకోవాలి. పౌష్టికాహారంపై అవగాహనకు చైతన్య శిబిరాలు నిర్వహించాలి. ఆకలితో ఉన్న వారిని గుర్తించి వారికి ఆహారం అందించాలి. పేదలకు పోషకాహారం ఆరోగ్య సేవలు ఉచిత విద్యా అందించాలి. ఆహార భద్రత చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. పాలనలో పారదర్శకత జవాబుదారీతనం బలోపేతం కావాలి. సుపరిపాలన పేదల ముంగిట్లోకి రావాలి. వనరుల సమాన పంపిణీపై జాతీయ స్థాయిలో చర్చలు జరగాలి. ప్రభుత్వ పాలకులు పాలనా యంత్రాంగం రాజకీయ పార్టీలు ఆకలిచావుల మీద కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆకలిని తీర్చే ప్రణాళికలతో ముందుకు సాగాలి. చర్చలతో కాలాన్ని వధా చేయొద్దు.
వ్యవసాయ రంగంలో స్వావలంబన
గ్రామీణాభివద్ధి, చిన్న లఘు పరిశ్రమల స్థాపన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను స్థాపించాలి. గ్రామీణ చేతి వృత్తులకు ఆధునీ కరించి ఉపాధి కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. గ్రామీణ ప్రాంతాలలో వృద్ధి కేంద్రా తరతలను స్థాపించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి.
ఉపాధి హామీ పథకం అమలు చేయడం, మౌలిక సదుపాయాలు కల్పన, ఆదాయ సృష్టి, జీవన ప్రమాణాల పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత పెరిగి అభివృద్ధికి దోహదపడే సూక్ష్మ స్థూల విధానాలు ఆర్థిక ప్రణాళికలు అమలు చేయ్యాలి. సమగ్రమైన ఆహార భద్రత సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఆకలిచావులను అరికట్టడానికి సమగ్ర సంతులిత పౌష్టికాహార పథకాలను అమలు చేయాలి. ఆహార భద్రత వ్యవస్థ పరిపుష్టికి దీర్ఘకాలిక వ్యూహాలతో బహుముఖ కార్యాచరణకు ప్రభుత్వం పూనుకోవాలి.
- నేదునూరి కనకయ్య
సెల్:9440245771