Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజారోగ్యాన్ని బలితీసుకునే మద్యం ఆదాయమే ప్రభుత్వాలకు ఇంధనంగా మారింది. నేడు ప్రభుత్వాలకు మద్యం దుకాణాల నిర్వహణ మీద ఉన్న దృష్టి, శ్రద్ద మరే అంశాలపై లేదు. మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఉంది. దీనితో కాలేయం, నోరు, పెదవులు, స్వరపేటిక, అన్న వాహిక, పెద్దపేగు దెబ్బతినడంతో పాటు రొమ్ముకాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని తాజాగా ''ఆక్స్ఫర్డ్'' విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మద్యానికి అలవాటు పడినవారిలో చాలా మందికి ధూమపానమూ తోడైతే ముప్పు తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా మద్యం కారణంగా ఏటా 30లక్షల మరణాలు జరుగుతున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మద్యం శరీరంలోనికి వెళ్లగానే జీవక్రియలో భాగంగా అది విచ్ఛిన్నమై ''ఎసిటెల్డీహైడ్''గా ఉత్పరివర్తన చెందుతుంది. తద్వారా అతి ప్రమాదకర ''కార్సినోజెనిక్'' రసాయనాలు ఉత్పన్నమవుతాయి. ఫలితంగా అనేక రకాల అవయవాలపై దాని ప్రభావం పడి నేరుగా క్యాన్సర్‌కు దారితీస్తుంది. దీనికి తోడు మద్యపాన ప్రియుల జీవనశైలిలో దురవాట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి దూమపానం, నిద్రలేమి, అనారోగ్య కరమైన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం లాంటి వాటివల్ల శరీరం ఆరోగ్యకరమైన పోషక విలువలను గ్రహించే తత్వం కోల్పోతుంది. ఇలా మద్యం కారణంగా మనదేశంలో ఏటా 2.60లక్షల ప్రాణాలు అర్థాంతరంగా కడతేరిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ప్రకటించింది. దీనికి తోడు రహదారి ప్రమాదాలు, ఆత్మహత్యలు, కుటుంబ సభ్యులతో ఘర్షణలు, గృహ హింసలు, వరకట్న వేదింపుల కారణంగా హత్యలకు తోడుగా సంపాదనంతా మద్యంపాలు, సంసారాలు వీధి పాలవుతున్నాయి. ఇలా భారతదేశంలో ఏటా ఐదులక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ప్రజా ఆరోగ్యం కన్నా మన ప్రభుత్వాలకు మద్యం విక్రయాలే మిన్నగా మారాయి. ప్రత్యేక విధానాలంటూ అనైతికంగా వీధి వీధికి, అడుగడుగునా, మంచి నీళ్ల కన్న మిన్నగా మద్యం వ్యాపారాన్ని జోరుగా ప్రోత్స హిస్తున్నాయి. ఇందులో రిజర్వేషన్లు జోడించి మహిళలకు, వివిధ క్యాటగిరీలకు మద్యం షాపులు అంటగడుతూ అదే ఉపాధిగా చెపుతున్నాయి.. ఈ విధంగా సంక్షేమ రాజ్యభావనకు విఘాతం కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలు అమానవీయం. మత్తు పదార్థాల వినియోగాన్ని క్రమేణా తగ్గిస్తూ, ఆరోగ్య భారతావనికి బాటలు పరవడం పాలకుల విద్యుక్త ధర్మంగా 47వ రాజ్యాంగ అధికరణ చెపుతోంది. దాన్ని తుంగలో తొక్కుతూ మద్యపుటేర్లను పారిస్తుంటే? ఈ సామాజిక సంక్షోభానికి ముమ్మాటికి పాలకులే కారణమవుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.
మన దేశ వ్యాప్తంగా అమ్ముడుపోతున్న మద్యంలో 45శాతం వాటా ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలదేనని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఆరేండ్లలో మద్యపాన అమ్మకాల గణాంకాలు ఇలా ఉన్నాయి. 2016 సంవత్సరంలో రూ.14,075.51 కోట్లు, 2017లో రూ.16,595.97 కోట్లు, 2018లో రూ.20,012.05 కోట్లు, 2019లో రూ.22,144.87 కోట్లు, 2020.లో రూ.25,601.39 కోట్లు, 2021లో రూ.30,222.27 కోట్లు వెరిసి గడిచిన ఆరేండ్లలోనే రాష్ట్రంలో ఏకంగా రూ.1.28 లక్షల కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. మద్యపాన వ్యవసనం పెరుగు తుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు 2,620 ఉన్నాయి. కానీ 40-50 వేల బెల్ట్‌షాపుల్లో అనధికారికంగా మధ్యం విక్రయాలు జరుగు తున్నాయి. దీని ఫలితంగా లక్షలాది కుటుంబాలు ఈ వ్యసన ఊబిలో చిక్కుకొని ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా చితికిపో తున్నాయి. సరదాగా అలవాటై, వ్యసనంగా మారి యువశక్తిని నిర్వీర్యం చేస్తోందని మేధావులు విశ్లేషిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి సగటున 36.2శాతం మంది పురుషులు ప్రతి రోజూ తాగుతున్నారు. గ్రామీణ, నగరాల్లో సగటున 54శాతం మంది వారంలో ఒకసారి మత్తులో మునిగిపోతున్నారు. అతి ముఖ్యంగా 15-49ఏండ్ల వయస్సులో ప్రతిరోజు తాగేవారిలో పురుషులతో పాటు మహిళలూ పెద్ద సంఖ్యలో ఉన్నారని కొద్దిరోజుల క్రితం వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదికలో బహిర్గతమైంది. మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసకూ ప్రధాన కారణం మద్యపానమేనని తెలుస్తున్నది. మద్యం తాగే అలవాటు పదేండ్ల ప్రాయంలోనే మొదలై యుక్త వయస్సులోకి వచ్చేసరికి వ్యసనంగా మారుతుంది. ఇలా 30-40ఏండ్లలోనే అనారోగ్యాలతో పురుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వలన వారి భార్యలు (మహిళలు) యుక్తవయస్సులోనే వితంతువులుగా మారుతున్నారు. ఇలా యువశక్తి నిస్సారం అవుతున్నది. దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల వినియోగంపై సామాజిక మంత్రిత్వశాఖ 2019లో నిర్వహించిన అధ్యయనంలో రాష్ట్ర వ్యాప్తంగా 59,13,600 మంది వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. వీరిలో 6,33,600 మంది బానిసలుగా మారుతున్నట్లు తేలింది. రెండేండ్ల క్రితం లెక్కలతో పోలిస్తే ఇప్పుడు ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుందనేది అంచనా. ఓ వైపు మద్యం అమ్మకాలు జోరుగా ప్రోత్సహిస్తూ మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అరికట్టాలనే చర్యలకు పూనుకోవడం ప్రభుత్వానికి సమంజసమా! మద్యంతో వచ్చే ప్రాణనష్టాలు, అనర్థాలపై సామాజిక చైతన్యం కల్పించే కనీస బాధ్యతను విస్మరించి ఆ ఆదాయం వల్ల వచ్చే నెత్తుటి కూడు, ఆ కుటుంబాల కన్నీళ్లకు ఆశపడే విధానాలు వెంటనే మానుకోవాలి.
- మేకిరి దామోదర్
సెల్:9573666650