Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో 4 నుండి 14శాతం మంది గర్భిణీ స్త్రీలలో షుగర్ వ్యాధి(మధుమేహం) ఉంటున్నది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఒక సర్వేలో గర్భిణీస్త్రీలలో 14శాతం మంది షుగర్ వ్యాధికి గురవుతునట్లు వెల్లడైంది. ఇటువంటి ''గర్భిణీస్త్రీలలో వచ్చే షుగర్ వ్యాధి'' (+వర్a్‌ఱశీఅaశ్రీ ణఱabవ్వర) వలన మాతా-శిశు ఆరోగ్యం దెబ్బతిని, తల్లికీ, గర్భంలోని శిశువుకూ తీవ్ర దుష్ఫలితాలు సంభవించే అవకాశం ఉన్నది. ఈ వ్యాధి మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో దీని గురించి ప్రజలలో, ముఖ్యంగా మహిళల్లో అవగాహన పెంచడం ద్వారా గర్భిణీస్త్రీలలో మధుమేహాన్ని నివారించడానికి, నియంత్రించడానికి ప్రతి సంవత్సరం మార్చి 10న ''జెస్టేషనల్ డయాబెటిస్ డే''గా జరపాలని ణ×ూూ× పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జెస్టేషనల్ డయా బెటిస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ఏమిటి?
గతంలో షుగర్ వ్యాధి లేకుండా ఉన్న స్త్రీలలో గర్భధారణ సమయంలో మొదటిసారిగా రక్తంలో షుగర్ లెవల్స్ అసాధారణంగా పెరిగి డయాబెటిస్ వచ్చినట్లు బయటపడితే దానిని జెస్టేషనల్ డయాబెటిస్ అంటాం.
ఎవరిలో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
గతంలో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చి ఉన్నట్లయితే, తల్లిదండ్రులకు లేదా దగ్గరి రక్తసంబంధీకులకు డయాబెటిస్ ఉన్న సందర్భంలో, అధిక బరువు (ఒబేసిటి) ఉన్నవారిలో, ఇంతకుముందు అధికబరువు (4కేజిల కంటే ఎక్కువ)గల శిశువు జన్మించిన సందర్భంలో, అండాశయాల్లో నీటి బుడగలు ఉన్న వారిలో, మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో భౌతికవ్యాయామం లేని వారిలో ఇందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జెస్టేషనల్ డయాబెటిస్‌లో శిశువుకి ఏర్పడగల దుష్ఫలితాలు ఏమిటి?
జెస్టేషనల్ డయాబెటిస్ సాధారణంగా గర్భిణి స్త్రీలలో 24వారాల (6వ నెల) సమయంలో బయటపడుతుంది. శిశువులో గుండె, వెన్నెముక, కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు మొదటి ఎనిమిది వారాలలోనే ఏర్పడతాయి. కాబట్టి సాధారణంగా జెస్టేషనల్ డయాబెటిస్ కేసుల్లో పుట్టే శిశువుకు పుట్టుకతో వచ్చే అవయవలోపాలు ఉండే అవకాశం లేదు. జెస్టేషనల్ డయాబెటిస్ కేసులతో పోల్చినప్పుడు, గర్భధారణకు ముందే డయాబెటిస్ ఉన్న స్త్రీలలో గర్భం దాల్చిన సమయానికి, తొలివారాలలో షుగర్ నియంత్రణలో లేకపోతే శిశువులో పుట్టుకతో వచ్చే అవయవలోపాలు ఉండే అవకాశం ఎక్కువ.
జెస్టేషనల్ డయాబెటిస్ గర్భిణీస్త్రీలలో షుగర్ ఖచ్చితమైన నియంత్రణలో లేకపోతే ఈ క్రింది కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు అధికబరువు కల్గివుండటం. శిశువు పుట్టినప్పడు బరువు నాలుగున్నర కేజిల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మేక్రోసోమియా (వీaషతీశీరశీఎఱa) అంటారు. తల్లికి షుగర్ నియంత్రణలో లేనప్పుడు, ఒకోసారి గర్భంలోనే చనిపోయిన శిశువు పుట్టవచ్చు. తల్లికి షుగర్ నియంత్రణలో లేనప్పుడు, ఒకోసారి నవజాత శిశువులో హైపోగ్లైసీమియా, హైపోకాల్షి మియా, హైపోమెగ్నీషిమియా, శ్వాసకోస ఇబ్బంది వంటి కాంప్లికేషన్స్ సంభవించవచ్చు. ఒకోసారి నెలలు నిండకముందే త్వరగా ప్రసవం జరగవచ్చు.
జెస్టేషనల్ డయాబెటిస్‌లో తల్లికి ఏర్పడగల దుష్ఫలితాలు ఏమిటి?
షుగర్ ఖచ్చితమైన నియంత్రణలో లేనప్పుడు తల్లిలో ఈ క్రింది కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన గర్భిణీస్త్రీలలో హై బి.పి వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్మనీరు అధికంగా ఉండవచ్చు. శిశువు అధికబరువు ఉంటే, సాధారణ కాన్పు కష్టమై సిజేరియన్ కాన్పు అవసరం కావచ్చు. కొద్దిమందిలో ప్రసవం తర్వాత టైప్-2 డయాబెటిస్ రావచ్చు. 6వ నెల తర్వాత శిశువు జననం కంటే ముందు సమయంలో తల్లికి రక్తస్రావం జరగవచ్చు. శిశువు జననం తర్వాత గర్భసంచి నుండి అధిక రక్తస్రావం జరగవచ్చు.
జెస్టేషనల్ డయాబెటిస్‌ను ఎలా నిర్థారిస్తాము?
జెస్టేషనల్ డయాబెటిస్ నిర్థారణకు వివిధ దేశాల్లో వివిధ పద్ధతులు, గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ మనదేశంలో ఎక్కువగా సంస్థ సూచించిన పద్ధతి పాటిస్తున్నారు. 75గ్రా.ల గ్లూకోజ్ తీసుకున్న అనంతరం 2గంటల తర్వాత రక్తంలో షుగర్ 120మి.గ్రా కంటే ఎక్కువగా జెస్టేషనల్ డయాబెటిస్‌గా నిర్థారిస్తారు. సాధారణంగా గర్భిణీస్త్రీలలో 24నుండి 28 వారాల సమయంలో జెస్టేషనల్ డయాబెటిస్ గుర్తించేందుకు రక్తపరీక్ష చేస్తారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం మొదటి మూడునెలల గర్భిణీ సమయంలో కూడా రక్తపరీక్ష ద్వారా స్క్రీనింగ్ చేయాలని సూచిస్తున్నారు. మొదటి మూడు నెలల్లో రక్తంలో షుగర్ నార్మల్ వచ్చినట్లయితే, తర్వాత 24 నుండి 28 వారాల మధ్యలో ఒక్కసారి, ఆ తర్వాత తిరిగి 32 నుండి 34 వారాల సమయంలో మరోసారి రక్తపరీక్ష చేయాలని గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి.
జెస్టేషనల్ డయాబెటిస్ చికిత్స
జెస్టేషనల్ డయాబెటిస్ నిర్థారణ అయిన వెంటనే తగిన విధమైన ఆహార ప్రణాళికను డైటిషియన్ సలహా మేరకు పాటించాలి. శరీర బరువును బట్టి ఒక రోజుకు తీసుకోవల్సిన కేలరీలు నిర్ణయించడంతో పాటుగా, అందులో సరైన నిష్పత్తిలో పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకత్తులు ఉండేవిధంగా విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కలిగిన సమతుల ఆహారం సూచించిన మేరకు తీసుకోవాలి. తగినంత మేరకు డాక్టర్ సూచించిన సరైన పద్ధతిలో శారీరక వ్యాయామం చేయాలి. ఆహరనియమాలు, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులతో కంట్రోల్ కానప్పుడు షుగర్ నియంత్రణకు మందులు వాడవల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో షుగర్ నియంత్రణకు టాబ్లెట్స్ వాడటం క్షేమం కాదు. టాబ్లెట్స్ తల్లి నుండి శిశువుకు మాయ(placenta) ద్వారా చేరినందువల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఏ రకమైన టాబ్లెట్స్ వాడకం కూడా పూర్తిగా క్షేమం కాదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి జీవనశైలి మార్పులతో షుగర్ కంట్రోల్ కానప్పుడు జెస్టేషనల్ డయాబెటిస్‌లో తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజక్షన్ వాడవల్సి ఉంటుంది. ఏ రకమైన ఇన్సులిన్ ఎంత డోసువాడాలి అనేది డాక్టర్ సూచించిన మేరకు పాటించాలి.
జెస్టేషనల్ డయాబెటిస్‌లో కాంప్లికేషన్స్ నివారణకు బ్లడ్‌షుగర్ లెవల్స్ ఎంతలోపు ఉండాలి?
గర్భిణీ స్త్రీ రెగ్యులర్‌గా తనకు తానే ఇంటివద్ద షుగర్ పరీక్షించుకుంటూ ఉండాలి(Self Monitoring of Blood Glucose). తల్లికి, శిశువుకు ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకుండా సురక్షితమైన కాన్పు జరిగేందుకు బ్లడ్ షుగర్ లెవల్స్ పరగడపున 95మి.గ్రా ఆహారం తీసుకున్నాక 2గంటల అనంతరం 120మి.గ్రా దాటకుండా నియంత్రించు కోవాలని గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి.
జెస్టేషనల్ డయాబెటిస్ డెలివరి తర్వాత కూడా ఉంటుందా?
సాధారణంగా జెస్టేషనల్ డయాబెటిస్‌లో డెలివరి అయిన వెంటనే డయాబెటిస్ తగ్గిపోయి రక్తంలో షుగర్ స్థాయి నార్మల్కు వస్తుంది. కానీ, జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన గర్భిణీస్త్రీలకు టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సుమారు 10శాతం జెస్టేషనల్ డయాబెటిస్ కేసుల్లో మాత్రం ప్రసవానంతరం కూడా డయాబెటిస్ వ్యాధి కొనసాగి తర్వాత కాలంలో కూడా మందులు వాడవల్సిరావచ్చు.
ఏం చేయాలి ?
సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో జెస్టేషనల్ డయాబెటిస్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్న హైరిస్క్ మహిళలకు గర్భధారణకు ముందుగానే వ్యాధిగురించి సరైన అవగాహన కల్పించాలి. హైరిస్క్ గర్భిణీస్త్రీలు ఆహారంలో తగిన మార్పులు, సూచించిన వ్యాయామం, నిర్దేశిత స్క్రీనింగ్ పరీక్షలు చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. జెస్టేషనల్ డయాబెటిస్ నివారణకు ప్రభుత్వం, వైద్యనిపుణులు, మీడియా, ఆరోగ్యరంగంలో పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
- డాక్టర్ కె. శివబాబు