Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లలు విద్యకు అనర్హులనీ, స్త్రీలు స్వేచ్ఛ పేరుతో గడపదాటడం పతనానికి తొలిమెట్టనీ, చదువు అనేది కేవలం కొంతమందికే సొంతమనీ మహిళలు, అస్పృశ్యులకు జ్ఞానం అవసరం లేదని, పురాతన, వైదిక, బ్రాహ్మణీయ సమాజం స్త్రీలకు, శూద్రులకు విద్యను నిరాకరించింది. కానీ బాలికా విద్యలోనే దేశభవిష్యత్తు దాగి ఉందని, మహిళ అక్షరాస్యురాలయితే అది సమాజ పురోభివృద్ధికి నాందియనీ, చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే స్త్రీల భాగస్వామ్యం అత్యంత ప్రధానమనీ గుర్తించి... మనువాదానికి వ్యతిరేకంగా పోరాడిన భారతదేశపు తొలితరం మహిళా ఉద్యమకారిణి, ప్రధమ మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి ఫూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాల తాలూకా నయాగావ్ గ్రామంలో లక్ష్మీ, ఖండోజీ నెమేషే పాటిల్ దంపతులకు జన్మించారు. జ్యోతిబాఫూలేను ఆమె వివాహం చేసుకున్నారు.
తన భర్తే మొదటి గురువుగా ఇంట్లోనే అక్షరాభ్యాసం గావించారు సావిత్రిబాయి ఫూలే. అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొంది బాలికల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా 1848 జనవరి 1న పూణేలో బాలికా పాఠశాలను ప్రారంభించారు. పితృస్వామ్యానికి, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తిన తొలితరం మహిళా ఉద్యమ కారిణిగా ఆమె కృషి అజరామరం. ఆమె బాలికల కోసం పాఠశాల నడపడం అగ్రవర్ణాల వారికి నచ్చలేదు. బాలికలు చదువుకుంటే ఎక్కడ తమ చాందస, సాంప్రదాయాలను ప్రశ్నిస్తారో అని వారి భయం. అందుకనే ఆమె పాఠశాలను నడపకుండావుండడానికి తీవ్రమైన వేధింపులకు, భౌతిక దాడులకు దిగేవారు. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే బురదజల్లేవారు. హేళన చేసేవారు. కానీ సావిత్రిబాయి ఫూలే వీటన్నింటినీ ఏమీ పట్టించుకోకుండా ''నా విధిని నిర్వహిస్తున్నాను'' అని ధైర్యంగా చెప్పిన ధీరవనిత...
ఆమెలోని ధైర్యానికి, బాలికల విద్య పట్ల ఆమె చూపుతున్న అంకితభావానికి అనతికాలంలోనే సమాజ సహకారం, గుర్తింపు లభించాయి. బాలికా విద్య ప్రాధాన్యత గురించి ఆమె వివరించిన తీరు, చేస్తున్న కృషిని చూసి ఎంతోమంది ఆమెకు సహాయ సహకారాలు అందించారు. విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషి అనన్య సామాన్యమైనది. బలహీనవర్గాల మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, ఆధిపత్య వర్గాల దురహంకారాన్ని ధిక్కరించిన సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే. తన జీవిత కాలంలో మొత్తం 52పాఠశాలలు స్థాపించారు. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే దంపతులు గృహ బహిష్కారానికి గురి కాబడ్డారు. అయినా సరే ఏమాత్రం వెనుదీయక ''మహిళా హక్కులే మానవ హక్కులంటూ'' తొలిసారి నినదించిన మానవ హక్కుల నేత సావిత్రిబాయి ఫూలే. స్త్రీలను చైతన్య పరచడానికి ఆమె 1852లో ''మహిళా సేవ మండల్'' అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. ఆ సేవా మండలి ద్వారా ఎంతోమంది అభాగ్యుల జీవితాలలో వెలుగు నింపారు సావిత్రిబాయి.
అగ్రవర్ణాల అసత్యాలతో దురహంకారంతో ఏర్పడ్డ కులవ్యవస్థను రూపుమాపడానికి తన భర్తతో కలిసి 1873లో ''సత్యశోధక్ సమాజ్'' స్థాపించారు సావిత్రిబాయి. ఈ సమాజం ద్వారా బాల్య వివాహాలకు, సతీ సహగమనానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించారు. అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపారు. చిన్నతనంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది బాలికలను అక్కునచేర్చకోవడమే కాక, గర్భవతులైన వారికి పిల్లలు పుట్టేంతవరకు తన వద్దనే ఆశ్రయం కల్పించే వారు. ఆ విధంగా జన్మించిన ఒక శిశువును పెంచుకుని యశ్వంత్గా నామకరణం చేసి తమ ఆశయాలకు ఆకాంక్షలకు వారసునిగా ప్రకటించారు. వితంతువులకు శిరోముండనం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ క్షురకులను చైతన్యపరిచి, వితంతువులకు శిరోముండనం చేయబోమని వారిచేత 1860లో సమ్మె చేయించిన ఉద్యమకారిణి ఆమె.
సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగానికి నేతృత్వం వహించడమే కాకుండా వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండానే నిర్వహించే విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. అంటరానితనానికి వ్యతిరేకంగా విశేష కృషి చేశారు. 1870-1896లో మహారాష్ట్రలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఫూలే దంపతులు చేసిన సేవ చరిత్రలో నిలిచిపోతుంది. 2000 మందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించే వారు. పాఠశాలల్లోనూ మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజనం ప్రారంభించిన ఘనత ఫూలే దంపతులకే దక్కుతుంది.
సమాజం పట్ల బాధ్యత గల రచయిత్రిగానూ సావిత్రిబాయి తన రచనలతో సమాజ మార్పుకు దోహదపడ్డారు. ఆమె చేసిన ఉత్తేజపూరిత, సందేశాత్మకమైన ఉపన్యాసాలు 1892లో పుస్తక రూపంలో వెలువడి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాయి. 1896 నవంబర్ 28న భర్త జ్యోతిరావు ఫూలే మరణం ఆమెను ఎంతగానో కృంగదీసింది. అంతటి దుఃఖం లోనూ ''తన భర్త చితికి తానే నిప్పుపెట్టి'' మరో ఆదర్శానికి తెరతీశారు సావిత్రిబాయి ఫూలే. భర్త మరణానంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతను స్వీకరించి నడిపించారు.
1897లో పూణేలో ప్లేగు వ్యాధికి భయపడి అంతా అడవుల్లోకి పారిపోయారు. కానీ సావిత్రిబాయి తన కొడుకు యశ్వంత్‌తో కలిసి ప్రాణాలను పణంగా పెట్టి మరీ వ్యాధిగ్రస్తులకు సేవచేశారు. ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. చివరికి ఆ ప్లేగు వ్యాధి మూలంగానే 1897 మార్చి 10న మరణించారు. ఆమె సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1997లో తపాలా బిళ్ళను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టింది.
సావిత్రిబాయి ఫూలే జీవితం మహిళా సాధికారతకు నిలువెత్తు ప్రతిరూపం. ఆమె చూసిన మార్గం మనందరికీ ఆదర్శప్రాయం. ఈనాటి రాజకీయాలు ఆమె సాధించిన ఆశయాలకు తూట్లు పొడుస్తూ విద్యను అందని ద్రాక్షగా చేస్తూ బడుగు బలహీన వర్గాలకు దూరం చేస్తున్నాయి. పాఠ్యపుస్తకాలలో, పాలకుల చేతలలో మనువాదం మళ్లీ పురుడు పోసుకోవాలని చూస్తున్నది. కుల, మత, లింగ భేదాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన ఆధునిక విద్యను అందించాలని, అణచివేతలను నిర్మూలించాలని సావిత్రిబాయి ఫూలే చేసిన పోరాటాన్ని తిరిగి కొన సాగించడమే ఆమె జయంతి సందర్భంగా మనం ఇచ్చే ఘనమైన నివాళి.
- కె. నిర్మల కుమారి, సెల్:9652395184