Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్రాజ్యవాదుల విస్తరణవాదం ప్రపంచాన్ని నిరంతరం యుద్ధాల్లోనూ, యుద్ధ భయంలోనూ ఉంచుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం వరకు సామ్రాజ్యవాదులు తమలో తాము కొట్లాడుకుంటూ కోట్ల మంది ప్రాణాలు తీశారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్టు భూతాన్ని చూపించి, 1991 తరువాత తానే సృష్టించిన ఉగ్రవాద భూతాన్ని అడ్డం పెట్టుకుని అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని యుద్ధాల్లో ముంచెత్తింది. తీవ్ర ఉద్రిక్తతలు సృష్టించింది. ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని, చైనాకు వ్యతిరేకంగా తైవాన్ సంక్షోభాన్ని సృష్టించడం ద్వారా సామ్రాజ్యవాదులు మళ్లీ పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ఈ రెండు సంక్షోభాలు ప్రపపంచంలోని రెండు ప్రాంతాల్లో అంటే ఒకటి ఐరోపాలో, రెండోది ఆసియాలో ఏర్పడినప్పటికీ రెంటి వెనుక ఒకే వ్యూహం ఉంది. అది సామ్రాజ్యవాదుల, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధ వ్యూహం.
ఉక్రెయిన్ సంక్షోభం
రష్యాతో యుద్ధసన్నాహాల్లో భాగంగా ఐరోపా యూనియన్‌కు 8,500 మంది సైన్యాన్ని, పెద్ద ఎత్తున సాయుధ సామగ్రిని పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించడంతో అది ఉక్రెయిన్, రష్యా యుద్ధ సంక్షోభానికి దారితీసింది. దాంతోబాటు 300 జావెలిన్ ట్యాంకు విధ్వంసక క్షిపణులను, భుజాలమీద నుండి ప్రయోగించే బహుళార్థ సాధక అస్సాల్ట్ ఆయుధాలను, బంకర్లను ధ్వరసం చేసే ఆయుధాలను అమెరికా ఉక్రెయిన్‌కు నేటి యుద్ధానికి ముందే పంపింది. మరో 50,000 సైన్యాన్ని ఈ ప్రాంతానికి పంపడానికి అమెరికా సిద్ధంగా ఉన్నదని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అప్పట్లోనే రాసింది. దీనికి తోడు బాల్టిక్ సముద్రానికి ఒక యుద్ధ నౌకను, రష్యాకు వ్యతిరేకంగా లిథుయేనియాకు నాలుగు ఎఫ్-16 విమానాలనూ పంపుతానని డెన్మార్క్ ప్రకటించింది. బాల్టిక్, మధ్యధరా సముద్రాలకు యుద్ధ నౌకలను పంపుతానని స్పెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ను ఆనుకుని ఉన్న నాటో సభ్యదేశం రుమేనియాకు సైన్యాన్ని పంపబోతున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. రష్యాతో యుద్ధ సన్నాహాల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లదిమిర్ జలెన్‌స్కీ దేశ భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ''యూరప్‌లో యుద్ధ పరిస్థితి నెలకొని ఉంది'' అని రష్యా పత్రిక ''కొమ్మెర్‌శాంట్'' అప్పట్లోనే ఒక వ్యాఖ్యానంలో పేర్కొంది. పరిస్థితి చాలా ''క్లిష్టంగా'' ఉంది అని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది.
రష్యా కూడా సైనిక సన్నాహాల్లో భాగంగా జనవరి నాల్గవ వారంలో పారాట్రూప్ యూనిట్లు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, బాలిస్టిక్ క్షిపణులతో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. నల్ల సముద్రంలోని, ఉక్రెయిన్, క్రిమియాల వద్దనే కాకుండా మొత్తం రష్యా భూభాగాలైన సైబీరియా, దూరప్రాచ్యం, బాల్టిక్ సముద్రాల్లో విన్యాసాలు నిర్వహించింది. బెలారస్‌తో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించింది. అప్పటినుంచీ ఉక్రెయిన్ను ఆనుకుని ఉన్న తన సరిహద్దుకు రష్యా లక్ష మంది సైన్యాన్ని తరలించినట్లు పశ్చిమ దేశాల ప్రసార సాధనాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. చివరికి అది నేటి యుద్ధానికి దారితీసింది.
చర్య-ప్రతిచర్య
ఉక్రెయిన్ను ఆక్రమించుకోడానికే రష్యా ఈ యుధ్ధం చేస్తోంది కాబట్టి తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నామని పశ్చిమ దేశాలూ, వాస్తవం దీనికి పూర్తి తలకిందులుగా ఉందని రష్యా చెబుతున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయి వార్సా సంధి రద్దయినప్పటికీ అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు నాటో కూటమిని విస్తరించుకుంటూ రష్యా సరిహద్దుల వరకు వచ్చారు కనుక తన దేశ రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నానని రష్యా వాదిస్తోంది. అందువల్ల ఏది చర్య ఏది ప్రతిచర్య అనేది ఉక్రెయిన్ సంక్షోభంలో పెద్ద చర్చగా సాగుతోంది. ఇదే పరిస్థితి చైనా పొరుగున ఉన్న తైవాన్ విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. తైవాన్ను స్వాధీనం చేసుకోడానికి చైనా ఆయుధాలను మోహరిస్తోందని అందువల్ల తైవాన్‌కు రక్షణగా తాము చైనాకు వ్యతిరేకంగా యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా దాని మిత్ర దేశాలు చెబుతున్నాయి. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉందనీ, ఒకే చైనా సిద్ధాంతానికి విరుద్ధంగా తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోడానికి అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు మద్ధతిస్తున్నాయి గనుక దాన్ని నివారించడం కోసం తాను సైనిక సన్నాహాలు చేస్తున్నానని చైనా చెబుతోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఏ వ్యూహమైతే అనుసరిస్తోందో తైవాన్ విషయంలో చైనాకు వ్యతిరేకంగా కూడా అదే వ్యూహం అనుసరిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ సంబంధాలు ఈ ప్రాంతంలో చాలా సున్నితమైనవి. క్రిమియాతో సహా ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో రష్యన్ జనాభా గణనీయంగా ఉంది. అంతే కాకుండా చమురు, గ్యాస్, ఇతర అనేక దిగుమతుల కోసం ఉక్రెయిన్ రష్యా మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఉక్రెయిన్-రష్యా సత్సంబంధాలు ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు ముఖ్యమైన గ్యారంటీగా నిలుస్తాయి. అయితే నాటోను తూర్పు వైపు విస్తరిస్తూ వచ్చిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ను కూడా నాటో కూటమిలో చేర్చుకుని రష్యాకు పక్కలో బల్లెంగా మార్చడానికి ప్రయత్నించాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత రష్యాపై కాలు దువ్వడం పెరిగింది. ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం రష్యాపైనా, ఆ దేశ అధికారులపైనా ఆంక్షలకు దిగింది. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలను మరింత ఎగదోస్తూ 2018 మార్చిలో ఉక్రెయిన్‌కు మరింత ప్రమాదకరమైన మారణాయుధాల ఎగుమతికి అనుమతిచ్చింది. అదే ఏడాది అక్టోబర్‌లో అమెరికా, మరో ఏడు నాటో దేశాలు ఉక్రెయిన్‌తో కలిసి పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలకు దిగాయి.
ఇక్కడ రష్యాకు రెండు సమస్యలు ఎదురైనాయి. ఒకవైపు నాటో తన వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా తూర్పు వైపుకు విస్తరిస్తూ క్రమంగా ఉక్రెయిన్ వరకు వచ్చింది. ఉక్రెయిన్ను కూడా నాటోలో చేర్చుకోబోతున్నట్లు ప్రకటించింది. అదే జరిగితే రష్యా భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. మరోవైపు ఎదురు తిరగకుండా పరిస్థితులను అలాగే వదిలేస్తే క్రిమియానూ, రష్యన్లు అధికంగా గల స్వయంప్రతిపత్తి ప్రాంతాలపైన ఉక్రెయిన్ దురాక్రమణకు పశ్చిమ దేశాలు ప్రోత్సహించవచ్చు. ఒక రకంగా రష్యాకు ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితులను నాటో కూటమి సష్టించింది. ఆ పరిస్థితులకు రష్యా స్పందిస్తే దాన్ని దురాక్రమణదారుగా నాటో దేశాలు చిత్రీకరిస్తున్నాయి.
తైవాన్ లోనూ అదే వ్యూహం
అమెరికా ఇదే పరిస్థితిని తైవాన్ విషయంలో చైనాకు కూడా సృష్టించింది. 1979లో నిక్సన్, చౌ ఎన్ లై సమావేశం అనంతరం ప్రధాన చైనా భూభాగాన్ని అమెరికా గుర్తించడమే కాకుండా ఒకే చైనా విధానాన్ని సమర్ధించింది. కానీ చైనాను నిలువరించాలన్న ఇటీవలి విధానంలో భాగంగా అమెరికా చైనాకు వ్యతిరేకంగా తైవాన్ను పావుగా వాడుకోవడం ప్రారంభించినప్పటి నుండి తైవాన్-చైనా సంబంధాల్లో కూడా మార్పు వచ్చి ఉద్రిక్తతలు తలెత్తాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైవాన్ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేందుకు దుందుడుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో తైవాన్ జలసంధి ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. ఉక్రెయిన్‌లో రష్యాకు ఎదురైన పరిస్థితే తైవాన్‌లో చైనాకు కూడా ఎదురైంది. తైవాన్ చైనాలో అంతర్భాగమనీ, ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న డెంగ్ సియావో పెంగ్ విధానం కింద తైవాన్ శాంతియుతంగా ఎప్పటికైనా చైనాలో కలవాలనీ, ఒకవేళ అలా కాకుండా తొందరపడి తైవాన్ స్వతంత్రం ప్రకటించుకోడానికి ప్రయత్నిస్తే బలప్రయోగంతోనైనా దాన్ని చైనా ప్రధాన భూభాగంలో కలుపుకుంటామని చైనా ప్రకటించడమే కాకుండా దాని రాజ్యాంగంలో కూడా పేర్కొన్నది. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ఇప్పుడు అమెరికా క్రమంగా తైవాన్ను సాయుధం చేస్తూ దాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించే దిశవైపు తీసుకుపోతోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇతర సామ్రాజ్యవాద దేశాలు తైవాన్ వేర్పాటుకు మద్దతివ్వడమే కాకుండా అమెరికా తన అమ్ముల పొదిలోని అత్యంత ఆధునిక ఆయుధాలను తైవాన్‌లో మోహరించి చైనాపై ఎక్కు పెట్టింది. దాని వల్ల నేడు ప్రపంచంలో తైవాన్ ఒక ఉద్రిక్త ప్రాంతం (హాట్ స్పాట్)గా మారింది. తైవాన్ పరిణామాలను అలాగే వదిలేస్తే అది స్వతంత్రం ప్రకటించుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. అలా కాకుండా తైవాన్‌పై ఒత్తిడి పెడితే అమెరికా దాన్ని సాకుగా చూపించి తైవాన్ను మరింత సాయుధం చేస్తున్నది.
అందువల్ల ఉక్రెయిన్, తైవాన్ పరిణామాలు రెండూ బయటకు చూస్తే ప్రతి చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతున్నాయి. కానీ వాస్తవంగా ఈ రెండు దేశాలను పావులుగా మార్చుకుని అటు యూరప్‌లో రష్యానూ, ఇటు ఆసియాలో చైనానూ కట్టడి చేయడానికి అమెరికా నేతత్వంలోని సామ్రాజ్యవాదులు పన్నిన యుద్ధ వ్యూహమే నేడు ఈ రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు కారణం.
రష్యా, చైనాలపై సామ్రాజ్యవాదుల యుద్ధ సన్నాహాలు ఆ రెండు దేశాలను ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక సంబంధాల్లో మరింత దగ్గర చేరుస్తున్నాయి. రెండు దేశాలు ఇటీవలి కాలంలో సంయుక్త సైనిక విన్యాసాలు చేయడమే కాకుండా పలు అంతర్జాతీయ పరిణామాల్లో సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి.
మొత్తం మీద చూసినప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం తరువాత మళ్లీ అంత పెద్ద స్థాయిలో ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు సష్టించడానికి సామ్రాజ్యవాదులు చైనా, రష్యాలను లక్ష్యంగా చేసుకున్నారు. దానికి ఉక్రెయిన్, తైవాన్లను పావులుగా వాడుకుంటున్నారు. ఈ సామ్రాజ్యవాద కుట్రలే నేటి ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి కారణం. ఇటు ఉక్రెయిన్, అటు తైవాన్.. ఈ రెండు సంక్షోభాలకూ కారణం ఒక్కటే. అది అమెరికా సామ్రాజ్యవాదుల ఆధిపత్య వ్యూహం. ఒకవైపు ప్రపంచం కరోనా మహమ్మారి నుండి, మరోవైపు ఆర్థిక సంక్షోభం నుండి పెద్ద ఉపద్రవాలు ఎదుర్కొంటున్న తరుణంలో... ఈ రెండు విషయాల్లోనూ విఫలమైన సామ్రాజ్యవాదం... తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూడా ఈ ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ వస్తోంది. ఆ ఫలితమే నేటి ఈ యుద్ధం.
- ఎస్. వెంకట్రావు