Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరుపేదలకు రెండు పూటల ఆహారం దొరక్క ఆకలి కేకలు పెడుతున్న దేశంలో ఆహారం వ్యర్థ పదార్థ రూపంలో డస్ట్‌బిన్ పాలు కావడం శోచనీయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 931 మిలియన్ టన్నుల ఆహారం వ్యర్థమవుతోంది. ఇందులో 569 మిలియన్ టన్నుల గృహ వ్యర్థాలు (61 శాతం), 244 మిలియన్ టన్నులు ఆహార సేవల వ్యర్థాలు (26శాతం), 118మిలియన్ టన్నుల రిటేల్ ఆహార వ్యర్థాలు (13శాతం) ఉన్నాయని విశ్లేషించబడింది. ప్రపంచ దేశాల వార్షిక తలసరి వ్యర్థాలు 121 కేజీలు ఉండగా, అందులో 74 కేజీలు గృహ వ్యర్థాలు, 32 కేజీలు ఆహార సేవల్లో వ్యర్థాలు, రిటేల్‌లో 15 కేజీల ఆహారం వ్యర్థం అవుతున్నది. ఇండియాలో 68.7 మిలియన్ టన్నుల (వార్షిక తలసరి ఫుడ్ వేస్ట్ 50కేజీలు) ఆహారాన్ని వ్యర్థ పదార్థంగా ఇంట్లోంచి చెత్తకుప్పలో వేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ''ఆహార వ్యర్థాల సూచిక-2021 (ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్-2021)'' నివేదిక బహిర్గత పరిచింది.
ఏడాదికి 690 మిలియన్ల ప్రజలు ఆకలి కోరల్లో, ముఖ్యంగా కోవిడ్-19 కల్లోలం అనంతరం 3 బిలియన్ల ప్రజలు పోషకాహారానికి దూరంగా ఉన్న వేళ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 17శాతం ఫుడ్ వేస్టేజ్ కావడం విచారకరం. ఇండియాలో వార్షిక తలసరి 50కేజీల (దేశ ప్రజలు ఏడాదికి 68.8మిలియన్ టన్నులు) ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నారని నివేదిక తెలిపింది. అతి తక్కువ ఫుడ్ వేస్ట్ ఆస్ట్రియాలో (వార్షిక తలసరి వ్యర్థాలు 39 కేజీలు) ఉండగా, అత్యధికంగా నైజీరియాలో 189 కేజీలుగా నిర్ణయించబడింది. అమెరికాలో తలసరి ఫుడ్‌వేస్ట్ 59కేజీలు (19.4 మిలియన్ టన్నులు), చైనాలో ఏడాదికి తలసరి ఫుడ్ వేస్ట్ 64కేజీలు (91.6మిలియన్ టన్నులు) ఉందని నివేదిక తేల్చింది. గృహాలు, హౌటల్స్, రిటేల్ ఔట్లెట్స్ ద్వారా ఆహారం వ్యర్థం కావడం జరుగుతోంది. భోజనం తరువాత మిగిలిన ఎముకలు, పీచు పదార్థాలు లాంటి తినడానికి వీలుకాని వ్యర్థాలను బయట వేయడం సర్వ సాధారణంగా జరుగుతుంది. కాని కొన్ని సంపన్న గృహాలు, శుభకార్యాలు, విందు భోజనాల అనంతరం మిగిలిన శుద్ధ ఆహారాన్ని కూడా డస్ట్ బిన్ లేదా పెంటపాలు చేయడం నేర సమానమని గమనించాలి.
ఆహార ఉత్పత్తిలో అపార రైతు శ్రమ, నీటి వినియోగం, ఎరువులు, క్రిమి సంహారకాలు, ఆర్థిక వనరులు, వ్యవసాయ వనరులు వినియోగించబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫుడ్ వేస్టేజ్‌తో వాతావరణ మార్పులు, ప్రకృతి విధ్వంసంతో పాటు జీవ వైవిధ్యం, కాలుష్యం, వ్యాపారం, నీటి కొరత, భూసారం, ఆర్థిక దుష్ప్రభావం, ప్రభుత్వ యంత్రాంగం, నిధుల వినియోగం, పౌర రైతు సేవలు సంబంధాన్ని కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఆహార వ్యర్థాల ఫలితంగా 8-10శాతం హరిత గృహ వాయువులు (గ్రీన్‌హౌజ్ గ్యాసెస్) విడుదల అవుతున్నాయని విశ్లేషించారు. కోవిడ్-19రికవరీ ప్రణాళికల్లో ఆహార వ్యర్థాలను తగ్గించడం ప్రధాన అంశమని వివరించారు. ఆహార వ్యర్థాలను తగ్గించే యజ్ఞంలో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, వ్యాపార సామ్రాజ్యాలు, రైతులు, పౌర సమాజం, దాతృత్వ సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు సమన్వయంతో పని చేయవలసి ఉంటుంది. ఆహార పదార్థాలను ఆలోచించి పరిమితంగా కొనడం, తయారు చేసుకోవడం, అవసరం మేరకే వాడటం, రుచిగా వండు కోవడం, సమతుల పోషకాహారాన్ని ఆస్వాదించడం వంటి చర్యలతో ఆహార వ్యర్థాలు తగ్గించబడటంతో పాటు ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ రక్షణ, ఆర్థిక నష్ట నివారణ సిద్ధిస్తాయని మరువరాదు.
ఆహార వ్యర్థాల కట్టడి ఫలితంగా మానవాళికే కాకుండా భూగ్రహానికి కూడా ఎంతో మేలు కలుగడంతో పాటుగా ఆహార భద్రత, వాతావరణ సకారాత్మక మార్పులు, డబ్బు ఆదా, నీటి లభ్యత, నేల నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య స్థాపన, వ్యర్థాల నిర్వహణ లాంటి ప్రయోజనాలు కలుగుతాయి. అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో (తలసరి వార్షిక వ్యర్థాలు 79 కెజీలు) పాటు అభివృద్ధి చెందుతున్న మధ్య-ఆదాయ (తలసరి 76 కేజీలు), అల్ప-ఆదాయ పేద దేశాల్లో (తలసరి 91కేజీలు) కూడా గృహ ఆహార పదార్థాలు అతిగా వ్యర్థం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రపంచదేశాల్లో తలసరి వార్షిక గృహ ఆహార వ్యర్థాలు అత్యధికంగా నైజీరియాలో 189కేజీలు, ర్వండాలో 164కేజీలు, గ్రీస్‌లో 142కేజీలు, దక్షిణ ఆఫ్రికాలో 134కేజీలు, బెహరెన్లో 132 కేజీలు, టాంజానియాలో 119 కేజీలు, ఇజ్రాయిల్, లెబనాన్, సౌధీ అరేబియాల్లో 105 కేజీలు, ఆస్ట్రేలియాలో 102 కేజీలు, కెన్యాలో 100 కేజీలుగా నమోదు అయ్యాయి. దక్షిణ ఆసియా దేశాల్లో ఇండియాలో గృహ తలసరి వార్షిక వ్యర్థాలు 50 కేజీలు ఉండగా, అఫ్ఘానిస్తాన్‌లో 82 కేజీలు, భూటాన్, నేపాల్‌లో 79 కేజీలు, శ్రీలంకలో 76 కేజీలు, పాకిస్థాన్‌లో 74 కేజీలు, బంగ్లాదేశ్‌లో 65 కేజీలు రికార్డు అయ్యాయి. అన్నాన్ని జీవ ఇంధనం గా భావించి, ఒక్కొక్క మెతుకులో దాగిన కర్షక శ్రమను గౌరవించి, ముద్ద ముద్దలో అన్నదాతకు కృత జ్ఞతలు తెలిపి, ఆకలిలేని లోకాన్ని స్వప్ని స్తూ, ఆహార పదార్థాలను వ్యర్థం కాకుండా జాగ్రత్త పడుతూ, ఆరోగ్య మానవాళిని నిర్మిం చుకోవాలి. ఆహార వృధా నేర సమాన మని, అదో ఘోర క్రియగా భావించాలి. బాధ్యతగా నడుచుకోవాలి.
డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
9949700037