Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ప్రస్థుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మూకుమ్మడిగా బయటికి వచ్చి, తాము స్వతంత్రంగా విధులు నిర్వహించలేకపోతున్నామని దేశ ప్రజలముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో, పలు రాష్ట్రాల హైకోర్టులలో న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాల్ని తీవ్రంగా తిప్పికొడు తున్నారు. సహేతుకంగా ఆలోచించి సామాన్య ప్రజల బాగోగులు చూడాల్సింది ప్రభుత్వాల బాధ్యత ేనని మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు. ఉదాహరణకు టెలికాం కంపెనీల కేసు గమనించండి..
టెలికామ్ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92కోట్ల ఎజీఆర్ బకాయిలను వసూలు చేయవద్దంటూ సంబంధిత అధికారులకు టెలికామ్ మంత్రిత్వశాఖ డెస్క్ ఆఫీసర్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెస్క్ అధికారితో పాటు టెలికామ్ సంస్థలకు కోర్టు ధిక్కార నోటీసులు పంపించింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రా చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. 'దేశంలో బోడిపాలన జరుగుతూ ఉందని' - దేశ ప్రజల అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ దేశంలో బతకడం కంటే దేశాన్ని వదిలి పోవడమే మంచిదని - అన్నారు. దేశంలో ఎలాంటి న్యాయం మిగిలిలేదని, అందువల్ల సుప్రీంకోర్టును ఎత్తేద్దామా? అని కూడా ఆయన ఆగ్రహించారు. తానెంతో ఆవేదనకు గురవుతున్నాననీ, ఈ కోర్టులో పనిచేయకపోవడమే మంచిదని జస్టిస్ అరుణ్‌మిశ్రా బాధపడ్డారు. తమ ఆదేశాలను పక్కనపెట్టి టెలికామ్ మంత్రిత్వశాఖ డెస్క్ ఆఫీసర్ నియామకం ఎలా జరిపిందని, దాని వెనక డబ్బు కోణం ఏమైనా ఉందా? అని జస్టిస్ అరుణ్‌మిశ్రా ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు గుప్పించారు. ఏమైనా, ఆ డెస్క్ ఆఫీసర్ జైలుకు వెళ్ళాల్సిందేనని అన్నారు.
ఇది ఇలా ఉంటే, అక్కడ అహ్మదాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ నాన్ వెజ్ని (మాంసాహారాన్ని) బ్యాన్ చేసింది. ఆహారం అమ్మే దుకాణాలలో (ఫుడ్‌స్టాల్స్) మాంసం వంటకాలు ఏవీ అమ్మకూడదని ఆంక్షలు విధించింది. ఆ విషయం గుజరాత్ హైకోర్టుకెక్కింది. అక్కడ జస్టిస్ బిరిన్ ఎ. వైష్ణవ్ తన తీర్పులో అహ్మదాబాదు మున్సిపల్ కార్పొరేషన్ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఏది తినాలో ఏది తినకూడదో నిర్ణయించే అధికారం మీకెవరిచ్చారని మండిపడ్డారు. పైన అధికారంలో ఉన్నవారి అహాన్ని సంతృప్తి పరచడానికి ఇలాంటి దిగజారిన తక్కువ స్థాయి నిర్ణయాలు తీసుకోగూడదని హితవు పలికారు. ఆహారపు అలవాట్ల కారణంగా జనాన్ని విడగొడతారా? అని ప్రశ్నించారు. సామాన్యుడి హృదయ ఘోషను తన తీర్పులో పొందుపరిచిన జస్టిస్, ప్రజల మన్ననను పొందారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెలువడిన ఈ హైకోర్టు తీర్పు - ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టింది.
ప్రఖ్యాత నాటకకర్త జార్జ్ బెర్నాండ్ షా ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు మనం మనదేశంలో చూస్తున్నాం. ఆయనేమన్నారంటే.. ''రెండుశాతం ప్రజలు ఆలోచిస్తారు. మరో మూడు శాతం ప్రజలు తాము ఆలోచిస్తున్నామని అనుకుంటారు. ఇక మిగతా తొంభైఐదుశాతం మంది మాత్రం అస్సలు (చచ్చినా) ఆలోచించరు!'' ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని ప్రయివేటు వాడికి అమ్మేస్తున్నారు. మళ్ళీ ఆ ప్రయివేటు వాడు నష్టాల్లో ఉన్నాడని వాడి రుణాలు మాఫీ చేస్తున్నారు. ఇదే నేటి మన పాలకుల దేశభక్తి. పెరుగుతున్న పెట్రోలు ధరలపై ఉత్తరప్రదేశ్ బీజేపీ మంత్రి ఉపేంద్ర తివారి ఎంత కామెడిగా వ్యాఖ్యానించారో గమనించండి... ''సమాజంలో తొంభైఐదు శాతం మందికి పెట్రోలు అవసరం లేదు. కార్లూ, బైక్‌లు ఉన్నవాళ్ళు మన జనాభాలో కొద్దిమందే కదా? వారు ఈ భారాన్ని సులభంగా సునాయసంగా భరించగలరు..'' తెలుగు టీవీ ఛానళ్ళలో కామెడిస్టార్స్ ప్రోగ్రాం చూసినవారికి ఎంత డోకు వస్తుందో, ఈ మంత్రిగారి వ్యాఖ్యలు కూడా అంతకు రెండింతలుగా డోకు తెప్పిస్తాయి. మన ప్రధాని వాడుతున్న మేబ్యాక్ జర్మన్ కంపెనీ కళ్ళజోడు ధర లక్ష అరవైవేలు. ఆయన తల్లి మాత్రం విరిగిన కళ్ళజోడుకు తాడుకట్టుకుని వాడుకుంటోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సరే అది వదిలేద్దాం. ఆయన మెర్క్-బెంజ్ కారు ధర పదకొండు కోట్లు. జార్జియో అర్మానీ సూట్, మొవాడో వాచ్, కెన్నెల్ కోల్ షూస్ వంటి వన్నీ విదేశాల నుండి దిగుమతి చేసుకున్నవే. మరి 'మన్ కీ బాత్'లో చెప్పేదేమిటీ? ''దేశ వాసులారా! మిత్రులారా!! భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే కొనండి - మేక్ ఇన్ ఇండియా'' - అని కదా? తన దేశ ప్రజ లకు సరైన తిండీ, గుడ్డా లేదని గ్రహించిన మహాత్మాగాంధీ మోకాళ్ళపైకి చిన్న పంచె కట్టుకుని, చొక్కాకూడా లేకుండా స్వాతంత్య్ర సమరంలో ముందు నిలిచారు.
కేరళలో ఒక చిత్రమైన విషయం కోర్టు కెక్కింది. ఒక్కొక్క డోసుకు రూ.750 చెల్లించి తను ప్రయివేటుగా వ్యాక్సిన్ వేయించుకుంటే.. కోవిడ్ వాక్సిన్ సర్టిఫికేట్‌పై నరేంద్రమోడీ ఫొటో ఎందుకూ? ఆయన ఫొటో ప్రచురించాల్సిన అవసరమేమిటీ? అని కేరళలో ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. ప్రభుత్వం ఉచితంగా వాక్సిన్ వేస్తే ప్రధాని ఫొటో ఉంటే కొంతవరకు సబబేమో గానీ, డబ్బు చెల్లించి ప్రయివేటుగా వేయించుకున్న వ్యాక్సిన్ గనక - దానికి సంబంధించిన సర్టిఫికేట్‌పై ఆయన ఫొటో ఎందుకూ?..అని! మన దేశపు బ్యాంకుల్ని లూటీ చేసి పారిపోయిన వారిలో నీరవ్ మోడీ ఒకడు. చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అతను లండన్ కోర్టులో కొన్ని వాస్తవాలు ప్రకటించాడు. కొంత గణిత శాస్త్రం కూడా బోధించాడు. తాను లూటీ చేసిన పదమూడువేల కోట్లలో తనది 32శాతమేననీ... మిగతాది అంతా బీజేపీ నేతలే తిన్నారని (8.840కోట్లు) ప్రకటించాడు. పైగా తనకు వచ్చిన రూ.4,160కోట్లలో నుంచి మళ్ళీ 456కోట్లు బీజేపీ నేతలకే కమీషన్ ఇవ్వాల్సి వచ్చిందనీ.. అందువల్ల వెరసి తనకు మిగిలింది 3,704 కోట్లయితే 12,544 కోట్లు బీజేపీ నాయకులే స్వాహా చేశారనీ... లండన్ కోర్టులో ప్రకటించాడు. దానితో స్వచ్ఛ భారత్‌కు స్వచ్ఛమైన నిర్వచనం ఇదేనని చెప్పినట్లయ్యింది - బయట అవాకులు చవాకులు మాట్లాడతారేమో గానీ, కోర్టులో మాట్లాడలేరు కదా? అందుకే కాబోలు ''మర్ నే వాలేక హాత్ పకడ్ సక్తీ హై / బోల్నె వాలేకి జుబాన్ నహీఁ'' అని అన్నారు. అంటే చనిపోయే వాడి చేయి పట్టుకోవచ్చు.. కానీ చెప్పేవాడి నాలుకను ఎలా పట్టుకోగలవూ? అని అర్థం!
కేరళలో ఉన్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి, అక్కడ ఒక ఏనుగు చనిపోయినా, గోది మీడియా గోలగోల చేస్తుంది. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనుషులు చచ్చినా పట్టించుకోదు. ఉదాహరణకు నాగాల్యాండ్‌లో సైన్యం 15మంది అమాయక పౌరుల్ని కాల్చి చంపితే పెద్దగా వార్తకాలేదు. హడావుడిలేదు. శ్రద్ధాంజలి లేదు. అదే బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే పదిరోజులు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారా? దేశానికి ఆయన అందించిన సేవలేమిటీ? అనేది ఆలోచించరా? పైరవీలు చేసి పెద్ద పోస్టులో కూర్చుంటే మహానుభావులవుతారా? ''అనర్హులకు నివాళులర్పించకండి'' అంటూ దేశ ప్రజల నుండి తీవ్రంగా వ్యతిరేకత వస్తే, గోది మీడియా పట్టించుకోలేదు. బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడే వివాదాస్పదుడు. అలాంటిది తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా పదోన్నతి పొందడం కూడా వివాదాస్పదమే! ఒక సందర్భంలో నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్‌ను యూనిఫాంలో అధికారికంగా కలిసి తన పదవి ప్రతిష్టను తనే దిగజార్చుకున్నాడు. ఈయన గురించి సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం ఇలా అన్నారు... ''బిపిన్ రావత్ జనరల్‌గా కాకుండా, అధికార బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడటం మానుకోవాలి!'' అని హితవు పలికారు. కాశ్మీరు ప్రజలపై రావత్ చేసినదాష్టీకం చాలా ఉంది. అలాంటి వాడికి ఈ దేశ ప్రజల సొమ్ము - నెలకు రెండున్నర లక్షలు జీతంగా కట్టబెట్టడం జరిగింది. అతనివల్ల ఈ దేశానికి జరిగిన మేలేమైనా ఉందా అంటే - శూన్యం!
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2007లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం జర్నలిస్ట్ ప్రశాంత్ రాహీపై కేసు బనాయించింది. పద్నాలుగేండ్ల సుదీర్ఘకాలం విచారణ జరిగింది. ఇటీవల 2022 జనవరి 7న ఆయన 'నిర్దోషి' అని కోర్టు తీర్పు చెప్పింది. పోలీసులు ఎన్నెన్ని అబద్దపు సాక్ష్యాలు సృష్టించి, కుట్రలు చేసినా, ప్రభుత్వ పథకం ఫలించలేదు. కేసు నమోదు చేయడం దగ్గర్నుండి, ఆధారాలు సేకరించడం, చివరకు శ్రాంత్ రాహీని నిందితుడిగా నిరూపించేదాకా ఎందులోనూ పోలీసులు చట్టబద్ధతని పాటించలేదని న్యాయమూర్తి కేసుకొట్టేశారు. ప్రశాంత్ రాహీ మామూలు జర్నలిస్ట్కాదు. మేధావిగా, సామాజిక కార్యకర్తగా ఎంతో చురుకుగా పనిచేసినవాడు. హిమాచల్ టైమ్స్, స్టేట్స్‌మెన్ వంటి పత్రికలకు పనిచేసినవాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి స్వతంత్ర జర్నలిస్ట్‌గా పనిచేస్తూ.. ''ఉత్తరాఖండ్ సంయుక్త సంఘర్ష్ కమిటి'' స్థాపించి కార్యకర్తగా మారాడు. అతని కార్యకలాపాలు చూసి భరించలేక ప్రభుత్వం ఉపా (ఖAూA ) కింద అతనిమీద కేసు బనాయించింది. అతని విలువైన పద్నాలుగేండ్ల జీవితాన్ని వృధాచేసింది. చివరికి న్యాయస్థానం అతణ్ణి నిర్దోషిగా ప్రకటించింది. అతని పద్నాలుగేండ్ల జీవితాన్ని, అతని కార్యాచరణని మళ్ళీ ఎవరు వెనక్కి తీసుకురాగలరూ? ప్రభుత్వాలు బనాయించే కేసులు ఎలా ఉంటున్నాయీ... న్యాయమూర్తులు వాటిని ఎలా కొట్టేస్తున్నారూ.. తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ! అయితే ప్రశాంత్ రాహీ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆయన మీదున్న మరోకేసు ఇంకా విచారణకు రాలేదు.
ఒకతను చెట్టుకింద తాయెత్తులు, యంత్రాలు అమ్ముతున్నాడు. ''ఇవి మహిమగల తాయెత్తులు- యంత్రాలు'' అని పక్కనే బోర్డు కూడా పెట్టుకున్నాడు. దారిన పోయే ఆసామి ఓ క్షణం అక్కడ ఆగి, పరిస్థితి గమనించి... ఇలా అన్నాడు. ''ఇన్నిన్ని తాయెత్తులు, యంత్రాలు ఉన్నవాడివి నువ్వే చెట్టుకింద కూర్చుని ఈగలు తోలుతున్నావూ? ఇక నేను ఒక్కటి కొని గొప్పోణ్ణి ఎలా అవుతాన్రా తింగరోడా?'' అని ఎగతాళిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇది కేవలం కార్టూన్ మాత్రమే కాదు. అర్థం చేసుకుంటే ఇంకా చాలా ఉంది. విగ్రహాలు ప్రతిష్టిస్తూ, ఆలయాలు పునరుద్దరిస్తూ, కుంభమేళాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం... చెట్టుకింద తాయెత్తులు పెట్టుకుని కూర్చున్నవాడికన్నా ఏమైనా మెరుగ్గా ఉందా? స్థాయిలో తేడాలుండొచ్చుగాక, భావ దారిద్య్రంలో సమానమే కదా? ప్రభుత్వ సంస్థల్ని రోడ్డున పడేసి, తాయెత్తులు అమ్మినట్లు అమ్ముతున్నారు కదా? ఏమిటీ తేడా? తాయెత్తులతో కలసివచ్చే అదృష్టమేమీ ఉండదు గానీ, ఇక్కడ కార్పొరేట్లు మాత్రం లాభపడతారు. జనం ఎగతాళిగా నవ్వుతున్నారంటే నవ్వరా మరి? ''నువ్వు చెడ్డవాడివైనా ఫరవాలేదు. కానీ, అబద్దాల కోరువో, మోసగాడివోమాత్రం కావద్దు!'' అన్నాడు రష్యన్ మహారచయిత లియో టాల్‌స్టారు. మరి మన పరిపాలకులు అబద్దాలతో, మోసాలతో కాలం గడుపుతుంటే... దేశ ప్రజలుగా మనం ఏం చేస్తున్నట్టూ? ఆచరణ తర్వాత - ముందు కనీసం ఆలోచిస్తున్నామా?
- వ్యాసకర్త సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు