Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కమ్యూనిస్టులు ప్రతిపక్షంలో ఉంటేనే బాగుండు. అప్పుడే ప్రజాసమస్యలు చర్చకు వచ్చి ఉండేవి' గత ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జి బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. ఆ రాష్ట్రాన్ని సీపీఐ(ఎం) ప్రజాసంక్షేమంతో మూడు దశాబ్దాలకు పైగా ఏకధాటిగా ఏలిన చరిత్ర మరువలేనిది. ఈ విషయం ఇప్పుడెందుకు నొక్కిచెపాల్సి వచ్చిందంటే ఇటీవల విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచింది. యూపీలో మినహా ఎక్కడా బలమైన ప్రతిపక్షం లేకుండా మందబలంతో అధికారంలోకి రానుంది. ఇది ప్రజాస్వామ్యానికి అతి పెనుసవాల్‌గా నిలిచే సంకేతం. స్వాత్యంత్య్రం వచ్చిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఎన్నో ఏండ్లుగా దేశాన్ని పాలించింది. కానీ అవినీతి, కుంభకోణాల పార్టీగా చరిత్రకెక్కింది. అసహనంతో విసిగి పోయిన ప్రజలు, హిందుత్వవాదంతో ముందు కొచ్చిన బీజేపీ పట్టం కట్టారు. మరి దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా.. బీజేపీ గెలిస్తే సమస్యలన్నీ పరిష్కారమైనట్టేనా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. దేశంలో రోజు రోజుకూ నిత్యావసరలు ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. కరోనా ప్రభావంతో కొనుగోలు శక్తి కూడా మందగించింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తామనే ధీమా ఒక్క హిందుత్వ ఎజెండాకే సాధ్యమైంది. జాతీయ గీతాన్ని ఆలపించేవారే దేశంలో ఉండాలని, గోవును పూజించే వారే ఈ గడ్డమీద జీవించాలని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వారికి సీట్లు పోతాయనే భయం, ఓట్లు రావనే ఆందోళన కూడా లేదు. ఎందుకంటే హిందుత్వాన్ని చాపకింద నీరులా ప్రవేశింపజేయడంలో వారిది అందెవేసిన చేయి. క్లిష్ట సమయంలో పుల్వామా దాడిని ఉపయోగించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో ఇతర దేశాల్లో యుద్ధ పరిస్థితులను చూపి దేశానికి మోడీయే ఉండాలని, ఆయనే శ్రీరామరక్ష అంటూ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఇలాంటి వాటిని చూపి వారి అసమర్థ పాలనపై ప్రజలు దృష్టి పెట్టకుండా చూడటంలో విజయం వారిదే. ప్రజలకు చావు భయం చూపించి బతకడానికి భరోసా ఇస్తున్నట్టు నటిస్తున్నారు. దేశంలో రామరాజ్యం పేరుతో రాష్ట్రాల్లో రావణరాజ్యాన్ని ప్రేరేపిస్తూ ప్రజల భావోద్వే గాలతో ఆడుకుంటున్నారు. ఈ బీజేపీ నీతిమాలిన రాజకీయాలను, అధికార దాహాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంలో కొంత వెనుకబడ్డారనేది విశ్లేషకుల అభిప్రాయం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపా యలను ఖర్చుపెట్టి అన్యాయంతో, అరాచకంగా ప్రజల్లో హిందూత్వ చిచ్చుపెట్టడంతోనే ఇప్పుడు కూడా ఈ తీర్పు ఏక పక్షమైందని ఒక అంచనా. ఈ గెలుపు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని అభాసుసాలు చేయడమే కాదు... దేశ ఆర్థిక, ప్రజల జీవణ ప్రమాణాలకు ముప్పు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా దేశమంతా విస్తరించి బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే భ్రమలు కూడా ఉండనవసరం లేదు. ఆయా రాష్ట్రాల్లో గ్రూపుల పోరు, పొత్తులు, అంచనా వేయలేని జననాడితో, ఎత్తుగడలు, వ్యూహాల్లో నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ ప్రజలకు మౌలిక వసతులైన విద్యా, వైద్యం, ఉపాధి కల్పించలేనప్పుడు ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి పాలకులు గెలవడం సాధారణం. అయితే ప్రజాసంక్షేమం లేకుండా ఇవి ఎంతో కాలం నిలబడవనేది కూడా జగమెరిగిన సత్యం. దానికి ప్రత్యక్ష ఉదహరణ పంజాబే. రాష్ట్రంలో ఆప్ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. ప్రతిపక్షాలను 'చీపురు'తో ఊడ్చేసింది. ఇక్కడ ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు లేరు. ప్రజా ఉద్యమం అంతకన్నా తక్కువే. కానీ 117 సీట్లకు గాను 92 సీట్లలో పాగా వేసి ఔరా అనిపించుకుంది. కారణం బీజేపీ సర్కార్ తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతుల పోరాటం. ఇది దేశ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక పోరాట ఘట్టం. ఎన్ని అవాంతరాలు కల్పించినా ఏడాది పాటు ఢిల్లీ-సింఘీ సరిహద్దులో ఉద్యమం చేశారు. ఈ పోరాటం అక్కడి ప్రజల్నే కాదు పసిపిల్లలను కూడా పాల్గొనేలా చేసింది. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి బీజేపీ విధానాల్ని వ్యతిరేకించడంతో దిగొచ్చిన ప్రధాని పార్లమెంట్లో నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది పంజాబ్ రైతుల ప్రజా విజయం. ప్రజల ఓట్లతో అధికారం చేజిక్కించుకుని బానిసలుగా చూసే పాలకులను ఒక్క పోరాటాలతోనే నిలువరించగలం. ప్రగతిశీల భావ జాలంతో ముందుకు సాగే ప్రజాతంత్ర, సంఘటిత శక్తులకే ఇది సాధ్యం. ఇలాంటి ఉద్యమాల్లో చైతన్యవంతులు భాగస్వాములవ్వాలి. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పాలి. అప్పుడే భావిభారత ప్రజల భవిష్యత్తు బాగుంటుంది.
- ఎన్. అజరుకుమార్
సెల్:9490099140