Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మృతి చిహ్నం 'తాజ్‌మహల్' యునెస్కోకు ప్రపంచ వారసత్వ ప్రదేశం. యునెస్కో దీనిని ''భావజాల పరంగా, ఆదరణలో, నిర్వహణా శైలిలో ఒక నిర్మాణ సంబంధమైన కళాఖండం''గా వర్ణించింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ 'అద్భుతం' మళ్ళీ భావజాల సిద్ధాంత కథనాలకు కేంద్రమైంది. ఈ క్రమంలో, చరిత్రను నీలినీడలలోకి నెట్టివేస్తున్నారు.
డిసెంబర్ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ప్రారంభించే నేపథ్యంలో భావజాలపరమైన ఒక కథనాన్ని రూపొందించే ప్రయత్నం ఇటీవల కాలంలో జరిగింది. ప్రశంసలతో కూడిన సంజ్ఞలతో ప్రధాని మోడీ, కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు కృతజ్ఞతా భావనతో అక్కడి పారిశుద్ధ్య కార్మికులపై పూలవర్షం కురిపించారు. కానీ, హృదయాన్ని కదిలించే ఆ సంజ్ఞ మొగలులను విమర్శించడానికి మరొక హేతువుగా మారింది. కొన్ని ఛానెళ్లు మోడీని, మొగల్ చక్రవర్తి షాజహాన్తో పోల్చడం మొదలు పెట్టాయి. నరేంద్ర మోడీ పారిశుద్ధ్య కార్మికులపై పూలవర్షం కురిపించినట్లు కాకుండా, షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించిన కూలీల చేతులను నరికించి వేశాడనే విషయాన్ని ఇక్కడ నొక్కి వక్కాణించారు. ప్రస్తుత పాలక ప్రభుత్వానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు శృతి మించిన అతిశయాలను జోడించారు. అతికొద్ది సమయంలోనే సామాజిక మాధ్యమాలు, తాజ్‌మహల్‌ను నిర్మించిన కూలీల చేతులను షాజహాన్ నరికివేశాడనే పోస్టుల ప్రవాహాలతో నిండిపోయాయి.
కానీ ఇది అందరికీ తెలిసిన కట్టుకథ అనేది వాస్తవం. షాజాహాన్ తాజ్ మహల్‌ను నిర్మించిన కూలీల చేతులను నరికించాడని రుజువు చేసే చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. ఎప్పుడో జరిగిందని చెప్పబడుతున్న, ప్రజలకు తెలియని ఈ వివాదంలోని నిజానిజాలను తేల్చడానికి రాయబడిన వివరాలను ఒక్కసారి పరిశీలించాలి.
తాజ్ మహల్ నిర్మాతలు
షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృతి చిహ్నంగా తాజ్‌మహల్‌ను నిర్మించాడు. అది ఎలా నిర్మించారో అర్థం చేసుకోడానికి అరబిక్ లిపిలో కొన్ని చారిత్రక, ఖురానిక్ చెక్కడాలు మాకు ఎంతగానో తోడ్పడ్డాయని యునెస్కో పేర్కొంది. భవన నిర్మాణ సుతార్లు, రాళ్ళు కొట్టే కూలీలు, అలంకరణ కార్మికులు, భవన శిల్పులు, పెయింటర్లు, చక్కటి చేతిరాత రాసేవారు (క్యాలీగ్రాఫర్లు), బురుజుల నిర్మాణ కార్మికులు, ఇతర చేతి వత్తుల వారిని, ఈ స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని మొత్తం సామ్రాజ్యంతో పాటు మధ్య ఆసియా, ఇరాన్ నుండి కూడా డిమాండ్ చేశారు. మొత్తం ఇండో-ఇస్లామిక్ భవన శిల్పా శాస్త్రంలోనే తాజ్‌మహల్ ఒక గొప్ప భవన శిల్పాశాస్త్ర సంబంధ విజయంగా పరిగణించబడుతుందనీ, తాజ్ మహల్ ప్రత్యేకత ఉద్యానవనాలను రూపొందించిన వారిలో, షాజహాన్ భవన శిల్పులలో దాగి ఉందని యునెస్కో వ్యాఖ్యానించింది.
చేతి వృత్తిదారుల, నిర్మాణ కూలీల నైపుణ్యాన్ని మనం తక్కువ చేసి చూడలేం. ఇది వాస్తవానికి మనకు ఇంత గొప్ప అద్భుతాన్ని అందించిన మధ్య ఆసియా, ఇరాన్ నుండి వచ్చిన వారితో పాటు భవన శిల్పుల, రూపకర్తల సృజనాత్మక సామర్థ్యం తప్ప వేరే కాదు. ఆలోచనలను రూపొందించిన దశ నుంచి ఆ భావాలను అమలుచేసే దశవరకు పర్యవేక్షించే బాధ్యతను మొగల్ రాజులకు అప్పగించారు.
అతా మొహమ్మద్ అనే రాళ్ళు కొట్టే కూలీకి నెలకు రూ.500, బుఖారా నుండి వచ్చిన షకీర్ అహ్మద్‌కు నెలకు రూ.400, ముల్తాన్ నుండి వచ్చిన మొహమ్మద్ సజ్జద్ అనే సుతారికి నెలకు రూ.590, లాహౌర్ నుండి వచ్చిన చిరంజీలాల్ అను మరొక కూలీకి నెలకు రూ.800లు చెల్లించారు. ఇలాంటి శిక్షణ పొందిన కూలీలకు నెలకు రూ.15లు సాధారణ వేతనాలుగా ఉండేవని మొగలుల రికార్డులు, అక్కౌంట్ పుస్తకాలు తెలియజేస్తాయి. ఈ అకౌంట్ పుస్తకాల్లో ఉదహరించబడిన వారంతా తాజ్ మహల్ పనికి బాధ్యత వహించిన సమూహాలకు మార్గనిర్దేశకులు. వారు బహుశా స్థానికంగా ఉన్న కూలీలకు, ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కూడా పని కల్పించారు. ఇంత పెద్ద మొత్తంలో తీసుకున్న డబ్బును మరికొందరికి కూడా పునఃపంపిణీ చేశారు.
వీరందరితో పాటుగా భవన శిల్పులు, క్యాలీగ్రాఫర్లు, నిర్వాహకుల పేర్లు కూడా చరిత్ర రికార్డుల్లో నమోదు అయ్యాయి. వారిలో కొందరు మొగల్ వంశానికి చెందినవారు. ఈ స్మృతిచిహ్నం యొక్క ప్రత్యేకతను చక్కటి చేతిరాత (క్యాలీగ్రఫీ)కు ఆపాదించబడింది. ఈ ప్రత్యేక లక్షణం గల స్మృతి చిహ్నానికి సంబంధించి ఆలోచించింది, ఆ పనిని పర్యవేక్షించిన వ్యక్తి, ఇరాన్‌లోని షిరాజ్‌కు చెందిన క్యాలీగ్రాఫర్ అయిన అమానత్ ఖాన్. ఈయన 1608 సీఈలో తన సోదరుడైన అఫ్జల్ ఖాన్‌తో కలిసి మొగల్ కోర్టుకు వలస వచ్చారు. ఆయన షాజహాన్ సామ్రాజ్యంలో ఇంపీరియల్ లైబ్రరీలో పని చేయడం ప్రారంభిస్తే, అఫ్జల్ ఖాన్ చాలా తక్కువ కాలంలో ఆ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. తరువాత ఆగ్రాలోని సమాధిపై చక్కటి దస్తూరీని రూపకల్పన చేసేందుకు అమానత్ ఖాన్‌ను నియమించారు. అదే తరువాత కాలంలో 'తాజ్ మహల్'గా ప్రసిద్ధి చెందింది. అతని పనితీరుతో సంతృప్తి చెందిన షాజహాన్ అతనికి 'మన్సబు' అను బిరుదును ఇచ్చాడు. అమానత్ ఖాన్ తాజ్ మహల్ కొరకు ఆరు సంవత్సరాలు శ్రమించాడు. సమాధి హాలులోని బురుజుపై దస్తూరి 1638లో పూర్తి అయ్యింది. కానీ ఆయన తన జీవితంలో ఇంత ప్రాముఖ్యత గల పనిని పూర్తి చేసిన సమయంలో ఆయనలో ఒక విషాదం చోటు చేసుకుంది. అఫ్జల్ ఖాన్ లాహౌర్‌లో మరణించాడు. అత్యంత అనుభవజ్ఞుడైన ఈ క్యాలీగ్రాఫర్ తనకు వచ్చిన ఆదాయాన్నంతా తన సోదరుని స్మృతి చిహ్నం నిర్మాణానికే ఖర్చు చేశాడని ''ఇండియన్, ఇస్లామిక్ ఆర్ట్'' ప్రముఖ స్కాలర్, డబ్ల్యూ.ఈ.బిగ్లే పేర్కొన్నాడు. తనకు అత్యంత ఆప్త మిత్రుడు, తాజ్ మహల్ ప్రధాన శిల్పి, ఉస్తాద్ అహ్మద్ అభ్యర్థన మేరకు అమానత్ ఖాన్ ఇరాన్‌కు తిరిగి వెళ్ళలేదు.
గౌరవ భవన శిల్పులు
ఆ కాలంలో ఉన్నత వర్గం వారికి సమానుడైన ఉస్తాద్ అహ్మద్ గౌరవప్రదమైన భవన శిల్పి. తాజ్ మహల్ నిర్మాణంలో ఆయన వ్యక్తిగత భాగస్వామ్యం గురించి షాజహాన్ కోర్ట్‌లోని చరిత్రకారులు నొక్కి వక్కాణించారు. ఏ ఇతర మొగల్ చక్రవర్తి కంటే కూడా ఉస్తాద్ అహ్మద్ అద్భుతమైన నూతన భవనాల నిర్మాణంలో చాలా గొప్ప ఆసక్తిని ప్రదర్శించారు. ఆయన ప్రతీరోజూ భవన శిల్పులు, పర్యవేక్షకులతో సమావేశాలు నిర్వహించేవారు.
షాజహాన్, పరిగణలోకి తీసుకోదగిన ఆలోచనల అనంతరం నిపుణులైన భవన శిల్పుల రూపకల్పనలకు అనుగుణంగా తగిన మార్పులు, చేర్పులు చేయించేవారనీ, శిల్పులను చాలా సమర్థవంతమైన ప్రశ్నలను అడిగే వారని, కోర్టులో వరుస సంఘటనలను నమోదు చేసే వ్యక్తి అయిన అబ్దుల్ హమీద్ లహౌరీ పేర్కొన్నాడు. లహౌరీ కుమారుడైన లత్ఫుల్లాV్‌ా ముహన్దిస్ రచనల్లో ఇద్దరు భవన శిల్పులైన ఉస్తాద్ అహ్మద్ లహౌరీ, మీర్ అబ్దుల్ కరీం పేర్లనుదహరించారు. ఉస్తాద్ అహ్మద్ లహౌరీ ఢిల్లీలోని ఎర్రకోటకు పునాదులను వేశాడు. మీర్ అబ్దుల్ కరీం ఇంతకు ముందు మొగల్ చక్రవర్తి అయిన జహంగీర్‌కు ప్రీతిపాత్ర మైన శిల్పి. కొంతమంది రూపకర్తలు, భవన శిల్పు లతో సహా మొత్తంగా 37 మంది పేర్లను మొగల్ చరిత్రలో ఉదహరించారు. వీరంతా తాజ్ మహల్‌కు ఒక రూపాన్నివ్వడంలో కలిసికట్టుగా శ్రమించారు.
తాజ్ మహల్ నిర్మాణంలో చేతివృత్తుల వారు, కూలీలు చాలా కీలకమైన పాత్ర పోషించగా, ఈ స్వభావం గల పనిని సృష్టించిన వారు భవన శిల్పులు, రూపకర్తలు. తన అభిరుచికి, తన దార్శనికతకు రూపమిచ్చిన వారందరినీ షాజహాన్ సన్మానించి, బహుమతులు అందజేశాడు. నమోదైన చరిత్ర ఇది కాగా, కూలీల చేతులను షాజహాన్ నరికించాడనే పుకార్లను, వదంతులను సృష్టించేవారు, నిత్యం కట్టుకథలను పదేపదే చెప్పే నాయకులు వారి అజ్ఞానాన్ని, చరిత్ర అవగాహన లేని తనాన్ని వారే బయట పెట్టుకుంటున్నారు.
- ఎం.సలీంబేగ్
('ద హిందూ' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451