Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాల ఐక్యవేదిక ''ప్రజలను కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం''అని పిలుపు నిచ్చింది. కార్మిక, ప్రజావ్యతిరేక, విధానాలతో మొండిగా ముందుకు సాగుతున్న మోడీ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు రెండు రోజుల దేశ వ్యాప్త సమ్మెకు ఐక్యవేదిక సిద్ధమవుతోంది. దేశ సంపద సృష్టికర్తలు రైతాంగం, కార్మికవర్గం నిరంతరం జరిపే పోరాటాల కొనసాగింపే ఈ సార్వత్రిక సమ్మె. దేశ సంపదను వేలం వేసేందుకు, స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడి దారులకు (కార్పొరేట్లకు) కారుచౌకగా కట్టబెట్టేందుకు బరితెగించిన నిరంకుశ పాలకులను నిలువరించడానికి, దేశానికి వినాశకరమైన విధానాలను తిప్పికొట్టేందుకే ఈ సమ్మె.
ఐక్యవేదిక విస్తృతి
ఈ వినాశకర నయా ఉదారవాద ఆర్థిక విధానాలను మనదేశంలో 1991లో ప్రవేశపెట్టారు. ఆప్పటి నుంచీ జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల్లో ఇది 21వది. మూడు దశాబ్దాలుగా సంఘటిత, అసంఘటిత రంగ పరిశ్రమలు, సంస్థల్లో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. కొనసాగింపుగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెల సందర్భంగా చేసిన కృషి ద్వారా కార్మిక సంఘాల ఐక్యవేదిక విస్తృతంగా బలోపేతమయింది. 2009 నాటికి దేశంలోని అత్యధిక కార్మిక సంఘాలు ఐక్యవేదికలో అంతర్భాగమయ్యాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో దాని అనుబంధ బీఎంఎస్ ఐక్యవేదిక నుంచి వైదొలగినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. వారి కేంద్ర నాయకత్వం ప్రభుత్వానికి వత్తాసు పలికినప్పటికీ రక్షణ రంగం వంటి అనేక రంగాల్లో సంస్థాగత పోరాటాల్లో బీఎంఎస్ సంఘాలు పాల్గొన్నాయి.
పురోగతి
బీజేపీ పాలనలో మరీ ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాల దూకుడు తారస్థాయికి చేరింది. ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారులైన కార్మిక, కర్షకులు.. ఆ విధానాలతో ప్రభావితమయ్యే విశాల ప్రజానీకం భాగస్వామ్యంతో ఉదారవాద విధానాల దుష్పరిణామాలపై పోరాటాల ఫలితంగా పాలక వర్గాల నిజస్వరూపం మరింత స్పష్టంగా బయటపడుతోంది.
ప్రజల జీవనోపాధి, హక్కులపై అధికార గర్వంతో అత్యంత క్రూరంగా వేధింపులకు పాల్పడటాన్ని దేశం మొత్తం చూసింది. విషపు కోరలతో అతిక్రూరంగా, అమానవీయంగా పాలకుల దాడి క్రమం కోవిడ్ మహమ్మారి కాలం మొత్తంలో స్పష్టంగా కనిపించింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో కోరుకున్న విధ్వంసక విధానాలను అధికారం అడ్డం పెట్టుకుని క్రూరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు మహమ్మారి సమయంలో ప్రజల నిస్సహాయతను ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉపయోగించుకుంది. ఈ పనులన్నీ బాహాటంగా జరిగాయి. చిన్న కమతాల వ్యవసాయాన్ని నాశనం చేసి లాభాపేక్షే ధ్యేయంగా ఉన్న బడా, గుత్త పెట్టుబడిదార్లకు (కార్పొరేట్లకు) వ్యవసాయ రంగాన్ని ధారాదత్తం చేయడానికి వినాశకర వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తెచ్చింది. వ్యవసాయ రంగంపై అధికారం, ఆదాయం మొత్తం కుబేరుల గుప్పిట్లో ఉంటుంది. ఇప్పటికే ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకాన్ని, దేశం ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను నిప్పుల కుంపట్లోకి నెట్టే చట్టాలను ప్రభుత్వం చేసింది. అంతులేని లాభాపేక్షతో అర్రులు చాచే బడా పెట్టుబడిదారీ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కార్మికవర్గాన్ని బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్‌ను కూడా ఈ కాలంలోనే ప్రభుత్వం ప్రకటించింది. సంక్షోభం కొనసాగుతుండగా, ఉత్పాదకాభివృద్ధి ఘోరంగా క్షీణిస్తున్న దశలో, ఉద్యోగాలు - ఉపాధి - ఆదాయాలు కోల్పోతూ ఉపాధి సంబంధాలు స్తబ్దుగా ఉన్న సమయంలో కార్మికులు - ఉద్యోగులపై వ్యయం సాధ్యమైనంత తగ్గించుకునే అవకాశాన్ని కార్పొరేట్లకు ప్రభుత్వం కల్పించింది. ఆర్థిక మాంద్యం కొనసాగుతుండగా. ఆహారం, చమురు, విద్యుత్, మందులు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు ద్రవ్యోల్బణం కారణంగా ఆకాశాన్నంటుతుండగా.. సాధారణ ప్రజానీకం సగటు ఆదాయాలు గణనీయంగా క్షీణిస్తున్న దశలో కార్పొరేట్లను సంతృప్తి పరచేందుకు మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సిద్ధపడింది. నిత్యావసరాల ధరల పెరుగుదల దానంతటదే జరగలేదు. విశాల ప్రజానీకాన్ని దోచుకునే ఉపకరణాన్ని కార్పొరేట్లకు, బడా వ్యాపారవర్గాలకు ప్రభుత్వం అందించింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడం, నాణ్యమైన ఉపాధి కల్పన తిరోగమనం వల్ల నిరుద్యోగం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఫలితంగా పేదరికం, దారిద్య్రం, ఆకలి పెద్ద ఎత్తున తాండవిస్తున్నాయి. 2022-23 బడ్జెట్ అదే వినాశకర విధానాలను బయట పెడుతోంది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో అంతర్భాగమే. ఈ మూడు దశాబ్దాలుగా రకరకాల పద్ధతుల్లో ప్రయివేటీకరణ ప్రక్రియ నడుస్తోంది. చివరకు 'జాతీయ మానిటైజేషన్ ప్రాజెక్టు' పేరున దేశ సంపదను పాలకుల సన్నిహితులకు అప్పనంగా దఖలుపరిచే ప్రక్రియ నడుస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ పైసా ఖర్చు లేకుండా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల పరం చేస్తున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంలో ఏమాత్రం పెట్టుబడి లేకుండా ఆదాయం భారీగా దండుకునే మార్గం కార్పొరేట్లకు సుగమం చేసింది ప్రభుత్వం.
పోరాటాలను ఉత్తేజితం.
విస్తతం చేసి వికేంద్రీకరించాలి
పైన పేర్కొన్న ప్రక్రియ నాణేనికి ఒకవైపు మాత్రమే. అన్ని వర్గాలకు చెందిన పీడిత ప్రజలు సర్వోన్నతమైన నూతన ఒరవడి పోరాటాలు చేయడం ఈ కాలంలో చూస్తున్నాం. 2020 మార్చి చివరి నుంచి కోవిడ్ పేరున అనేక నెలలపాటు దేశాన్ని అన్ని విధానాలుగా స్తంభింపజేశారు. లాక్డౌన్ విధించారు. ఏ రకమైన ఉద్యమాలను, సమీకృత కార్యక్రమాలను, ప్రజల కదలికలను, గుమికూడటం, ఉమ్మడి కార్యక్రమాలు, ప్రచారాలు వేటినీ అనుమతించలేదు సరికదా సంపూర్ణంగా నిషేధించింది ఈ ప్రభుత్వం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోవిడ్ మహమ్మారి తాండవించిన సమయంలోను అంటే 2020 నవంబరు 26న 20వ సార్వత్రిక సమ్మె దేశ వ్యాప్తంగా దిగ్విజయంగా జరిగింది.
1991 నుంచి జరిగిన అన్ని సార్వత్రిక సమ్మెల్లోనూ ఇదే అత్యంత ఉధృతంగా జరిగిన సమ్మె. అన్ని రకాల అడ్డంకులను, నిషేధాలను ఛేదించుకుని వికేంద్రీకరణ ద్వారా సరికొత్త మార్గాలను అన్వేషించి పని ప్రాంతాల్లో, పారిశ్రామికవాడల్లో సమ్మె జయప్రదంగా జరిగింది. పరిస్థితులు విసురుతున్న సవాళ్లను అత్యంత చైతన్యవంతంగా నూతన ఉత్సాహంతో సరికొత్త మార్గాల్లో సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కిందిస్థాయి కార్మికులు ఎంతో పట్టుదలగా పాల్గొని సమ్మె నిర్వహించారు. ఆ రోజు నుంచి రైతులు దేశ రాజధానిని నలువైపులా ముట్టడించి వినాశకర, దుర్మార్గమైన, ప్రజలందరి బతుకులను ఛిద్రం చేసే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని సంవత్సరం పైగా సాగిన చారిత్రాత్మక పోరాటాన్ని ప్రారంభించారు. అదే స్పూర్తిని కొనసాగిస్తూ వికేంద్రీకరణ పద్ధతుల్లో యావత్ కార్మికవర్గం అనేక సంఘీభావ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, చురుగ్గా పాల్గొంటూ రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించింది. దేశ రాజధాని చుట్టుపక్కల మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అన్ని ప్రాంతాల్లో సంఘ ప్రాతినిధ్యంతో నిమిత్తం లేకుండా అన్ని సంఘాల కార్మికులు ఈ పోరాటానికి మద్దతుగా నిలిచారు.
కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశవ్యాప్త చురుకైన సంఘీభావ కార్యక్రమాల ఫలితంగా కార్మిక సంఘాల ఐక్యవేదికకు రైతు సంఘాల ఉమ్మడి వేదికకు మధ్య బంధం బలపడింది. యావత్ దేశం పట్ల, ప్రజల పట్ల కార్పొరేట్ దోపిడీని కొనసాగించే దివాళాకోరు, దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. కార్మికవర్గం, రైతుల ఈ ఐక్యత, సంఘీభావ కార్యక్రమాలు జరిగే క్రమంలో నూతన ఒరవడికి దారితీశాయి. వినాశకర తిరోగమన విధానాల పట్ల ఉన్న వ్యతిరేకత అందుకు కారణమయిన పాలకులు, అధికారంలో ఉన్న రాజకీయవర్గాలపట్ల వ్యతిరేకతగా మార్పు చెందింది.
విస్తృతమవుతున్న అసమానతలు - సామాన్యుల కష్టాలు
ఈ ప్రక్రియ పర్యవసానంగా ''ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'' (వ్యాపార నిర్వహణకు అత్యంత సానుకూల పరిస్థితి - ఇది దేశ సంపదను, ప్రజలను అడ్డంగా దోచుకోవడమే) సూచీ ఆకాశాన్ని తాకుతుండగా... ఆకలి - సామాన్యుల జీవన ప్రమాణాల సూచీ పాతాళానికి దిగజారడాన్ని అందరూ గమనిస్తున్నారు. భారతదేశంలో ఆదాయాల వ్యత్యాసం మునుపెన్నడూ ఎరుగనంత హీనస్థితిలో ఉంది. ఏ నాగరిక సమాజంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అనుమతించరాని అంశం. అనేక సంస్థల విశ్వసనీయ సర్వేల్లో ఈ విషయాలను ధ్రువీకరించే గణంకాలు సాధికారికంగా వెలుగుచూశాయి. పైస్థాయిలోని ఒక్కశాతం మంది దేశ సంపదలో మూడు వంతుల మొత్తాన్ని కలిగి ఉన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న అట్టడుగు పేదలందరి సంపద 6శాతం మాత్రమే. 2020 నాటికి పైస్థాయి పది శాతం వద్ద 57శాతం సంపద పోగుపడింది. అట్టడుగు స్థాయి సగం దేశ జనాభా 13శాతం మాత్రమే కలిగి ఉంది. పై ఒక్కశాతం మంది 22శాతం దేశ ఆదాయాన్ని లాగేసుకున్నారు.
సంవత్సర కాలంగా దేశ జీడీపీ పెరుగుదల విలోమ దిశలో (నెగెటివ్) ఉంది. అంటే, దేశ ఆర్థికాభివృద్ధి తిరోగమనంలో ఉంది. ఇదే కాలంలో కార్పొరేట్ వర్గాలకు చెందిన పైస్థాయి బిలియనీర్ల సంపద మాత్రం 40శాతం పైగా పెరిగింది. వీరి సంపదలోని ఈ అనూహ్య పెరుగుదల ఏ విధమైన ఉత్పత్తి క్రమం నుంచి వచ్చింది కాదు. కేవలం ప్రజలను దేశ సంపదను అనేక ప్రభుత్వ పథకాల పేరున దోపిడీ చేసి పోగేసుకున్నారు. ప్రభుత్వమే తన అధికార, పాలనాపటిమతో పథకాలను రూపొందించి కార్పొరేట్ శక్తులకు ఆ అవకాశం కల్పించింది.
ఐక్య పోరాటాల ఆవశ్య కత
కార్మికులు, రైతులు ఇరువర్గాల వారు - తమ, తమ సమస్యలకు ఉమ్మడి కారణాన్ని కలిగి ఉన్నారు. బడా కార్పొరేట్లు (గుత్త పెట్బుడిదారులు) నడిపే ప్రభుత్వమే ఉమ్మడి శత్రువని, దానితో కలిసికట్టుగా తలపడవలసిందేనని గుర్తించారు. కార్మికులను, ప్రజలను, యావత్ దేశాన్ని నాశనం చేసే వినాశకర పాలనకు వ్యతిరేకంగా 2022 మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇకముందు జరగబోయే కార్మివర్గ ఐక్య కార్యాచరణకు నాంది. దేశ సంపదను కొల్ల గొట్టే గుత్త పెట్టుబడిదార్లకు (బడా కార్పొరేట్లకు) వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకం బతుకుదెరువు, హక్కుల కోసం జరిగే పోరాటం ఇది.
కార్మికవర్గం ఎక్కు పెట్టిన ఈ సమ్మె కేవలం జీవనోపాధి, హక్కుల పరిరక్షణ కోసం మాత్రమే కాదు. దుర్మార్గమైన దోపిడీ, వినాశనం నుంచి దేశాన్ని పరిరక్షించే ఉన్నతమైన రాజకీయ లక్ష్యంతో ఈ సమరశంఖం పూరించబడింది. పెత్తందారీ వినాశకర పాలనకు సవాలు విసిరేలా మార్చి 28, 29 సార్వత్రిక సమ్మెను నూతనోత్తేజంతో, అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిద్దాం! నయా ఉదారవాద రాజకీయాలతో తలపడి, ఓడించి దేశ ప్రజలను, దేశాన్ని కాపాడే ఉన్నత చైతన్యాన్ని రగిలిస్తూ ధృడ చిత్తంతో, కృతనిశ్చయంతో కదులుదాం!
- తపన్ సేన్