Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలువై ఉన్నాడే దేవ దేవుడు అంటూ ఓ కవి రాశాడు. ఎలా ఉన్నాడూ అంటే కోటి సూర్య ప్రకాశుడే అంటాడు. తలవంక అలవేలు, నెలవంక ఉన్నా రంటాడు. ఒక్క సూర్యుడి ప్రకాశంలోనే మనకు చంద్రుడు కనబడడు అలాంటిది కోటి సూర్యుళ్ళ ప్రకాశం ముందు కూడా చంద్రుడిని కవి చూడగలిగాడు. అది అతని భక్తి పారవశ్యం. మనమేమీ అనడానికి వీలు లేదు. ఇంతకీ ఆ కొలువు ఎవరిచ్చారని మనకు అనుమానపు డౌటు వస్తుంది. అసలు దేవుడి సృష్టికర్త మనిషే కాబట్టి ఆ కొలువు కూడా మనిషే ఇచ్చాడనుకోవాలి. కవి కూడా మనిషే కదా....!
ఇక మనిషి బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. కష్టే ఫలి అన్నారు. కష్టపడనిది ఏదీ రాదు అందుకే మహా కవి ఏదీ తనంత తానై నీ దరికి రాదు అన్నాడు. అంటే దాన్ని తెప్పించుకోవాలన్నా, చేరుకోవాలన్నా కష్టపడాలి. మానవ ప్రస్థానం చూసినా మనకర్థమయ్యేది శ్రమే అన్నింటికీ మూలాధారం అని. కాబట్టి మనిషి శ్రమ చేయాలి. ఏ వ్యాపారమో చెయొచ్చు లేదా తమ వృత్తులు చేసుకోవచ్చు. ఇక మనిషి దగ్గర మిగులు మొదలై, డబ్బు పుట్టిన తరువాత కష్ట జీవులతో పాటు తిష్ట జీవులూ పెరిగారు. కాబట్టి వాళ్ళు తమ పనులకు వేరే వాళ్ళను పెట్టుకుంటారు. కొలువు ఇస్తారన్నమాట. వాళ్ళేనా కొలువులిచ్చేది అంటే ప్రభుత్వాలు కూడా ఇస్తాయని తెలుసుకోవాలి. కొలువులు అనగానేమి వాటిలో రకములు ఎన్ని అని పాత కాలపు ప్రశ్న వేస్తే కలెక్టరు దగ్గరి నుండి కింద అటెండరు వరకు పనిచేసేదేదైనా కొలువే. అంతెందుకు అన్న రామారావు తాను ప్రభుత్వానికి ఓ ఉద్యోగిగా ఉన్నాడు కాబట్టి ఒక్క రూపాయి జీతం తీసుకున్నాడు. ఆ ఒక్క రూపాయి తీసుకోకపోతే ఆ ఉద్యోగం చెల్లదు. దాని వెనుక ఉన్న మర్మం అది. ఇక ఒక పూర్వ ముఖ్యమంత్రి తనకు తాను చీఫ్ ఎగ్జిగ్యూటివ్ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడేమో నేను చౌకీదారునని చెప్పే వాళ్ళూ వచ్చారు. అంటే కాపలాదారు డన్నమాట. ఎవరికి కాపలా అని అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. మంత్రి కొలువులిచ్చి కొందరిని సంతృప్తి పరిస్తే కార్పోరేషన్ల పదవులిచ్చి ఇంకొందరికి సంతృప్తినిస్తారు. అదంతా వాళ్ళ చేతిలోని పని. ప్రభుత్వాలు నడవాలంటే, నడపాలంటే మంత్రులు, ముఖ్య, ప్రధాన మంత్రులు, కలెక్టర్లు, ఇంకా ఇతర ఉద్యోగులు చాలా కావాలి. అందుకే చదరంగం ఆట ద్వారా రాజు నుండి భటులను, ఏనుగు, ఒంటె, గుర్రం లాంటి శక్తిగల జంతువులను, వారి, వాటి పనిని, శక్తులను మనకు తెలిసేలా కనిపెట్టారు. అందులో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి ఎందుకంటే అది రాజకీయ కొలువు కాబట్టి. ఇప్పుడు రాజులు పోయి, రాజ్యాలు పోయి ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి అని చదువుకున్నాం. నిజంగా వచ్చాయా లేదా అన్నది మరో చర్చ. అసలు పైన చెప్పుకున్న దేవుడి కొలువును కాపాడాలన్నా శుభ్రంగా పెట్టాలన్నా ఎందరో ఉద్యోగులు కావాలి. అందుకే ఎక్కడ కూడా ఈ కొలువులు లేనిది ఒక్క పనీ జరగదన్నది అందరమూ అంగీకరించవలసిన విషయం.
ఇక అధికారంలో కొలువై ఉన్నవాళ్ళు తిరిగి అదే కుర్చీల్లో కూచోవాలన్నా పనిచేసే ఉద్యోగులు కావాలి. శ్రమ దోపిడి చేస్తూ తక్కువమందితో ఎక్కువ పని చేయించుకోవడం ఈ వ్యవస్థ లక్షణం. ఇక అలా చేస్తూనే ఇంకొన్ని కొలువులు ఇస్తాము దానికి ప్రకటన విడుదల చేస్తాము అని ప్రకటిస్తుంటారు. సహజంగానే తక్కువ సంఖ్యలో మాత్రమే కొలువులు నింపుతుంటారు. బయట నిరుద్యోగ యువసేన ఆ కొలువుల కోసం రాంత్రింబవళ్ళూ చదివి, కోచింగులు తీసుకొని తయారుగా ఉంటారు ఆ కొలువులకు పెట్టే పరీక్షల కోసం. యుధ్ధ సైనికుల్లాగా సిధ్ధంగా ఉంటారు చెప్పాలంటే. ఫలానా పోస్టులు ఇన్ని పడతాయి అని ఓ అంచనాలో ఉంటారు. మంత్రుల మాటలు విని కొన్నే ఉద్యోగాలు నింపుతారని తెలిసి కొద్దిగా నీరసపడతారు. అయినా యుధ్ధం మాత్రం ఆపరు చదువుతూనే ఉంటారు. ఇంకొంత మంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతల్లాగా ప్రకటించిన ఉద్యోగాలు సరిపోవని ఇంకా కావాలని ఉద్యమాలు చేస్తారు. సందట్లో సడేమియా లాగా అంతకు ముందు అధికారం వెలగబెట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల వాళ్ళు కూడా మళ్ళీ కుర్చీలోకొచ్చేవరకూ ఈ యువకుల పక్షాన మాట్లాడతారు. అంతకు ముందు వాళ్ళేమి చేశారన్నది పక్కనబెడితే ఆమాత్రమైనా అడగడం ఆనందకరమే.
ఇక్కడ ఇంకో విషయయం చెప్పుకోవాలి. చట్టంలో చాలా లొసుగులున్నాయి అని చెబుతుంటారు కొందరు. అది వాడుకోగలిగేవారికి. ఓ పెద్దమనిషి చెప్పిన మాట జ్ఞాపకమొస్తోంది, అదేమంటే చట్టాన్ని వంచి లేదా వంగి పోవాలిగాని దాన్ని తుంచి కాదు అన్నది ఆయన మాట. చట్టాన్ని బ్రేక్ చేయొద్దు, బెండ్ చేయి అన్నాడు. అదే విధంగా ఈ కొలువుల అధికారిక ప్రకటనల్లో కూడా కొన్ని లొసుగులు పెట్టి వదుల్తారు నిరుద్యోగుల మీదికి. మామూలుగానే పోటీ పరీక్ష జరుగుతుంది. రాసి వచ్చిన అలసట కూడా తీరకముందే ఎక్కడో ప్రశ్నపత్రం లీకైనట్టుగా వార్త వస్తుంది. దాని పైన ఎంక్వయిరీ నడుస్తుంది. అది నిజమైతే మళ్ళీ పరీక్ష పెడతారు. అదే హాల్ టికెట్టుతో పరీక్ష రాయొచ్చంటారు కాని మళ్ళీ చదవాలి, పరీక్ష కేంద్రానికి పోవాలి, ఆరోగ్యాలు, వసతులు ఇలా చాలా సమస్యలకు సమాధానాలు దొరకవ్. అంతా సవ్యంగా జరిగి కొలువులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించగానే కొందరు కోర్టుకు పోతారు. తమకు అన్యాయం జరిగింది అనుకున్న వాళ్ళకు ఆ హక్కు ఎప్పుడూ ఉంది. ఇదంతా ముందు అనుకున్న ప్రకారమే నడుస్తోందని ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. మొత్తం మీద మంచిరోజు చూసుకొని కొలువులో చేరదామన్న యువతకు మళ్ళీ నిరాశ ఎదురవుతుంది. ఇది ఈ వ్యవస్థ లక్షణం, కొలువివ్వడమంటే అంత వీజీ కాదు.
కుర్చీలో కొలువై ఉన్నవాళ్ళు కొలువులకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులతో ఆటలాడడం అన్నిచోట్లా ఉంది. అది ఓ వికృత క్రీడ. జిందగి హర్ కదం ఎక్ నయా జంగ్ హై అని ఓ కవి రాసినట్టు ఈ జీవితమే ఓ పెద్ద యుద్ధం. దాంట్లో యుద్ధం చేసేటోళ్ళు, ఆడుకునేవాళ్ళూ అందరూ ఉంటారు. అలసిపోకుండా యుద్ధం చేసి కొలువు సంపాదించడమే ఏకైక మార్గం. ఎన్నో కొలువులిస్తున్న ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి తమకున్న ఇద్దరు ముగ్గురు మిత్రులని ఆనందింపజేయడం కోసం అధికారంలో కొలువున్న వాళ్ళు కొలువు లేకుండానే డబ్బులు సంపాదించే మార్గాలను చూపిస్తుంటారు.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298