Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మానవాళిలో అత్యున్నతమైన మనసు ఆలోచించడం మానివేసింది. నేనెరిగినంతలో అత్యంత బలీయమైన గుండె కొట్టుకోవడం మానేసింది' అని ఎంగెల్స్, మార్క్స్ మిత్రులకు లేఖల ద్వారా తెలియజేశాడు. లండన్‌లో 1883 మార్చి 14న ఉదయం తన పడకగది నుండి అధ్యయనం చేసే గదిలోకి మార్క్స్ అడుగుపెట్టి కుర్చీలో కూర్చుని కూలబడిపోయాడు. శాశ్వతంగా తన అధ్యయనానికి వీడ్కోలు పలికాడు. 1883 మార్చి 17 శనివారం లండన్‌లోని హైగేట్ శ్మశానంలో మార్క్స్‌ను సమాధి చేశారు. ''ఆయనపేరు, అలాగే ఆయన చేసిన కృషి యుగయుగాలుగా నిలిచిపోతుంది'' అన్న ఎంగెల్స్ నివాళి ప్రసంగం నేడు నిజమయ్యింది.
మార్క్స్ మరణించి 134 సంవత్సరాలు దాటింది. కానీ ఆయన మానవ జాతికి అందించిన తాత్విక, ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక భావజాలం సమస్త శ్రామిక శక్తులకు నిత్య చైతన్యాన్ని అందిస్తూనే ఉంది. ఆయన భావాలు మానవ జాతికి లభించిన గొప్ప సంపద. దాని ప్రాముఖ్యత అంచనా వేయడం కష్టం. మానవ సంస్కృతీ చరిత్రలో మార్క్సిజంతో ఏస్థాయిలోనైనా సరే పోల్చదగినది ఏదీలేదు. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంలోని సారాంశానికి, వాస్తవికతను గుర్తించే దాని పరిశోధనా పద్ధతి దృష్ట్యా సంక్షిప్తంగా నిర్వచించాలంటే, స్థిరమైన పిడివాద వ్యతిరేకత, స్థిరమైన చరిత్రాత్మకత అని నిర్వచించవచ్చు.
మార్క్స్ మనకందించిన తాత్వికాంశాలు, పెట్టుబడి, చారిత్రక భౌతిక వాదం మొదలైన విషయాలన్నీ సమాజ పరిణామ క్రమాలలోని అంతర్ సత్యాలను అర్థం చేయిస్తుంది. ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూపెడుతాయి. అంతే కాదు, ఎలా మార్చుకోవాలో కూడా స్పష్టంగా వివరిస్తాయి. దోపిడీ, పీడనలేని సమసమాజ నిర్మాణానికి అస్త్రశస్త్రాలను అందిస్తాయి. కమ్యూనిస్టు సమాజంలో కన్నీళ్ళకు, కష్టాలకు తావుండదు. అదొక సుందర స్వప్నం. అనివార్యపు సత్యం. ఈ విషయాలు కమ్యూనిస్టులు ఎంతోకాలం నుండి చెబుతున్నారు. ఎప్పుడు కల నిజమయ్యేను! అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కొందరు నిరాశ చెందుతారు. నేటి పరిస్థితులలో, మత విద్వేషాలు, ధన రాజకీయాల భ్రమల్లో కూరుకుపోయిన వాళ్ళు మార్క్సిజాన్ని హేళన చేస్తూ మాట్లాడతారు. అయితే సత్యానికి మసిపూసి ఎల్లకాలము దాచలేరు. అందుకనే మార్క్స్... ''సునాయాసంగా సఫలీకృతం అయ్యే ప్రయత్నం కాదు నాది, శాంతియుతంగా జరిగేదీ కాదు... నా అవిశ్రాంతతకు అదే కారణం. సమస్త విశ్వాన్ని నేను నా విశ్వంలోకి ఆహ్వానిస్తున్నాను, నా విశ్వం సమస్త మానవ జాతి కళ్ళలో వెలిగే కాగడా కావాలి, శతాధిక కళల నుండి నేను విజ్ఞానాన్ని గ్రహించాల్సి ఉంది. ఇక్కడ బుద్ధిజీవులు, మంచుగడ్డల్లో చచ్చిన శవాలై తిరుగుతున్నారు. ఇప్పట్లో వాళ్ళకు నేనర్థం కాను...
కలల్ని నిజం చేయటానికి మనం
అనంత జాగృతయాత్ర చేస్తాం
కలల్ని పండించుకోవటానికి మనం
ముందుకు మునుముందుకు కదుల్తాం
ఒక నవ్య సృష్టి జరుగుతుంది
ఒక కొత్త వ్యవస్థకు ద్వారాలు తెరుచు కుంటాయి.'' అని
తన స్వప్నం నిజమవుతుందని, ఈ సత్యం రుజువవుతుందని అనంత విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. ప్రపంచాన్ని నేడు చూసినట్లయితే, మార్క్స్ నూటాయాభైయేండ్ల క్రితం చెప్పిన విషయాలన్నీ జరుగుతున్న సంఘటనల్లో మనం గమనించవచ్చు. మార్క్స్ క్యాపిటల్‌లో చెప్పినట్టుగానే పెట్టుబడిదారీ విధానంలో లాభాల కోసం విపరీతమైన సరుకుల ఉత్పత్తి జరిగి సంపద పోగుపడి, అదనపు పెట్టుబడి ఉత్పన్నమవుతుంది. క్రమంగా ఇది కేంద్రీకృతమై గుత్తసంస్థలు ఏర్పడి ప్రపంచాన్ని మార్కెట్లుగా పంచుకుంటుందని, దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ సామ్రాజ్యవాదాన్ని సృష్టిస్తుందనేది మార్కిస్టు విశ్లేషణ. ఇదే ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను విస్తరించడంగా మనం చూస్తున్నాం. ఈ ఆర్థిక విశ్లేషణ లోంచే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలనూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు సరుకుల ఉత్పత్తికీ, అమ్మకాలకు ఏ సంబంధమూ లేని ద్రవ్య పెట్టుబడి ప్రవాహరూపంలో ప్రపంచమంతా ప్రవహిస్తున్నది. ఇది ఏ దేశాల అదుపులోనూ ఉండదు, ఏ దేశానికీ ప్రాతినిధ్యము వహించదు. త్వరగా లాభాలు పోగేసుకోవడమే దాని లక్ష్యం. ఈ కారణంగా పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోయి, సరుకుల అమ్మకాలు లేక నష్టాల్లోకి పోయే సంస్థల వల్ల కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి సంక్షోభం మొదలవుతుంది. ఈ ఫైనాన్స్ పెట్టుబడి మన దేశం నుండి తరలిపోతుందనే భయంతో పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం దేశీయ వనరులను ప్రభుత్వాలు దోచిపెడతాయి. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేయటాన్ని మనం చూస్తున్నాం. ప్రజల కోరికలకూ, ప్రయోజనాలకు, ప్రభుత్వ వాగ్దానాలకు పొసగని స్థితి వస్తుంది. ఆర్థిక చక్రబంధనంలో చిక్కుకున్న దేశాలలో సమాజం అతలాకుతలమవుతుంది. మతకల్లోలాలు, తెగల తగవులాటలు, ఛాందస వీరంగానాల్లో ప్రజలు ఇరుక్కుపోతారు. ఆర్థిక క్షీణత, నిరనుద్యోగం, ఆకలి, అసమానతలు, ఈ రకరకాల భావాలకు ప్రాణం పోస్తోయి. జాతీయ దురభిమానాలు, మత విద్వేషాలు, కుల వివక్షతలు, ప్రాంతీయ విభేదాలు, వేష, భాషల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. వీటన్నిటి నుండి బయటపడే ఏకైక మార్గం శ్రామికులు సంఘటితమై పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగిస్తున్న విధానాలపై పోరాడటమే తప్ప మరో మార్గం లేదు. పెట్టుబడి చేసే మాయాజాలాన్ని, దాని విశ్వరూపాన్ని మార్క్స్ ఎలా వివరించాడో, అది ఇప్పుడు మన కండ్లముందు కనపడుతోంది. మితవాద, ఛాందసశక్తులు ప్రపంచంలో పెరుగుతున్న తీరును చూస్తున్నాము. అంతే కాదు, విపరీతమైన ఘర్షణలను, వైరుధ్యాలను గమనించవచ్చు. ప్రపంచ వ్యాపితంగా తలెత్తిన సంక్షోభాలు, పర్యవసానంగా సాగుతున్న సామాజిక అలజడులు, వివక్షతలు, అసమానతలు, హింస, విధ్వంసాలు అన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాల ఫలితాలేనని మార్క్ ఎప్పుడో వివరించారు.
మార్క్స్ వర్థంతి సందర్భంగా మతం గురించి ఆయన ఎలా వివరించాడో ఒకసారి చూద్దాం... మనిషే మతాన్ని సృష్టిస్తాడు. కానీ మతం మనిషిని సృష్టించదనే విషయాన్ని మతం అంగీకరించదు. 'భగవంతుడనే భావన మానవ ఆకాంక్షల ప్రతిక్షేపణ తప్ప వేరేమీ కాదు' అని మార్క్స్ పేర్కొన్నాడు. అంటే మనిషి నిజ జీవితంలోని ఆకలి, రోగాలు, అన్యాయం, దోపిడీ, హింస మొదలైన వాటిని తను తొలగించలేక, వీటన్నింటినీ తొలగించగల సర్వశక్తివంతమైన దైవాన్ని కల్పించుకున్నాడు. అప్పుడు ఇక తన బాధ్యత అంతా ఆ దేవునిదే అనుకుని కొంత ఊరట చెందాడు. దేవుని మీద ఎంత వరకు భారం వేసాడో అంతమేరకు పరిస్థితులను మార్చగల తన శక్తి యుక్తులను నిరుపయోగం చేసుకున్నాడు. దుఃఖాలు, బాధల నుండి దేవుడు విముక్తి చేస్తాడని మతం బోధిస్తుంది. దీంతో అసలు దుఃఖకారకులు (దోపిడీ దారులు) బతికిపోతారు. అసలు విషయమేమంటే వాటి నుండి విముక్తి పోందేశక్తి ప్రజల చేతుల్లోనే ఉంటుందని మార్క్సిజం ఎరుకపరుస్తుంది.
మతం వల్ల, సరుకుల వల్ల మనుషులు పరాయీకరణకు గురయి నిస్సహాయకులుగా మారిపోతారు. మనుషులు తమ ఊహల్లో సృష్టించుకున్న కొన్ని భావనల నుండి దేవుళ్లు మానవతీతమైన సర్వశక్తిమంతమైన వారిగా కనిపిస్తారు. వాళ్ళు మనుషులతో సంబంధాలు పెట్టుకుంటారు. మనుషులు సృష్టిస్తున్న సరుకులు కూడా ఇలాంటివే. సృష్టించబడిన వెంటనే సరుకులు కొన్ని అతీంద్రియ శక్తులు సంతరించుకుంటాయి. వీటిపట్ల ఆరాధనా భావం పెరుగుతుంది. దీన్నే మార్క్స్ ఫెటిషిజం అంటారు. మన ఆవిష్కరణలు, అభివృద్ధి అంతా జడవస్తువులకు మేధోశక్తులు ఉన్నట్టు భ్రమింపజేస్తాయి. ఫలితంగా మనిషి జీవితం జడంగా మారిపోతుంది. సరుకుల ఆరాధన పెరుగుతుంది. అలాగే తాను సృష్టించిన దేవుడికి, మతానికి మానవుడే దాసుడవుతాడు. తాను చేసిన వస్తువు తనకు దూరంగా పోయి కనపడదు, దక్కదు. దేవుడూ అంతే, కనపడడు, కష్టాలు తొలగించడు. కానీ ఆరాధన సాగుతూనే ఉంటుంది. మనుషులు సరుకుల స్థాయికి దిగజారిపోతారు. ఇదీ మతం ద్వారా మనిషిని పరాధీనున్ని చేయడమంటే. దోపిడీ వ్యవస్థ మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మనదేశంలో పాలకులు, ప్రజల బాధలకు ఓదార్పు, ఉపశమనాలకు ఆసరా అయిన మతాన్ని దేవున్ని వాడుకుంటూ ఉద్వేగపూరిత విద్వేషాలను రెచ్చగొడు తున్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుతున్నారు. దోపిడీని స్వేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. శ్రామికులను అణచివేయచూస్తున్నాయి. అయినా ప్రతిఘటన సాగుతూనే ఉన్నది. వివిధ స్థాయిలలో ఘర్షణ జరుగుతూనే ఉంది. ఈ వైరుధ్యం దోపిడీ ఉన్నంత కాలం ఉంటుంది. వస్తువుల ఉత్పత్తి సామాజికంగా జరుగుతూ, ఉత్పత్తిపై యాజమాన్యం వ్యక్తుల చేతిలో ఉన్నంత కాలం, శ్రామికుల దోపిడీ కొనసాగుతుంది. అది పరిష్కారమైనప్పుడు మాత్రమే, అంటే ఉత్పత్తి సాధనాలపై ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యాన్ని తొలగించి సామాజిక యాజమాన్యంలోకి తీసుకురావడం ద్వారా పరిష్కరించబడుతుంది. అప్పుడు ఈ అన్ని సంక్షోభాలు, సమస్యలు రూపుమాసిపోతాయి. అప్పటి వరకు నిరంతరంగా చైతన్యయుతంగా పోరాటం చేయటమే మనముందున్న కర్తవ్యం. ఈ రకమైన వాస్తవిక అంశాలపై ఆధారపడి చేసిన విశ్లేషణా సారాంశమే మార్క్సిజం. ఇది ఊహతోనో, కల్పనగానో చెప్పిన విషయం కాదు. సమాజంలో ఉన్న, కొనసాగుతున్న దానిని, తన జీవితమంతా శోధించి వెలికి తీసాడు మార్క్స్. మానవ మేథస్సు సృష్టించిన ప్రతిదాన్ని మార్క్స్ స్వయంగా పునరాలోచన చేసి, విమర్శకు గురిచేసి కార్మికోద్యమంతో సరిచూశాడు. అప్పటివరకు వ్యవస్థలో ఉన్న అన్ని దుర్భ్రమలను తొలగించి నిర్ధారణలు చేశాడు.
ఇవి కేవలం ఆర్థిక నిర్ధారణలే కాదు, ప్రపంచంలో మానవ కార్యకలాపాల మొత్తానికి సంబంధించినవి. ప్రకృతిలోని పదార్థ పరిణామానికి సంబంధించినవి. మానవున్ని మహౌన్నతంగా నిలబెట్టే సాధనాలు. మార్క్స్ భావాలు పాతబడిపోయాయి, అవి ఇప్పుడు పనికిరావని కొందరంటారు. కానీ ఆ మాటలే పనికిరాకుండా పోయి, నేడు తలెత్తుతున్న సంక్షోభాలు, ఆకలి, ఆవేదన, ఆందోళనలు అన్నింటిలోనూ మార్క్స్ చెప్పింది నిజమని రుజువు అవుతూనే ఉంది. మానవాళి విముక్తికోసం తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసి, గుండె కొట్టుకునేంతవరకు శ్రమించిన మహౌన్నతుడు మార్క్స్. నిత్య దారిద్య్రాన్ని, అనారోగ్యాన్ని అనుభవిస్తూ కూడా లక్ష్యం కోసం పరితపించినవాడు మార్క్స్. ''అతడు తన కోసమే శ్రమించినట్లయితే బహుశ అతడు గొప్ప పండితుడుగా, గొప్ప జ్ఞానిగా, మంచి కవిగా ప్రసిద్ధి చెందవచ్చు. అతనెప్పటికీ పరిపూర్ణుడు, సిసలైన గొప్ప వ్యక్తిగా ఉండజాలడు. తోటివారి పరిపూర్ణత కోసం, మేలు కోసం శ్రమించడం ద్వారానే మనిషి పరిపూర్ణతను సాధించగలుగుతాడు'' అని చెప్పిన మార్క్స్, అదే మాటకు కట్టుబడి పరిపూర్ణ మానవుడిగా జీవించిన అమరుడు. అతడు మనకందించిన విశ్లేషణలను అధ్యయనం చేస్తూ నిత్య చైతన్యాన్ని పొందగలగటమే ఆయన వర్థంతి స్మరణకు అర్థం.
- కె. ఆనందాచారి
సెల్:9948787660