Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2,56,958.51కోట్ల బడ్జెట్లో వెనుకబడిన తరగతులైన వివిధ చేతివృత్తుల ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. గతంతో పోలిస్తే పెంచినట్లు కనిపించినా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు పెంచాలి. కానీ రూ. 5,697 కోట్లు మాత్రమే కేటాయించి వివిధ ఫెడరేషన్లకు భిక్షం వేసినట్లుగా నిధులు ఇచ్చారు. వృత్తులు కోల్పోయిన బడుగు లకు బడ్జెట్లో నిధులు లేవు. ప్రత్యామ్నాయ ఉపాధి, వృత్తి శిక్షణకు నిధులు కనబడవు. మొత్తం బీసీల సంక్షేమా నికి కేటాయించిన బడ్జెట్ 2022-2023 రూ.5,697 కోట్లు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు కేటాయించిన బడ్జెట్ రూ.600 కోట్లు. గత 2021-2022 బడ్జెట్లో రూ.5,522కోట్లు. బీసీ, ఎంబీసీలకు కలిపి రూ.500 కోట్లు
2022-2023 గాను
వివిధ ఫెడరేషన్లకు కేటాయింపులు:
రజక ఫెడరేషన్ రూ.50 కోట్లు. నాయీ బ్రాహ్మణ రూ. 50 కోట్లు. వడ్డెర ఫెడరేషన్ రూ.3 కోట్లు. పూసల ఫెడరేషన్ రూ.3 కోట్లు. వాల్మీకి బోయ ఫెడరేషన్ రూ.2.50 కోట్లు. భట్రాజు ఫెడరేషన్ రూ.2 కోట్లు. మేదరి ఫెడరేషన్ రూ.3 కోట్లు. విశ్వబ్రాహ్మణ రూ.3 కోట్లు. కుమ్మరి ఫెడరేషన్ రూ.3 కోట్లు. ఉప్పర ఫెడరేషన్ రూ.2 కోట్లు. 2021-2022 బడ్జెట్లో పై ఫెడరేషన్లకు కేటాయింపులు చేయలేదు.
1.సేవావృత్తిదారులు: రజకులకు సంబం ధించి ఆధునాతన దోభీఘాట్లు నిర్మిస్తామని తెలిపారు. గత మూడున్నర సంవత్సరాల కాలంలో 7 చోట్ల మెకనైజ్డ్ దోభీఘాట్లు నిర్మిస్తామని చెప్పి కేవలం రెండు చోట్ల సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌లో మాత్రమే పూర్తి చేశారు. మిగతా నల్లగొండ, ఆలేరు, ఆదిలాబాద్, ఇంజాపూర్, సికింద్రా బాద్‌లలో త్వరితగతిన వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో మోడ్రన్ దోభీఘాట్లకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. గత రెండు సంవత్సరాలుగా దోభీఘాట్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదు. రజక నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సబ్సిడీకి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. సుమారు 6వేల సొసైటీలకుగాను లక్ష మంది సభ్యులు కలిగిన వారికి సొసైటీ రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి నిధులు కేటాయించక పోవడం అత్యంత శోచనీయం. వెనుకబడిన తరగతులపట్ల ప్రభుత్వ తీరు కేవలం మాటలతో కడుపునింపే విధంగా ఉందని వివిధ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. బడ్జెట్‌ను సవరించి ఫెడరేషన్ల, కార్పొరేషన్ల వారీగా నిధులు పెంచాలని వివిధ వృత్తి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
2. ఎంబీసీ కార్పొరేషన్: గత సంవత్సరం కేటాయింపులు, ఖర్చులు అత్యంత వెనుకబడిన ఎంబీసీ కార్పొరేషన్, 36 సంచార కులాల జాతులకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.200 కోట్లు కేటాయింపులు, కానీ ఖర్చు మాత్రం చేయ లేదు. సంచార జీవితం అనుభవిస్తున్న 36 కులాల ఆర్థికాభివృద్ధి కోసం ఎలక్ట్రిక్ ఆటోలు, వ్యక్తిగత రుణాలు, స్కిల్ డెవెలప్మెంట్ శిక్షణ ఎంతమందికి ఇచ్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. 2017లో ఏర్పడిన ఈ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు ప్రతియేటా కేటాయిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం నిరూపించ లేదు. అందుకు గాను రుణాలు కొద్దిమందికి మాత్రమే అందు తున్నాయి. ఎంబీసీల అభివృద్ధి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సాగుతున్నది. ఎంబీసీల అభివృద్ధికి యేటా రూ.1000 కోట్లతో ఉపాధి అవకాశాలు చూపిస్తామని చెప్పినా, అది అమలుకు నోచుకోవడం లేదు. రక్షణచట్టం కల్పిస్తా మన్నారు. ఈ అంశం దరిదాపున కూడా లేకుండా పోయింది. కార్పొరేషన్, ఫెడరేషన్లు నేటికీ పాలకవర్గాలు లేకుండానే ఉన్నాయి.
3. బీసీ కార్పొరేషన్‌కు కేటాయింపులు: రూ.200 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అవి కేవలం అధికారుల జీతభత్యాలు, కార్పొరేషన్ నిర్వాహణకు మాత్రమే సరిపోతున్నాయి తప్ప, బీసీల సంక్షేమానికి ఎలాంటి ఉపయోగం జరగడం లేదు. 2018 ఎన్నికల సందర్భంగా బీసీ, ఎంబీసీ 11 కులాల ఫెడరేషన్లకు సంబంధించి జీవో నెం 190 ప్రకారం 5,70,000 మంది రూ.5లక్షల నుండి రూ.30 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు మంజూరు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. రూ.50 వేల చొప్పున, కేవలం 40 వేల మందికి మాత్రమే రుణాలు అందజేశారు. గత 7సంవత్సరాలుగా బీసీ కార్పొరేషను ప్రభుత్వం ఉత్సవ విగ్రహంగానే చూస్తోంది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో అన్ని రాజకీయ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో 2 రోజులపాటు సమావేశం జరిపి 210 తీర్మానాలు చేశారు. అందులో బీసీ సబ్‌ప్లాన్ తెస్తామని హామీ ఇచ్చారు. అదికూడ నీటిమూట గానే అయ్యింది.
- పి. ఆశయ్య