Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజకీయాలలో మతవాద- మితవాద రాజకీయాల ప్రాబల్యం కొనసాగుతున్నదని ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలోనూ బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. మరీ ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదేండ్లు పూర్తి చేసుకుని మళ్లీ ఎన్నికయ్యారంటే అది మూడున్నర దశాబ్దాలలోనే మొదటిసారి. ఆ యోగి అయోధ్య రామమందిరం వివాదానికి కేంద్ర బిందువైన గోరఖ్‌పూర్ మఠాధిపతి కావడం బీజేపీ సంఘ పరివార్ రాజకీయాలకు కచ్చితమైన ఉదాహరణ. ఆయన హయాంలో యూపీలో మతతత్వ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. హత్రాస్, ఉన్నావ్, లఖింపూర్‌ఖేరీ వంటి అత్యాచారాలు హత్యలు జరిగాయి. గోమాంసం పేరిట ప్రాణాలు తీసిన ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే అట్టడుగున యూపీ ఉందని వారి ఆధ్వర్యంలోని నిటి ఆయోగ్ ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవడంలో ఘోరవైఫల్యం ప్రపంచాన్ని కలవరపర్చింది. గంగానదిలో శవాలు తేలడం గగుర్పాటు పుట్టించింది. ఇలాటి ఘోరాలు ఎన్ని జరిగితేనేం? యోగి శాంతి భద్రతలను కాపాడిన యోధుడుగా బడామీడియా హౌరెత్తించింది. యూపీలో యోగి గెలిస్తేనే రేపు కేంద్రంలో నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని కాగలరని హౌంమంత్రి అమిత్‌షా స్వయంగా ప్రకటించారు. ఈ ఫలితాల తర్వాత ప్రధాని విజయోత్సవ ప్రసంగం యూపీ మహాకథనం కొనసా గింపే. 2017లో యూపీలో గెలిచినప్పుడే 2019 లో తమ విజయం ఖాయమైందని జ్ఞానులు అన్నారనీ, ఇప్పుడు కూడా అదే పునరావృత మవుతుం దని ఆయన ప్రకటించారు. ఈ ఫలితాల చుట్టూ బీజేపీ సంఫ్‌ు పరివార్ వ్యూహం ఎలా ఉండేది అర్థం కావడానికి ఒక సంకేతమిది.
బీజేపీ విజయానికి మరోవైపు..
అన్ని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్టు బీజేపీ కీలక విజయం సాధించినా యాభై వరకు స్థానాలు తగ్గాయి. యూపీ నుంచి ఏర్పడిన ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఊహించినదానికి మించి విజయం సాధించినా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ దామి ఓడిపోయారు. యూపీలోనూ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌మౌర్య సహా 11మంది మంత్రులు ఓడిపోయారు. మరోవంక సమాజ్‌వాది పార్టీ పదిశాతం ఎక్కువగా 32శాతం ఓట్లు సాధించి రెండున్నర రెట్లు సీట్లు పెంచుకోగలిగింది. నలభైóఒక్క స్థానాలలో కేవలం అయిదువేల లోపు ఓట్ల తేడా. అదే సమయంలో 2007-12మధ్య పాలన సాగించిన మాయావతి బిఎస్పి అన్నిచోట్లాపోటీ చేసి ఒక్క స్థానానికి, 12.7 ఓట్ల శాతానికి క్షీణించింది. ప్రియాంక గాంధీ ప్రచారార్భాటం కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోగా 2.4శాతం ఓట్ల దగ్గరే ఆగిపోయింది. 93స్థానాల్లో పోటీ చేసిన ఒవైసీ మజ్లిస్ ఒక్కశాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ములాయం క్రియాశీల జోక్యం తగ్గినా, అఖిలేష్ బీజేపీకి కొత్త సవాల్‌దారుగా ముందుకొచ్చారనే అంచనా బలపడింది. ఆయన కూడా ముందునుంచి రంగంలోకి దిగి సమగ్ర వ్యూహంతో వ్యవహరించి ఉంటే, బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ కలుపుకొని లౌకికతత్వం కోసం గట్టిగా పోరాడితే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమై ఉండేవి. ఎస్పినే ప్రధాన ప్రత్యర్థిగా చూసిన, మాట్లాడిన మాయావతి బీజేపీపె రాజకీయ సైద్ధాంతిక పోరాటం దాదాపు చేపట్టలేదు. ఈ రెండు పార్టీలనూ కులంపై ఆధారపడినవిగా విమర్శించిన బీజేపీ వాస్తవంలో తన హిందూత్వ వ్యూహాలను తీవ్రంగా అమలు చేయడమేగాక కులాల వారి పొందికల విషయంలోనూ చాలా జాగ్రత్త పడింది. రైతాంగ ఉద్యమం పశ్చిమ యూపీలో బాగా ప్రభావం చూపిస్తుందన్న అంచనాలు నిజమై ఆర్ఎల్డీ తగు సంఖ్యలో స్థానాలు తెచ్చుకోవడమే గాక జయంత్ చౌదరి నాయకుడుగా స్థిరపడ్డారు. గత శాసనసభలో అతి తక్కువగా 24 మాత్రమే ఉన్న ముస్లిం ఎంఎల్ఎల సంఖ్య ఇప్పుడు 37కు పెరిగింది. వీరంతా ఎస్పి, ఆర్ఎల్డిల తరపున నెగ్గిన వారే.
బీజేపీ ఘన విజయాన్ని కొనియాడే శక్తులూ మోడీ, షాలకు యోగి ఆదిత్యనాథ్ తోడైనారని త్రిమూర్తులుగా కీర్లించడం ఎలాగూ జరుగుతున్నది. తీవ్రమైన మెజారిటేరియనిజం అంటే హిందువులే పాలించాలన్న హిందూత్వ రాజకీయం ముస్లిం వ్యతిరేకత షరా మామూలుగా నడిచాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రచారానికి తోడు వారణాసిలో మోడీ విశ్వేశ్వరాలయ విస్తరణ పనులు ఎంత భారీ ప్రచారంతో ప్రత్యక్ష ప్రసారంతో చేసిందీ చూశాం. ఈ ఎన్నికలు 80-20శాతం మధ్య జరుగుతున్నాయని యోగి పరోక్షంగా హిందూ ముస్లిం పోరాటంగా చెప్పనే చెప్పి తర్వాత ఏదో సమర్థించుకున్నారు. సకల సంస్థల ప్రయివేటీకరణ విధానాలతో కార్పొరేట్ల ఆర్థిక మద్దతు అంగబలం, బడా మీడియాను ప్రలోభాలతో ఒత్తిళ్లతో లోబర్చుకుని అనుకూల ప్రచారానికి వాడుకోవడం ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చాయి. బీజేపీకి గెలుపులో సాసుకూల కోణంలో ఒకే అంశం ఉచిత రేషన్.బీజేపీ వ్యతిరేక కూటమి గురించి ప్రాంతీయ నేతలు జోరుగా మాట్లాడినా అతి కీలకమైన యూపీలో ఓట్ల చీలిక నివారించడానికి, కనీసం తగ్గించడానికి ప్రయత్నించలేదు. ఫలితాల తర్వాత మాయావతి అఖిలేష్ ప్రియాంకలలో ఎవరూ ఆ సత్యాన్ని గుర్తిస్తున్నట్టు మాట్లాడలేదు.
ఆప్ ఘన విజయం, కేజ్రీ తీరుతెన్నులు
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం 117లో 92 స్థానాలు సాధించి పాలక పక్షమైన కాంగ్రెస్, అకాలీదళ్‌లను తుడిచిపెట్టడం మరింత ప్రచారం పొందింది. రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పంజాబ్‌లో బీజేపీ ఊసేలేకుండా పోయింది. తన ప్రాణాలు తీసే ప్రయత్నం జరిగిందంటూ ప్రహసనం నడిపినా మోడీ మంత్రం పనిచేయలేదు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్‌ను కూడా ప్రజలు ఆదరించలేదు. ఏమైనా సరైన ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం ఉన్నచోట ప్రజలు ఆదరిస్తారనడానికి పంజాబ్ ఫలితాలే ఉదాహరణ. ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాలలో అధిóకారానికి రావడం ఇదే మొదటిసారి. 2017లో 20 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా వచ్చిన ఆప్ ఎప్పటినుంచో పంజాబ్‌ను తదుపరి లక్ష్యంగా చేసుకుంది. దీర్ఘకాలంగా పాతుకుపోయిన రెండు సంప్రదాయ పార్టీల స్థానే నూతనత్వంతో కూడిన ఆప్‌ను ఓటర్లు ఘనంగా గెలిపించడం అర్థం చేసుకోదగిందే. గోవాలోనూ ఆప్‌కు స్థానాలు వచ్చాయి గనక ఇక మరో రాష్ట్రంలో వస్తే జాతీయ హౌదా లభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇందుకోసం గుజరాత్, హిమచల్ ఎన్నికలపై దృష్టి పెడతామంటున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, వైద్యం వంటి పౌరసదుపాయాల కల్పనలో మంచి ఫలితాలు సాధించడం పంజాబ్ ప్రజలు దాన్ని ఎంచుకునేలా చేశాయి. ఆప్ రైతాంగ ఉద్యమం సమయంలో సానుకూల వైఖరి తీసుకుంది గాని బీజేపీ మతతత్వాన్ని అంత గట్టిగా వ్యతిరేకించడంలేదనే అభిప్రాయం ఉంది. గత కొద్ది మాసాలలోనూ కేజ్రీవాల్ మోడీ పేరెత్తిందే తక్కువ. ఆప్ ప్రధానంగా కాంగ్రెస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆ శూన్యంలో తను ప్రవేశిస్తున్నదని, బీజేపీకి కూడా అది అంత అభ్యంతరంగా లేదని అంటున్నారు. ఈ ఫలితాల తర్వాత ఆప్‌ను అభినందించి సహకారం ఇస్తామని మోడీ ప్రకటించగా కేజ్రీ ధన్యవాదాలు చెప్పారు. శరద్‌పవార్ మినహా తక్కిన ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రులు పెద్దగా అభినందించలేదు. భగవంత్‌మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకముందు ఆయనే వెళతారనే ఊహలు కూడా వినిపించేవి. ఢిల్లీ కన్నా పంజాబ్ పెద్దది, ఎక్కువ అధికారాలు గల ప్రభుత్వం గనక కేజ్రీవాల్ ఎలా సమన్వయం చేస్తారనేది కూడా చూడవలసి ఉంటుంది.గోవాలో కాంగ్రెస్ వారిని చేర్చుకుని తనే ప్రత్యామ్నాయంగా వస్తానని ప్రకటించుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఆశలు ఫలించలేదు.
కాంగ్రెస్ కకావికలు
అందరికన్నా ఘోరంగా దెబ్బతిన్నది కాంగ్రెస్. ప్రియాంక గాంధీ ఎంతగా ఆరాటపడినా గత కొన్నేళ్లుగా క్రమేణా క్షీణిస్తున్న ఆ పార్టీ యూపీలో సఫలం కాలేకపోయింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీపై అసంతృప్తి ఉన్నా కాంగ్రెస్ ఓటమిపాలైంది. గతంలో గోవా, మణిపూర్లలో ఏకైక పెద్ద పార్టీగా వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక బీజేపీకి అప్పగించిన ఆ పార్టీ ఈసారి ముందే ఓడిపోయింది. గోవాలో 40స్థానాలకు గాను 12 తెచ్చుకోగా, బీజేపీకి ఇరవై దక్కాయి.మణిపూర్‌లో ఇంకా ఘోరంగా 40కి రెండే వచ్చాయి. గెలుపు లెక్కలేసుకున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీకి 48రాగా కాంగ్రెస్ 18 దగ్గరే ఆగిపోయింది. పంజాబ్నైనా నిలబెట్టుకుంటే దేశ రాజకీయాలలో ఆ పార్టీకి గౌరవం దక్కుతుం దనుకున్నారు గాని అక్కడ 70లో 19 మాత్రమే దక్కాయి. అమరీందర్ సింగ్‌ను మార్చి దళితనేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని గద్దెక్కించినా రిజర్వుడు స్థానాలు ఆప్కే అత్యధికంగా వచ్చాయి. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో జి23 అనే తిరుగు బాటు నేతలు స్వరం పెంచారు. గాంధీ కుటుంబం చుట్టూనే తిరుగుతుంటే ఉన్న పునాది కూడా పోతుందని తీవ్ర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ను వదిలేయాలని మమత పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ తన సముచిత పాత్ర నిర్వహించకుండా అడ్డుకుంటున్నదెవరని సీతారాంఏచూరి ఫలితాలకు ముందే ప్రశ్నించారు.
ఫ్రంట్లు, ప్రాంతీయ నేతలు
ఇక కేసీఆర్, మమత, కేజ్రీవాల్ వంటివారిలో ఎవరు మోడీకి ప్రత్యామ్నాయం తీసుకువస్తారనే చర్చ మీడియాలో మొదలైంది. కేసీఆర్ వెనకడుగు వేస్తారని, కేజ్రీవాల్ అవకాశాలు పెరుగుతాయని మరోవైపు కథనాలు వస్తున్నాయి. తమ ఫ్రంట్ ఎలావుంటుందో ఇంకా స్పష్టత రావాలని కేసీఆర్ ముందే ప్రకటించారు. ఈ ఫలితాలు వచ్చిన సమయంలోనే ఆయన అస్వస్తతకు గురైనారు గనక వారంరోజుల విశ్రాంతిలో మాట్లాడేది వుండదు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఏపీలో జగన్మోహనరెడ్డి (చంద్రబాబు నాయుడు కూడా) బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కర్నాటక మినహా దక్షిణాది రాష్ట్రాలలో నామమాత్రంగా ఉన్న బీజేపీ యూపీని చూపి ఏపీలో లేదా తెలంగాణలో గెలిచేస్తానని హడావుడి చేయడం హాస్యాస్పదం. కేజ్రీవాల్ ఆప్ పంజాబ్‌లో సాధించింది మంచి విజయమైనా దాన్నిబట్టి అయన దేశవ్యాపిత శక్తిగా మోడీకి ప్రత్నామ్నాయంగా వచ్చేస్తారనడం అవాస్తవికతే. యూపీతో సహా నాలుగుచోట్ల పనిచేసిన మోడీ మంత్రం పంజాబ్‌లో విఫలమైనప్పుడు, అక్కడ ఒకచోట గెలిచినంత మాత్రాన కేజ్రీ దేశమంతా గెలిచేస్తారని చెప్పడం అతిశయోక్తి. మోడీ అన్నట్టు 2022 ఎన్నికలతోనే బీజేపీకి 2024 విజయం వచ్చిందని కూడా చెప్పడానికి లేదు. అప్పటికి చాలా పరిణామాలు చూడాల్సి రావచ్చు. ఏది ఏమైనా బీజేపీ కూటమి మతతత్వ కార్పొరేట్ రాజకీయాల సవాలు తీవ్రంగా కొనసాగుతుందనడం నిస్సం దేహం. కేంద్ర రాష్ట్రాలలో ఆ ప్రజా వ్యతిరేక అనర్థక విధానాలను ఎదుర్కోవాలంటే వామపక్షాలు ప్రజాస్వామిక శక్తులు మరింత ఉధృతంగా కృషి చేయవలసి ఉంటుంది. తగిన వ్యూహాలను విస్త్రత రాజకీయ సైద్ధాంతిక ప్రచారాన్ని చేపట్టవలసి వుంటుంది. కేంద్రంలో బీజేపీ మరోసారి వస్తుందా లేక ఇంకేదైనా కూటమికి అవకాశం లభిస్తుందా అన్నది 2024లోక్‌సభ ఫలితాల తర్వాతే తేలుతుంది.
- తెలకపల్లి రవి