Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుతిన్‌ను క్రూరమైన నియంతగా పేర్కొంటూ ఉక్రెయిన్‌పై ఆయన జరుపుతున్న దాడులను వ్యతిరేకించే నైతికత కోసం అమెరికా నేతృత్వంలోని నాటో చేస్తున్న ప్రయత్నాలు కపటత్వం, ద్వంద్వ ప్రమాణాలతో కూడినవిగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత యూరప్‌లో శాంతి చెల్లాచెదురవడం ఇదే మొదటిసారి అన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే, 1991లో సోవియట్ యూనియన్ రద్దైన తర్వాత 1999లో సెర్బియా, యుగోస్లోవియాలపై నాటో జరిపిన దురాక్రమణ దాడులే యూరప్‌లో మొదటగా జరిగిన యుద్ధమన్న వాస్తవాన్ని వారు పూర్తిగా విస్మరిస్తున్నారు. యుగోస్లోవియాను విచ్ఛిన్నం చేయాలన్న తమ లక్ష్యాన్ని సాధించేందుకు బెల్గ్రేడ్, ఇతర ప్రాంతాలపై నాటో దళాలు 78రోజుల పాటు వైమానిక బాంబు దాడులు జరిపాయి.
అమెరికా, బ్రిటన్‌తో సహా దాని మిత్రపక్షాలు ఇరాక్‌పై దాడి చేసి, దేశాన్ని ధ్వంసం చేసి లక్షలాదిమంది ఇరాకీల మృతికి కారణమయ్యాయి. సద్దాం హుస్సేన్ ప్రభుత్వం సామూహిక విధ్వంసక ఆయుధాలను కలిగివుందంటూ అమెరికా తప్పుడు ప్రచారం సాగించి ఆ దేశంపై యుద్ధానికి పాల్పడింది. ఆ తర్వాత, నాటో బలగాలు దాదాపు 20ఏండ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో దురాక్రమణ సాగించాయి. ఆ దేశంపై దాడులు కొనసాగించాయి. నాటో భాగస్వాములు లిబియా, సిరియాలపై దాడులు జరిపాయి. ఇవన్నీ సార్వభౌమాధికార దేశాలే, ఆ దాడులు, యుద్ధాల తాలుకూ వినాశకర పర్యవసానాలు నేటికీ చూస్తునే ఉన్నాం.
అందువల్ల, ఉక్రెయిన్‌లో రష్యా దాడులను భగం చేయడానికి అమెరికా నేతృత్వంలోని నాటో చేస్తున్న ప్రయత్నాలు, అది పెడుతున్న గగ్గోలు ప్రపంచంలో చాలా చోట్ల ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు.
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిపై తీవ్ర గందరగోళానికి గురిచేసే విశ్లేషణలు, ప్రతిస్పందనలు వెలువడడానికి వెనుక వివిధ వైరుధ్యాలు అంతర్గతంగా పోషించిన పాత్ర ఒక కారణం. సోవియట్ యూనియన్, తూర్పు యురోపియన్ సోషలిస్టు వ్యవస్థల చారిత్రిక పతనం మూలంగా ఈ రెండు శక్తుల మధ్య వైరుధ్యాలు ఒక్కసారి పెచ్చరిల్లాయి. ఒకవైపు విప్లవ ప్రతీఘాత శక్తులు జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, మరోవైపు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల కూటమి మొత్తంగా యూరప్ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి తన పన్నాగాలను ఉధృతం చేయడం వంటి ధోరణులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పరిణామాన్ని చూడాలి.
1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన నెలల వ్యవధిలోనే, ఏకధృవ ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాద గుత్తాధిపత్యాన్ని స్థాపించాలని అమెరికా పాలక వర్గాలు నిర్ణయించాయి. ''భవిష్యత్‌లో ఎలాంటి అంతర్జాతీయ పోటీ తలెత్తకుండా చూడడంపైనే ఇప్పుడు మా విధానం తిరిగి దృష్టి కేంద్రీకరిస్తోంది'' అని అమెరికా రక్షణ విధాన మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అప్పటినుండి భౌగోళిక, రాజకీయ సిద్ధాంతమనేది ప్రపంచ ఆధిపత్యానికి సామ్రాజ్యవాద వ్యూహంగా ఉంది. దీనికి ముందుగా కావాల్సింది రష్యాను బలహీనపరచడం, యూరో ఆసియాలో దాన్నొక అసమర్ధశక్తిగా తయారుచేయడం. ఇందుకోసం తూర్పు దిశగా నాటోను విస్తరించడమనేది ప్రధాన సాధనంగా ఉంది. తర్వాత, పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడంపై దృష్టి మళ్ళింది.
జర్మనీ పునరేకీకరణ, నాటోను తూర్పు దిశగా విస్తరించడానికి దారి తీయదని 1990 ల్లోనే అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్, రష్యా అధ్యక్షుడు గోర్బచెవ్కు హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ కేవలం నోటి మాటగానే మిగిలింది. అప్పటి నుండి నాటో ఐదుసార్లు విస్తరణ జరిపింది. ఫలితంగా మొత్తంగా తూర్పు యూరప్ అంతా నాటో పరిధిలోకి వెళ్ళిపోయింది. పూర్వపు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న మూడు బాల్టిక్ దేశాలు కూడా నాటోలో భాగమయ్యాయి.
2008లో జార్జియా, ఉక్రెయిన్లకు సభ్యత్వం ఇస్తామంటూ నాటో ముందుకొచ్చింది. ఇది రష్యాకి చిట్టచివరి ప్రాంతంగా ఉంది. ఉక్రెయిన్ నాటోలో భాగమైతే, రష్యాకి పక్కలో బల్లెంగా మారుతుంది. 2015 నుండి, ఉక్రెయిన్ సైనికబలగాలకు అమెరికా శిక్షణ ఇస్తూ వచ్చింది. రష్యాతో ఘర్షణను సృష్టించేందుకు కోట్లాది డాలర్ల విలువ చేసే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పంపింది. ఉక్రెయిన్‌లో అమెరికా నెలకొల్పిన మితవాద ప్రభుత్వం రష్యన్లకు ప్రతికూలంగా మారింది.
నాటోలో చేరాలన్న లక్ష్యాన్ని ఉక్రెయిన్ కొత్త ప్రభుత్వం తమ రాజ్యాంగంలో కూడా పొందుపరిచింది. రష్యాతో చారిత్రక, సాంస్కృతిక, జాతి సంబంధాలు కలిగిన ఉక్రెయిన్, ప్రతికూలంగా మారడం రష్యాకు ఆందోళన కలిగించింది. దీనికి ప్రతిస్పందన, 2014లో క్రిమియాలో రిఫరెండం పెట్టినపుడు తాము రష్యాతో కలిసి ఉంటామని క్రిమియా ప్రజలు నిర్ణయించడంతో వెల్లడైంది. ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాలో రష్యన్లు ప్రధానంగా ఉన్నారు. క్రిమియాలోని సెవాస్తోపోల్లో రష్యా నల్ల సముద్ర నావికా దళం ఉంటుంది. ఇదొక్కటే రష్యాకు అందుబాటులో గల వార్మ్ వాటర్ (శీతాకాలంలో కూడా నీరు గడ్డకట్టని ) ఓడరేవు.
రష్యా చుట్టుపక్కలా గల, కొత్తగా నాటోలో చేరిన దేశాల్లో అమెరికా, నాటో తమ బలగాలను, క్షిపణులను మోహరించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా తన బలగాలను మోహరించింది. యూరప్‌లో కొత్త భద్రతా ఒప్పందాన్ని రూపొందించు కోవడానికి చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని కోరింది. అక్కడ బలగాలు, క్షిపణులు మోహరించిన నేపథ్యంలో తమ భద్రతకు హామీ కావాలని కోరింది. కానీ అమెరికా-నాటో ఈ డిమాండ్‌ను తిరస్కరించాయి. సార్వభౌమాధికార దేశంగా ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఉందని పేర్కొన్నాయి.
ఆ తర్వాత ఉక్రెయిన్‌పై జరిగిన సైనిక దాడితో వరుసగా పలు సంఘటనలు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో యూరప్‌లో శాంతి, ఆర్థిక వ్యవహారాలు, భద్రతా ఒప్పందాలపై తీవ్ర పర్యవసానాలు చూపగలిగేవే. సామ్రాజ్యవాద శక్తులకు, ప్రధాన పెట్టుబడిదారీ శక్తులకు మధ్య (అమెరికా సామ్రాజ్యవాదానికి, నిరంకుశ పెట్టుబడిదారీ పాలకుడు అధికారంలో ఉన్న రష్యాకు మధ్య) ఘర్షణే ఉక్రెయిన్ యుద్ధంలో ప్రతిబింబిస్తోంది. కీలకమైన భద్రతా ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవచ్చు. అంతేకానీ, ఒక సార్వభౌమాధికార దేశ ప్రాదేశిక సమగ్రతను ధిక్కరించేలా సైనిక దాడులకు దిగడం నిర్దంద్వంగా వ్యతిరేకించాల్సిన అంశం. ఇప్పటికే చాలామంది మరణించారు. బోల్షివిక్కులను నిరసించడం, లెనిన్ ఉక్రెయిన్ ఏర్పాటును వ్యతిరేకించడంలోనే గ్రేట్ రష్యా పట్ల పుతిన్‌కు గల దురభిమానం, జాతీయవాదం కనబడుతోంది. అందువల్లే ఈ ఘర్షణలకు స్వస్తి చెప్పి చర్చలు జరపాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.
బైడెన్ ప్రభుత్వానికి సంబంధించినంతవరకు, అట్లాంటిక్ అలయన్స్‌కు కట్టుబడేందుకు, యురోపియన్ యూనియన్ స్వయంప్రతిపత్తి ఆవిర్భావానికి గల సాధ్యాసాధ్యాలను తోసిపుచ్చడానికి ఇదొక సువర్ణావకాశం. యూరప్‌లో ప్రధానశక్తిగా ఉన్న జర్మనీ నాటో దురాక్రమణ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పెద్ద ఎత్తున సైనిక పునర్వ్యవస్థీరణ జరగాలన్న పిలుపులను వ్యతిరేకిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తన ప్రతిఘటనను విరమించుకుంది.
అమెరికా, నాటో దేశాల నుండి మరిన్ని బలగాలు, ఆయుధాలు పోలండ్, హంగరీ, రుమేనియా, బాల్టిక్ దేశాలకు పంపుతున్నారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు ప్రాణాంతక ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. మొట్టమొదటిసారిగా జర్మనీ కూడా ఆయుధాలు అందచేసింది.
ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్‌లో సైనిక దాడులు ఎలా సాగుతున్నాయో మనం చూడాల్సి ఉంది. రష్యా దాడులు ప్రారంభించి ఇప్పటికి రెండు వారాలు దాటింది. ఖెర్సాన్ నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా రష్యా సైనిక దళాలు నిలకడగా ముందుకు సాగుతున్నాయి. రాజధాని కీవ్, ఖర్కివ్, పోల్ నగరాలను చట్టుముట్టాయి. డాన్‌బాస్‌లోని తిరుగుబాటు శక్తులతో చేతులు కలిపాయి. పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ రష్యా కున్న అపారమైన భూతల, వైమానిక, నావికా బలగాల సామర్ధ్యం దష్ట్యా రష్యా సైన్యందే పై చేయిగా ఉంది.
ఇప్పటివరకు బెలారస్లో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. మార్చి 7న జరిగిన చివరి సమావేశంలో కాల్పుల విరమణకు సంబంధించి కొంత పురోగతి ఉన్నట్లు కనిపిస్తోంది. మొదటగా, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా మానవతా కారిడార్లను ఏర్పాటు చేశారు. నాటోలో సభ్యత్వంపై ఇక పట్టుబట్టబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా గుర్తించిన రెండు రిపబ్లిక్ల పరిస్థితి, రష్యాలో భాగంగా ఉన్న క్రిమియాపై నెలకొన్న సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సివున్నాయి.
ఇది రాసే సమయానికి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రి కులేబాలు టర్కీ రిసార్ట్ అంటాలియాలో సమావేశమవుతున్నారు. విదే శాంగ మంత్రుల స్థాయిలో చర్చలు జరగడమంటే ఇదొక సానుకూల పరిణామంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. యుద్ధానికి తక్షణమే స్వస్తి చెప్పి, ఉక్రెయిన్ తటస్థంగా ఉండి, మిన్స్క్ ఒప్పందాల ప్రాతిపదికగా డాన్బాస్ రిపబ్లిక్లకు పరిష్కారాన్ని కనుగొనడమే ప్రస్తుతమున్న అత్యంత ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాలు.
-పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం