Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోవియట్ యూనియన్ స్ఫూర్తితో అనేక దేశాలు స్వాతంత్య్రం సంపాదించాయి. తూర్పు ఐరోపా దేశాలలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ విస్తృతిని అడ్డుకోడానికి 1949లో అమెరికా ఆధ్వర్యంలో 12 సభ్య దేశాలతో నాటొ (నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్) యుద్ధ కూటమి ఏర్పడింది. నాటొ అధికరణ 5 ప్రకారం ఒక సభ్య దేశంపై ఏ దేశమైనా దాడిచేసినప్పుడు ఇతర సభ్య దేశాలన్నీ దాన్ని తనపై యుద్ధంగా భావించి ఆ దేశంతో యుద్ధం చేయాలి. 1945లోనే స్థాపించిన ఐక్యరాజ్య సమితి సూత్రం 51 ప్రకారం నాటొ దేశాలపై ఏ దేశమైనా దండెత్తినప్పుడు ఐరాసకు నివేదించాలి. ఐరాస యుద్ధాన్ని ఆపి శాంతి పరిరక్షిస్తుంది. ఇందుకు సభ్యదేశాల నుండి శాంతి పరిరక్షణ దళం పేరుతో సైన్యాన్ని కూడా సమీకరిస్తుంది. ఈ ఐరాస అధికరణ ఉండగా నాటొ అధికరణ 5 ఎందుకు? ప్రపంచ చట్టాన్ని అమెరికా తన చేతుల్లోకి తీసుకోడం కాదా? నాటొ ఆగడాలను అడ్డుకోడానికి సోవియట్ నాయకత్వంలో పోలండ్ రాజధాని వార్సాలో 1955లో వార్సా ఒప్పందం కుదిరింది. వార్సా చర్యకు ప్రతిచర్యగా ప్రవర్తించిందే కాని ఏ పరిస్థితిలోనూ నాటొపై దాడిచేయలేదు. సోవియట్ పతనం తర్వాత వార్సాలోని కొన్ని దేశాలను నాటొలో చేర్చుకున్నారు. వార్సాను 1991లో రద్దుచేశారు. నాటొ కూడా తప్పనిసరిగా రద్దుకావాలి. కాని అమెరికా దాన్ని విస్తరించింది. దాని సభ్యత్వం 30కి చేరింది. పూర్వ సోవియట్ దేశాలను నాటొలో చేర్చుకోడం శోచనీయం. ఇప్పుడు రష్యా, జార్జియా, ఉక్రెయిన్, మోల్దోవ మాత్రమే నాటొ బయట ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాటొలో చేరమని ఉక్రెయిన్ పై అమెరికా వత్తిడి పెరిగింది.
ఐక్యరాజ్య సమితి ఛార్టర్ చాప్టర్ 7 భద్రత సమితికి ప్రపంచ శాంతి నిర్వహణకు అధికారాన్నిచ్చింది. అంతర్జాతీయ శాంతిభద్రతల పునరుద్ధరణకు సైనిక, నిస్సైనిక చర్యలు చేపట్టవచ్చు. అమెరికా లాంటి అగ్రరాజ్యాల నిధుల మీద ఆధారపడిన (193 సభ్యదేశాల) ఐరాస యుద్ధ నివారణలో, శాంతి స్థాపణలో విఫలమైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నివారణలో కూడా దాని పనితనంలో తేడా లేదు. 40ఏండ్లలో తొలిసారి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో అత్యవసర సర్వ ప్రతినిధి సభ జరిపింది. అదీ రష్యాను నిందించడానికి.
పశ్చిమ జర్మనీలో సైనికవాద పునరుద్ధరణకు భయపడ్డ సోవియట్ రష్యా 1954లో నాటొ సభ్యత్వాన్ని కోరింది. అమెరికా ఇంగ్లండ్‌లు తిరస్కరించాయి. సోవియట్ పతనం తర్వాత రష్యా మరలా నాటొ సభ్యత్వాన్ని కోరింది. కొత్తగా నాటొలో 2, 3 పద్ధతుల్లో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. రష్యాకు 1991లో నాటొ భాగస్వామ్యం ఇచ్చారు. 2014లో రష్యాపై కోపగించుకున్న అమెరికా రష్యా నాటొ భాగస్వామ్యాన్ని రద్దు చేసింది. 1997 నుండి ఉక్రెయిన్ నాటొ భాగస్వామ్య దేశం. భాగస్వామ్యంలో తప్పనిసరి అనవసర యుద్ధ నియమం ఉండదు. దీన్ని మినహాయించి సభ్యత్వానికి భాగస్వామ్యానికి తేడా లేదు. అలాంటప్పుడు ఉక్రెయిన్ సభ్యత్వం రష్యాపై యుద్ధం చేయించడానికేనా? నాటొ ఏర్పడినప్పుడు తూర్పు ఐరోపా దేశాలు అందులో సభ్యత్వం తీసుకొని సమస్యలు సృష్టిస్తాయన్న భయం ఉంది. ఆ దేశాల నాటొ సభ్యత్వంపై నిబంధనలు విధించారు. ఒక తూర్పు ఐరోపా దేశానికి నాటొ సభ్యత్వం ఇవ్వాలంటే అన్ని నాటొ సభ్య దేశాలు, ఆ దేశ పొరుగు దేశం అందుకు అంగీకరించాలి. ఇప్పుడు నాటొ సభ్య దేశాలయిన ఫ్రాన్స్, జర్మని ఉక్రెయిన్ నాటొ సభ్యత్వాన్ని ఒప్పుకోలేదు. ఇందుకు దేని కారణం దానిది. జర్మని రష్యా నుండి చమురు, సహజ వాయువులను దిగుమతి చేసుకుంటుంది. ఇందుకు పోలండ్ భూభాగం నుండి నార్డ్ స్ట్రీమ్ × కింద రెండు గొట్టాల సరఫరా మార్గం ఉంది. అమెరికా ఆదేశం మేరకు పోలండ్ దీన్ని అభ్యంతరపెట్టింది. ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన నార్డ్ స్ట్రీమ్ ×× కింద రెండు గొట్టాల సరఫరా మార్గాలు నిర్మించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇది ఆపబడింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన రష్యా ఉక్రెయిన్ నాటొ సభ్యత్వాన్ని అభ్యంతర పెడుతోంది. నాటొ సభ్యత్వానికి మరో షరతు ఉంది. భూతగాదాలున్న, ఇతర దేశాలతో సరిహద్దు వివాదాలున్న దేశానికి నాటొ సభ్యత్వం ఇవ్వరాదు. పాత తగాదాలతో చేరి నాటొ దేశాలనన్నిటినీ అనవసర యుద్ధంలోకి లాగుతుందని ఈ షరతు ఉద్దేశం. ఉక్రెయిన్ లోని డొనేట్క్స్, లుహాన్క్స్ రిపబ్లిక్లు స్వతంత్రత కోసం పోరాడాయి. ఇప్పుడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. రష్యా గుర్తించింది. రోగికి ఆరోగ్య బీమా ఇవ్వరు కదా. 1989లో అమెరికా తన ప్రాబల్య పశ్చిమ జర్మనీలో తూర్పు జర్మనీని కలపాలనుకుంది. అందుకు సోవియట్ సహకారాన్ని కోరింది. నాటొను తూర్పు ఐరోపా దేశాలకు విస్తరించరాదని రష్యా షరతు పెట్టింది. ఈ షరతును అమెరికా ఒప్పుకుంది. సోవియట్ జర్మని ఐక్యతకు అంగీకరించింది. ఈ కారణాలతో ఉక్రెయిన్‌కు నాటొ సభ్యత్వ అర్హత లేదు. అయినా తన సహజ ధోరణిలో అన్ని నియమాలను ఉల్లంఘించి అమెరికా ఉక్రెయిన్‌కు నాటొ సభ్యత్వం ఇవ్వాలని ఉబలాటపడుతోంది.
రష్యా, ఉక్రెయిన్, ఐరోపా భద్రత, సహకార సంస్థ (ఉూజజు)ల మధ్య సహకారం, సమస్యల నివారణ, పరిష్కారాలకు బెలారుస్ రాజధాని మిన్క్స్‌లో జూన్ 2014న మిన్క్స్ పరిష్కార వేదికను ఏర్పాటుచేశారు. అమెరికా ఉక్రెయిన్ కాలుపట్టి లాగడంతో ఇది 2015 జనవరిలో రద్దయింది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన రష్యా చొరవతో 2015 ఫిబ్రవరిలోనే మిన్క్స్ ×× పేరుతో దీన్ని పునరిద్ధరించారు. ఉక్రెయిన్ ఘర్షణను ముగించడానికి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఉక్రెయిన్ తిరస్కరించింది. అప్పటి నుండి రష్యా మిన్క్స్ ×× వేదికగా ఉక్రెయిన్ ను చర్చలకు పిలుస్తూనే ఉంది. ఉక్రెయిన్ స్పందించలేదు. తాజా గొడవలో 2021 డిసెంబర్లోనే అమెరికా, నాటొ దేశాలు ఉక్రెయిన్‌లో భారీగా ఆయుధాలను దించాయి. యుద్ధ సమయంలో నాటొ సభ్యత్వం ఇవ్వమని ఉక్రెయిన్ వత్తిడిచేస్తోంది. నాటొ సభ్యదేశంగా తనకు అమెరికా, నాటొ దేశాల బహుముఖ సహా యం అందుతుందని ఉక్రెయిన్ అభిప్రాయం.
ఎస్. హనుమంతరెడ్డి
సెల్:9490204545