Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్‌లో వైద్య విద్యావసతులకు ఏం కొరత, డాక్టరీ చదువుల కోసం దేశం విడిచి వెళ్ళాలా వంటి అనేక ప్రశ్నలు సహజంగానే వస్తాయి. నిజమే కదా! మన దేశంలో అలాంటి పరిస్థితులే ఉంటే చిన్న చిన్న దేశాలకు వెళ్లి మన విద్యార్థులు అవస్థలు ఎందుకు పడతారు? ఏ దేశాభివృద్ధికైనా విద్య, వైద్యం పునాదులు. ఈ రెండు రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యూరప్ దేశాలతో, సోషలిస్టు దేశాలు అనేక రంగాల్లో మందంజలో ఉన్నాయి. అందుకు ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రధాన కారణం. అదే మన దేశంలోనైతే ఈ రంగాలకు వెచ్చిస్తున్న మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో 3శాతం లోపే. వైద్య రంగానికి అయితే మరీ తక్కువగా 1.82శాతం నిధులనే బడ్జెట్లో కేటాయిస్తున్నారు. తత్ ఫలితంగా మన దేశంలో వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. అందువల్లనే మరెన్నో నూతన కోర్సులు చదవుటానికి మన విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు.
ఉక్రెయిన్ విద్యాశాఖ గణాంకాల ప్రకారం అక్కడ 18,095 మంది భారతీయ వైద్య విద్యార్థులు చేరారు. మనదేశంలో మొత్తం వైద్య సీట్లు 90,825. వీటిలో ప్రభుత్వ కళాశాలలో 43శాతం పైచిలుకు సీట్లు ఉండగా, మిగిలిన సుమారు సగం పైబడి సీట్లు ప్రయివేటు కళాశాలల్లో ఉండటంవల్ల వైద్య, విద్య సామాన్యులకు అందుబాటులో లేదు. గత మూడు దశాబ్దాలుగా వైద్య వృత్తి చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం రంగంలో వైద్య కళాశాలలు సీట్లు తక్కువ ఉండటం, అదే సమయంలో భారత దేశంలో ఉన్న సుమారు 261 ప్రయివేటు వైద్య కళాశాలల్లో సీట్లు కొనలేక, ఫీజులు కట్టలేక మన దేశం నుంచి ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, రష్యా వంటి దేశాలకు వైద్య విద్య కోసం వెళ్తున్నారు. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మన మనదేశం నుంచి వెళ్లిన విద్యార్థులను స్వదేశం తీసుకుని రావడానికి ''ఆపరేషన్ గంగా'' పేరుతో కేంద్రం నానా హైరాణపడింది. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో సమావేశం అయిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పాపంతో తనకు కానీ, తన ప్రభుత్వానికి కానీ ఇసుమంతైనా సంబంధం లేదని, ఇదంతా గత పాలకులదే అని సెలవిచ్చారు. పైగా మేమే మిమ్మల్ని కాపాడామంటూ గొప్పలు చెప్పుకొచ్చిన మోడీ సర్ ఆ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట మాత్రమైనా మాట్లాడలేదు. విద్యార్థులను, వారి తల్లిదండ్రుల మనోభావాలను సైతం చాలా తెలివిగా తమ ఎన్నికల ప్రయోజనాలకు వాడుకున్నారు మన ప్రధానమంత్రి.
మనదేశంలో ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలు మొత్తం 533 మాత్రమే. సుమారు 135 కోట్ల మంది ఉన్న మనదేశంలో కేవలం 90825 సీట్లు మాత్రమే ఉండటం, అందులో ఎక్కువ సీట్లు ప్రయివేటు కళాశాలల్లో ఉండటం ఎంతవరకూ సమంజసం? కనీసం ఇప్పుడైనా ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కనీసం 1,50,000 సీట్లు ఉండేటట్టు చర్యలు ఉపక్రమించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీసం అడుగు కూడా వేయని బీజేపీ సర్కారు. తాను అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇంకా గత పాలకుల నిర్లక్ష్యమే కారణం అంటూ స్వయంగా ప్రధానే శుద్ధి పూసలా మాటలతో కాలం వెల్లబుచ్చుతున్నారు. మరి ఈ ఎనిమిదేండ్లగా ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం ఒకటి లేదు.
నీట్ పరీక్షలో క్వాలిఫై అయిన వారిలో కేవలం 10శాతం మందికే సీట్లు లభిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం 16 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తుండగా, వారిలో 8,70,000 పైబడి క్వాలిఫై అవుతున్నారు. వీరిలో సీట్లు దొరక్క, తక్కువ ఫీజులు తీసుకుని వైద్య విద్య అందిస్తున్న విదేశీ కళాశాలలకు ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. విదేశాల్లో వైద్య చదువులో ఉత్తీర్ణులైన వారు ఇక్కడ ఎఫ్.ఎం.జి.ఈ.లో కేవలం 17 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అనగా ఇటువంటి విద్యార్థులు ప్రమాణాలు చాలా నాసిరకం అని తెలియవచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే, వైద్య విద్య మనదేశంలోనే బాగుంది. కానీ ప్రభుత్వం సరైన రీతిలో విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించి, మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఏర్పాటు చేయాలి.
డబ్ల్యూ.హెచ్.ఓ ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. కానీ మనదేశంలో 1456 మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అనగా 80శాతం మంది పట్టణాలు నగరాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో నేటికీ సరైన వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో లేక చాలామంది అవస్థలు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల సంఖ్యను పెంచాలి. ఎక్కువ మంది స్వదేశంలో చదువుకునే అవకాశం కల్పించాలి.
- ఎం. మోహన్‌కృష్ణ
సెల్:9490099132