Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత నెలలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపిని, మోడీ భక్తులను ఆనంద సాగరంలో ముంచెత్తాయి అంటే అతిశయోక్తి కాదు. నాలుగు రాష్ట్రాల్లో విజయభేరి మోగించిన బీజేపీకి కూడా ఫలితాలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి అనటంలో అసత్యం లేదు, అతిశయం కాదు. విజయం సాధించిన పార్టీకి విజయ కారణాలు విశ్లేషించే అవసరం లేకపోయినా, ఈ గెలుపు వల్ల ప్రజలకు అంతా మంచే జరుగుతుంది అనే భ్రమలోకి నెట్టే ప్రమాదం ఉందని గుర్తించాలి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టం వాటిల్లే కార్మిక, కర్షకవర్గం ఈ దిశగా ఆలోచన చేయాలి.
ప్రజాస్వామ్యానికి పెను ముప్పు సరైన ప్రతిపక్షం లేకపోవటమే. ఇటీవల భారత రాజకీయాల్లో అదే జరుగుతున్నది. దాని వలన విధేయులైన సొంత పార్టీ వాళ్ళు ఒక విధానం సరైంది కాదని తెలిసినా ప్రశ్నించలేరు, ప్రతిఘటించనూ లేరు. వంద సార్లు చెపితే అబద్దమే నిజమై కూర్చుంటుంది. ప్రజాస్వామ్యం అంటే... ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, టు ది పీపుల్ అని అన్నా, ఆ పీపుల్ వల్లనే ఒక్కోసారి చిక్కులూ వస్తాయి.
కోవిడ్ మహమ్మారి ప్రబలినప్పుడు ప్రభుత్వ అలసత్వం వలన వలస కార్మికుల జీవితాలు ఎంత అల్లకల్లోలం అయ్యాయో అందరికి తెలుసు. కోవిడ్ టీకా అందించటంలో ఎన్ని లోటుపాట్లు, సామాన్యులు వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిరావడం ఇంకా మరుగున పడలేదు. ప్రభుత్వ వైఫల్యం వలన సరైన వైద్య సదుపాయాలు అందక, ప్రయివేటు ఆసుపత్రుల్లో లక్షలు గుమ్మరించినా ప్రాణాలు కాపాడుకోలేక ఎన్ని కుటుంబాలు ఆప్తులను పొగొట్టుకున్నాయో, మరెన్ని కుటుంబాలు మృత్యువాత పడ్డాయో అందరం చూశాం.
ఏడాది పైగా రైతులు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తుంటే నిర్లక్ష్యం వహించి ఎన్నికల ముందు తెలివిగా రైతులు ఒప్పుకోవటం లేదని వెన్నక్కి తగ్గుతున్నామన్న ప్రధాని అవకాశవాదాన్నీ, దొడ్డిదారిలో వాటిని అమలు చేయజూస్తున్న ప్రభుత్వ తీరునూ కండ్లార చూస్తున్నాం. అందుకే పంజాబ్‌లో బీజేపీని ప్రజలు పక్కకు పెట్టారు.
ప్రజల మధ్య మత తత్వాన్ని రెచ్చగొడుతూ, వారి సెంటిమెంట్లతో ఆడుకుంటూ రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకుంటున్నది బీజేపీ. వారణాసిని వెలిగింప చేసి, హిమాలయ పర్వత పాదాల చెంత కేదార్‌నాథ్‌ను దేదీప్యమానం ఒనరించి హైందవ సంస్కృతికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నామంటూ మత సమీకరణలకు, మత విభజనలకు పాల్పడు తున్నారు. కానీ, ఈ పాలకులు మర్చిపోతున్న విషయం భారతదేశ చరిత్ర చూస్తే, మన దేశం ఎప్పుడూ మత సహనానికి ఆలవాలమై నిలిచింది. వందల ఏండ్లుగా ఇన్ని మతాలు ఈ గడ్డపైన సహవాసం చేసాయి అంటే అది ఈ దేశ ఔన్నత్యం. మతసామరస్యం ఈ ప్రజల నరనరాల్లోనూ ఇంకి ఉండటమే అందుకు తార్కాణం. మైనారిటీలు, మెజారిటీలు అనేది పక్కన పెట్టి... ఏ మతమైనా ప్రజల మధ్య చిచ్చు పెట్టే చర్యలకు పాల్పడితే సభ్య సమాజం ఖండించవలసిందే. కానీ, ఈ ఎన్నికల్లో ఎర ఇదే అయింది. ప్రతిపక్షాలు కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచించడం మాని అధికారపార్టీ అనుసరిస్తూ ప్రణాళికలు రూపొందిచుకుని ప్రజలను దూరం చేసుకున్నాయి.
ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య కబళిస్తున్నా, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశం దాటి అంతరిక్షంలోకి ఎగసి పోతున్నా, జీడీపీ అంతే వేగంగా పాతాళంలోకి పడిపోతున్నా, సామాన్య ప్రజానీకానికి, కార్మికుల సంక్షేమానికి గొడ్డలి పెట్టయిన పెట్టుబడి దారి వ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా వేగంగా పావులను కదుపుతూ, ఆర్థిక సంస్కరణలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి ప్రతినిధి అయిన మోడీకే ప్రజలు పట్టం కట్టడం ప్రజాస్వామ్య మనుగడకు ఆందోళనకరం.
ఈ ఎన్నికల్లో గమనించదగ్గ విషయం - ముఖ్య మంత్రులుగా ఉన్నవారు ఓటమి చవిచూడటం. యూపీలో ఎన్నికల ప్రణాళికను రూపొందించిన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఉచితాలు సత్ఫలితాలనిచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలు ఉచిత ఆహార సరుకుల సరఫరాకు (ఉచిత రేషన్), మరుగు దొడ్ల నిర్మాణం, ఉజ్జ్వల - వంట గ్యాస్ పంపిణీ లాంటి సౌకర్యాలకు ఓటు వేశారు. ఇంటిల్లి పాదికీ కడుపు నిండితే చాలు అనుకునే మామూలు మనుషులు వీరంతా. నాయకులు హ్రస్వ దృష్టితో తెచ్చే ఈ పథకాలైనా స్వల్ప కాలానికే పరిమితమా, దీర్ఘకాలికంగా ఉంటాయా అనేది వేచి చూడాలి.
ప్రతి పక్షాలలో సరైన ఐక్యత లేక పోవటం, ప్రణాళిక బద్దమైన వ్యూహ రచన లోపించటం, బెంగాల్ విజయం కొంత తప్పు దోవ పట్టించటం, చిన్న చితక పార్టీలు బీజేపీతో పొత్తు కుదుర్చుకుని విజయం సాధించడం కాషాయ వర్గానికి అధికారాన్ని అందించాయి. ఇదే సమయంలో గమనించవలసినవి - 2017 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ముస్లిం ఓట్ల సంఖ్య 2022లో పడిపోవటం. ఎస్పీ పార్టీకి మెజారిటీ రాక పోయినా 2017 నాటి నుండి 2022కి తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలిగింది. గెలిచిన వారు ప్రత్యర్థి మీద చాలా తక్కువ శాతం తేడాతో గెలవటం, పోస్టల్ బాలెట్ ఓట్లు సగానికి పైగా ఎస్పీకి రావటం, ఇందులో రక్షణ శాఖకు చెందిన సిబ్బంది ఎక్కువగా ఉండటం గమనార్హం. యూపీ మంత్రివర్గంలోని 11మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.
ఈ ఎన్నికలు బీజేపీని పటిష్టమయిన గోడలా కనిపింపచేసినా, గోడకు బీటలు వారటం అసాధ్యం కాదని స్పష్టపరిచాయి. ఎన్నికల గారడీలు, పంచే తాయిలాల వెనుక ఉన్న ఆంతర్యాలను విశ్లేషించుకుని ఎటు వంటి కార్యాచరణకు సిద్ధపడాలో తేల్చుకోవాల్సిన అవసరం ప్రజల పైనా, ప్రతి పక్షాల పైనా ఉంది. అలాగే గాలివాటున కొట్టుకు పోవటం కాకుండా సమర్థత, అవగాహనా నేర్పు ఉన్న మేధావి వర్గంతో పాటుగా పోరు బాటలో ఉన్న కార్మిక వర్గం కూడా అంతః పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. అలా కానినాడు, అడ్డు అదుపులేకుండా ప్రవేశపెట్టే ఆర్థిక సిద్ధాంతాలు గొడ్డలి పెట్టయి సామాన్యుల ఆర్థిక స్థితిగతులను విచ్చిన్నం చేయటానికి ఎంతో కాలం పట్టదు.
- ఎన్. ఝాన్సీలక్ష్మి