Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, కేంద్ర ఇంధనశాఖ మంత్రికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు స్వరూపం, కార్పొరేట్ల లాభాల వేటలో తల్లి భూదేవిని కాపాడే యత్నాలకు చేస్తున్న ద్రోహం దాగివున్నాయి. రాష్ట్రాలకు విద్యుత్తును యూనిట్ రూ.1.10 పైసల చొప్పున కేంద్రం సరఫరా చేస్తోందని స్వయానా ప్రధాని మోడీ ప్రకటించారు. దానిని తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా సవాల్ చేశారు. ప్రధాని చెప్పింది పచ్చి అబద్ధం అని సూటిగా ప్రకటించారు. పైగా కేంద్రం సౌర, పవన విద్యుత్తును ప్రయివేటు విద్యుదుత్పత్తి సంస్థల నుండే కొనుగోలు చేయాలన్న ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించాలన్న ముందస్తు షరతు విధించి, దానిని అమలు చేస్తేనే ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలలో సడలింపు లభిస్తుందని కేంద్రం మెలిక పెట్టిందని కేసీఆర్ అన్నారు. ఆ షరతును అంగీకరించనందువలన తమ రాష్ట్రం అదనంగా లభించే రూ.25,000 కోట్ల రుణాన్ని కోల్పోయిందని, అయినప్పటికీ తాము వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించడానికి వ్యతిరేకమని కేసీఆర్ స్పష్టం చేశారు.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తాజా నివేదిక ప్రకారం దేశంలో డిస్కాంలు విద్యుత్తును సగటున యూనిట్‌కు రూ.4.73పైసల చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. అతి తక్కువగా రూ.2.71పై. చొప్పున సిక్కింలో కొంటూంటే, అతి ఎక్కువగా మణిపూర్‌లో రూ.5.73 పైసలకు కొంటున్నారు. తెలంగాణ లో రూ.5.25 పైసలకు, మహారాష్ట్రలో రూ.5.22 పైసలకు, ఉత్తరప్రదేశ్‌లో రూ.5.19 పైసలకు, కర్నాటకలో రూ.5.13 పైసలకు కొనుగోలు చేస్తున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం నడిపే విద్యుత్ జనరేషన్ కంపెనీలు ఎన్టిపిసి (థర్మల్), ఎన్‌హెచ్‌పిసి (హైడ్రో), ఎన్‌పిసిఐఎల్ (న్యూక్లియర్) ఢిల్లీ రాష్ట్రానికి వరుసగా రూ.4.99 పైసలు, రూ.2.51 పైసలు, రూ.3.29 పైసల చొప్పున అమ్ముతున్నారు. దేశంలో డిస్కాంలు దాదాపు 90శాతం విద్యుత్తు అవసరాలను దీర్ఘకాల ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్నాయి. కొరవ విద్యుత్తు అవసరాలకు ఆయా రోజుల్లో మార్కెట్లో కొనుగోలు చేస్తున్నాయి. ఈ బహిరంగ మార్కెట్లో వేలం ద్వారా జరిగే కొనుగోలులో కనిష్టంగా రూ.1.99పై. చొప్పున, గరిష్టంగా రూ.20.00 చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ సగటు చూస్తే రూ.4.43 పైసలు ఉంది. రాబోయేది వేసవికాలం కాబట్టి బహిరంగ మార్కెట్లో రేటు రూ.20.00 దాటి పెరుగుతుంది.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రధాని మాత్రం రూ.1.10 పైసలకు విద్యుత్తును కేంద్రం రాష్ట్రాలకు అందిస్తోంది అని చెప్పడం పచ్చి అబద్ధం కాక ఇంకేమిటి ?
2022 నాటికి 175 గిగా వాట్ల సౌర, పవన విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించాలని, 2030 నాటికి ఆ సామర్థ్యాన్ని 500 గిగా వాట్లకు పెంచాలని లక్ష్యంగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆయా రాష్ట్రాల డిస్కాంలు విధిగా కొనాలన్న నిబంధనలను కూడా జారీ చేసింది. అయితే ఈ సౌర, పవన విద్యుత్తును ఉత్పత్తి చేయగల సానుకూల పరిస్థితులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రీతిగా లేవు. రాజస్థాన్, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భౌగోళికంగా ఈ తరహా విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సౌర, పవన విద్యుత్తు వినియోగాన్ని ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యంగా నిర్దేశించాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా లక్ష్యాలను నిర్ణయించింది. దాని ఫలితంగా సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి అనుకూల భౌగోళిక పరిస్థితులు లేని రాష్ట్రాలు వేరే రాష్ట్రాలనుండి కొనుగోలు చేయవలసివస్తోంది. పైగా తమ రాష్ట్రాలలో బొగ్గు, సహజ వాయువులను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, తప్పనిసరిగా సౌర, పవన విద్యుత్తును వినియోగించాలన్న నిబంధన ఉండటం వలన తమ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాపక సామర్థ్యం మేరకు వినియోగించుకోలేని పరిస్థితి రాష్ట్రాలకు ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సౌర, పవన విద్యుత్తు వినియోగ లక్ష్యా లను తమకున్న ప్రత్యేక పరిస్థితులకు అనుగుణం గా తిరిగి నిర్ణయించాలని పదే పదే కోరుతున్నా, కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదు.
పైగా, ఆయా రాష్ట్రాల డిస్కాంల ఆమోదంతో నిమిత్తం లేకుండానే సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులను వివిధ ప్రాంతాల్లో నెలకొల్పడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. 2018 నుండి ఇప్పటివరకూ ఆ తరహా బిడ్లు 28రౌండ్లు నిర్వహించారు. ఈ బిడ్లలో దాదాపు 50 సంస్థలు పాల్గొంటున్నాయి. అయితే నాలుగే నాలుగు కంపెనీలకు 50శాతం ప్రాజెక్టులను కేటాయించారు. వాటిలో దాదాపు సగం అదానీ గ్రూపుకి కేటాయించారు. ఈ విధంగా ఒకే సంస్థకు అసాధారణంగా ఎక్కువ వాటా కేటాయించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి?
ఈ కంపెనీలతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకోడానికి రాష్ట్రాల డిస్కాంలు అంత సుముఖంగా లేవు. ఇప్పటికే తమ అవసరాలకు సరిపడా విద్యుత్తు కొనుగోలు చేయడానికి దీర్ఘకాల ఒప్పందాలు కుదుర్చుకుని ఉన్నాయి. వాటిని రద్దు చేయాలంటే భారీ నష్ట పరిహారం చెల్లించాల్సివస్తుంది. ఇప్పటికే నిధులు లేక కునారిల్లుతున్న డిస్కాంలకు అది తలకు మించిన పని. అయినప్పటికీ, ఏదోవొక పేరుతో కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పందాలను చేయిస్తోంది. ఆ ఒప్పందాలలో ఉన్న నిబంధనలు రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టదాయకం. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్లు కూడా ఆ నిబంధనల పట్ల తమ అభ్యంతరాలను తెలియజేశాయి. కానీ ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే ఒప్పందాలు జరగాలన్న న్యాయసూత్రాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోంది. పరిమిత వనరులున్న రాష్ట్రాలపై అననుకూల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను బలవంతంగా రుద్ది ఇప్పుడు కేంద్ర విద్యుత్తు, ఇంధన మంత్రి రాష్ట్రాలను నిందిస్తున్నారు. ఇంతకన్నా విడ్డూరం ఉండదు.
ఇప్పటివరకూ 30,000 మెగా వాట్ల సామర్థ్యం కల సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులను ఖరారు చేసిన కేంద్రం తాజాగా మరో 25,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను ఖరారు చేసింది. అందులో 21,000 మెగావాట్లు కేవలం ఐదు రాష్ట్రాలలోనే నిర్మిస్తారు. ఆ సోలార్ పార్కులలో అదానీకి సింహభాగం కేటాయిం చారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తోంది. రాజస్థాన్‌లో అదానీ తలపెట్టిన సోలార్ పార్కులకు స్థలం కేటాయింపు విషయంలో అవకతవకలు జరిగాయన్న వివాదంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సోలార్ పార్కులకు కేటాయించిన భూముల విషయంలో జరిగిన అవకతవకలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.
సౌర, పవన విద్యుత్తు రంగంలో తాము భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ, అంబానీ ఇటీవల ప్రకటించారు. ఈ సౌర, పవన రంగాలలో పెట్టుబడులు పెట్టడం కేవలం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను దారి మళ్ళించడానికే అని పలువురు భావిస్తున్నారు. పైగా ఆ కంపెనీలకు రుణాలిచ్చే బ్యాంకులకూ ఇది మోయలేని భారమే అవుతుంది.
గతంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలు రుణాలు తీసుకునే పరిమితులను నిర్ధారిం చడంతోబాటు, ఆ రాష్రాలు సమర్థవంతంగా పనిచేస్తే అదనపు రుణాన్ని పొందవచ్చునన్న సిఫార్సు చేసింది. రాష్ట్రాల సామర్థ్యాన్ని నిర్థారించడానికి పెట్టిన కొలబద్దల్లో వ్యవసాయ పంపుసెట్లకు ప్రీ పెయిడ్ మీటర్లను బిగించడం, విద్యుత్తును సబ్సిడీ ధరపై గాని, ఉచితంగా గాని సరఫరా చేయడం బదులు నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టి, బిల్లులు చెల్లించని వారికి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం, క్రాస్ సబ్సిడీని (అధిక మొత్తంలో విద్యుత్తు వినియోగించే ప్రయివేటు వినియోగదారులకు ఎక్కువ చార్జి, సామాన్య గృహ వినియోగదారులకు,పేద, దళిత వినియోగదారులకు తక్కువ చార్జి వసూలు చేసే పద్ధతి) తగ్గించడం... వంటివి ఉన్నాయి. ఈ పనులు చేయలేకపోతే డిస్కాంలను ప్రయివేటీక రించాలన్న నిబంధనా విధించారు. ఈ విధంగా రాష్ట్రాలపై ఒత్తిళ్లు తేవడం అప్రజాస్వామికమే గాక రాష్ట్రాల హక్కుల మీద ప్రత్యక్ష దాడిగా కూడా పరిగణించాలి. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా అదనపు రుణాన్ని పొందే హక్కును వదులుకోవడంతో సరిపెడితే ఈ సమస్య పరిష్కారం కాదు. రాష్ట్రాలు ఐక్యంగా తమ హక్కుల కోసం కేంద్రంతో తలపడి ప్రతి ఘటించడమే మార్గం.
- బి. ప్రదీప్
(స్వేచ్ఛానుసరణ)