Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయా ఉదారవాద విధానాల వైపు పోకమునుపు భారతదేశానికి సోవియట్ యూనియన్‌తోను, తూర్పు యూరపు సోషలిస్టు దేశాలతోను వ్యాపార లావాదేవీలలో రూపాయిలతోనే చెల్లింపులు జరిగేవి. అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్‌ను రిజర్వు కరెన్సీగా అందరూ అంగీకరించినప్పటికీ, సరుకుల మారకానికి ఆ డాలర్‌ను కొలమానంగా ఈ లావాదేవీలలో మనం ఆ కాలంలో ఉపయోగించలేదు. రష్యన్ రూబుల్తో మన రూపాయి ఏ రేటుకు మారకం చేయాలో ఆ రేటును ముందే నిర్ణయించి, దానిని స్థిరంగా ఉంచుతూ వ్యాపారం సాగించేవారు. ఇరు దేశాల నడుమ వ్యాపార చెల్లింపులలో ఒక దేశానికి లోటు ఏర్పడితే దానిని వెంటనే సెటిల్ చేసేయాలనే షరతు ఏదీ ఉండేదికాదు. కాలక్రమేణా ఆ లోటు సర్దుబాటు అయ్యేది. అంతే తప్ప ఏనాడూ డాలరు కొలమానం ఉపయోగించలేదు. డాలర్లు తగినంత మొత్తంలో లేనందు వలన ఇరు దేశాల నడుమా వ్యాపారాలు ఆగిపోయే పరిస్థితి. అందువల్లనే ఉత్పన్నం కాలేదు. పైగా డాలరు ప్రసక్తి లేకపోయేసరికి ఇరు దేశాలకూ మరింత తేలికగా, మరింత ఎక్కువగా వ్యాపారం చేసుకోగలిగిన పరిస్థితి ఉండేది.
ఈ పద్ధతి చాలా సహేతుకమైది. ఇరు దేశాలలోనూ ఒకరికి అవసరమైన సరుకులు రెండో దేశం దగ్గర ఉన్నప్పుడు డాలర్లు తగిన మొత్తంలో లేకపోయినా, ఆ సరుకును కొనుగోలు చేయడానికి ఏ ఆటంకమూ ఉండదు. ఇది ఆ రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండిన విధానం. డాలర్ల కోసం విధిగా ఏదో సరుకును మూడో దేశానికి అమ్ముకుని, తద్వారా వచ్చిన డాలర్లతో మాత్రమే తనకు అవసరమైన సరుకును రెండో దేశం నుండి కొనుగోలు చేయవలసిన అగత్యం ఏర్పడదు. వ్యాపారం యావత్తూ డాలర్ల రూపంలోనే సాగాలంటే సంపన్న పెట్టుబడిదారీ దేశాల దగ్గరే ఆ డాలర్లు ఎక్కువగా ఉంటాయి గనుక ఆ దేశాలకు కావలసిన సరుకులను, అవి చెప్పిన రేటుకు తెగనమ్ముకోవలసిన దుస్థితి వస్తుంది. అదే డాలరు ప్రస్తావనే లేకుండా రెండు దేశాలూ వ్యాపారం చేసుకోగలిగితే అటువంటి దుస్థితి ఏర్పడదు.
కాని నయా ఉదారవాద ఆర్థికవేత్తలు ఈ విధంగా డాలరుతో నిమిత్తం లేని ద్వైపాక్షిక వ్యాపారాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటువంటి ద్వైపాక్షిక వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని తేలికగా నిర్వహించుకోడానికి దోహదం చేస్తాయని మనం భావిస్తుంటే, వాళ్ళు మాత్రం ఈ తరహా వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని కుదించివేస్తాయని, పక్కదోవ పట్టిస్తాయని విమర్శించారు. తమ వద్ద ఉన్న డాలర్లకు సరిపడా సరుకులు దొరకడం లేదని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆ యా దేశాలు ద్వైపాక్షికంగా వ్యాపారాలు నిర్వహించు కుంటూ తమ వైపు రావలసిన వ్యాపారాన్ని పక్కకు మళ్ళిస్తున్నాయని వారు అభ్యంతరాలు లేవనెత్తారు. ఒకసారి సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఈ చర్చ నిలిచిపోయింది. డాలరు ఆధిపత్యం స్థిరపడింది. నయా ఉదారవాదం ఎటువంటి ద్వైపాక్షిక వ్యాపారాలనూ అనుమతించదు. ప్రపంచవ్యాప్తంగా ఒకే మారకపు రేటు ఉండాలని అది శాసిస్తుంది. విదేశీ మారకద్రవ్య వ్యాపారానికి కూడా ఈ సూత్రమే వర్తించాలని ఆదేశిస్తుంది.
ఈమధ్య కాలంలో తమ ఆదేశాలను ధిక్కరిస్తున్న దేశాలపై సంపన్న పెట్టుబడిదారీ దేశాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇలా ఆంక్షలకు గురైన దేశాలు తమలో తాము ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను చేసుకోవడం మొదలైంది. తద్వారా తమపై విధించిన ఆంక్షల ప్రభావాన్నుంచి తప్పించుకోవాలని అవి ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ మీద ఆంక్షలు విధించాక ఇరాన్ మరికొన్ని దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుంది. తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన నేపథ్యంలో రష్యా మీద సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తీవ్రంగా వ్యాపార ఆంక్షలు విధించాయి. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, తక్కిన సంపన్న పశ్చిమ దేశాలు మాత్రమే మొత్తం ప్రపంచం కాదని, ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉందని, తమను ఓ మూలకు నెట్టాలని చూస్తే అనేక దేశాలతో తాము ద్వైపాక్షికంగా ఒప్పందాలను కుదుర్చుకోగలమని పుతిన్ హెచ్చరిం చాడు. ఈ పరిస్థితి చూస్తే మళ్ళీ ప్రపంచంలో ద్వైపాక్షిక ఒప్పందాల జోరు పెరిగేలా ఉంది.
రష్యాకు చెందిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పశ్చిమ దేశాల ఆర్థిక నెట్‌వర్క్‌తో ఏ విధంగానూ లావాదేవీలు జరిపేందుకు వీలు లేకుండా నిషేధించడం ఇప్పటివరకూ విధించిన ఆంక్షలలోకెల్లా తీవ్రమైనటు వంటిది. స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్) నెట్‌వర్క్‌ను రష్యన్ బ్యాంకులకు అందుబాటులోకి లేకుండా చేయడం దీనిని సూచిస్తుంది. దీని వలన రష్యా తన దేశం నుండి విదేశాలకు చేసిన ఎగుమతులకు ప్రతిగా డాలర్ల రూపంలో రావలసిన ఆదాయం నిలిచిపోతుంది. డాలర్లు లేకపోతే రష్యా తనకు అవసరమైన దిగుమతులకు కొనుగోలు చేయలేదు. అటువంటప్పుడు రష్యా తన దిగుమతుల అవసరాల కోసం తప్పనిసరిగా డాలర్లతో ప్రమేయం లేని ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవలసి వస్తుంది. అందులో భాగంగా భారతదేశంతో కూడా గతంలో మాదిరిగా ద్వైపాక్షిక ఒప్పందాలకు రష్యా సిద్ధపడవచ్చు. ఆ ఒప్పందాలు గతంలో సోవియట్ యూనియన్ ఉన్న కాలంలో చేసుకున్న ఒప్పందాలను తలపించే అవకాశం ఉంది.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తట్టుకుని నిలదొక్కుకోడానికి రష్యాకు ఆ విధమైన ఒప్పందాలు ఎంతమేరకు దోహదం చేయగలవో ఆచరణలో చూడాల్సిందే. ఈవిధమైన ఆంక్షల ఫలితంగా వేలాదిమంది ప్రజలు సకాలంలో ఔషధాలు అందక వెనెజులాలో, ఇరాన్లో మరణించారు. ఒకానొక ప్రభుత్వం తీసుకున్న వైఖరి అంగీకారయోగ్యంగా లేనందున ఆంక్షల పేరుతో అక్కడి పౌరులను సైతం బలి చేయాలా అన్నది చర్చ. అయితే, రష్యా వంటి పెద్ద, బలమైన దేశం విషయంలో ఈ విధమైన చర్చ పెద్దగా వర్తించదు. పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు కాదన్నంత మాత్రాన రష్యాను పట్టించుకోకుండా దూరంగా ఉంచగలిగిన స్థితి చాలా దేశాలకు లేదు. రష్యా బలమైన దేశమే గాక, ప్రపంచంలో దానికి చాలామంది మిత్రులు కూడా ఉన్నారు.
సామ్రాజ్యవాదం విధించే ఈ ఆంక్షలు అనేక వైరుధ్యాలతో కూడివున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సామ్రాజ్యవాదం విధించే ఆంక్షలు ప్రధానంగా అమెరికన్ డాలర్లు లేదా ఇతర ప్రధాన కరెన్సీలు ఆ దేశాలకు అందుబాటులోకి లేకుండా చేస్తాయి. ఆ విధంగా ఆంక్షలు విధించిన ప్రతీ సందర్భంలోనూ ఆంక్షలకు గురైన దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలు పెడతాయి. ఆ క్రమంలో సామ్రాజ్యవాదం యొక్క పట్టు బలహీనపడడం ప్రారంభం అవుతుంది. ఆంక్షలకు గురైన దేశాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ద్వైపాక్షిక ఒప్పందాలు పెరుగుతాయి. సామ్రాజ్యవాదపు పట్టు బలహీనపడడం పెరుగుతుంది. ఆ విధంగా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వాణిజ్య వ్యవస్థ తలెత్తడానికి అవకాశాలు ఏర్పడతాయి.
ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అత్యంత హేతుబద్ధమైనదిగా చిత్రీకరించి... అన్ని దేశాలనూ ఒప్పించడం ద్వారా దానిని ఉనికిలోకి తెచ్చారు. కాని ఈ వ్యవస్థ సామ్రాజ్యవాద పెత్తనాన్ని మరింత పెంచేందు కోసమే రూపొందింది. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తమను ఆర్థికేతర కారణాలతో వ్యతిరేకించే దేశాలపై కక్ష సాధింపుకు సామ్రాజ్యవాదం ఉపయోగి స్తున్నది. ఉక్రెయిన్ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలా వద్దా అన్నది అంతర్జాతీయ వాణిజ్యం పరిధిలోకి రాని అంశం. కాని ఆ వివాదం కారణంగానే ఇప్పుడు రష్యా మీద ఆంక్షలను విధించారు. అంతర్జాతీయ వాణిజ్యం రాజకీయ వివాదాలకు అతీతంగా, హేతుబద్ధంగా జరగాలంటూ తొలుత ప్రతిపాదించిన సామ్రాజ్యవాదులే ఇప్పుడు ఆ సూత్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వారి అసలు రంగు ఏమిటో దీనిని బట్టే బైట పడుతోంది. నాటో కూటమి విస్తరణతో ముడిపడిన వివాదాల కారణంగా ఆయా దేశాలు పరస్పర వాణిజ్య సంబంధాలను ప్రతికూలంగా దిగజార్చుకోవలసిరావడం పలు దేశాలకు ఆమోదయోగ్యం కాదు. అందుచేత ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై వారినుండి తిరుగుబాటు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇమిడివున్న వైరుధ్యాల పర్యవసానాలను నేడు మనం చూస్తున్నాం. నయా ఉదారవాదం ముందుకు పోయే దారి కనిపించని, దిక్కు తోచని స్థితికి ఏవిధంగా చేరుకుంటున్నదీ మనం చూస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ రూపంలో మనకు కనిపించేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభపు చిహ్నాలు, అమెరికా ఆధిపత్యానికి పెరుగుతున్న సవాళ్ళు మాత్రమే.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)