Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటికీ సజీవ స్రవంతిగా కొనసాగుతున్న ఈ దేశపు శ్రామికవర్గ సంస్కృతికి ప్రతీకలు సమ్మక్క- సారలమ్మలు. బిర్సాముండా, కుమ్రం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల లాగానే.. శ్రమజీవుల పోరాట సాంప్రదాయానికి స్ఫూర్తి ప్రదాతలు వీరు. గిరిజన దేవతలనే పేరుతో వారిని చిన్నచూపు చూడటం తగదు. రాతి బొమ్మల్లో కూరుకు పోయిన దేవతామూర్తులు కాదు సమ్మక్క- సారలమ్మలు. శ్రమజీవుల ధర్మాగ్రహానికి.. మొక్కవోని పోరాటపటిమకు సజీవ సాక్ష్యాలువారు. 13వ శతాబ్దంలో.. నాటి కాకతీయ సామ్రాజ్యంలో.. నీలాగ, నాలాగ.. రక్తమాంసాలతో ఈ నేలమీద నడయాడిన సామాన్య మానవులు వారు. ఆత్మగౌరవం కోసం, న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు శత్రువు ఎంతటి బలవంతుడైనా బెదరక ముందడుగు వేయాల్సిందేనన్న ఆశయస్ఫూర్తిని తమ ప్రాణార్పణతో నిరూపించిన త్యాగధనులు సమ్మక్క-సారలమ్మలు.
''నువ్వు కష్టపడాల్సిందేమీ లేదు.. నాకు చేతులెత్తి మొక్కితే చాలు, అన్నీ నేను చూసుకుంటానని'' బోధిస్తారు శిష్టవర్గపు దేవతలు. అందుకు భిన్నంగా ''నీ సమస్యల పరిష్కారం కోసం నువ్వే తెగించి పోరాడాలి... పోరాటమే జీవితం'' అంటూ ఉపదేశిస్తారు సమ్మక్క సారలమ్మలు. కోట్లాదిమంది శ్రామికవర్గ ప్రజలు ఆరాధించే సమ్మక్క-సారలమ్మలని నిందిస్తూ, అవహేళన చేస్తూ చిన్న జీయరు మాట్లాడటం తగదు.
సమ్మక్క-సారలమ్మ పేరుతో బిజినెస్ నడుస్తున్నదని చిన్న జీయరు వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. భక్తుల ఇంటికొస్తే ఒక రేటు.. పాద పూజకు అనుమతిస్తే ఇంకో రేటు.. ఇంకో పూజకు ఇంకో పెద్ద రేటు.. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసినదేగా ఈ నిర్వాకం ఎవరిదో..! మరి మేడారంలో ఏముంటుంది? అక్కడ దేవతల విగ్రహాలు ఉండవు. అర్థం కాని మంత్రాలు ఉండవు. భక్తులకు పెట్టే శఠగోపాలు ఉండవు. రేటు పెట్టి అమ్ముకునే లడ్డూ ప్రసాదాలు ఉండవు. దర్శనం టికెట్టు ఉండదు. దేవుడి కంటే మేమే ఎక్కువ అనే పూజారులూ ఉండరు. రెండు సంవత్సరాలకు నాలుగు రోజులే దర్శనం. దీన్ని బిజినెస్ అనే వాడు మూర్ఖుడు కాక మరేమిటి?
మన దేశం ఎన్నో మతాలకు, ఎన్నో విశ్వాసాలకు నిలయం. ఒకరి విశ్వాసం మరొకరికి అసంబద్ధంగానూ, అల్పమైనదిగానూ కనిపించవచ్చు. అయినా.. ఇక్కడ ఎవరూ ఒకరినొకరు నిందించరు. అది ఈ దేశపు విశిష్ట మిశ్రమ సంస్కృతి. చిన్న జీయర్ ప్రతినిధిగా ఉన్న బ్రాహ్మణీయ సంస్కృతి లో ఎన్నో అసంబద్ధ అంశాలు శ్రామికవర్గ ప్రజలకు కనబడతాయి. వాటిని ఎవరూ అపహాస్యం చేయడం లేదు. ఆ పాటి విజ్ఞత చిన్నజీయర్లో ఎందుకు లోపించింది? కోట్లాదిమంది శ్రామికవర్గ ప్రజలను అవమానించిన చిన్న జీయర్పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేసి.. ప్రభుత్వం చట్టప్రకారం శిక్షించాలి.
- ఆర్. రాజేశమ్,
సెల్: 9440443183