Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ రక్షణకు ఆయుధ సామాగ్రిని ఉత్పత్తి చేసే గురుతర బాధ్యతలను ప్రతిష్టాత్మక దేశ 'ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు' గత రెండున్నర శతాబ్దాలుగా చేపట్టి, సగర్వంగా ముందుకు సాగుతోంది. 1775లో స్థాపించబడిన 'భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు' కేంద్ర కార్యాలయమైన 'ఆయుధ భవన్', కలకత్తాలో ఉన్నది. ఈ బోర్డు పరిధిలోకి దేశవ్యాప్తంగా విస్తరించబడిన 41 ఆర్డినెన్స్ ఫాక్టరీలు, 9 శిక్షణ సంస్థలు, 3 ప్రాంతీయ మార్కెటింగ్ కేంద్రాలు, 5 ప్రాంతీయ భద్రత నియంత్రణ కేంద్రాలు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. 18 మార్చి 1802 రోజున కలకత్తా సమీపాన 'కోసిపోర్' వద్ద ప్రారంభమైన భారత రక్షణ పరికరాల తయారీ కేంద్రంతో మొదలై ప్రపంచంలోనే 37వ, ఆసియాలో 2వ, దేశంలో అతి పెద్ద పురాతన ప్రభుత్వరంగ పరిశ్రమలుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు నిలుస్తున్నాయి. దేశ భద్రతలో త్రివిధ దళాలతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అందిస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా 18 మార్చిన 'ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే లేదా ఆయుధ సామాగ్రి ఉత్రత్తి పరిశ్రమ దినం' పాటించుట జరుగుతోంది. త్రివిధ దళాలకు వెన్నెముకగా నిలిచిన నాలుగో బలగంగానే కాకుండా సాయుధ దళాలకు బలాన్ని చేకూర్చే ఆయుధ కేంద్రాలుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ద్వారా మందుగుండు సామాగ్రి, ఆయుధ విడిభాగాలు, రసాయనాలు, విస్పొటన పదార్థాలు, పారాచూట్లు, తోలు, వస్త్ర ఉత్పత్తులు, ఆయుధ పరిశోధనలు, పరీక్షల నిర్వహణ, అభివృద్ధి, మార్కెటింగ్, గ్రెనేడ్లు, మైన్స్, మెసైల్స్, రాకెట్ లాంచర్స్, మిలిటరీ వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలు, లాజిస్టిక్స్ లాంటి అనేక నాణ్యమైన భూతల, గగన, సముద్ర తల వ్యవస్థలకు సంబంధించిన ఆయుధ ఉత్పత్తి జరుగుతున్నది. దేశ త్రివిధ దళాలకే కాకుండా 30కి పైగా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సేవలు వెలకట్టలేనివి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్న ప్రభుత్వ రక్షణశాఖ సంస్థగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అనాదిగా ఖ్యాతి గాంచింది.
18 మార్చి రోజున జరిగే 'ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే' వేదికగా బోర్డు ఉత్పత్తి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాలు, ఆర్టిల్లరీ, రైఫిల్స్, గన్స్, పారాచూట్లు లాంటివి ప్రదర్శించడంతో పాటుగా కవాతుల నిర్వహణ, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఆవార్డులు కూడా అందిస్తారు. అసాధారణ సేవలు అందిస్తున్న 'సాయుధ దళాల తెర వెనుక బలీయశక్తి (ఫోర్స్ బిహైండ్ ఆర్ముడ్ ఫోర్సెస్)'గా పేరు గడించిన ఆయుధ సామాగ్రి ఉత్పత్తి కేంద్రాలైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దేశ రక్షణ రంగానికే వెన్నెముకలుగా నిలుస్తున్నాయని మరువరాదు. 'ఫోర్త్ ఆర్మ్ ఆఫ్ డిఫెన్స్'గా పేరుగాంచిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు పరిధిలో 80,000లకు పైగా ఉద్యోగులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారు. దేశ రక్షణలో తెర వెనుక నిలిచి విశేష సేవలు అందిస్తున్న ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కృషి మనకు గర్వకారణం. కాగా వీటిని సైతం ''దేశభక్తులైన'' నేటి పాలకులు ప్రయివేటీకరించేందుకు పూనుకోవడం విచారకరం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037