Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. అవి కోర్ట్ కేసుల్లోనే వాయిదాలతో ఆగిపోతాయానే అనుమానాలు కూడా లేకపోలేదు. మరోవైపు సుమారు రెండులక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ఇందులో సగం కూడా ప్రకటించకపోవడాన్ని ప్రతిపక్షాలు, యువజన సంఘాలు ప్రశ్ని స్తున్నాయి. అందుకే ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా 29లక్షలమంది నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకుంటే కొంతమందికే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం నిరుద్యోగులను నిరాశలో ముంచినట్టేననే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఏండ్లు గడుస్తున్నా దానికి అతీగతీ లేదు. కండ్లుకాయలుగాసేలా ఎదురు చూస్తున్నవారి ఆశలు ఆవిరైపోతున్న పరిస్థితి.
పాలకులు పరిశ్రమలు వస్తాయని, ఉపాధి దొరుకుతుందని ఆశలు కల్పించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు. కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ కేంద్రంతో పోట్లాడి తెప్పిస్తామన్నారు. మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తామన్నారు. కానీ, అడుగు ముందుకు పడలేదు. ఆశలు తీరలేదు. వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో ప్రరిశమలు ప్రారంభించాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గత శాసనసభ ఎన్నికల ముందు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు టీఆర్ఎస్ హామీల వర్షం కురిపించింది. గెలిచి మూడేండ్లు గడిచినా అడుగు ముందుకు పడలేదు. టెక్స్ టైల్ పార్కుతో జిల్లా అభివృద్ధి జెడ్ స్పీడ్‌తో ముందుకెళ్తుందని మురిసిపోయి సంబరాలు చేసుకున్నారు. కానీ, ప్రజల ఆశలు నెరవేరలేదు.
22 అక్టోబర్ 2017న ముఖ్యమంత్రి కేసీఆర్ టెక్స్ ట్రైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుగా నామకరణం చేశారు. ఇది ప్రారంభమైతే ప్రత్యక్షంగా సుమారు 70వేలమందికి, పరోక్షంగా మరో 30వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వెంటనే పరిశ్రమలు ప్రారంభించాలని కాకతీయ మెగా టెక్స్ టైల్ పరిశ్రమకు 2వేల ఎకరాల భూమి సేకరించారు. ముందుగా 1190ఎకరాల భూమిని దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు రూ.1075కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మౌలిక సదుపాయాలు, సాధారణ సౌకర్యాలు, భవనాలు, ప్లాంట్ యంత్రాల ఖర్చుతో సహా రూ.9వేల కోట్ల పెట్టుబడి అవసరం ఉటుందని నిర్ధారించారు. స్పిన్నింగ్, నేయడం, అల్లడం ప్రాసెసింగ్‌తో పాటు రెడీమెడ్ గార్మెంట్ పరిశ్రమలతో ఏటా రూ.7వేల కోట్ల ఉత్పత్తి జరుగుతుందని ప్రాథమిక అంచనా. పేపర్ మీది ప్రణాళికలు ఆచరణలోకి రాలేదు. మౌలిక సదుపాయాలతోపాటు పైన పేర్కొన్న ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అంగట్లో అన్నీ ఉన్నా కొనుక్కోవడానికి కాసులు లేనట్టుగా పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే 3వ రాష్ట్రంగా ఉంది. 50 నుంచి 60లక్షల బేళ్లకుపైగా ఉత్పత్తి అవుతోంది. దేశంలో 60శాతం పత్తిమీదనే ఆధారపడి టెక్స్టైల్ పరిశ్రమలు వెలుగొందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి అత్యధికంగా పండుతుంది. ఇక్కడ జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులు అత్యధికంగా ఉన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన యంగూన్ టెక్స్ టైల్ పరిశ్రమ కార్యకలాపాలు ఆరునెలల్లోనే ప్రారంభించి 12వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేరళకు చెందిన కిటిక్స్ పరిశ్రమ రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 4వేలమందికి ఉపాధి కలుగుతుందని ఊదరగొట్టారు. కానీ, నేటికీ అతీగతీ లేదు. కాగితాల మీద మాత్రమే ఒప్పందాలు జరిగాయి. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కరోనా సాకుతో పనులు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే వాదనలో పసలేదు. ఎందుకంటే కరోనా కంటే రెండేండ్ల ముందే ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. నేడు కేంద్రం నిధులు ఇవ్వాలని కొత్తపల్లవి అందుకున్నారు. అవకాశవాదంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆత్మనిర్భర్ భారత్ తయారు చేసేందుకు 13 పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ 7 మెగా టెక్స్ టైల్ పరిశ్రమలను స్థాపించాలని నిర్ణయించి రూ.4వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి పీఎం మిత్ర పథకంగా ప్రకటించి రాష్ట్రాలను దరఖాస్తు చేసుకోమన్నారు. ఎక్కడ అనుకూల వాతావరణం, వనరులు ఉంటే అక్కడ పరిశ్రమ కేటాయిస్తామని చెప్పారు. ఈ పథకానికి అర్హత సంపాధించాలంటే వెయ్యి ఎకరాలకు పైగా భూమి కేటాయించి అభివృద్ధి చేయాలి. రోడ్డు, రైలు, ఓడరేవులు, విమానాశ్రయం, కనెక్టివిటీ ఉండాలి. ముడిసరుకు విద్యుత్, తగినంత నీటి సౌకర్య లభ్యత ఉండాలి. కార్మిక చట్టాలతోపాటు రాష్ట్రాల పారిశ్రామిక విధానాల వంటి ఇతర అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా రైల్వే పెట్టుబడిదారులతో కలిపి పీపీపీఎల్ ద్వారా అభివృద్ధి చేస్తారట. మొదటి ప్రతి మెగా టెక్స్టైల్ పార్కుకు రూ.300కోట్లు కేటాయిస్తారట. రెండేండ్లకోసారి పరిశ్రమ పనితీరు సమీక్షించి నిధులు కేటాయిస్తామని కేంద్రం ప్రకటించింది. ఏడు మెగా టెక్స్ టైల్ పరిశ్రమలకు 10రాష్ట్రాలకు పైగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు కేంద్రం మెండిచేయి చూపింది. విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే వ్యాగన్ పరిశ్రమ, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌కు అతీగతీ లేదు. కేంద్రంతో సంబంధం లేకుండా గత ఎన్నికల ముందు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ప్రారంభించి ఉపాధి చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగ సమస్యకు కారణమన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోంది. నిరుద్యోగ దీక్షలు చేపట్టి మోసం చేయాలని చూస్తోంది. రాజకీయ ప్రాబల్యం కోసం టీఆర్ఎస్, బీజేపీలు పాలక పార్టీలన్న విషయం మర్చిపోయి పరస్పర విమర్శలకు పాల్పడుతూ ప్రజలను మోసగిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి నిరోధక పార్టీలుగా టీఆర్ఎస్ బీజేపీలు వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి పార్టీలకు బుద్ధిచెప్పాలంటే ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయడమే ఏకైక మార్గం.
- గడ్డం రమేష్
సెల్:9490098484