Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మనిషి ప్రవర్తన, ప్రవృత్తుల గురించి మనం ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే, మనిషి వల్లే మానవ జాతికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇది అందరికీ తెలిసిన దయనీయమైన పరిస్థితి. మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అతని మానసిక ప్రవర్తన, పరివర్తనల మీద అధ్యయనం జరాగాల్సి ఉంది. రాబోయే అతి భయంకరమైన ప్రమాదాలకు మనమే కారణం కాబోతున్నాం అని తెలుసుకోవడం మంచిది'' అని అన్నారు స్విర్జల్యాండ్ సైకియాట్రిస్ట్ కార్ల్ గుస్టావ్ జంగ్ (26 జులై 1875- 6 జూన్ 1961). ఇది ఆయన 1959లో చెప్పిన మాట! పాత తప్పుల్ని సరిదిద్దుకుంటూ అవగాహన పెరిగిన ఆధునికుడు ప్రతి విషయాన్ని మళ్ళీ కొత్తగా ఇప్పటి పరిస్థితులకు అనువైన విధంగా నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పౌలింగ్ అంటారు... ''మానవ వాదమనేది ఆనందకరమైన తాత్త్విక సేవ. మనవాళికి అత్యున్నతమైన సేవలు అందించడానికి, కొత్త కొత్త ఆలోచనలతో అందరికీ వైజ్ఞానిక ప్రగతిని అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించబడింది'' అని అన్నారు లినస్ కార్ల్ పౌలింగ్ అమెరికా రసాయన శాస్త్రవేత్త, రచయిత, శాంతి కార్యకర్త.
ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన అంశాల్ని విపులంగా పరిశీలిద్దాం! బౌద్ధ ధమ్మాన్ని (ధర్మాన్ని) ధ్వంసం చేస్తూ వచ్చిన ఆర్యులు బౌద్ధాన్ని కనుమరుగు చేయడం కోసమే -బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే పేర్లతో దేవుళ్ళని సృష్టించి, జనం మెదళ్ళని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అందుకే చూడండి... 'బ్రాహ్మణుడు లేకుండా ఏ కార్యక్రమం జరగదు' అనే స్థితికి సమాజాన్ని తీసుకొచ్చారు. బహుజన సమాజాన్ని అజ్ఞానులుగా చేశారు. అందువల్ల బ్రాహ్మణులు లేకుండా, అర్థంలేని మంత్రాల ప్రమేయం లేకుండా ఎవరి కార్యక్రమాలు వారు హుందాగా నిర్వహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆధిపత్య వర్గాలవారు తమ ఉనికిని తాము కాపాడుకోవడానికి దేవుడు, మతం, మంత్రాలతో... కొన్ని కట్టుకథల ఆధారంగా తమ ఆధిపత్యాన్ని ఇంకా చాటుకుంటూ ఉన్నారు. బహుజనులు దాన్ని గుర్తించాలి!
చిన్నప్పుడు పాఠశాలల్లో చదువుకునే రోజుల్లో పరుగుపందాలుండేవి. మామూలు పరుగు పందాలు కాకుండా ఒంటికాలితో ఎవరెంత దూరం - ఎంత వేగంతో పరుగెత్తుతారు అని ఒక పోటీ ఉండేది. అది కాక, ఒకరి కాలు మరొకరి కాలుతో కట్టేసి - అలా జంటలుగా పరుగెత్తే పోటీ మరొకటి ఉండేది. నిజ జీవితంలో అణగారిన వర్గాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ రెండు కాళ్ళు కట్టేసి, గెంతుతూ పరిగెత్తమంటారు. అందరిలాగే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయని చెప్పనైతే చెపుతారు. కానీ, అవి ఉండవు. అలాంటి ఎన్నెన్నో బంధనాలలో చిక్కుకుని కూడా ఎంతో శ్రమించి, నెగ్గుకొచ్చిన బహుజనులు ఉన్నత స్థానాల్ని అలంకరిస్తే, అప్పటికీ ఈ లోకం హర్షించదు. 'వెధవలు రిజర్వేషన్లో వచ్చినవారు' అని ఎద్దేవా చేస్తుంది. రిజర్వేషన్ కాదని, కేవలం ప్రతిభతో నెగ్గుకొచ్చినా... ప్రశంస లభించదు. కాళ్ళు కట్టేసినా, రెక్కలు విరిచేసినా ఆత్మబలంతో గెంతుతూ ఎగురుతూ ఉన్నత శిఖరాలకు చేరుకున్న విషయాన్ని తక్కువ చేసి చెపుతుంది.. లోకం! అగ్రవర్ణానికి చెందిన క్రీడాకారిణి ఓ చిన్న పతకం తెస్తే, బాకాలూదే మీడియా వేలడప్పులు కొట్టి చెప్పిందే చెపుతూ ఉంటుంది. అదే ఏ దళిత యువతో క్రీడల్లో రాణించి స్వర్ణపతకం తెచ్చినా, మీడియా గొంతు పెగలదు. ప్రభుత్వ పెద్దల చూపు ఆనదు. ఇలాంటి వివక్ష ఇంకా ఎంతకాలం? మనుషులు, వ్యవస్థలు, ప్రభుత్వాలు వైఖర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదా?
పోటీ ఉంటే గింటే సమానంగా ఉండాలి. అవకాశాలు ఇవ్వకుండా అణిచిపెట్టి, విద్యకు ఆర్థిక స్థోమతకు దూరం చేసి శూద్రుల్ని, మహిళల్ని, దళితుల్ని అణగదొక్కి, వాళ్ళంతా తెలివిలేని వారని నిర్ణయిస్తే ఎలా? సమానావకాశాలు కల్పించి చూడండి. అబద్దాన్ని నిజమని నమ్మించడం సుళువైపోయింది. నిజాన్ని నిజమని నమ్మించడమే కష్టమైన పనిగా మారింది. అందుకే అధిక సంఖ్యాకులైన బహుజనులు, మైనార్టీలు, మహిళలు విషయాన్ని విస్తారంగా అవగాహన చేసుకోవాల్సిన తరుణం వచ్చేసింది. ఇంతెందుకూ? అక్రమంగా ఆక్రమించుకున్న లక్షల ఎకరాల భూమి ఎవరెవరిదో లెక్కలు తీయండి. చమటోడ్చి వాటిని పండిస్తున్న దెవరో లెక్క కట్టండి. విషయం బోధపడుతుంది. వివక్ష, అణచివేత గురించి అంతా అక్కడే తేటతెల్లమవుతుంది. స్వేచ్ఛగా పరిగెత్తగలిగిన వారు పరిగెత్తగలిగినంత దూరం పరిగెత్తి భూములు ఆక్రమించుకున్నారు కదా? అది సరిపోలేదన్నట్లు అర ఎకరం గాళ్ళను ఇంకా ఎందుకు హింసిస్తారూ? ఇక్కడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి! ''బ్రాహ్మణ స్త్రీ కడుపుతో ఉంటే తనకు పుట్టబోయే కొడుకుకు ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తి పదవి దొరుకుతుందేమోనని ఆశపడుతుంది. దాని కోసమే ఆలోచిస్తుంది. కానీ, అదే నిమ్నజాతి స్త్రీ అయితే ఏ మున్సిపల్ పరిధిలోనో పాకీపని కోసం ఆలోచిస్తుంది. అంతకంటే ఉన్నతమైన ఉద్యోగం కోసం ఆశపడదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే, హిందూ మత ప్రభావం బలంగా ఉండటం వలన! అగ్రకులాల వారు ఉన్నతమైన కోర్కెలు కోరుకోవాలని, తక్కువ కులాల వారు హీనమైన కోర్కెలు మాత్రమే కోరుకోవాలని హిందూమతం కొన్ని శతాబ్దాలుగా బోధిస్తూ ఉన్నందు వల్ల, ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి వర్థిల్లుతూ ఉంది. హిందూమతంలో అంతర్భాగంగా ఉన్నంత కాలం శూద్రులు, మహిళలు ఏ విధమైన మార్పును ఆశించలేరు. హిందూ మతాన్ని వదిలి, బుద్ధుని మార్గాన్ని అనుసరించగలిగితే.. ఉన్నతమైన ఆశయాలకు, ఆశలకు ఆస్కారం ఉంటుంది!'' అన్నారు అంబేద్కర్.
తమకు తాము అగ్రవర్ణాలుగా ప్రకటించుకున్న ఆర్యులు (బ్రాహ్మణులు / మనువాదులు) మిగతా అధిక సంఖ్యాకుల్ని తమకు బానిసలుగా బతకమన్నారు. అంతే కాదు, వారు తమకు ఏఏ దానాలు ఎప్పుడెప్పుడు చేయాలో, ఎలా చేయాలో కూడా ప్రకటించారు. విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం... బ్రాహ్మణులకు చేయాల్సిన షోడశ (16) దానాలలో మొదటిది కన్యాదానం. బ్రాహ్మణుడికి ఏయే దానాలు ఇవ్వాలో తెలియజేసే శ్లోకం ఎలా ప్రారంభమవుతుందో గమనించండి.. ''కన్యా కనక దాసీచ శకటాశ్వ గజా గృహం'' - కన్యాదానం పెండ్లికొడుక్కి చేసేది కాదు, పురోహితుడికి చేసే తంతుగా మొదట ప్రారంభమైంది. పెండ్లి కూతురు మూడు రాత్రులు బ్రాహ్మణుడితో గడిపిన తర్వాతనే సదరు పెండ్లి కొడుకు దగ్గరకు వచ్చే సంప్రదాయం ఉండేది. కాలక్రమంలో నాగరికత పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మారింది. సంప్రదాయవాదులు ఇంకా ఇదే పద్ధతి కొనసాగాలని అనుకుంటున్నారా?
దత్తం న దీయతే దానం / గ్రాహీత్పవ యాచతే!
ఉభౌతే నరకే యాతశ్చిన్నర జ్జో / ఘటో యథా!!
(45-60) (శ్రీ దేవీ భాగవతం)
దీని అర్థం ఏమిటంటే.. బ్రాహ్మణుడు అడిగిన దక్షిణ ఇవ్వని ఇంటి యజమాని కుంభీపాక నరకాలకి పోతాడు. లక్ష సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానా హింసలు అనుభవిస్తాడు. అటుపై దరిద్రుడిగా, వ్యాధిగ్రస్తుడిగా జన్మిస్తాడు. అతని కుటుంబంలో అటూ, ఇటూ ఏడు తరాలవారికి మహాపాపం చుట్టుకుంటుంది. ఇదంతా భయపెట్టడానికి అతిశయోక్తులు చెప్పినట్టుగా ఉంది. లక్ష సంవత్సరాలు ఎవరు జీవించాలి? యమదూతలు హింసించాలంటే ఆ ఇంటి యజమాని లక్ష సంవత్సరాలు జీవించి ఉండాలి కదా? యమదూతలు కల్పితమే, లక్ష సంవత్సరాలు జీవించడం కల్పితమే, ఏడు తరాల మహాపాపం కల్పితమే. జనాన్ని భయభ్రాంతులను చేయడానికి వారు ఏస్థాయికైనా పోతారనేది అర్థమవుతూ ఉంది. భగవద్గీతలో ఇలా ఉంది... ''అన్నము వలన జంతు జాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మవలననే సంభవమగును'' ప్రకృతిపై నేడు స్కూలు పిల్లలకు గల అవగాహన కూడా నాటి భగవద్గీత రచయితలకు లేదు. పర్యావరణ పరిజ్ఞానం ఏ మాత్రం లేకపోయినా, అదొక పవిత్ర గ్రంథంగా ప్రచారం చేశారు.
ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లా జలాన్లో ఒక దళిత యువకుడు అగ్రవర్ణాల వారితో సహపంక్తి భోజనం చేశాడని, బయటికి లాగి ముక్కుకోసేశారు. ఇది 2021 ఆగస్టు 9న జరిగింది. రామాయణంలో శూర్పణఖ ముక్కు చెవులు కోయడం... వీరికి స్ఫూర్తినిచ్చి ఉంటుంది. అసలైతే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి. అగ్రవర్ణానికి చెందిన ఆ దుండగులు బలవంతులు కావడంతో స్థానిక పోలీసులు తమ విధి నిర్వహణ మరిచారు. అగ్రవర్ణ దుండగుల్ని వదిలేశారు. దేశంలో బలహీనులైన వారికి న్యాయం లభించదు. ఇలాంటివి కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతాయి. పాపం, పుణ్యం, దేవుడు, దైవాజ్ఞల పేరుతో అమాయకులైన అధిక సంఖ్యాకుల్ని మోసం చేస్తూ ఇంత వరకు బతికింది చాలదా? బానిసలుగా బతికిన అసంఖ్యాకులైన ప్రజలు ఇకనైనా తమ జీవితాల్ని పునఃనిర్వచించుకోవాలి కదా? పాత విలువల్ని ధ్వంసం చేస్తూ సమాన హక్కుల కోసం, స్థాయి కోసం పోరాడాల్సిన అవసరం లేదా?
ఒక దేశంలో 'కళ్ళుండటం ఒక రోగం' అని భావిస్తారట! కళ్ళున్న వారి కళ్ళు పొడిచి గుడ్డివాళ్ళను చేస్తారట. ఆ దేశమేదో మనదే ఎందుకు కాకూడదూ? కళ్ళు మాత్రమే కాదు ఇక్కడ మెదళ్ళు కూడా చిదిమేస్తారు. ''వేదాలలో ఏముందని'' అడుగు చాలు! చంపేయకపోతే చూడు. పోనీ నువ్వే ఇంకొకర్ని చంపుతూ పోయావనుకో - ఫినిష్! నిన్ను ఈ దేశం డేరాబాబానో, సద్గురువునో చేసేస్తుంది. అంతే!! ఇలాంటివి కేవలం ఇండియాలోన సాధ్యం! అంతే కాదు ఇండియాకే పరిమితం. దొంగబాబాలు, దొంగ సన్యాసులు, రాజకీయ నాయకుల వేషధారణలో ఉన్న యోగులు అధిక సంఖ్యలో ఉన్న దేశం కదా ఇది? వీరంతా ఒక్కసారి ప్రజాకవి వేమన పద్యాలు చదివి అర్థం తెలుసుకుంటే ఎంత బావుండునూ? ''ఎద్దుకైన గాని యేడాది తెలిపిన / మాట తెలిసి నడుచు మర్మమెరిగి / మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకు నైన / విశ్వదాభిరామ వినురవేమ'' - ఒక్క సంవత్సరం పాటు నేర్పిస్తే ఎద్దయినా మనం చెప్పినట్లు నడుచుకుంటూ సేద్యానికి ఉపయోగపడుతుంది. మూర్ఖుడు మాత్రం ముప్పయేండ్లు చెప్పినా తెలుసుకోలేడు- అని ఆ వేమన పద్యానికి తాత్పర్యం. హేతువాదం తెలియని వారిని నాయకులుగా ఎన్నుకుంటున్న ఈ దేశ ప్రజలు ఎంతకాలం ఎద్దుకన్నా హీనంగా వ్యవహరిస్తారూ? ''ఎవడెవడు బ్రహ్మకు పుట్టాడో మాకు తెలియదు. మేం మాత్రం మా అమ్మకే పుట్టాం'' - అన్నాడు మహాకవి గుర్రం జాషువా. ఆ మాటలోని అంతరార్థం గ్రహించనంత కాలం, వర్గ వ్యవస్థను ధిక్కరించనంత కాలం, మానవ జాతి అంతా ఒక్కటే.. అని నినదించనంత కాలం ఈ దేశం ఇలాగే అభివృద్ధి చెందని దేశాల్లో ఒకటిగా ఉండిపోతుంది! సంప్రదాయ వాదుల నోళ్ళు మూయించి, దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించాల్సిన బాధ్యత నేటి యువతరం మీదే ఉంది.
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు