Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా లింగ అసమానతలను గణనీయంగా పెంచడంలో కోవిడ్-19 ప్రధానమైన పాత్ర పోషించింది. అలాంటి అసాధారణ అసమానతలు తీవ్రంగా పెరిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. కరోనా మహమ్మారి, దాని కారణంగా విధించిన వరుస లాక్డౌన్లు సృష్టించిన ఉపాధి సంక్షోభానికి మహిళలు ముఖ్యంగా యువతులు బాధితులయ్యారు. పనిలో మహిళల భాగస్వామ్యం రేటు ఊహించని రీతిలో చాలా దిగువ స్థాయికి అంటే 10శాతం పైగా కుదించుకొని పోయింది. లాక్డౌన్ కాలంలో మహిళలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అసమానంగా తమ ఉపాధిని కోల్పోయారు. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా మహిళల ఉపాధి కోలుకోకపోగా తగ్గడం కొనసాగుతున్నది. మార్కెట్లు లాక్డౌన్ కాలంలో మూసివేయడం వలన స్వయం ఉపాధి కార్మికులైన మహిళలకు తమ ఉత్పత్తులను అమ్మడం సాధ్యం కాలేదు. అంతేకాక మైక్రోఫైనాన్స్ సంస్థలు ఆ కాలంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఒత్తిడి చేయడం వల్ల ఆ ప్రభావమూ మహిళలపై పడింది. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ వారు దేశ వ్యాప్తంగా 5వేల మంది అసంఘటిత రంగ కార్మికులపై చేసిన అధ్యయనంలో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా కార్మికులు 71శాతం మంది తమ ఉపాధిని కోల్పోయారని తేలింది. లాక్డౌన్ విధించిన కాలంలో దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో రెండు నెలల పాటు నిర్వహించిన సర్వే, 83శాతం మంది మహిళల ఆదాయాలు గణనీయంగా తగ్గాయని తేల్చింది. ఇది ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులలో గుర్తించారు.వారు పనిని కోల్పోయారు, వేతనాలు లేవు. సంక్షేమ బోర్డులు చెల్లించిన సహాయనిధి కేవలం 6శాతం మంది కార్మికులకు మాత్రమే దక్కింది. బజార్లలో తిరిగి అమ్ముకునే వాళ్ళు 97శాతం మంది పూర్తిగా ఆదాయాలు కోల్పోయారు. చెత్త ఏరుకునే మహిళలు కూడా ఆదాయాలు కోల్పోయారు. లాక్డౌన్ కాలంలో చెత్త ఏరడం, వాటిని వేరుచేసి అమ్మడం ఇబ్బందిగా మారింది. కాంట్రాక్టర్ల కింద పనిచేసే కార్మికులు అప్పటికే తమకు రావాల్సిన చెల్లింపులను నిలిపివేశారని చెప్పారు. యజమానుల ఇండ్లలోకి వెళ్లడానికి నిబంధనలు అనుమతించలేదు కాబట్టి ఇండ్లలో పనిచేసే మహిళా కార్మికులకు లాక్డౌన్ కాలంలో జీతాలు లేవు. తమ పనిని కోల్పోకుండా జాగ్రత్తలు వహించిన కార్మికులు చాలా తక్కువ వేతనంతో పని చేశారు.
లాక్డౌన్ కాలంలో భారతీయ మహిళా రైతులకు గుర్తింపు లేకుండా పోయింది. స్వంత రవాణా వ్యవస్థ కలిగి ఉన్న కొద్దిమంది మహిళా రైతులు కూడా తమ ఉత్పత్తులను రవాణా చేయడానికి అవసరమైన అనుమతి పాసులను పొందలేక పోయారని సెల్ఫ్ ఎంప్లార్డు విమెన్స్ అసోసియేషన్ వారు చేసిన సర్వేలో వెల్లడైంది. అంటే వారు పెద్ద మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకోలేక పోయారు. మార్కెట్లకు వెళ్లే అవకాశాలు సన్నగిల్లడం వల్ల కొద్దిపాటి భూమి మాత్రమే ఉన్న మహిళా రైతులు వారు బతకడానికి అవసరమైన పంటల సాగుకే పరిమితమయ్యారు.
భారతదేశంలో దాదాపు చెల్లింపులులేని పనులనే మహిళలు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా మహమ్మారి మహిళలు చేసే చెల్లింపులు లేని పనిని మరింత పెంచింది. లాక్డౌన్ కాలంలో పురుషులు ఇంటి వద్దనే ఉండడంతో, మహిళలు చేసే ఇంటిపని భారం పెరిగింది. పిల్లలు, వృద్ధులను కనిపెట్టుకొని ఉండే పని కూడా లాక్డౌన్ కాలంలో బాగా పెరిగిపోయింది. లాక్డౌన్ కారణంగా ఆహార వస్తువుల కోసం రేషన్ షాపుల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూలో నిలబడి ఉండడం అంటే ఎక్కువ సమయాన్ని కేటాయించే పరిస్థితి ఏర్పడింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో ఆహారాన్ని పొందే అవకాశాలు బాగా సన్నగిల్లాయి. ఆ కాలంలో ఆహార అభద్రతను అనుభవించామని 'రైట్ టూ ఫూడ్ క్యాంపెయిన్ అండ్ సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్' నిర్వహించిన సర్వేలో పాల్గొన్న పది కుటుంబాలలో ఎనిమిది కుటుంబాల వారు చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో పావువంతు కుటుంబాలు తీవ్రమైన ఆహార అభద్రతను అనుభవించామని చెప్పారు. కరోనా మహమ్మారికి ముందు కాలంలో తీసుకున్న పౌష్టికాహారం కన్నా మహమ్మారి తరువాత తీసుకున్న పౌష్టికాహారం నాణ్యత తగ్గిందని ఐదింట రెండొంతులకు పైగా కుటుంబాలు తెలిపాయి. కుటుంబాలలోని మగవారి కంటే మహిళలల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపింది.
లాక్డౌన్ కారణంగా 2022 ప్రారంభం వరకు స్కూళ్లు మొత్తం మూసేసిన ఫలితంగా పిల్లల పౌష్టి కాహారంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇది సుమారు 80శాతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై (సుమారు 144 మిలియన్ల మంది పిల్లలు) ప్రభావం చూపింది.
'ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం' కింద నిర్వహించబడిన అంగన్వాడీ కేంద్రాల మూసివేత ఆ కాలంలో మరో విపత్తు. ఈ పథకం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లలకు ఆహారాన్ని సమకూర్చుతుంది. కానీ అధికారంలో ఉన్న వారు ఇది అవసరమైన చర్యగా భావించలేదు. ఈ కేంద్రాల మూసివేత తల్లీ, పిల్లలపై దీర్ఘకాలికమైన ప్రభావాన్ని చూపింది. సుమారు 100 మిలియన్ల మంది పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఈ పథకంపై ఆధారపడ్డారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంచనా వేసింది. గతంలో అంగన్వాడీ కేంద్రాల నుండి తమ పిల్లల కోసం పౌష్టికాహారాన్ని తీసుకుని వచ్చేవారు. కానీ లాక్డౌన్ కాలంలో, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ఆ కేంద్రాలను మూసివేయడంతో పౌష్టికాహార లోపాలతో అనేక మంది పిల్లలు చనిపోయారు.
గర్భం దాల్చిన సమయంలో, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. రోజువారీ ఆరోగ్య సేవలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ క్రమంగా లేకపోయిన కారణంగా ఆదాయాలు, ఉపాధిని కోల్పోయిన పేద మహిళలు అనేక కష్టనష్టాలను భరించాల్సి వచ్చింది. లాక్డౌన్ను ఎత్తేవేసిన తరువాత ప్రసవాలకు సంబంధించిన ఆరోగ్య సేవలకు మార్గదర్శకాలు జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నెల రోజుల సమయం పట్టింది. ఆ జారీ అయిన మార్గదర్శకాలు కూడా ఆసుపత్రుల్లో అధికారులను గందరగోళ పరిచే విధంగా ఉండడంతో వైద్యం కోసం వచ్చిన మహిళలు తిరిగి వెళ్ళి పోయారు. చివరకు మార్గదర్శకాలు జారీ చేసిన తరువాత, ఆసుపత్రికి వెళ్లాలనుకునే గర్భిణీ స్త్రీలు కోవిడ్ పరీక్ష చేయించి, దానిలో వారికి వ్యాధి సోకలేదనే ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఆ పరీక్ష చేయించడానికి కనీసం ఒక రోజు సమయం పడుతుంది, పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు అది సాధ్యపడలేదు. ఆ కారణంతో అనేకమంది మహిళలను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలకు అనుమతించలేదు. లాక్డౌన్ విధించిన మూడు నెలల కాలంలో ఆరు మిలియన్ల మంది గర్భిణీ స్త్రీలలో 15శాతం మందికి ఆరోగ్య సేవలు అందకుండా పోవడం లేదా ఆసుపత్రుల్లో ప్రవేశం పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొనడం జరిగిందని అంచనా వేశారు.
లాక్డౌన్ విధించిన సమయం నుండి లింగపరమైన ఆందోళనల పట్ల భారతీయ అధికారగణంలో నిర్లక్ష్య ధోరణి కనిపించింది. జాతీయ లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ నిత్యావసర సరుకుల జాబితాను మార్చి 2020 చివర్లో విడుదల చేశారు. ఆ జాబితాలో సానిటరీ ప్యాడ్స్, అంటువ్యాధులను నివారించే పరిశుభ్రమైన ఇతర వస్తువులు పేర్లు లేవు. వీటి సరఫరా నిలిచి పోవడంతో మహిళల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కర్నాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఆ వస్తువులను నిత్యావసర సరుకుల జాబితాలో చేర్చారు. స్పష్టమైన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుండి లేకపోవడం వల్ల ఆ వస్తువుల ఉత్పత్తి, సరఫరాపై తీవ్రమైన ప్రభావం పడింది. పాఠశాలలు మూతపడడంతో సానిటరీ ప్యాడ్స్ పంపిణీ నిలిచిపోవడంతో, పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఎక్కువ ధరను వెచ్చించి వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే కాలంలో కుటుంబ నియంత్రణ సేవలు నిలిచిపోవడంతో సుమారు మూడు మిలియన్ల మంది మహిళలు అవాంఛిత గర్భాలు దాల్చారని, సుమారు రెండు మిలియన్ల గర్భస్రావాలు జరిగాయని, కొన్ని వేలమంది తల్లులు చనిపోయారని ఒక అధ్యయనంలో అంచనా వేశారు.
గృహహింస పెరుగుదల
జీవనోపాధిని కోల్పోయిన కుటుంబాల్లోని మగవారు కోపంతో, నిరుత్సాహంతో ఇంటికి పరిమితమై మద్యానికి అలవాటుపడి మహిళలపై హింసకు పాల్పడ్డారు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసిన జిల్లాలలో సైబర్ నేరాలు, గృహహింస కేసులు పెరిగాయని ఒక అధ్యయన గణాంకాలు తెలిపాయి. అదే కాలంలో లైంగిక దాడులు, రేప్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు (ప్రజారవాణా వ్యవస్థలో, పని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనల వల్ల) బాగా తగ్గిపోయాయి.
2020 నవంబర్ చివరి నాటికి గృహహింస కేసులు, అంతకు ముందు 12 నెలల కాలంలో నమోదైన కేసుల సంఖ్య కన్నా 60శాతం ఎక్కువగా నమోదు అయ్యాయి. భర్త, కుటుంబసభ్యులు పాల్పడిన హింసను గురించి సమాచారం ఇవ్వకుండా ఉండడం సగటు భారతీయ మహిళలకు ఉండే సహజ లక్షణం. 3/4 వంతుల మందికి పైగా మహిళలు, తాము అనుభవించిన భౌతిక, లైంగిక హింసను ఎవ్వరితోనూ చెప్పుకోరని 2015-16లో జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 తెలిపింది. వివిధ కారణాల వల్ల ఎక్కువ మంది మహిళలు అధికారులను, లేదా ఎన్జీవోలను, లేదా బయటి వారిని పిలవడానికి సాహసించరు. సహాయం కోసం చేసే విజ్ఞప్తుల వలన ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు.మామూలుగా మహిళలు, ఆగ్రహంతో ఉన్న భర్తలతోనే (పోలీసు వారి కౌన్సిలింగ్ తో) ఇంటి వద్దనే ఉండాల్సి వచ్చింది. ''సాధారణంగా మేము మొదటి, రెండవ ఫిర్యాదులతో గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోం. ప్రాథమికంగా కౌన్సిలింగ్ ఇస్తాం. వాస్తవానికి బాధితురాలితో పాటు నేరారోపణ చేయబడిన వ్యక్తికి కలిపి రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. పరిస్థితిలో ఏ విధమైన మార్పు కనిపించనప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని'' ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహౌబా, ఎస్పీ చేసిన ప్రకటన అధికారుల ధోరణిని తెలియజేస్తుంది.
జీవనోపాధిని నాశనం చేసి, ఆర్థిక అభద్రతను పెంచిన లాక్డౌన్ ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. దేశ వ్యాప్తంగా బాల్య వివాహాల సంఖ్య బాగా పెరిగిందని నివేదికలున్నాయి. మొత్తంగా చూస్తే కోవిడ్ మహమ్మారి, సాధారణ మహిళలు అమ్మాయిల పరిస్థితులను మరింత అధ్వాన్నంగా మారిస్తే, పాలకవర్గాల పితృస్వామిక ధోరణులు, అధికారగణం యొక్క నిర్లక్ష్య వైఖరి వారి జీవితాలను మరింత దుర్భరం చేశాయి.
- జయతీఘోష్
అనువాదం:బోడపట్ల రవీందర్,
9848412451.