Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: ఛ... ఛ... ఛ... ఏమి ఎన్నికలో, ఏమి తీర్పులో...? బాధలు బాధలే... ప్రభుత్వాలు ప్రభుత్వాలే. అంతా గందరగోళంగా ఉంది గురువుగారూ..
గురువు: ఏం శిష్యా ఎందుకంత ఆందోళన... కలవరం?
శిష్యుడు: లేకుంటే ఏంటండీ... ఈ ప్రజలు మళ్ళీ బీజేపీకే పట్టం గట్టారు. కష్టకాలాన్ని మర్చి పోయారు. కరోనా దెబ్బకు చిందరవందరైన బతుకులు, మైళ్ళకొద్దీ వలస కూలీల కాలినడక, గంగానదిలో తెప్పలు తెప్పలుగా తేలిన శవాలు, ఏడొందల మందిని పోగొట్టుకుని ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం... ఇవేమీ ప్రజలను మార్చలేకపోయాయి. ఇక ఈ జనం మారరండీ బాబూ.. మారరు..
గురువు: ఊరకే నిరాశతో లబోదిబోమనకు, ముందు నీవు అర్థం చేసుకోవాల్సింది జనం వేరు, ఓటర్లు వేరు, 18ఏండ్లు లోపువారికి ఓటుహక్కు లేదు. పిల్లలైన వారు నాల్గవ వంతు జనం. ఇకపోతే మిగిలిన జనం అందరిపేర్లు పూర్తిగా ఓటర్ల జాబితాలో ఉండవు. కొన్ని సంచార తెగల, ఆదివాసి తెగలవారి ఓట్లు అసలే నమోదు కావు. అలాగే కొందరి ఓట్లు రకరకాల కారణాల రీత్యా గల్లంతు అవుతాయి. ఈ అవకతవలకలు పదిశాతం ఉంటాయని అంచనా. అంటే జనంలో 65శాతం మందికి మాత్రమే ఓట్లు ఉంటాయి. అందులో పోలయ్యేవి 60-70శాతం. మెజారిటీ అంటే పోలైన ఓట్లలో సగంపైన రానక్కర్లేదు. పోటీ చేసిన వారిలో ఎక్కువ ఓట్లు వస్తేచాలు. కనుకనే 30శాతం ఓట్లు వచ్చినా గెలిచిన సందర్భాలు కోకొల్లలు. కాబట్టి మొత్తం జనంలో గెలిచిన వారిని అంగీకరించినవారు 25శాతం మించరు. పైగా నోటా కూడా ఉంది. (ఎవరికీ సమ్మతం తెలపకపోవడం). ఇదీ స్థూలంగా మన ఎన్నికల వ్యవస్థ.
శిష్యుడు: ఇదా సంగతి. మరి మొన్న ప్రధాని మోడీ పార్లమెంటులో అడుగిడు తుంటే.. జగజ్జేత మోడీకి జైజై అని బీజేపీ వారు గట్టిగా నినాదాలు ఇచ్చారంట.
గురువు: కావచ్చు. వారి దృష్టికోణం అది. ఒకేవైపు చూస్తే అలానే ఉంటుంది. మరోవైపు చూస్తే మరోలా కన్పిస్తుంది.
శిష్యుడు: ఎలా..?
గురువు: ఈ ఎన్నికల్లోనే పంజాబ్‌లో మొదటిసారి ఆఫ్ (ఆమ్ ఆద్మీ పార్టీ) అటు బీజేపీని ఇటు కాంగ్రెస్‌ను, ప్రాంతీయ పార్టీ అకాలీదళ్‌ను చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిందిగా...
శిష్యుడు: అవునవును 117 స్థానాలకు 92 గెలుచుకుంది. భగవంత్ సింగ్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎంతైనా భగత్‌సింగ్ పుట్టిన వీర కిశోర్ భూమి కదా..!
గురువు: అదిగదిగో అప్పటికప్పుడే అలా పొంగిపోతే ఎలా..?
శిష్యుడు: మరి...!
గురువు: అదే పంజాబ్ నేడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ముందున్నది. భగత్‌సింగ్ వారసత్వంతో ముందుకు రావాల్సిన యువత మత్తులో జోగుతోంది. ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా వచ్చింది.
శిష్యుడు: ఏంటి గురువుగారు. అలా అంటే ఇలా అంటారు. ఇలా అంటే అలా అంటారు. మరి ఎలా..?
గురువు: అందుకే ప్రతి విషయాన్ని సాంగోపాంగంగా పరికించాలి. వాస్తవాల నుండి విషయాన్ని గ్రహించాలి. పరిష్కారంకై చిత్తశుద్దితో అడుగెయ్యాలి.
శిష్యుడు: సాధ్యమా ఇది.
గురువు: సాధ్యమే. ప్రమాణ స్వీకారంనాడు మాన్ ఏం చెప్పాడు. ఉడ్తా పంజాబ్ కాదు, ఇక ఇది బఢ్తా పంజాబ్ (ఎదిగే పంజాబ్) అన్నాడు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడ్తామన్నాడు.
శిష్యుడు: భలే.. భలే.. యాహూ...
గురువు: ఆగాగు.. అప్పుడే భంగడా డ్యాన్స్‌లా చిందులేయకు.
శిష్యుడు: ఏమిటి గురువుగారు ఏ ఉత్సాహాన్నీ పంచుకోనివ్వరూ...
గురువు: అత్సుత్సాహం ఒక్కోసారి కొంప ముంచుద్ది. అయినా ఇక్కడ మనం చూడాల్సింది గెలుపు ఒక్కటే కాదు, గెలుపునకు దారితీసిన పరిస్థితులు కూడా.
శిష్యుడు: అవునవును వివరించండి గురువర్యా..
గురువు: ఆఫ్ పార్టీ అధినేత కేజ్రీవాల్ అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ఢిల్లీ ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా పాలిస్తున్న విషయం తెలిసిందేగా.. విద్యా, వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పలు చర్యలు చేపడుతున్నాడు. అదే ఎజెండాను పంజాబ్‌లో కూడా అమలు పరుస్తామని చెప్పాడు.
మహిళలకు ప్రతినెలా ఉచితంగా వెయ్యి రూపాయలు, బస్‌లలో మహిళలకు వృద్ధులకు ఉచిత బస్ ప్రయాణం, ఇంటికి కరెంటు 300 యూనిట్ల వరకు ఉచితం, నీటి సరఫరా ఉచితం, మాదకద్రవ్యాల నియంత్రణ, నిరుద్యోగాన్ని అవినీతిని అంతం చేయడం.. ఇలా ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాల అమలులో ఇతర పార్టీల కంటే ఈ కొత్తపార్టీ ముందుంటుందేమోననే ఆశతో పంజాబ్ ఓటర్లు ఆప్‌కు పట్టం గట్టారు.
శిష్యుడు: మరి అమలు చేయరా..?
గురువు: ఆచరణలో చూద్దాం. అన్నింటికి అంత తొందరైతే ఎలా?
శిష్యుడు: ఇంతకీ మీరు ఏం అంటారు గురువుగారు. అహ ఏం అంటారు?
గురువు: 'మార్పు ఢిల్లీ నుండి ప్రారంభమైంది. పంజాబ్‌కు చేరింది. అది దేశమంతా విస్తరిస్తుంది' అని యుద్ధం ప్రకటించాడు కేజ్రీవాల్.
శిష్యుడు: యుద్ధమా..?
గురువు: అవును యుద్ధమే. మోడీ గుజరాత్‌ను మోడల్‌గా చూపించి కేంద్రాధికారాన్ని కైవసం చేసుకుంటే నేను ఢిల్లీని మోడల్‌గా చూపించి కేంద్రాన్ని కైవసం చేసుకుంటా అనే ధ్వని ఈ మాటల్లో ధ్వనించింది.
శిష్యుడు: అమ్మమ్మమ్మా... లోపల ఇంత అర్థం ఉందా...?
గురువు: ఒకవైపు అదానీ అంబానీ వంటి గుజరాత్ వర్తక సామ్రాట్లకు దేశాన్ని దోచిపెట్టేలా చర్యలు చేపట్టడం, మరోవైపు హిందూత్వను జాతీయ ఎజెండాగా మార్చి ప్రతి ఎన్నికల్లో ఎప్పటికప్పుడు ఓట్లు కైంకర్యం చేసుకోవడం. ఈ రెండింటినీ జమిలిగా నడపడమే బీజేపీ ఎజెండా.
శిష్యుడు: మరి బీజేపీని ఆప్ ఒక్కతే ఎదుర్కోగలదా..?
గురువు: లేదు. ఆప్ చర్యల్లో సారాన్ని గ్రహించాలి. భారతదేశ భవిత కేవలం ఉచిత సంక్షేమ పథకాలపైనే ఆధారపడి ఉండదు. మానవ వనరుల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అందుకు సంబంధించి కీలకమైన విద్యా వైద్య రంగాలపై ఆప్ దృష్టి పెట్టింది కనుకనే బీజేపీకి ముచ్చెమటలు పడుతున్నాయి.
శిష్యుడు: అవునా...?
గురువు: అవును. ఇది కేవలం ఆప్‌కు సంబంధించిన పరిమిత రాజకీయ విషయమే కాదు. శాస్త్రీయ సత్యం కూడా. కేరళ ప్రభుత్వం కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రత్యామ్నాయం చూపిందా లేదా.. నిజమైన మార్పుకు అదే సంకేతం.
కనుకనే పంజాబ్‌లో ఆప్ గెలిచినందుకు కాంగ్రెస్‌వారి కంటే బీజేపీ ఎక్కువ బాధపడుతున్నది. కాంగ్రెస్‌ను నేలమట్టం చేసేందుకు మేం సర్వశక్తులు ఒకవైపు ధారపోస్తుంటే మరోవైపు ఆప్ చిగురులు తొడుక్కురావడమేమిటని చిందులు తొక్కుతున్నది.
శిష్యుడు: ఇంతకీ ఏం సెలవిస్తారు.
గురువు: ఇది ఆప్‌కు అగ్నిపరీక్ష. బలమైన అధికారం ఇప్పటికీ కేంద్రం వద్దనే ఉన్నది. మరింతగా బలం పెంచుకునేందుకు బరితెగించి బాహాటంగా సకల విలువలను ధ్వంసం చేస్తున్నది. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. కేంద్ర - రాష్ట్రాల వైరుధ్యమే భారత రాజకీయాల్లో ఇప్పుడు ముందుకు తోసుకువచ్చింది. ప్రత్యామ్నాయ విధానాలతోనే బీజేపీని ఎవరైనా వెనక్కి నెట్టగలరని కేరళ ప్రభుత్వం నిరూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి మంచి మార్పును మనం గౌరవించాలి. యువత మత్తులో జారకుండా భగత్‌సింగ్ బాటలో నడిచేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తపడాలి. సదా అప్రమత్తతే శ్రేయస్కరం. శరణ్యం.
- కె. శాంతారావు
సెల్:9959745723