Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ రాజకీయాలలో కాంగ్రెస్ శకం ముగిసిందా?
యూపీ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి తిరుగులేదా?
ప్రాంతీయ పార్టీల ప్రయత్నాలు ముందుకు సాగుతాయా?
ఈ అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. జాతీయ రాజకీయాలలో బీజేపీ కన్నా కాంగ్రెస్ గురించే ఎక్కువ చర్చ జరగటం గమనార్హం. ఆ పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోవటమే కారణం. నాయకత్వ సమస్యే ప్రధానంగా మీడియాలో చర్చ నడుస్తున్నది. అదే నిజమైతే... నాయకత్వాన్ని మార్చేస్తే కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలి. కుటుంబం ఆధిపత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని కొందరంటున్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరొకరికి పగ్గాలు అందించటమే మార్గమంటున్నారు. మరో బలమైన అభిప్రాయం కూడా ఉన్నది. ఆ కుటుంబం నుంచి కాకుండా ఎవరు నాయకులుగా ఉన్నా, కాంగ్రెస్ ఈ మాత్రం కూడా లేకుండా పోతుందన్న వాదన ఉన్నది. స్వయంగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినప్పటికీ, యూపీలో అవమానకర ఫలితాలు చవిచూసింది. జాతీయోద్యమంతో అణుమాత్రం కూడా సంబంధంలేని శక్తి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. తాజాగా యూపీలోనూ అదే జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం బలహీత కూడా నిజమే కావచ్చు. కానీ... కేవలం నాయకత్వ సమస్య చుట్టూ పరిశీలించవల్సిన చిన్న విషయం కాదు ఇది. దానిని మించిన, విధానపరమైన అంశాలను విస్మరించలేము కదా!
కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలనకు తానే ప్రత్యామ్నాయంగా ప్రజల విశ్వాసం పొందగల స్థితిలో కాంగ్రెస్ లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించగల జవసత్వాలు లేవు. ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక రంగాలలో ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోయింది. మోడీ ప్రభుత్వం మీద క్రమంగా ప్రజలలో అసంతృప్తి పెరుగుతుందనీ, అది ఆటోమెటిక్‌గా తన జేబులో ఓట్ల రూపంలో పడిపోతుందన్న భ్రమల్లో కాంగ్రెస్ ఉన్నది. ఇది కేవలం నాయకత్వం సామర్థ్యం సమస్య కాదు. దూరదృష్టికీ, ప్రణాళికాబద్ధమైన కృషికీ సంబంధించిన విషయం మాత్రమే కాదు. వీటన్నింటికీ మించి, ఇది విధానపరమైన సమస్య. ఏ విషయంలోనూ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు కనుకనే దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల పరిస్థితి దిగజారింది. ఈ ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలను, సమస్యల సుడిగుండంలోకి నెట్టింది. కరోనాకు ముందే ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారింది. గత ఐదు దశాబ్దాలలో ఎప్పుడూలేని స్థాయికి నిరుద్యోగం కరోనాకు ముందే చేరింది. ధరలు భరించలేని స్థాయికి చేరుతున్నాయి. ఆర్థిక అసమానతలు ఎప్పుడూ లేనంత ఎక్కువగా పెరిగాయి. గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. విద్యా, వైద్య రంగాలలో కార్పొరేటీకరణ కుటుంబాలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నది. అయినా వీటిని ప్రశ్నించగల నైతిక స్థైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ విధానాలన్నీ కాంగ్రెస్ ప్రారంభించినవే. మోడీ ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అంతకు ముందు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చెప్పుల్లోనే కాళ్ళు పెట్టింది. అందువల్ల ఈ పాపాలన్నింటిలో కాంగ్రెస్ వాటాను కాదనలేము. అన్ని రంగాలలో మోడీ ప్రభుత్వం నియంతృత్వ పద్ధతులను విస్తరిస్తున్నది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు కాలరాస్తున్నది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నది. గవర్నర్లను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పావులుగా వాడుకుంటున్నది. రాష్ట్రాల హక్కులు, అధికారాలు, వనరులు హరిస్తున్నది. అయినా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కోలేక పోతున్నది. ప్రజలను సమీకరించి పోరాడలేకపోతున్నది. మోడీ నిరంకుశ పోకడలను ప్రశ్నించగల స్థితిలో కాంగ్రెస్ లేదు. ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎమర్జెన్సీ నియంతృత్వ పాలనను ప్రజలు ఇంకా మరచిపోలేదు. పశ్చిమబెంగాల్లో అర్థఫాసిస్టు దమనకాండ అమలు చేసిన కాంగ్రెస్ చరిత్రను మరువలేదు. అనేక రాష్ట్రాలలో దాని హత్యారాజకీయాలు ఇంకా ప్రజలు మదిలో తిరుగాడుతున్నాయి. అందుకే ఈ విషయాలలో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేక పోతున్నారు. రాజకీయాలలో విలువల విషయంలో కూడా ఇదే పరిస్థితి.
కనీసం లౌకిక విలువల పరిరక్షణ కోసమైనా కాంగ్రెస్ నికరంగా నిలబడలేక పోతున్నది. తన పార్టీ శ్రేణులకే స్పష్టమైన దిశానిర్దేశం చేయలేక పోతున్నది. గత సార్వత్రిక ఎన్నికలలో లౌకిక విలువల పరిరక్షణ గురించి కాంగ్రెస్ మాట్లాడటానికే భయపడ్డది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం బీజేపీ మీద పోటీ చేసి, మతోన్మాద వ్యతిరేక పోరాటాలకు నాయకత్వపాత్ర పోషించేందుకు కూడా సిద్ధపడలేదు. ఇక కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎందుకు చూస్తారు? బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎట్లా తప్పో చెప్పాలి. కాంగ్రెస్ చూపిస్తున్న ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలి. అందుకు కాంగ్రెస్ సిద్ధంగాలేదు. కారణం ఒక్కటే. నాడు కాంగ్రెస్ పాలనలో అయినా, నేడు బీజేపీ పాలనలో అయినా, ప్రభుత్వ విధానాలన్నీ బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసమే! నాడు మన్మోహన్సింగ్ పక్కన ఉన్న అంబానీ, టాటా, బిర్లాలు ఇప్పుడు మోడీ పక్కన జేరారు. అదనంగా అదానీ కూడా వచ్చాడు. మౌలిక ఆర్థిక విధానాలలో ఈ రెండు పార్టీలకు తేడాలేదు.
నెహ్రూ విధానాలు దేశానికి వెన్నెముకగా కాంగ్రెస్ భావించేది. కానీ వాటి మీద బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు చేస్తున్న నిరంతర దాడిని కాంగ్రెస్ ఎదుర్కోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీనే నెహ్రూ విధానాల నుంచి బయటకు రావటం ఇందుకు కారణం. సరళీకృత ఆర్థిక విధానాలు దేశంలో ప్రారంభించిన కాంగ్రెస్, నెహ్రూ వారసత్వాన్ని నిలుపుకోలేకపోయింది. ప్రపంచంలో సోషలిజం శక్తివంతంగా ఉన్న కాలంలో తాను సోషలిజం అమలు చేస్తానని ఓట్ల కోసం ప్రజలను నమ్మబలికింది. అందువల్ల సోషలిజం మీద దాడి చేయదలుచుకున్న వారు, కాంగ్రెస్ అమలు చేసిందే సోషలిజం అని చెప్పి రాళ్ళు వేస్తున్నారు. సోషలిజం ఎదురుదెబ్బ తిన్న నేటి పరిస్థితుల్లో, సోషలిజం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవల్సిన అవసరం కూడా ఇప్పుడు కాంగ్రెస్‌కు లేదు. అందువల్ల నెహ్రూ విధానాల మీద, సైద్ధాంతిక అంశాల మీద మితవాద శక్తులు చేస్తున్న దాడిని ఎదుర్కోగల స్థితిలో కాంగ్రెస్ లేదు. అందుకే... ఏ విధంగానూ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలువలేక పోతున్నది. మరోవైపు ప్రజా ఉద్యమాలు, కార్మిక, కర్షక పోరాటాల మీద కేంద్రీకరించవల్సిన కమ్యూనిస్టులు ఎన్నికల రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చి మరింత బలహీన పడటం బీజేపీ పెరుగుదలను సులభతరం చేసింది. జాతీయ స్థాయిలో, రాజకీయ రంగంలో తగిన ప్రత్యామ్నాయం లేకపోవటమే మోడీ ప్రభుత్వానికి వరంగా మారింది. ఈ మధ్యనే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, ఎంఐఎంల వైఖరి ఎస్పీకి నష్టం చేసింది. బీజేపీకి లాభించింది. మతపర మైన విభజనతో ఓట్లు పొందేందుకు బీజేపీ అన్ని ప్రయ త్నాలు చేసింది. ఇంత జరిగినా బీజేపీ సీట్లు తగ్గిపోయాయి.
పెరుగుతున్న నియంతృత్వం, రాష్ట్రాల హక్కుల మీద దాడి, ప్రాంతీయ పార్ట్టీల పట్ల అనుసరిస్తున్న వైఖరి వల్ల క్రమంగా అనేక పార్టీలు బీజేపీకి దూరమవుతున్నాయి. అవి కేంద్రంతో ఘర్షణ పడకతప్పదు. కానీ, ప్రాంతీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్న చోట అదే ప్రయివేటీకరణ విధానాలు అమలు చేస్తున్నాయి. నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తున్నాయి. అయినా, రాష్ట్రాల హక్కుల కోసం, వనరుల కోసం కేంద్రంతో ఘర్షణ పడేందుకు సిద్ధపడిన చోట్ల ప్రాంతీయ పార్టీలు ప్రత్యామ్నాయంగా నిలబడగల్గుతున్నాయి. కానీ ఇవి తాత్కాలికంగా బీజేపీని ఓడించేందుకు ఆయా రాష్ట్రాలలో ఉపయోగపడవచ్చు. కానీ ప్రజల జీవితాలలో మౌలిక మార్పు సాధించే విధానాలు లేకుండా ప్రజలకు ఒరిగేది పరిమితమే! జాతీయ స్థాయిలో కూడా వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ప్రాంతీయ పార్టీల మనుగడనే సవాలు చేస్తున్నాయి. కేంద్రంతో విభేదించే పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నా, వనరులు తీవ్ర సమస్యగా మారాయి. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ విధానాలు లేవు. ముఠా కుమ్ములాటలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక స్థానంలో శూన్యం పెరుగుతున్నది. ఈ శూన్యం ఎక్కువకాలం నిలువజాలదు. ఏదో ఒక రాజకీయ శక్తి పూరించవల్సిందే. అది పార్టీల సంప్రదింపులు, ఫ్రంట్లతో ఏర్పడుతుందా? లేక ప్రజా పోరాటాల నుంచి ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుందా అన్నదే ప్రశ్న.
బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో వామపక్షాలు ఎదురుదెబ్బలు తిన్నాయి. ఇతర ప్రాంతాలలో కూడా పునాది కొంత చెదిరింది. కానీ కేరళలో వామపక్షం సరికొత్త విజయాలు సాధించింది. ఎన్నికల విజయాలు మాత్రమే కాదు. కరోనా కాలంలో ప్రజలను అక్కున జేర్చుకున్న అగ్రగామి కేరళ ప్రభుత్వం. వందేండ్లలో ఎప్పుడూలేని వరద బీభత్సం నుంచి ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం అది. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార రంగం పటిష్టంగా నిర్మించిన రాష్ట్రం అది. విద్య, ప్రజారోగ్యం, కనీస వేతనాల అమలు వంటి చర్యలలో ఆదర్శంగా నిలిచింది. ఉన్న పరిమితుల్లో కూడా, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజానుకూల ప్రత్యామ్నాయం చూపిస్తున్నది. ప్రజాస్వామ్యం, లౌకికత్వం లాంటి రాజ్యాంగ మౌలిక లక్షణాల పరిరక్షణ కోసం, ఫెడరల్ రాజ్యాంగ విలువల కోసం నికరంగా నిలబడుతున్నది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు, నియంతృత్వ పోకడలకు, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకునే మతోన్మాద విధానాలకు నిజమైన ప్రత్యామ్నాయ విధానాలు ప్రజల ముందుంచగల్గుతున్నది వామపక్షాలే. అందుకే మోడీ ప్రభుత్వం గానీ, ఆరెస్సెస్ లాంటి సంఫ్‌ుపరివారం గానీ వామపక్షాలనే లక్ష్యం చేసుకుని దుష్ప్రచార దాడికి పూనుకున్నాయి. కేరళ, త్రిపురలలో భౌతిక దాడులు కూడా చేస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాలలో ప్రజానుకూల ప్రత్యామ్నాయాలకు వామపక్షం నాయకత్వం వహిస్తే వామపక్షాలు ఏమేరకు బలపడితే, ఆ మేరకు దేశ పరిస్థితుల దశ, దిశ మార్పు అనివార్యమవు తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు, ఆ ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు ఏమి చేయాలో అప్పుడు చర్చించుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలే స్వతంత్రంగా, ఏదో ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలను కూడా బడా పారిశ్రామికవేత్తలు సహించజాలరు. ఆ పరిస్థితే వస్తే, మళ్ళీ కాంగ్రెస్‌కు ప్రాణం పోసేది కూడా ఆ బడాబాబులే. బీజేపీ లేదా కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటారు. దీర్ఘకాలంలో బీజేపీని నిలువరించాలన్నా, ప్రజానుకూల విధానాలు అమలు చేయాలన్నా వామపక్షాలు బలపడటంతోనే సాధ్యం. అది ప్రజా పోరాటాలతోనే సాధ్యం. ఏడాదిపాటు సాగిన రైతాంగ పోరాటం, కార్మిక హక్కుల కోసం జరుగనున్న సార్వత్రిక సమ్మె, వివిధ రంగాలలో జరిగిన దేశవ్యాపిత సమ్మెలు రానున్న కాలంలో ప్రజల కదలికను సూచిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు సహజంగానే రోజూ ఎన్నికల గురించే చర్చిస్తాయి. కానీ వామపక్షాలు మాత్రం సమస్యల పరిష్కారం కోసం ప్రజలను సమీకరించి పోరాటాలు చేయటం మీదనే దృష్టి సారించాలి. ప్రజలకు మేలు చేసేది పోరాటాలే!
- ఎస్. వీరయ్య