Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయిదు రాష్ట్రాల ఎన్నికలలో ఘోర పరాజయం, పాలించే పంజాబ్‌ను కూడా చేజార్చుకోవడం జరిగాక కాంగ్రెస్ పార్టీ ఒక విధమైన అస్తిత్వ సంక్షోభంలో అంతర్గత ఘర్షణలో మునిగిపోయింది. దేశంలో ఇప్పుడు రాజస్థాన్, చత్తీస్‌ఘర్ మినహా స్వంతంగా పాలించే రాష్ట్రాలేవీ లేవనే వాస్తవం ఆ పార్టీ నాయకులనూ శ్రేణులనూ కూడా కలవరపెడుతున్నది. కాంగ్రెస్ నిరంతరాయంగా క్షీణిస్తున్న పరిస్థితిని ఈ ఫలితాలు పరాకాష్టకు చేర్చాయి. జి23గా పేరొందిన అసమ్మతివాద నాయకుల విమర్శల మధ్య గత సోమవారంనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ముందు గాంధీ కుటుంబ నాయకత్వానికి సవాలు అని కథనాలు రావడం, రాజస్థాన్, చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీయే ఉండాలని ప్రకటించడం జరిగాయి. ఈ పూర్వరంగంలో వర్కింగ్ కమిటీ ఓటమిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతూ పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలనీ, రాబోయే ఎన్నికలను దీటుగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. రాహుల్‌గాంధీ రాజీనామా తర్వాత సోనియా తాత్కాలికంగా నిర్వహిస్తున్న ఎఐసిసి అధ్యక్ష పదవితో సహా దేశవ్యాపితంగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని పునరుద్ఘాటించింది. ఇంతలోనే కపిల్ సిబాల్ రాహుల్‌గాంధీ పెత్తనాన్ని సవాలు చేయగా మరికొందరు ఖండించారు. జి23 తరపున హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర కుమార్ హుడా బుధవారం రాహుల్‌గాంధీతో సమావేశమై గురువారం తమ గ్రూపునకు నివేదించారు. అక్కడ మంతనాల తర్వాత మరో సీనియర్ గులాంనబీ ఆజాద్ శుక్రవారం సోనియాగాంధీతో సమావేశమైనారు. పార్టీ అధ్యక్షులుగా సోనియా కొనసాగడాన్ని తామెవరూ ప్రశ్నించలేదనీ, ఆగష్టులో సంస్థాగత ఎన్నికలు ముగిసేవరకూ ఆమె ఆ పదవిలో ఉండటంపై అభ్యంతరాలు లేవని ఆజాద్ చెప్పారు. వీరందరికీ రాహుల్‌గాంధీ పాత్రపైనే అభ్యంతరాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్నా సర్దుబాటు చేసేందుకు సోనియా తంటాలు పడుతున్నారు.
ఆజాదూ, అధిష్టానం
ఇటీవలి కాలంలో ఆజాద్‌కు బీజేపీ పద్మభూషణ్ బిరుదు ఇస్తే ఆయన విపరీతంగా కృతజ్ఞతలు చెప్పడం, రాజ్యసభలో రిటైరవుతున్న సమయంలో ప్రధాని మోడీ మరీమరీ పొగడ్డమే గాక కళ్లనీళ్లుపెట్టుకుని భావోద్వేగానికి గురి కావడం, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్‌లో ఆజాద్ సోదరుడు నిష్క్రమించడం వంటి పరిణామాలు చూశాం. ఇవన్నీగాక విడ్డూరమైన పద్ధతిలో ఆజాద్‌ను మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా చేయాలని చూస్తున్నదని కూడా తెలుగు మీడియాలో నిరాధార కథనాలువచ్చాయి. మొన్నటి ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను చచ్చిపోనివ్వబోమనీ, జీవితమంతా ఆ పార్టీలో గడిపిన తమలాంటి వారికి ప్రస్తుత దుస్థితి చాలా బాధ కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. జి23 ఆధ్వర్యంలో దాదాపు పార్టీ చీలికకు కూడా అడుగులు పడుతున్నాయనే వార్తల మధ్య రాహుల్ సోనియాలు ఈ చర్చలు జరిపారని గుర్తుంచుకోవాలి.
వర్కింగ్ కమిటీలు, ఇతర చర్చలు ఎన్ని జరిగినా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబ ప్రాధాన్యత తగ్గబోదనీ, ఒకరిద్దరు వ్యతిరేక స్వరాలు వినిపించినా వెంటనే ఇతరులు ఖండించడం, అధిష్టానం బుజ్జగించి పంపడం షరామామూలేనని చాలాసార్లు రుజువైంది. ఇప్పుడు జరుగుతున్నదీ దాదాపు అదే. మోడీ, ఇతర బీజేపీ నాయకులు తమ మతరాజకీయాలను, కార్పొరేట్ ప్రయివేటీకరణను, ఏకపక్ష పోకడలను సమర్థించుకోవడానికి గాను వంశపారంపర్యం అంటూ దాడి చేయడం కూడా ఒక ప్రహసనంగా నడుస్తుంటుంది. రోగి కోరిందీ వైద్యుడు ఇచ్చిందీ ఒకటేనని ఈ రెండూ సరిపోతుంటాయి. ఏతావాతా దేశంలో బీజేపీపై పోరాటం దెబ్బతినిపోతుంటుంది. కాంగ్రెస్ అంతర్గత సంక్షోభంలో ఈ రాజకీయ కోణం కన్నా ఎవరు నాయకత్వం వహించాలన్నదే ప్రధాన మవుతుంటుంది. ఒకోచోట ఎన్నికల్లో ఓడిపోతున్న కొద్దీ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయింపులు కూడా పెరుగుతున్నాయి. అలాంటివారు ముఖ్యమంత్రులు కేంద్రమంత్రులు కూడా అయ్యారు. ఇప్పుడు ఆజాద్గానీ ఇతర జి23 నాయకులు గాని మాట వరసకు బీజేపీని ఎదుర్కొవడం అంటున్నా సైద్ధాంతికంగా ఆ విషయం చెప్పడం నామమాత్రంగానే జరుగుతుంటుంది. ఇక రాహుల్‌గాంధీ వంటివారైతే బీజేపీకి విరుగుడుగా తాము కూడా మెత్తటి హిందూత్వను ప్రదర్శిస్తే చాలన్నట్టు ప్రవర్తిస్తుంటారు. బీజేపీని ఓడించడం కన్నా తమ ప్రత్యర్థులైన ప్రాంతీయ పార్టీలను, కేరళ వంటిచోట్ల కమ్యూనిస్టులను దెబ్బతీయడానికి పాకులాడుతుంటారు. సున్నితమైన చైనా సరిహద్దు సమస్య వంటిదాన్ని పదేపదే లేవనెత్తుతుంటారు. సరళీకరణ విధానాలు తీసుకొచ్చిన ఆద్యులు వారేగనక ఆర్థికరంగంలో వారుచేసే విమర్శలకు పెద్దగా స్పందన రాదు కూడా. ప్రజల ముందు సరైన ప్రత్యామ్నాయం చూపించలేకపోవడం, ఉద్యమాలు పోరాటాలలో పాలుపంచుకోలేకపోవడం ఎన్నికలలో ఓటముల పాలవడానికి, ఉన్నపునాది హరించుకు పోవడానికి కారణం. ఉదాహరణకు ఇటీవలి రైతాంగ పోరాటాలకు పంజాబ్ ముఖ్యకేంద్రమైనా అక్కడ ఆప్ గెలిచింది తప్ప కాంగ్రెస్ కాస్త కూడా నిలబడలేకపోయింది. యూపీలో బీజేపీ, బీఎస్పీ సీట్లు తగ్గితే ఎస్పీకి వచ్చాయి తప్ప కాంగ్రెస్‌కు బదలాయించబడలేదు. రాహుల్‌గాంధీ లోక్‌సభ నియోజకవర్గమైన అమెథీలో గతంలోనే ఓడిపోయి కేరళలోని వైనాడ్ నుంచి లోక్‌సభకు వెళ్లారు. తర్వాత ప్రియాంకగాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో దీర్ఘకాలంగా అక్కడే ఉండి సర్వం తానై ప్రచారం నడిపినా ఇప్పుడు అమెథీతో పాటు రారుబరేలీలోనూ కాంగ్రెస్ సీట్లు కోల్పోయింది. కేవలం రెండు సీట్టు, 2.3శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. యూపీని వదిలేసినా మిగిలిన రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ఉన్న బలం నిలుపుకోలేకపోయింది.
అన్నా చెల్లెళ్ల నిర్వాకాలు
ఇంత జరిగినా గాంధీ కుటుంబం విజయ రహస్యమనే వీరవిధేయులకు ఏం చెప్పాలి? 2013లో అట్టహాసంగా ఉపాధ్యక్ష పదవి తీసుకుని మరో నాలుగేండ్ల తర్వాత అధ్యక్షుడైన రాహుల్‌గాంధీ తానుగా రాజీనామా చేశారే గాని ఎవరూ తొలగించలేదే? ఆపద్దర్మ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సోనియా ఈ సంక్షోభం వచ్చాకనే తాను పూర్తి స్థాయి అధ్యక్షురాలినని ప్రకటించారు కదా. పదవికి రాజీనామా చేసినా రాహుల్ ప్రియాంకలే నిర్ణయాలు తీసుకోవడం, సోనియా వారికే వత్తాసునివ్వడం పరిపాటిగా మారింది. దారుణంగా చేజార్చుకున్న పంజాబ్‌నే తీసుకుంటే నవజ్యోతి సిద్ధూ వంటి వివాదాస్పదుణ్ణి పీసీసీ పీఠాధిపతిని చేయడం, ఉన్న ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను మార్చడం అన్నా చెల్లెళ్లుచేసిన పని కాగా సోనియా కూడా సారీ చెప్పి పంపించారు. ఆయన విడిపోయి మరోపార్టీ పెట్టుకుని బీజేపీతో కలసి పోటీచేసి ఓడిపోయారు. దళితుల ఓట్లు వస్తాయంటూ వీరు కొత్తగా పాలన అప్పగించిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండుచోట్లా వ్యక్తిగతంగానూ ఓడిపోగా దళితులూ ఆప్కే ఓటేశారు. ఉత్తరాఖండ్‌లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఇంత తీవ్ర పరాజయాల తర్వాత కూడా ఆ పార్టీ అధిష్టానం సమీక్ష జరిపి బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్న మొక్కుబడి ప్రకటనలతో సరిపెడు తుంటుంది. 2014 ఓటమి తర్వాత నియమించిన ఆంటోనీ కమిటీ నివేదిక ఏమైందో ఇప్పటికీ తెలియదు. 2019 ఎన్నికల అనంతరం 2020లో ఇలాగే హడావుడిగా జరిగిన వర్కింగ్ కమిటీ కంటితుడుపు చర్యలు ఏమైందీ తెలియదు. ఇప్పుడైనా ఇంతకన్నా భిన్నంగా ఏదో జరిగిపోతుందనే ఆశ ఆ పార్టీనేతలకిే లేదు. కాంగ్రెెస్ ఎంత బలహీనపడినా అంతర్గత కలహాలు మాత్రం తగ్గడం లేదనడానికి తెలంగాణనే ఉదాహరణ. ప్రజలు గెలిపించిన ఎంఎల్ఎలు చాలా మంది టీఆర్ఎస్లో కలిసిపోగా ఓడినవారిలో ప్రముఖులు బీజేపీలో చేరగా మిగిలిన వారు కీచులాటలలో మునిగితేలుతున్నారు. బీజేపీపై పోరాటం కన్నా టీఆర్ఎస్పై కత్తులు నూరడమే కర్తవ్యంగా వ్యవహరిస్తుంటారు.
నానాటికి తీసికట్టు..
దాదాపు యాభై ఏండ్ల కిందట కాంగ్రెస్ బలహీనపడటం మొదలైన దశలో బంగ్లా కాంగ్రెస్, ఉత్కళ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ వంటివి ఏర్పడ్డాయి. ఆ తర్వాత కాలంలోనూ ఇందిరారాజీవ్ కాంగ్రెస్, శరద్‌పవార్ నేషనలిస్టు కాంగ్రెస్్, మూపనార్ తమిళమానిల కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటివి ఏర్పడ్డాయి. విడిపోయిన చెన్నారెడ్డి, ఆంటోనీ, మూపనార్, అమరీందర్ సింగ్ వంటి రాష్ట్ర స్థాయి నేతలు మళ్లీ కలవడం, విడిపోవడం చాలా జరిగాయి. ప్రాంతీయ పార్టీలు వామపక్షాల సవాలుతో ఆ పార్టీ తమిళనాడులో 55ఏండ్లుగా, బెంగాల్లో 45ఏండ్లుగా, యూపీ బీహార్లలో ముప్పై ఏండ్లుగా, ఒరిస్సా గుజరాత్‌లలో పాతికేండ్లుగా అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలలో మళ్లీ గెలుస్తుందా అనే సందేహాలు ఉండగానే పంజాబ్‌ను కూడా చేజార్చుకుంది. ఇది స్వయంకృతాపరాధమే అయినా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నట్టు అసలు ఆ పార్టీ పని అయిపోయిందని కొట్టిపారేయడానికి లేదు. ఇప్పటికీ 200 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ బీజేపీతో ప్రధానంగా తలపడవలసి ఉంటుంది. కాంగ్రెస్, ప్రాంతీయ పాలక పార్టీలు ఆర్థిక రంగంలో ఒకే విధానాలు అనుసరించడం నిజం. బీజేపీ మతతత్వ రాజకీయాలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్, కొన్ని ఇతర పార్టీలూ రాజీ పడటం నిజమే. అయినా బీజేపీనీ వాటినీ ఒకే గాట కట్టడానికి లేదు. ఆ పేరిట కాంగ్రెస్‌తో రాజకీయ సంఘటన కూడా కుదిరేది కాదు. రాష్ట్రాలలో పరిస్థితులనూ కేంద్రంలో వచ్చే ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎన్నికల తర్వాత పరిస్థితులే బీజేపీ వ్యతిరేక పొందిక తీరుతెన్నులు నిర్థారిస్తాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలకమైన అనేక శాసనసభ ఎన్నికలూ రానున్నాయి. 2022 చివరలో గుజరాత్ హిమాచల్ ఎన్నికలు ఉంటాయి. త్రిపురతో సహా మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు 2023 మార్చిలో ఉంటాయి. మే డిసెంబర్ మధ్య కర్నాటక, చత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి. ఇందులో చాలాచోట్ల కాంగ్రెస్ ఒక ముఖ్య శక్తిగా ఉంది. వాటిలో ఆ పార్టీ జయాపజయాలు 2024లో దాని పాత్రను చాలావరకూ నిర్థారిస్తాయి. కాబట్టి నానాటికి తీసికట్టుగావున్న తమ పార్టీ పరిస్థితిని సరైన విధానాలతో సమిష్టిగా అధిగమించగలరో లేదో కాంగ్రెస్ నాయకులే తేల్చుకోవలసి ఉంటుంది.
- తెలకపల్లి రవి