Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికే కొద్దిమంది పెట్టుబడిదారుల, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కోట్లాది మంది కడుపులు కొట్టే చర్యలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం, మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇంకా బరితెగిస్తోంది. నయా ఉదారవాద విధానాలను మరింత వేగంగా అమలు చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వరంగ సంస్థల్లో మిగులు భూములు, భవనాల అమ్మకానికి మోడీ సర్కార్ నిర్ణయం చేసింది. ఈ అమ్మకాల కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్(ఎన్‌ఎల్‌ఎంసి) ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకుగాను మిగులుభూమి నగదీకరణకు రూ.5 వేల కోట్ల ప్రారంభ అధీకృత షేర్ క్యాపిటల్, రూ.150 కోట్ల పెయిడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్‌తో పూర్తి యాజమాన్య సంస్థగా ఈ కార్పొరేషన్‌ను ప్రారంభించనుంది. 2021-22 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు అను గుణంగానే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపిఎఫ్) వడ్డీ రేటును తగ్గించాలని ప్రభుత్వ ప్రతినిధులు, యాజమాన్య సంఘాల ప్రతినిధులు ప్రతిపాదించ గా సిఐటియుతో పాటు ఇతర కార్మిక సంఘాలు దాన్ని వ్యతిరేకించాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయం చేసింది.
2020-2021లో పి.ఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.5శాతం ఉండగా, దీన్ని 2021-2022లో 8.1శాతానికి తగ్గిస్తూ నిర్ణయం చేశారు. తగ్గిన వడ్డీ 0.4శాతం వల్ల కార్మికులు భారీగా ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుంది. 4 దశాబ్దాల కాలంలో వడ్డీ రేట్లను అతి తక్కువగా నిర్ణయించిన కాలం ఇదే. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఎఫ్ నిధులను షేర్ మార్కెట్లలో పెట్టడాన్ని కార్మికవర్గం ప్రతిఘటించినా, ప్రభుత్వం పట్టించు కోకుండా మొత్తం పిఎఫ్ డిపాజిట్లలో 15శాతం షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టింది. వాటి లాభ, నష్టాలపై ఆధారపడి వడ్డీ రేట్లు నిర్ణయిస్తున్నారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా మోడీ చర్యలున్నాయి. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చే ముసుగులో ట్రేడ్ యూనియన్ హక్కులపై దాడి చేస్తూ కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
2019లో రెండవ సారి బీజేపీ అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాలను దూకుడుగా కొనసాగిస్తున్నది. దేశభక్తి, జాతీయత నినాదాలను చిలక పలుకులుగా పలుకుతూ ఆచరణలో ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. జాతీయ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మేస్తున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పాలసీ తెచ్చి సహజ వనరులు, మౌలిక వసతుల లీజు పేరుతో సుమారు రూ.6 లక్షల కోట్లు రాబట్టుకోవాలని కేంద్రం చూస్తున్నది. ఎటువంటి పెట్టుబడి లేకుండా దేశీయ, విదేశీ కార్పొరేట్లకు లాభాలను సులభతరం చేయడమే వీరి లక్ష్యం. ఎన్ఎంపి అనేది ప్రజల ఆస్తులను నాశనం చేసేది తప్ప మరొకటి కాదు. ఇది ఆస్తుల విలువలను తగ్గించి అంచనా వేస్తుంది. తగ్గించిన అంచనాల ఆధారంగా వాటిని తన అనుయాయులకు కట్టబెడుతుంది. ఉదాహరణకు రూ.8లక్షల కోట్ల విలువ కలిగిన జాతీయ రహదారులను కేవలం రూ.1.6 లక్షలకు, 40,000 కోట్ల విలువైన 8,154 కిలో మీటర్ల గెయిల్ పైప్ లైన్‌ను రూ.24,642 కోట్లకు, రూ.60,649 కోట్ల విలువ గల పవర్ గ్రిడ్‌ను రూ.45,200 కోట్లకే కార్పొరేట్లకు అప్పజెప్పాలని నిర్ణయం చేశారు. 400 రైల్వే స్టేషన్తు, 150 రైళ్ళు, 43,300కిలో మీటర్ల పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు, 5,000 మెగావాట్ల హైడ్రా, సోలార్, వాయుశక్తి, 8,000 కి.మీ. నేషనల్ గ్యాస్ లైన్, 4,000 కి.మీ. ఐఓసి, హెచ్‌పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్, రెండు క్రీడా మైదానాలు ఇలా లక్షల కోట్ల విలువ గల ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా లీజుకిస్తున్నారు. తెలంగాణలో కూడా సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నది. రాష్ట్రంలోని 365కి.మీ. జాతీయ రహదారులను అమ్మివేస్తున్నది. దీనివల్ల ప్రజలు పొందుతున్న అనేక సౌకర్యాలను కోల్పోతారు. యూజర్ కార్డుల భారం ప్రజలకు పెనుముప్పు అవుతుంది. ఆస్తులను ప్రయివేటీకరించడం లేదంటూ బుకాయిస్తూనే, వాటిని 30ఏండ్ల పాటు లీజుకు ఇచ్చి, ఆ తరువాత దాన్ని పొడిగించే వెసులుబాటు కూడా ఈ పాలసీలో కల్పించారు.
వ్యూహాత్మకత పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో 100శాతం వాటాల విక్రయానికి తెరతీస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని నేడు దక్షణ కొరియా కంపెనీకి 100శాతం అమ్మివేసేందుకు నిర్ణయించారు. బిడిఎల్, బిహెచ్ఇఎల్, హెచ్ఎఎల్, మిథానీ లాంటి సంస్థల్లో దాదాపు 45శాతం వాటాలు అమ్మివేశారు. జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లో లక్ష కోట్ల రూపాయల వాటాలు ఐపీఏ ద్వారా అమ్మివేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.
భారతదేశంలో 4జి సర్వీసులను 2014లోనే ప్రారంభించారు. నేటికి ఎనిమిదేండ్లు పూర్తయినా మోడీ ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి ఆ సేవలను విస్తరించలేదు. 4జి స్పెక్ట్రం కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుపడుతుంది. పైగా బిఎస్ఎన్ఎల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను అద్దెకు ఇవ్వడం ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని 2021-22 సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. విఆర్ఎస్ పేరుతో లక్ష మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులను బలవంతంగా గెంటేసే చర్యలకు పూనుకున్నది. కార్పొరేట్ సంస్థలు ఎగ్గొట్టిన బ్యాంక్ రుణాలను వసూలు చేయకుండా ప్రభుత్వరంగ బ్యాంకులను దివాళా తీయిస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ నిధులు ప్రయివేటు ఇన్సూరెన్స్ ప్రయివేటు మ్యూచ్యువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నారు. చివరికి రక్షణ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలే కొల్లగొట్టేందుకు వీలుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల బోర్డులను రద్దు చేశారు. కేంద్రం దూకుడుగా అమలు చేస్తున్న ఈ విధానాలు భారతదేశ ఆర్థిక స్వావలంబనకే పెనుముప్పు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కూడా అంబానీ, ఆదానీ తదితర కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్ప పూనుకుంటున్నది. విద్యుత్ సవరణ బిల్లు 2021ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ రంగం పూర్తిగా ప్రయివేటు వారి చేతుల్లోకి పోతుంది. సబ్ స్టేషన్ల నుండి విద్యుత్ ఉత్పత్తి వరకు ప్రయివేటు వారికి అప్పజెప్పి, ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోజూస్తున్నది. ప్రయివేటీకరణ వల్ల పేదలకిస్తున్న క్రాస్ సబ్సిడీలు రద్దయి, పేదలు పొందుతన్న రాయితీలు లేకుండా పోతాయి. రైతుల పంపు సెట్లకు మీటర్లు పెట్టాలనే నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఉచిత కరెంట్ పొందుతున్న రైతులు తీవ్రంగా నష్టపోతారు. విద్యుత్ రంగంలో ప్రయివేటీకరణ దేశ ప్రజలకు గుదిబండగా మారనున్నది.
లేబర్ కోడ్లను ప్రవేశపెట్టడం ద్వారా కార్మికులు, ట్రేడ్ యూనియన్ల హక్కులను, ఉమ్మడి బేరసారాల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ట్రేడ్ యూనియన్ల నమోదు ప్రక్రియపై తీవ్ర ఆంక్షలు విధించడమే కాకుండా, ఇప్పటికే నమోదైన కార్మిక సంఘాలను కూడా ఇండిస్టియల్ రిలేషన్ కోడ్ (పారిశ్రామిక సంబంధాల కోడ్) నిబంధనలకు అనుగుణంగా మార్చారు. ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడానికి రిజిస్ట్రార్లకు విస్తృత అధికారాలు కల్పించారు. కనీస వేతనాల నిర్ణయాన్ని పాలకుల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. పారిశ్రామిక సంబంధాల కోడ్‌తో సమ్మె హక్కుకే ముప్పు వచ్చింది. తిరిగి 12 గంటల పని దినాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని కోర్ - నాన్ కోర్ యాక్టివిటీతో పాటు అన్ని రంగాల్లో విచ్చలవిడిగా పెంచి, కాంట్రాక్టర్ల దోపిడీకి హద్దు లేకుండా చేస్తున్నారు.
ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలతో నేడు భారతదేశం విధ్వంసమవుతున్నది. దేశాభివృద్ధి, ప్రజల ఆర్థిక, సామాజిక ప్రయోజనాల పరిరక్షణకు యావత్ కార్మికవర్గం పిడికిలి బిగించాలి. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఓడిస్తేనే కార్మికవర్గానికి మేలు జరుగుతుంది. ప్రజలకు రక్షణ ఉంటుంది. అప్పుడే దేశ ప్రయోజనాలు రక్షించబడతాయి. అందుకే దేశాన్ని రక్షించుకుందాం, ప్రజల్ని కాపాడుదాం! దేశాన్ని అమ్మడాన్ని అనుమతించం అనే నినాదంపై మార్చి 28, 29 తేదీల్లో జరిగే సమ్మెకు యావత్ ప్రజానీకం మద్దతునిచ్చి జయప్రదం చేయాలి.
- పాలడుగు భాస్కర్