Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షహీద్ భగత్‌సింగ్... ఈ పేరు వింటే చాలు... యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ప్రశ్నించే తత్వం, ఆవేశం యువతకు స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ కలిగిస్తుంది.. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న జాతీయోద్యమ నాయకులలో, వయసులో అందరి కన్నా భగత్‌సింగ్ చిన్న వాడైనప్పటికి సైద్ధాంతిక అవగాహనలో దిట్ట. జాతీయోద్యమ పరిణామాలను శాస్త్రీయంగా అంచనా వేయడంతో పాటు ధీటైన పోరాట పంథాను అనుసరించాడు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సామ్రాజ్యవాద పోకడల పట్ల ధృఢమైన పోరాట మార్గాన్ని దేశ ప్రజల ముందుంచాడు. మహత్తర అక్టోబర్ సోషలిస్టు విప్లవంతో ఉత్తేజం పొందిన భగత్‌సింగ్, సమసమాజ స్థాపనకు విప్లవ పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. సోషలిజం పట్ల, స్వేచ్ఛ స్వాతంత్య్రాల పట్ల లోతైన అంకిత భావాన్ని భగత్‌సింగ్, ఆయన సహచరులూ కలిగి ఉన్నారు. భారత దేశంలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం సోషలిజం కోసం అంతర్జాతీయ కార్మికవర్గం జరుపుతున్న మహౌద్యమంలో భాగమేనని, లెనిన్ రచనలు చదివిన తర్వాత భగత్‌సింగ్ అర్థం చేసుకున్నాడు.
జాతీయోద్యమంతా రాజీ ధోరణిలో ఉన్న దశలో భగత్‌సింగ్ ఎంచుకున్న ఈ విప్లవ మార్గం ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. యువ నాయకత్వం అంతా భగత్‌సింగ్ కార్యాచరణను స్వీకరించి కదనరంగంలోకి దూకారు. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు నడిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సిన సందర్భంలో, గాంధేయవాద మార్గం, ఇతర శక్తుల పోరాట మార్గాలు ప్రజలను అసంతృప్తికి గురి చేసిన సందర్భంలో భగత్‌సింగ్ నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటమే కాకుండా మొత్తం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని తీసుకున్న నిర్ణయం జాతియోద్యమానికి గొప్ప ప్రేరణగా నిలిచింది. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్థిల్లాలి అని ఇచ్చిన నినాదం దేశవ్యాప్తంగా మార్మోగింది. ఉద్యమంలో నూతన ఒరవడిని సృష్టించింది. దేశ స్వాతంత్య్రంతో పాటు, సమసమాజ స్థాపన కోసం సోషలిజాన్ని తన లక్ష్యంగా ఎంచుకున్నారు. ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దోపిడీ చేయని వర్గరహిత సమసమాజం సాధించడమే తమ అంతిమ లక్ష్యం అని ప్రకటించాడు. అలాంటి వీరోచిత విప్లవ పోరాట కార్యాచరణ ఫలితంగానే కాంగ్రెస్ సైతం సంపూర్ణ స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు కల్పించబడ్డాయి.
నేను నా జివితాన్ని మాతృదేశ విముక్తి అనే ఉన్నతా శయానికి అంకితం చేశాను. అందువల్ల నాకు కుటుంబ సుఖాలు, ప్రాపంచిక వాంఛల పట్ల ఎలాంటి మోజు లేదంటాడు భగత్‌సింగ్. తన కుటుంబం పెళ్లికి బలవంతం చేస్తే భగత్‌సింగ్ తన తండ్రికి ఒక లేఖ రాసాడు. అందులో ''ఇది పెళ్లికి సమయం కాదు. దేశం నన్ను పిలుస్తోంది.. నేను నా దేశానికి సేవ చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నాను'' అని చెపుతాడు. అయినప్పటికీ భగత్‌సింగ్ తండ్రి ఒత్తిడి చేయడంతో మరొక లేఖ రాసాడు. ఆ లేఖలో... ''మీ ఉత్తరం చూసి నేను విస్మయం చెందాను, మీరు అమ్మ గురించి బెంగపడుతున్నారు. కానీ 33కోట్ల మందికి అమ్మ అయిన భారత మాత ఎన్ని ఇబ్బందులు పడుతోంది? ఆమె కోసం మనం అన్నీ త్యాగం చేయాలి. మాతృ భూమికి సేవ చేయడం అనే అత్యున్నత లక్ష్యానికి నా జీవితాన్ని అంకితం చేశాను'' అని ప్రకటించిన త్యాగశీలి భగత్‌సింగ్.
భగత్‌సింగ్ లౌకిక వాదాన్ని తన జీవితం తుదివరకు ఆచరించాడు. ఇతర ఏ సమకాలీన నాయకులకన్నా ఎక్కువగా భారత దేశానికి, భారత స్వాతంత్య్రోద్యమానికి పొంచి ఉన్న మతం ముప్పును భగత్‌సింగ్ అర్థం చేసుకున్నాడు. మతోన్మాదం సామ్రాజ్యవాదంలా అతి పెద్ద ప్రమాదమని హెచ్చరించాడు. మతం వ్యక్తి గత అంశంగా ఉండాలని చెప్పాడు. అయితే అది రాజకీయాల్లోకి చొరబడి మతోన్మాద రూపం తీసుకున్నప్పుడు, దాన్ని ఒక పెద్ద శత్రువును ఎదుర్కొన్నట్టే ఎదుర్కొవాలని చెప్పాడు. మతం, మూఢనమ్మకాల బంధనాల నుండి ప్రజలు విముక్తులు కావాలని విశ్వసించాడు. అయన రాసిన వ్యాసం ''నేను ఎందుకు నాస్తికుడిని అయ్యాను'' దేవుడు, మతం పట్ల ఆయన వైఖరిని చాలా స్పష్టంగా వెల్లడిస్తుంది. కుల మతాలకతీతంగా వ్యవహరించే కొత్తతరం యువత రావాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది.
కానీ, స్వాతంత్రోద్యమంలో ఏ మాత్రం ప్రమేయంలేని సంఫ్‌ుపరివార్ శక్తులు, నేడు అధికారం చేపట్టి దేశభక్తికి, జాతీయతకు కొత్త అర్థాలు చెపుతున్నారు.. ఉద్యమంలోలేని వారిని కీర్తిస్తూ, అసలైన జాతీయ భావాలు కలిగిన త్యాగధనుల కించపరుస్తున్నారు. మనువాద అజెండాతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, తమ రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మతతత్వ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకునేందుకు యువత ఉద్యమించడమే భగత్ సింగ్‌కు నిజమైన నివాళి...
- కోట రమేష్
సెల్ : 9618339490