Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలనుండి తక్కువ స్థాయి వేతనాలు ఉండే దక్షిణాది దేశాలకు పెట్టుబడులు తరలిపోవడం ఎక్కువమంది దృష్టిని ఆకట్టుకుంది. ఇదే కాలంలో తక్కువ స్థాయి వేతనాల ఉన్న తూర్పు యూరప్ దేశాల నుండి సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు కార్మికులు తరలిపోయిన సంగతి మాత్రం ఆ విధంగా ఆకట్టుకోలేదు. వాస్తవానికి యూరోపియన్ యూనియన్ దేశాలలో ఒక సభ్యదేశం నుండి ఇంకొక సభ్యదేశానికి కార్మికులు స్వేచ్ఛగా తరలిపోవచ్చు. ఆ విషయంలో ఏ విధమైన ఆంక్షలూలేని కారణంగానే ఎక్కువ తూర్పు యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్‌లో చేరాయి. కార్మికులను పెద్ద సంఖ్యలో ఎగుమతి చేస్తే ఆ దేశాల వ్యవస్థల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఆ మాదిరి లక్షణాలే ఈ తూర్పు యూరప్ దేశాలలోనూ కనిపిస్తున్నాయి. దేశ జనాభా తగ్గిపోవడం, జనాభాలో పనిచేయగల శక్తి కల మగవారి సంఖ్య మహిళలతో పోల్చితే తగ్గిపోవడం, పిల్లల, వృద్ధుల శాతం పెరగడం, ఉత్పత్తి చేసి అమ్ముకునే ఆర్థిక వ్యవస్థ కాస్తా బైట దేశాల నుండి ప్రవాసులు పంపే సొమ్ములమీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థగా మారడం వంటి లక్షణాలు ఈ దేశాల్లో కనిపించాయి. సోవియట్ యూనియన్ కుప్ప కూలడంతో ఆ దేశానికి పశ్చిమాన ఉన్న (పూర్వపు సోషలిస్టు) దేశాలలో జనాభా తరుగుదల ప్రస్ఫుటంగా కనిపించింది.
గత దశాబ్దకాలంలో బల్గేరియా జనాభా 73 లక్షల నుండి 65 లక్షలకు - అంటే 11.5శాతం మేరకు పడిపోయింది. 1990 నుండి 2019 మధ్య కాలంలో రుమేనియా జనాభా 2కోట్ల 32 లక్షల నుండి ఒక కోటి 94 లక్షలకు పడిపోయింది. అంటే 16.4 శాతం. 2000లో 23 లక్షల 80 వేల జనాభా కలిగివున్న లాత్వియా 2022 ప్రారంభానికి 18.2శాతం జనాభాను కోల్పోయింది. ఇప్పుడు ఆ దేశ జనాభా 19లక్షల 50వేలు. లిథువేనియా, జార్జియా దేశాలలోనూ ఈ కాలంలో ఇదే విధమైన పరిస్థితి ఉంది. 2050 నాటికి ఉక్రెయిన్ జనాభా ఇప్పుడున్న దానిలో ఐదో వంతును కోల్పోవనుంది.
గతంలో యుగోస్లావియా దేశంలో భాగంగా ఉండి అనంతరం విడిపోయిన దేశాలలోనూ ఇదే పరిస్థితి. బోస్నియా - హెర్జెగోవినా దేశం 24శాతం జనాభాను కోల్పోయింది. సెర్బియా 9శాతం, క్రోయేషియా 15శాతం చొప్పున జనాభాను కోల్పోయాయి. అలబామా, మోల్డోవా దేశాలలోనూ ఇదే పరిస్థితి. మధ్య, తూర్పు యూరప్ దేశాలనుండి ఎక్కువగా ఈ తరలింపు యూరోపియన్ యూనియన్ దేశాలవైపు జరిగింది. వీటిలో 7 దేశాలు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందాయి. పశ్చిమ దేశాలవైపు వలసలు పోవడమే ఈ జనాభా తరుగుదలకు ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యం చెలామణీ అయే పరిధిలో పెట్టుబడులుగాని కార్మికులుగాని తరలిపోవడం అనేది ఇదే మొదటిసారి కాదు. నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతి దశలోనూ ఈ తరలింపులు జరుగుతూనే వచ్చాయి. ఎటొచ్చీ ఆ తరలింపు జరిగే తీరులో మార్పులు ఉంటున్నాయి. 1850కి ముందుకాలంలో ఆసియా, ఆఫ్రికా దేశాలనుండి బలవంతంగా కార్మికులను తరలించుకుపోయి వారిని బానిసలుగా వినియోగించే క్రూరమైన పద్ధతులను అనుసరించారు. 1850 దశకం నుండి మొదటి ప్రపంచ యుద్ధం జరిగేవరకూ యూరప్ దేశాలు భారీగా ''కొత్త ప్రపంచానికి'' (అమెరికా ఖండానికి) పెట్టుబడులను తరలించాయి. తమ ఆధీనంలో ఉన్న వలస దేశాలనుండి (ప్రధానంగా భారతదేశం) కొల్లగొట్టిన సొమ్మే ఈ పెట్టుబడిగా మారింది. అమెరికా ఖండంలోని సమశీతోష్ణ ప్రదేశాలకు యూరప్ నుండి కార్మికులు కూడా తరలివెళ్ళారు. భారతదేశం నుండి, చైనా నుండి కార్మికులు అమెరికా ఖండంలోని ఉష్ణ ప్రదేశాలకు తరలించబడ్డారు. వీరిని సమశీతోష్ణ ప్రదేశాలకు తరలించకుండా కఠినమైన ఆంక్షలు ఉండేవి. ఇక యుద్ధానంతర కాలంలో పెట్టుబడుల తరలింపుపై గట్టి ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పెట్టుబడిదారీ దేశాల నడుమ ఉభయదేశాలకూ అంగీకారంగా ఉండే పద్ధతిలో పెట్టుబడుల మార్పిడి జరిగింది. లేదా, పన్నుల చట్రం నుండి తప్పించుకోడానికి తమ అధీనంలోని వలసదేశాలకు పెట్టుబడులను తరలించేవారు. ఇక కార్మికుల తరలింపు ప్రధానంగా తమ పూర్వపు వలసదేశాలనుండి సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు జరిగింది. ఆ విధంగా ఇండియా, పాకిస్థాన్, వెస్ట్ ఇండీస్ దేశాలనుండి ఇంగ్లాండ్‌కు, ఆల్జీరియా, మొరాకోల నుండి ఫ్రాన్స్‌కు, టర్కీ నుండి జర్మనీకి కార్మికుల తరలింపు జరిగింది. గత కాలపు తరలింపులకు భిన్నంగా ప్రస్తుతం పెట్టుబడులు సంపన్న పెట్టుబడిదారీ దేశాలనుండి మూడవ ప్రపంచదేశాలకు జరుగుతోంది. ఇక కార్మికుల తరలింపు తూర్పు యూరప్ దేశాలనుండి సంపన్న పశ్చిమ యూరప్ దేశాలకు జరుగుతోంది. అయితే గతంలో జరిగిన తరలింపులో గాని, ప్రస్తుతం జరుగుతున్న తరలింపులో గాని చౌకగా కార్మికశక్తిని పొందాలన్న పెట్టుబడిదారుల కాంక్ష మాత్రమే ప్రధానమైన చోదకశక్తిగా పని చేసింది.
అయితే పెట్టుబడిదారీ 'ప్రధాన స్రవంతి' ఆర్థిక వేత్తలు మాత్రం ఈ పెట్టుబడుల, కార్మికుల తరలింపును ఏ మాత్రమూ పరిగణనలోకి తీసుకోనేలేదు. ఇటువంటి తరలింపు జరుగుతోందన్న అంశాన్ని పూర్తిగా విస్మరించి తమ వస్తు, సేవల వాణిజ్య ఒప్పందాలను వారు సమర్థించుకుంటున్నారు. పెట్టుబడుల లభ్యత ఎక్కువగా ఉండి, దానితో పోల్చినప్పుడు కార్మికుల శ్రమశక్తి లభ్యత తక్కువగా ఉన్న దేశాలనుండి పెట్టుబడుల లభ్యత తక్కువగా ఉంటూ కార్మికుల శ్రమశక్తి లభ్యత ఎక్కువగా ఉన్న దేశాలకు అధిక పెట్టుబడులు అవసరమయ్యే ఉత్పత్తులను తరలించడం, దానికి బదులుగా ఆ దేశాలనుండి అధిక శ్రమశక్తి అవసరమయ్యే ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం - ఇదే హేతబద్ధమైన విధానం అని వారు వివరిస్తున్నారు.
పెట్టుబడుల తరలింపు, కార్మికుల తరలింపు - ఈ రెండింటిని గనుక ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు గుర్తిస్తే అప్పుడు ఆ యా దేశాల నడుమ జరిగే వాణిజ్యాలను వారు వేరే విధంగా వివరించాల్సి వస్తుంది. ఒక ప్రాంతపు భౌగోళిక పరిస్థితులలో అక్కడ ఉత్పత్తి అయ్యే సరుకులు వేరే ప్రాంతంలో ఉత్పత్తి కావు. ఆ సరుకులను అమ్మేందుకు వాటిని ఉత్పత్తి చేసే దేశాలు గనుక సుముఖంగా లేకపోతే, సదరు సరుకులు జరూరుగా అవసరమైన దేశాలు బలప్రయోగం ద్వారానైనా వాటిని పొందేందుకు పూనుకోవలసి ఉంటుంది. అంటే ఆ బలప్రయోగం ''సామ్రాజ్యవాదం'' అనే రూపం తీసుకుంటుంది. అయితే 'స్వేచ్ఛా వ్యాపారం' సూత్రాన్ని మాత్రమే ప్రచారం చేసే బూర్జువా ఆర్ధికవేత్తలు 'సామ్రాజ్యవాదం' అనే ఒక లక్షణాన్ని గుర్తించడానికే నిరాకరిస్తారు. అందుచేతనే వారు పెట్టుబడుల తరలింపు, కార్మికుల తరలింపు వంటి లక్షణాలను గుర్తించడానికి నిరాకరిస్తారు. వాటిని గుర్తిస్తే 'సామ్రాజ్యవాదం' అనేది ఒకటుందని వారు అంగీకరించాల్సివస్తుంది.
ఉదహరణకు: మొట్టమొదట పారిశ్రామిక విప్లవానికి అడుగులు వేసినది బ్రిటన్. అక్కడ జౌళి పరిశ్రమ మొదలైంది. కాని ఆ దేశంలో పత్తి పండదు. ఆ పత్తిని పండించే ఉష్ణ మండలాల దేశాలనుండి బ్రిటన్ పత్తిని తెచ్చుకోవలసి ఉంటుంది. స్వేచ్ఛా వ్యాపార సూత్రాలు గనుక వర్తిస్తే అవసరం బ్రిటన్ ది కనుక పత్తిని పండించే దేశాలు కోరిన ధర చెల్లించాల్సి వస్తుంది. కాని వాస్తవంగా జరిగినది అందుకు భిన్నంగా ఉంది. ఉష్ణదేశాలమీద బ్రిటిష్ వారు ఆధిపత్యాన్ని సాధించి చౌకగా పత్తిని పట్టుకుపోయారు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతులను అనుసరించి ఉష్ణ దేశాలనుండి ముడి సరుకులను, చౌకగా లభించే కార్మికులను పట్టుకుపోయారు. అంటే ఉష్ణ దేశాలనుండి పెట్టుబడి, కార్మికులు తరలించబడ్డారు. ''స్వేచ్ఛావ్యాపార'' భక్తులు ఈ వాస్తవాన్ని అంగీకరించితే సామ్రాజ్యవాద దోపిడీని ఒప్పుకోవలసివస్తుంది. అందుకే వారు పెట్టుబడుల తరలింపు గాని, కార్మికుల తరలింపు గాని జరుగుతాయన్న వాస్తవాన్ని గుర్తించడానికి సిద్ధపడరు.
ప్రస్తుతం పశ్చిమ యూరప్‌లో నిరుద్యోగం హెచ్చు స్థాయిలో ఉంది. అటువంటప్పుడు అక్కడికి తూర్పుయూరప్ దేశాలనుండి కార్మికులు పనులకోసం వలస రావడం అనేది అర్థంలేని పరిణామంలాగా పైకి కనిపిస్తుంది. అయితే నిరుద్యోగం పెట్టుబడిదారీ ప్రపంచం అంతటా నెలకొని ఉన్నప్పుడు ఒక దేశం నుండి మరో దేశానికి కార్మికులు వలస పోవడానికి కార్మికుల కొరత ఏర్పడడం ప్రధాన కారణంగా ఉండదు. తక్కువ జీతాలు వచ్చే ప్రాంతాలనుండి ఎక్కువ జీతాలు దొరికే ప్రాంతాలకు వలస పోతారు. స్థానికంగా లభించే కార్మికులకు ఇచ్చే వేతనాలకన్నా వలస వచ్చే కార్మికులు తక్కువ వేతనాలకే పని చేయడానికి సిద్ధపడతారు గనుక యజమానులు వలస కార్మికులను పనుల్లో పెట్టుకోడానికి మొగ్గు చూపుతారు.
(ఇండియాలో వచ్చే జీతం కన్నా అమెరికా లో ఇచ్చే జీతం ఎక్కువ గనుక ఇక్కడినుండి అమెరికా పోడానికి సిద్ధపడతారు. అమెరికాలో స్థానికంగా ఇవ్వవలసిన జీతం కంటే తక్కువకే వీళ్ళు పని చేయడానికి సిద్ధపసడ్డారు గనుక స్థానికుల కన్నా ఇండియా నుండి వలస వచ్చిన వారినే పనిలో పెట్టుకోడానికి అక్కడ యజమానులు మొగ్గు చూపుతారు ఈ రెండు దేశాలలోనూ నిరుద్యోగం ఉన్నా ఈ వలసలు జరుగు తున్నాయి.) ఇదే విధంగా పశ్చిమ యూరప్ దేశాల్లో జరిగిం ది. ఆ దేశాలు ఒకపక్క సంక్షోభంలో ఉన్నా, తూర్పు యూరప్ దేశాలనుండి కార్మికులు అక్కడికి పనులకోసం వలసలు పోయారు. సోషలిజ.ం కూలిపోయాక అసలు పనులే లేకుండా పోవడం వలన ఈ వలసలు సంభవించాయి.
ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో ఒకవైపు సంపన్న పశ్చిమ దేశాల నుండి మూడో ప్రపంచ దేశాలవైపు పెట్టుబడుల తరలింపు, ఇంకోవైపు పేద దేశాలనుండి సంపన్న దేశాలవైపు కార్మికుల వలసలు జరుగుతున్నాయి. ఈ జంట ధోరణులు అంతిమంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికోద్యమాన్ని బలహీనపరచడానికే దోహదం చేస్తాయి. సంపన్న దేశాలనుండి పెట్టుబడులు తరలిపోవడం వలన అక్కడి కార్మికోద్యమాలు బలహీన పడతాయి. ఇక వలసలు పోయిన కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించాలంటే వారు సంఘటితంగా లేనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే వలసకార్మికులు సంఘటితంగా ఉండలేరు. ఆ విధంగా ప్రపంచం మొత్తంగా చూసినప్పుడు బలాబలాలు కార్మిక వర్గానికి ప్రతికూలంగాను, పెట్టుబడిదారీ వర్గానికి మరింత అనుకూలంగాను మారాయి.
అయితే ఈ పరిస్థితి పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదిరేందుకే దారి తీస్తుంది. ప్రపంచం మొత్తంగా ఉత్పత్తిలో ఏర్పడే మిగులులో కార్మికుల వాటా బాగా తగ్గిపోవడం వలన వారి వినిమయం కూడా బాగా తగ్గిపోతుంది. వినియోగదారుల్లో అత్యధికులు కార్మికులే గనుక వారి వినిమయం తగ్గినందువలన మార్కెట్లో డిమాండ్ మరింత పడిపోతుంది. సంక్షోభం మరింత ముదిరిపోతుంది. వీలైనంత చౌకగా కార్మికుల శ్రమను కొల్లగొట్టి లాభాలను పోగేసుకోవాలనే పెట్టుబడి దారుల దురాశ వల్లనే ప్రస్తుతం ప్రపంచం ఎక్కువ కాలం పాటు కొనసాగుతున్న సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతోంది.
- ప్రభాత్‌పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)