Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. నాటి స్వాతంత్య్ర సమరంలోని గదర్ ఉద్యమం, అమృత్‌సర్‌లో సంభవించిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండ, భగత్‌సింగ్ లేత హృదయంపై చిన్ననాటే అమితమైన దేశభక్తి ప్రభావం వేసింది. దేశభక్తులు కర్తార్‌సింగ్, రాస్బీహార్ బోస్‌ల ప్రత్యక్ష పరిచయం భగత్‌ను నిరంతరం ఉత్తేజితుడ్ని చేసింది.
1921లో భగత్ 9వ తరగతి చదువుతున్నాడు. బ్రిటిష్ విద్యాసంస్థ లను బహిష్కరించండి అంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపును అమలుపరిచాడు.
1928 'సైమెన్ గోబ్యాక్' ప్రదర్శనపై జరిగిన లాఠీచార్జిలో లాలాలజపతిరారు క్షతగాత్రుడై ప్రాణాలు విడిచిపెట్టడం, ప్రత్యక్షంగా వీక్షించిన భగత్‌సింగ్‌ను ఎంతగానో ప్రభావితం జేసింది. అందుకు కారకుడైన సాండర్స్‌ను హత్యచేసి ప్రతీకారం తీర్చుకుంటే తప్ప భారత యువత ఆగ్రహజ్వాల చల్లారదని భావించాడు. ఉద్యమ సహచరులతో పథకం రచించి అమలుపరిచాడు.
బ్రిటిష్ ప్రభుత్వం దేశ ప్రజల అభీష్టానానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టబోయింది. 1. పారిశ్రామిక వివాదాల బిల్లు. 2. ప్రజారక్షణ బిల్లు - ఇవి పార్లమెంట్లో ఆమోదించకపోయినా వైశ్రారు తన విశేషాధికారంతో ఆర్డినెన్స్‌గా ప్రకటిస్తానని హెచ్చరించాడు. అంటే... అంతిమంగా దేశ ప్రజలపై బ్రిటిష్ నిరంకుశ అధికారమే రుద్దబడుతుంది. దీన్ని ఎంత మాత్రమూ కొనసాగించకూడదనే లక్ష్యంతో పార్లమెంటులో బాంబువేయడానికి ఉద్యుక్తుడవుతాడు.
రాజద్రోహం నేరం క్రింద బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించి ఉరిశిక్ష విధించింది. 1931 మార్చి 23 సాయంత్రం లాహౌరు జైలులో బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షణ్యంగా భగత్‌సింగ్‌ను ఉరితీసింది. భగత్‌సింగ్ తో పాటు సహచరులు రాజ్‌గురు, సుఖదేవ్‌లకు కూడా ఉరిశిక్ష అమలైంది. ఉరిశిక్షకు ముందు...
''కామ్రేడ్స్! విప్లవ కారులమైన మేము మానవ జీవితాన్ని పవిత్రమైనదిగా భావిస్తాము. ప్రతిఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు శాంతి సమానతలు లభించే ఉజ్వల భవిష్యత్‌లో మాకు విశ్వాసం ఉంది. మానవత్వాన్ని ప్రేమించడంలో మేం ఎవరికి తీసిపోం. మాకు ఎవరి పట్ల వ్యక్తిగత ద్వేషం లేదు. మేం అందరినీ ప్రేమార్ద్ర దృష్టితోనే చూస్తూ వచ్చాం.
దేశానికి, ప్రజలకు సేవ చేయడంలో ఇతరులకు హాని కలిగించడం కంటే మా జీవితాన్ని మేమే అంతం చేసుకుంటాం. మేము సామ్రాజ్యవాదుల తొత్తు సైనికులవంటి వారముకాము. వారికి నిర్దయ గా హత్యలు చేయడం నేర్పుతారు. మేము జీవితాన్ని గౌరవిస్తాము. దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాము.
అన్నీ తెలిసే మేం పార్లమెంటులో బాంబు వేశాం. బ్రిటిష్ సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలపై పెల్లుబుకుతున్న భారత ప్రజల ఆగ్రహజ్వాల ప్రపంచానికి తెలియాలంటే పార్లమెంటులో బాంబు వేయడమే సరైన మార్గమని మేం భావించాం. చెవిటివానికి శంఖం విన్పించేలా చేయడమే మా బాంబు లక్ష్యం తప్ప ప్రాణాలు హరించడం ఎంతమాత్రమూ కాదు.
విప్లవం ప్రపంచ నియమం. మానవాళి ప్రగతికి అది ఆధారం. అందుకు రక్తపాతం అనివార్యం కాదు. వ్యక్తిగత హింసకు అందులో చోటులేదు. ఆర్థికంగా రాజకీయంగా ఈ వ్యవస్థను మార్చుకోవాలనే ప్రజల మనోబలమే విప్లవానికి నిజమైన బలం. మనిషిని మనిషి దోచుకునే పద్ధతిని అంతం చేయడమే విప్లవ లక్ష్యం.
విప్లవం వర్థిల్లాలి.. ఇంక్విలాబ్ జిందాబాద్...'' అంటూ కోర్టులో భరతజాతికి గొప్ప సందేశమిచ్చాడు.
ఉరితీసేముందు బ్రిటిష్ అధికారితో... ''సార్! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఒక సాధారణ భారత విప్లవకారుడు తన మహత్తర విప్లవ సాధన కోసం చిరునవ్వుతో ప్రాణాలు ఎలా అర్పిస్తారో మీరిప్పుడు స్వయంగా చూడబోతున్నారు'' అని ఉరితాడును ముద్దాడుతాడు.
తప్పులు అందరూ చేస్తారు. త్యాగాలు కొందరే చేస్తారు. భగత్‌సింగ్‌ను ప్రముఖ చరిత్రకారుడు కె.ఎన్.ఫణిక్కర్ భారతదేశ తొలి మార్క్సిస్టులలో ఒకరిగా అభివర్ణించారు. ఉద్యమకారులకు ఆనాడు స్వాతంత్య్రమే ప్రధాన లక్ష్యం. భగత్‌సింగ్ అభిప్రాయం ప్రకారం దేవుడనేవాడు ఉద్యమ కారులకు ఎవ్వడూ లేడు. మతం పట్ల అస్సలు వ్యామోహం వారికి ఉండరాదు. డబ్బులేదా ఇతర ప్రాపంచిక కోర్కెలపై మోహం ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో రాజ్య నిరంకుశత్వాన్ని అస్సలు సహించరాదు. దీని అర్థం ప్రయివేటు ఆస్తి వంటి సంకెలలో ఉద్యమకారులు బంధీకాకుండా స్వేచ్ఛగా ఉండాలి.
విప్లవకారుల స్వాతంత్య్ర పోరాటానికి మతం ఎప్పుడూ ఆటంకమేనని స్వానుభవంతో నమ్మాడు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించిన తర్వాత పెద్ద ఎత్తున చెలరేగిన హిందూ-ముస్లిం ఘర్షణలతో తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
1917లో రష్యాలో కామ్రెడ్ లెనిన్ నాయకత్వాన సంభవించిన విప్లవం పట్ల భగత్‌సింగ్ అమిత ఆకర్షితుడయ్యాడు. లెనిన్ సమకాలీనుడుగా తాను జీవిస్తున్నందుకు ఉద్విగ భరితంగా నిత్యం పొంగిపోయేవాడు.
'రష్యా ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ కార్మికవర్గానికి మా గొంతు కలుపుతాము. శ్రామికవర్గం గెలుస్తుంది. పెట్టుబడిదారి విధానం ఓడిపోతుంది. సామ్రాజ్య వాదానికి మరణ మొదలైంది' అని తన జైలు నోటుబుక్‌లో రాసుకున్నాడు.
ఉరితీసేరోజున కూడా క్లారాజెట్కిన్ రచించిన రెమిని సెన్సెస్ ఆఫ్లెనిన్ (లెనిన్ జ్ఞాపకాలు) పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు భగత్‌సింగ్. అధికారులు చివరి కోరిక ఏమిటని అడిగినప్పుడు తాను లెనిన్ జీవితాన్ని చదువుతున్నానని చనిపోయే లోగా దానిని పూర్తిచేయాలని చెప్పాడు. ఓ విప్లవ కారుని గుండెతో మరో విప్లవకారుని గుండె మమేకం కావడం అంటే ఇదే కదా...
- కె. శాంతారావు
సెల్: 9959745723