Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి, సుత్తీ కొడవలీ నక్షత్రం గుర్తుకే మన ఓటు''...
రాత్రి ఆ అక్షరాలు రాస్తున్నప్పుడు తెలియదు నాకు... తెల్లవారితే అవి అగ్గి రాజేస్తాయని.... సూర్యునితోపాటే మా ఇంటి గోడ మీద దర్శనమిచ్చిన ఆ రాతలు పెద్ద రాద్దాంతమే సష్టించాయి. పొద్దున్నే నిద్దుర లేచి కళ్ళు నులుముకుంటూ బయటికొచ్చిన నాకు, ఊరంతా మా ఇంటి ముందే కనిపించింది. ఎన్నడూరాని దొరోడు మా ఇంటెదురుగా కుర్చేసుకుని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్నాడు. చేతులు కట్టుకుని నిల్చున్న మా నాయినను ''ఎవడు రాసాడో చెప్పు''మని నిలదీస్తున్నారు దొర గూండాలు.. మా అమ్మ భయం భయంగా బేల చూపులు చూస్తోంది..
''తెల్లారేసరికి గోడమీదున్నయి.. ఎవడు రాసిండో మాకేమెరుక.. మేంగూడ మీలెక్కనే చూసినం'' అంటోంది మా అమ్మమ్మ...
''ఎవడో రాస్తే ఊళ్లె ఇండ్లన్నీ కాదని మీ ఇంటిమీదనే ఎందుకు రాస్తడు'' ఊరి సర్పంచ్ కోపంతో ఊగిపోతుండు... ఈ లొల్లి ఎంతసేపటి నుండి జరుగుతుందో తెలియదుగానీ, అప్పుడే వచ్చిన నేను
''ఎవరు రాస్తె ఎంది? రాసిందాంట్లె తప్పేముంది?'' అన్న.. అంతల్నే ''నాయినా వీడు మా స్కూల్ల ఎస్సెఫ్ఫయ్యోళ్లతోటి తిరుగుతుండే... ఇది వీడే రాసుంటడు'' అన్నడు సర్పంచ్ కొడుకు.
''అరేరు వాన్ని రెక్కలిరిసి కచ్చీరు కాడికి ఈడ్సుకరార్రి'' అంటూ కుర్చీలోంచి లేసిండు దొరోడు. ఎనిమిదో తరగతి చదువుతున్న నన్ను పదిమందికిపైగా పట్టుకుండ్రు....
అదిగో అప్పుడు జరిగిందో అద్భుతం...! ఎర్రజెండా రెపరెపలాడుతుండగా రయ్యిరయ్యిన దుమ్ములేపుకుంటూ దూసుకొచ్చిందో జీపు... నన్నొదిలి ఆ జీపుకు అడ్డం తిరిగింది దొరోడి గుంపు. అంతే..! జీపులోంచి సివంగిలా దూకి, భుజాన ఎర్రజెండా వేసుకుని ఎగిరి బానెట్ మీద కూర్చోని కాలుమీద కాలేసుకుంది అమ్మ స్వరాజ్యం! ''రమేశా రారా'' అని పిలిచింది. అది కలో నిజమో తెలిసేలోపు నేనెళ్లి ఆమె వొడిలో కూర్చున్నా..!! అది కల కాదు, నిజమని తెలిసాక ప్రపంచాన్ని జయించిన అనుభూతి! అందులోంచి తేరుకోకముందే ''పోనీరు ఎవడడ్డమొస్తడో చూస్త... తొక్కిరు..'' అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న కామ్రేడ్‌ని ఆదేశించింది అమ్మ... ఉరుములాంటి ఆ ఆజ్ఞకు జీపు స్టార్టయిందో లేదో.. అడ్డునిలిచిన కాంగ్రెస్ గూండాలు పరుగులు తీస్తుంటే, ఆ జీపు ఊరి వీధులగుండా కవాతు చేసింది. అది మొదలు... ఎర్రజెండాకు ప్రవేశమేలేని ఆ ఊరు (తాటిపాముల) మూడున్నర దశాబ్దాలు కమ్యూనిస్టుల కంచుకోటగా నిలిచింది. నేటికీ ఎర్రజెండాలు ఎగరేస్తూనేవుంది. చారిత్రక తెలంగాణ సాయుధపోరాటంలోనే కాదు, తదనంతర పార్టీ నిర్మాణంలోనూ ఆమె సాహసానికీ, గుండెధైర్యానికీ ఓ మచ్చుతునక ఈ సంఘటన.
ఓ అర్థరాత్రి...
ఆకాశం గర్జిస్తుంటే భూమి ఉలికిపడుతోంది...
రెండు రోజులుగా ఎడతెగని వాన...
సముద్రహౌరును తలపిస్తూ పోటెత్తిన వాగు మా ఊరిని ముంచెత్తుతోంటే జనం అతలాకుతలమవుతున్నారు...
ఇళ్లన్నీ నీళ్లతో నిండి మనుషులు వీధుల్లోకొచ్చారు...
కష్టపడి కట్టుకున్న నివాసాలు కండ్లముందే కూలిపోతుంటే కన్నీరుమున్నీరవుతున్నారు...
ఎటు చూసినా చిమ్మచీకటి... ఆ చీకటిని తన హెడ్లైట్ల ద్వారా చీల్చుకుంటూ వచ్చి ఊరి బయట ఆగిందో వాహనం... అది ఊరిలోకి రాకుండా పొంగిపొంగిపొరలుతున్న రోడ్డాం అడ్డగించింది... తన జీపు డ్రైవర్, గన్‌మెన్‌తో జీపు దిగి, మోకాటిమంటి నీటిలో ఆ ప్రవాహాన్ని దాటి ప్రజలను చేరుకుంది అమ్మ. అప్పుడామే మా నియోజకవర్గ ఎమ్మెల్యే.
వచ్చీరావడంతోనే బోరున విలపిస్తున్న బాధితుల్ని అల్లుకుని కన్నీరు కార్చింది...
చినుకులు పదునైన సూదుల్లా గుచ్చుతున్నా లెక్కచేయక, వణుకుతున్న ప్రజల్ని ఓదార్చింది.. అంతలోనే తేరుకుని, అంతకంతకూ ఉధృతమవుతున్న వాగు ఆ ప్రాణాలకే ప్రమాదమని పసిగట్టింది. అప్పటికే మోకాళ్లు దాటి నడుం వరకూ పెరిగింది రోడ్డాంలో ప్రవాహాం... కాసేపాగితే దాటడమే కష్టంగా మారుతుందని గ్రహించింది.. తక్షణమే పిల్లా జెల్లా, మూటా ముల్లే సంకనేసుకుని వీధులు ఖాళీ చేయాలని ఆదేశించింది. దగ్గరుండి అందరినీ ఊరు దాటించింది. తను ఆ ప్రజలతోనే ఉండి, తన వాహనాన్ని తిరిగి పంపించింది. తెల్లవారేసరికి అందరికీ అన్నపానీయాలు అందుబాటులోకి తెచ్చింది. సాయంత్రం వాగు ఉరవడి తగ్గాకగానీ ఆమె అక్కడినుండి కదలివెళ్లలేదు. ఇది కమ్యూనిస్టుగా ఆమె కరుణకు నిదర్శనం. ఆమె అంతటితోనే ఆగిపోలేదు. కూలిన కరెంటు స్తంభాలనూ, కాలిన ట్రాన్స్ఫార్మర్లనూ యుద్ధప్రాతిపదికన దగ్గరుండి పునరుద్ధరింప జేసింది. ప్రభుత్వంతో కొట్లాడి, ఏడాదిలోపే బాధితులందరికీ పార్టీలకతీతంగా పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఇది ప్రజాప్రతినిధిగా ప్రజల పట్ల ఆమె నిబద్ధతకు నిలువుటద్దం.
కార్యకర్తలను కాపాడుకోవడమెలాగో, ప్రజలతో మమేకమవడమంటే ఏమిటో ప్రత్యక్షంగా ఎరుకపరిచిన ఈ రెండు ఘటనలూ నాకు మరపురాని జ్ఞాపకాలు.. వీరుల జ్ఞాపకాలు వ్యక్తులకే పరిమితమై ఉండిపోతే యోధుల చరిత్రను నమోదు చేయడం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. వాటి సమిష్టి కలపోతే మన సమిష్టి కార్యాచరణను నుసంపన్నం చేస్తుంది. ఇలాంటి జ్ఞాపకాలు, అనుభవాలు ఆమెతో కలిసి పనిచేసిన కార్యకర్తలనేకులకు అనేకం.. ఆ అనేకుల్లో నేనూ ఒకడిని కావడం, తుంగతుర్తి ప్రజాతంత్ర ఉద్యమంలో కొన్ని సంవత్సరాలపాటు ఆమెతో అత్యంత సన్నిహితంగా పనిచేయగలగడం నాకు లభించిన ఓ గొప్ప అవకాశం.
ఒక వ్యక్తి శక్తిగా మారడం ఎలాగో తెలుసుకోవడానికి అమ్మ జీవితం ఓ ఉదాహరణ. పదమూడేండ్ల పసి ప్రాయంలోనే తెలంగాణ విముక్తి పోరాటంలోకి పాటై ప్రవేశించి, అది సాయుధరూపం తీసుకునే నాటికి తుపాకీ తూటా అయి పేలింది...
''భారతీ భారతీ ఉయ్యాలో నా తల్లి భారతీ ఉయ్యాలో
నైజాం రాజ్యాన ఉయ్యాలో నరరూప రాక్షసులు ఉయ్యాలో
వెట్టి జెయ్యలేక ఉయ్యాలో సచ్చిపోతున్నాము ఉయ్యాలో''... ఇలా ఊరూరా పాటై ప్రవహించడమే కాదు, గెరిల్లా దళానికి కమాండరై గడీలను గడగడలాడించింది. పిండిప్రోలులో సాయుధశిక్షణ పొంది దండకారణ్యానికి గెరిల్లా యుద్ధమై వ్యాపించింది. ఒక వైపు నిజాం పోలీసు బలగాలూ, మరోవైపు రాజాకారు మూకలూ గ్రామాలపై విరుచుకు పడుతుంటే ఆమె నిలువెత్తు గుండెధైర్యమై ప్రజలకు అండగా నిలిచింది. తదనంతర పార్టీ నిర్మాణంలోనూ ముందుండి ప్రజలను నడిపించింది. చట్టసభల్లో ప్రజల గొంతుకై మోగింది.
అలా తన జీవితమంతా చేతులనిండా కాగడాలు పట్టుకొని, చీకటిదారులు వెలిగిస్తూ సాగిన అలుపెరుగని బాటసారి అమ్మ. చూసిన ప్రతి ఒక్కరికీ చేరాల్సిన గమ్యాన్ని తెలిపే మహౌజ్వల ప్రయాణం ఆమెది. తొంభైరెండేండ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె నిత్యం దిక్కులు పిక్కటిల్లే నినాదమై మోగిందే తప్ప, ఏనాడూ మౌనంగా ఉన్నది లేదు. ఎందుకంటే మౌనం ప్రజాస్వామ్యానికి ప్రబల శత్రువు. కానీ, నేడు మౌనం ఒక అలౌకిక ఆచరణగా మారిపోతున్న కాలాన్ని మనం చూస్తున్నాం. ఆ మౌనంలో ఎవరికివారు తమ స్వప్రయోజనాలనూ స్వార్థప్రయోజనాలనూ వెతుక్కోవడం గమనిస్తున్నాం. ఒక వయుక్తిక దుఃఖానికి సామూహికంగా స్పందించే మానవీయ లక్షణాన్ని కోల్పోవడానికి మించిన సామాజిక విషాదమేముంటుంది? ఒక వ్యక్తి మౌనం ఆ వ్యక్తినో, లేదా అతని కుటుంబాన్నో మాత్రమే కబళించగలదు. కానీ ఈ సామూహిక మౌనం ఒక తరాన్నీ, ఒక జాతినీ, ఒక దేశాన్నే దహించివేస్తుంది. ఇలాంటి అవాంఛనీయమైన సాముదాయిక మౌనాన్ని బద్ధలుకొట్టడమే లక్ష్యంగా సాగిన మనకాలపు యుద్ధగీతం కామ్రేడ్ మల్లు స్వరాజ్యం. ఒక్క తెలంగాణమేకాదు, మొత్తం తెలుగు సమాజమే గర్వించదగ్గ కమ్యూనిస్టు దిగ్గజం.
ఆమె మరణం ఇప్పుడు తెలుగువారికో విషాదం. జనన మరణాలు సహజమైనవే కావచ్చుగానీ, ఇలాంటి యోధులు నిష్క్రమించినప్పుడు సమాజం గాయపడుతుంది. ప్రత్యేకించి జనమే జీవితంగా బతికినవారినీ, తామే ఒక చరిత్రగా నిలిచినవారినీ కోల్పోయినప్పుడు అమితంగా దుఃఖపడుతుంది. కానీ, తాము జన్మించిన కాలంతో ప్రభావితులై, తాము జీవించిన కాలాన్ని నడిపించినవారు అమరులు. తమ అనంతర కాలాన్ని కూడా వెలిగించగల తారలు. వారి ప్రతిభాపాటవాలూ, శక్తియుక్తులన్నీ వ్యక్తిగత నైపుణ్యాలుగా కనిపించవచ్చుగానీ.. చరిత్ర, వర్తమానమూ, సమాజమే వారిని తీర్చిదిద్దే నేపథ్యాలు. మహౌన్నత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రభవించి, ప్రజల ఆశల ఆయువు పోసుకొని... సమాజాన్నే కాదు, చరిత్రనూ ఉన్నతీకరించిన వీరవనిత మల్లు స్వరాజ్యం. వీరులు పోతూపోతూ మనకోసం దారులు వేస్తారు. ముళ్లూ రాళ్లూ అవాంతరాలెన్నొచ్చినా ఆ దారుల్లో ముందుకు సాగడమే మన కర్తవ్యం.
- రాంపల్లి రమేష్
సెల్: 9550628593