Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది మార్చి పందొమ్మిది సాయంత్రం... అరుణ తార ఒకటి నింగికెగసింది. భౌతికంగా అందనంత దూరం పోయినా, పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపుతూనే ఉన్నది. అమ్మ ఇచ్చిన ధైర్యంతో కదిలింది. ''అమ్మ'' నవల స్ఫూర్తితో నడిచింది. అన్నతో కలిసి కదనరంగంలో దూకింది. ఎనిమిది దశాబ్దాలు జనంతో పెనవేసుకున్న జీవితమది. జనంతో నడిచి, జనం మనిషిగా నిలిచి, జనం మనిషిగానే తుదిశ్వాస విడిచింది. అమె పేరే మల్లు స్వరాజ్యం! తెలుగు ప్రజలకు ఆపేరు సుపరిచితం. దేశంలో చరిత్రకారులకు సహజ పరిచయం. సుదీర్ఘకాలం పట్టు సడలని కమ్యూనిస్టుగా ప్రజలతో మమేకమై నిలిచిన నిండు జీవితం. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ప్రారంభమైన ఆమె కమ్యూనిస్టు జీవితం, ప్రపంచీకరణ ప్రవాహాన్ని తట్టుకుని నిలబడ్డది. భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం సాగిన పోరాటంలో క్రియాశీల కార్యకర్త... ప్రపంచీకరణ యుగంలో వినిమయ సంస్కృతిని తట్టుకుని ప్రజా ఉద్యమాలతో పెనవేసుకుని నిలబడిన నిరాడంబర నాయకురాలు. భవిష్యత్తు తరానికి స్ఫూర్తినిచ్చే నేత మల్లు స్వరాజ్యం.
పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అది ఎవరో ఇచ్చింది కాదు... మహిళగా ప్రోత్సహించిందీ కాదు... తాను సాధించుకున్న స్థానం అది. ఎర్రజెండాతో పెనవేసుకున్న ఆమె జీవితమే ఆమెకు కట్టబెట్టిన స్థానం. ప్రజా సమస్యలెక్కడుంటే అక్కడ, ప్రజా ఉద్యమం ఎక్కడుంటే అక్కడ స్వరాజ్యం ఉండవల్సిందే. సాయుధ పోరాటంలోనూ, పార్లమెంటరీ పోరాటంలోనూ, ప్రజాస్వామ్య సమాజంలో ప్రజా ఉద్యమాలలోనూ అదే బాట. తూటాలు పేల్చిన చేతులు అవి. అంతేనా... తూటాల్లాంటి మాటలతో, ధీటైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవటంలో దిట్ట. భూపోరాటమైనా, సారా వ్యతిరేక పోరాటమైనా, మహిళా ఉద్యమమైనా... తుది శ్వాస వీడే వరకూ ఉద్యమమే ఊపిరిగా బతికారు. అనారోగ్యంతో మంచం పట్టిన సమయంలో కూడా కుటుంబ సభ్యులతో ఇంట్లో గడపటం కన్నా, మహిళాసంఘం కార్యాలయంలోనే ఉండడానికీ, ఉద్యమ కార్యకర్తల నడుమ ఉండటానికే ఇష్టపడ్డారు. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే కుటుంబం ఉన్నప్పటికీ ప్రజలు అంతకన్నా పెద్ద కుటుంబం అని నమ్మిన ప్రజల మనిషి. బతికున్న కాలంలోనే కాదు. మరణానంతరం కూడా తన శరీరం సమాజ శ్రేయస్సుకే ఉపయోగపడాలని భావించింది ఆమె. అందుకే మెడికల్ కళాశాలకు అప్పగించాలని పార్టీని కోరింది. తన శరీరం బూడిదపాలు కావద్దనీ, వైద్య విద్యార్ధుల పరిశోధనలకు తోడ్పడాలని కోరుకున్నారు. పదకొండేడ్ల వయస్సులో ప్రజలతో నడక ప్రారంభించి 92 ఏండ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు.
అనేక కట్టుబాట్లు మహిళను కట్టడి చేస్తున్న కాలం అది. అయినా సరే... సంప్రదాయాలను థిక్కరించి, సామాజిక దురాచారాలను ఛేదించి నడిచిన సాహస వనిత. పీడిత ప్రజల కోసం దేనినీ ఖాతరు చేయని మొండితనం. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేదలతో మమేకం కావడానికి అవేవీ అడ్డురాలేదు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయమది. స్వరాజ్యం తల్లి చొక్కమ్మ మీద కూడా ఆ ప్రభావం ఉంది. ఆమె స్వయంగా ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ, తన దగ్గరి బంధువుల ద్వారా ప్రభావితమైంది. తన కుటుంబానికి బీరకాయపీచు బంధాలు అన్నీ స్వాతంత్య్రోద్యమంతోనో, ఆంధ్రమహాసభతోనో ఏదో ఒకమేరకు ప్రభావితమైనవే. స్వరాజ్యం తల్లి అన్న కొడుకులు ముగ్గురూ విప్లవోద్యమంలో దూకారు. ఈ ప్రభావాలతోనే చొక్కమ్మ తన బిడ్డకు స్వరాజ్యం అని పేరు పెట్టింది. స్వరాజ్యం అక్కా బావలూ ఉద్యమ బంధం ఉన్నవారే. చెల్లెలు, మరిదీ కూడా ఆ అనుబంధం ఉన్నవారే. అన్నా, తమ్ముడూ పోరాటంలోనే ఉన్నారు. తల్లి మానవతావాది. భూస్వామి ఇల్లాలుగా ఎన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ... ఆ కట్టుబాట్లనే ధిక్కరిస్తున్న బిడ్డ స్వరాజ్యమ్మను సమర్థించింది. అడ్డుకోలేదు. తన భర్త మరణానంతరం మరింత స్వేచ్ఛగా తన బిడ్డల పోరాటానికి అండగా నిలిచింది. అందుకే ఆ తల్లి, ఉగ్గుపాలతోనే స్వరాజ్యమ్మను ప్రజల మనిషిగా తీర్చిదిద్దిందనటం అతిశయోక్తి కాదు. బాల్యంలోనే బాల్య వివాహాలను ప్రతిఘటించింది స్వరాజ్యం. సమాజంలో భర్తల హింసను వ్యతిరేకించింది స్వరాజ్యం. కూలీలతో కలిసి నీళ్ళు మోసింది. పొలానికి పోయింది. ఇందుకు బంధువుల ఆగ్రహాన్ని ఖాతరు చేయలేదు. అన్ని కులాలతో సహపంక్తి భోజనాలలో పాల్గొన్నది. హరిజనుల (దళితులను హరిజనులనేవారు)తో బతుకమ్మ లాడించి సంప్రదాయ బంధాలను ఛేదించిన చరిత్ర స్వరాజ్యమ్మది.
మొదట వెట్టిచాకిరీ మీద పోరాటం. 1946 ఐలమ్మ పోరాటంతో ఊపందుకున్న ప్రజల ఉత్సాహం కౌలురైతుల పోరాటంగా మారింది. జులై 4 కడివెండి ప్రదర్శనలో ప్రాణాలొడ్డిన దొడ్డి కొమరయ్య వీరమరణంతో ప్రజల ఆవేశం కట్టలు తెగింది. సెప్టెంబరు 11న కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో అది సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. ఎల్లమ్మ, మల్లమ్మ, ముత్యాలమ్మ... ఏ పేరైతేనేమి? ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతో ఉద్యమబాట పట్టింది స్వరాజ్యం. గిరిజనుల మధ్య సమ్మక్కగా నడిచింది. రాజక్క దళంగా పేరుగాంచింది. నాల్గవ తరగతితోనే చదువు మానేసిన స్వరాజ్యం అన్నతో కలిసి మీటింగులకు వెళ్ళేది. బతుకమ్మ పాటలు, జానపద గేయాలతో ప్రజాసమస్యలు మేళవించి పాడేది. పదకొండేండ్ల ప్రాయంలోనే విజయవాడ రాజకీయ తరగతులకు హాజరైంది. తర్వాత అన్న ప్రయత్నించిన కూలిపోరాటం తాను కొనసాగించింది. బంధువుల పొలాలలోనే కూలీల పోరాటం నడిపింది. బంధుమిత్రుల దాడిని ఎదుర్కోవటంతోనే పోరాట జీవితం ప్రారంభించింది. ఐలమ్మ పోరాటంలో ఉద్యమగీతాలు పాడింది. గురజాడ గేయం ''పుత్తడి బొమ్మ పూర్ణమ్మ'' మహిళలను కదిలించే సాధనంగా ఉపయోగపడింది ఆ రోజుల్లో.
స్వరాజ్యం పోరాట కేంద్రం పాత సూర్యాపేట. ఉద్యమ విస్తరణ కోసం మల్లు వెంకట నర్సింహారెడ్డి వెళ్ళిన ప్రాంతానికే, కొంతకాలం తర్వాత స్వరాజ్యంను కూడా పార్టీ పంపింది. అప్పటికి వారిద్దరికీ పరిచయం లేదు. స్వరాజ్యం ప్రధాన కేంద్రీకరణ గిరిజన ప్రజలను సమీకరించటమే. పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన ఆ పోరాటం గ్రామరాజ్యాలు స్థాపించింది. తాను పనిచేస్తున్న ప్రాంతంలో గ్రామరాజ్యాల పరిపాలనా బాధ్యతలు కూడా స్వరాజ్యం నిర్వహించింది. గ్రామరాజ్యంలో భూమి పంచటమే కాదు, వెట్టిచాకిరీ నిషేధించారు. కుల, మత బేధాలకు తావులేదు. స్త్రీలకు సమాన హక్కులు. భార్యాభర్తల ఇష్టాఇష్టాలను బట్టే వివాహాలైనా, విడాకులైనా! నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం ఉన్నది. ప్రజాసమస్యల మీద పాటలు పాడి ప్రజలను సమీకరించటం, వనరులను సమీకరించటం స్వరాజ్యం పని. పాటలు, ఉపన్యాసాలు ఇందుకు తోడ్పడ్డాయి. పోలీసులు గ్రామాల మీదకు వస్తే ఏమి చేయాలో గ్రామ ప్రజలకు సూచనలు చేసేవారు. మహిళలను సమీకరించి భూస్వాముల మీద దాడి చేసి, వారి తుపాకులు గుంజుకుని ప్రజలకు ఇచ్చేవారు. మేజర్ జైపాల్సింగ్ మిలటరీ ట్రైనింగ్లో కూడా 300 మంది మహిళలతో పాల్గొన్నారు. దళ నాయకురాలు ''రాజక్క''ను పట్టి ఇస్తే పాలకులు 1947లోనే పదివేల రూపాయలు బహుమానంగా ప్రకటించారు. ఆ క్రమంలో ఏడేండ్ల అజ్ఞాతవాసం గడిపిన ధీర వనిత స్వరాజ్యం.
పోరాట విరమణ తర్వాత 1954లో ఉద్యమ సహచరుడైన మల్లు వెంకట నర్సింహారెడ్డి (విఎన్గా పిలుస్తారు)తో పెండ్లి జరిగింది. సాయుధ పోరాట విరమణ తర్వాత పరిస్థితులు కొంత గందరగోళంగా ఉన్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరిన కాలం. కార్యకర్తలందరినీ ఇముడ్చుకోగలిగిన స్థితిలో పార్టీ నిర్మాణం లేదు. దీనితో కొంతకాలం కుటుంబ జీవితానికే పరిమితమైనా, సీపీఐ(ఎం) ఏర్పడిన కొద్దికాలంలోనే మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు.
సాయుధ పోరాటం ఆగిపోయినా... దొరలపై పోరాటం తప్పలేదు. పోరాట కాలంలో ప్రజలకు పంచిన భూములు, భూదానోద్యమంలో ప్రజలకిచ్చిన భూములు కూడా భూస్వాములు మళ్ళీ గుంజుకునేందుకు ప్రయత్నించారు. పాలకులు భూస్వాములకే అండగా నిలిచారు. భూముల రక్షణ కోసం పేదరైతులు, కూలీల కోసం నిలబడ్డారు. భూస్వాముల అరాచక, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల కోసం పనిచేసారు. 1978లోనూ, 1983 లోనూ రెండుసార్లు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) అభ్యర్థిగా పోటీ చేసి తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలిచారు. 1981 నుంచి 2002 వరకు ఆంధ్రప్రదేశ్ మహిళాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసారు. హైదరాబాద్ నగరాన్ని ఒక కుదుపు కుదిపిన ఘటన రమీజాబీ మీద జరిగిన అత్యాచారం. శాసనసభలో ఈ సమస్యమీద స్వరాజ్యం నిర్వహించిన పాత్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. శాసనసభలోని మహిళా ప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా స్వరాజ్యంతో నిలబడవల్సి వచ్చింది.
1983లో, దారితప్పి టీడీపీలో చేరిన తన తమ్ముడినే ఎన్నికల బరిలో ఎదుర్కోవలసి వచ్చింది. తన వేలు పట్టుకుని పోరుబాటన నడిపిన అన్న కూడా 1994లో అన్యవర్గ ధోరణులకు గురయ్యాడు. పార్టీని వీడారు. తాను మాత్రం అన్నతో విభేదించి జీవిత సహచరుడు వీఎన్తో పాటు పార్టీతో నిలబడ్డారు స్వరాజ్యం. తెలంగాణ సాయుధపోరాట యోధుడుగా, సుదీర్ఘకాలం ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా, పార్టీ కేంద్రకమిటీ సభ్యుడుగా కామ్రేడ్ వీఎన్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే.
శరీరంలో శక్తి సడలినా, ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా, 92 ఏండ్ల వయస్సులో కూడా, ఆస్పత్రి మంచంమీద ఎరుపుమెరుపులు గుర్తుచేసిన ధీశాలి. పరామర్శకు వచ్చినవారికి, వెంటిలేటర్ మీద ఉండికూడా, పిడికిలి బిగించి ఎర్రదండాలు పెట్టిన ఎర్రజెండా బిడ్డ. జమీందార్లను మించిన కార్పొరేట్లు పుట్టుకొచ్చారని హెచ్చరించారు. నియంతృత్వం, మతోన్మాదం బలపడిన కాలంలో ఉన్నామని గుర్తించారు, గుర్తుచేసారు. ప్రజలకు సన్నిహితం కావాలనీ, ప్రజలతో మమేకం కావాలనీ... అప్పుడే ఈ దోపిడీ రాజ్యాన్ని ఎదుర్కో గలమని హెచ్చరించారు. వర్గ పోరాటమే మార్గమని పునరుద్ఘాటించారు. ఆ బాటలో పయనించటమే ఆమెకు నిజమైన నివాళి!
- ఎస్. వీరయ్య