Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెరిచిన పుస్తకం వంటి ఆమె జీవితం ప్రతి మహిళకు ఒక పాఠ్యాంశం. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిన ప్రతి మహిళకు ఆమె జీవితం ఒక పాఠశాల. నేడు ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆమే మల్లు స్వరాజ్యం. 92 సంవత్సరాల నిండు జీవితం ఆమెది. 80 సంవత్సరాల ప్రజా జీవితం ఆమెకు ఎనలేని అనుభవాలను ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు తరాల ప్రజలను, ప్రత్యేకించి స్త్రీలను అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారా అనిపిస్తుంది. దేశ స్వాతంత్రోద్యమంలోనూ, దేశ చరిత్రను మలుపు తిప్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, మహిళా ఉద్యమాల్లోనూ పాల్గొన్నవారు, నాయకత్వం వహించిన వారిలో అనేకమంది స్త్రీలు లేకపోలేదు. కానీ తుది శ్వాస వరకు ఉద్యమాలలో కొనసాగినవారు బహు అరుదు.
ఒక కళాకారిణి. ఒక విప్లవకారిణి, ఒక ప్రజాప్రతినిధి, ఒక మహిళా హక్కుల నేత, ఒక మాతృమూర్తి... ఇలా ఆమెలో ఎన్ని పాత్రలో, ఆమె జీవితంలోనూ అన్ని ఒడిదుడుకులు. అవి రాజకీయమైనవైనా, వ్యక్తిగతమైనవైనా. అన్నిటినీ తట్టుకుని నిలిచిన ధీశాలి. ఆమె కన్నీళ్లు పెట్టడం ఎప్పుడూ ఎవరూ చూడలేదు. అమరులను తలుచుకున్నప్పుడు, గాదె శ్రీనివాసరెడ్డి వంటి ప్రజా నాయకుల హత్య, కామ్రేడ్ విఎన్ మరణం వంటి ప్రత్యేక సందర్భా ల్లో మాత్రం కొంతకాలం ఆమెలో కుంగుబాటు కనిపించింది.
11-12ఏండ్ల వయస్సులో ప్రారంభమైన స్వరాజ్యం ప్రజా జీవన ప్రస్థానంలో ఎన్నో ఘట్టాలున్నాయి. అతి చిన్న వయసులో వ్యవసాయ కార్మికులను, ప్రత్యేకించి స్త్రీలను ప్రోత్సహించి సమ్మె చేయించింది. ఫ్యూడల్ దొరల పెత్తనం కింద నలిగిపోయిన ఆనాటి తెలంగాణలో... పచ్చి బాలింత అయినా రోజుల పసికందుని వదిలి దొరల పొలాల్లో పనికి వెళ్లక తప్పేది కాదు. 'పాలు చేపుకు వచ్చినాయి దొరా.. చంటి బిడ్డకు పాలిచ్చి వస్తాను' అని అన్నా వదలకుండా, ఏదీ చూపించు, అని చనుబాలు పిండించిన పైశాచికానందం నాటి దొరలది. అలాంటి కాలంలో...
'నాగళ్ల మీదున్న ఉయ్యాలో.. నాయన్న లారా ఉయ్యాలో..
చీమూ నెత్తురు లేదా ఉయ్యాలో.. తిరగబడరేమయ్యా ఉయ్యాలో..' అంటూ మెదడు మొద్దుబారిపోయి అచేతనంగా ఉన్న అణగారిన పేదల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవనారి స్వరాజ్యం.
ఆమెకు యుక్తవయసు వచ్చేనాటికి రగులుతున్న తెలంగాణ దొరల పెత్తనానికి వ్యతిరేకంగా తిరగబడింది. 1946 నాటికి సాయుధపోరాటం ఆరంభమయ్యింది. పోరాట కాలంలోనూ, విరమణ తరువాత కూడ ఏడేండ్ల పాటు ఆమె పూర్తిగా జనంలోనే సంచరించింది. ఇంటి ముఖం చూడలేదు. 16ఏండ్ల వయసు నుంచి సుమారు 23ఏండ్ల వయస్సు వరకు యవ్వనంలో నల్లగొండ, వరంగల్, ఇప్పటి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఉద్యమాన్ని విస్తరింపజేసింది.
స్వరాజ్యం జీవితం గురించి చెప్పుకుంటూపోతే ఎన్నో జ్ఞాపకాలు. ఆమె ఏసీ రూముల్లో కూర్చుని, ఏసీ కారులో తిరిగి ఉద్యమాలు చేయలేదు. ఆమె కుటుంబ జీవిత ప్రారంభ దినాలు ''మదర్ ఇండియా'' సినిమాలో నర్గీస్‌ను తలపిస్తాయి. కామ్రేడ్ విఎన్ ఉద్యమ బాధ్యతలు ఒక తపస్సులా నిర్వహిస్తే, కుటుంబ బాధ్యతను తాను భుజాన వేసుకుని రైతు స్త్రీగా పొలందున్ని, సాగుచేసి పిల్లల్ని సాకింది. అయినా ఇంటి బాధ్యతల్లో కూరుకు పోయి రాజకీయాలు మరువలేదు. ప్రజల్ని, ప్రజల పరిస్థితుల్ని, కమ్యూనిస్టు ఉద్యమంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, తన రాజకీయ అవగాహనకు పదును పెట్టుకుంటూ, ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి ఉరుకుతూ, ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ప్రజా ఉద్యమాలను కాపాడుకుంటూ సాగించింది జీవనయానం.
సాయుధ పోరాటానికి ముందు, పోరాట సమయంలోనూ, ఆ తదనంతరం శాంతి కాలంలోనూ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా స్త్రీ సమస్యలను విడవలేదు. పైపెచ్చు ఫ్యూడల్ భూస్వామ్య దోపిడీకి, స్త్రీ అణచివేతకు ఉన్న సంబంధాన్ని ప్రతి సందర్భంలోనూ ఎత్తిచూపే వారు. స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం చిన్ననాటి నుండి చెప్పడమేగాక చేసి చూపారు. ఆ కాలంలో ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేసి అత్తగారింటికి ఈడ్చుకు పోతుంటే పిల్లల గుంపును పోగుచేసి అడ్డుకున్న ఘటనలను ఆమె చెబుతూ ఉండేవారు.
పోరాట కాలంలో స్త్రీలకు కూడా ఆయుధ శిక్షణ ఇప్పించాలని పట్టుబట్టడం, దళ సభ్యురాలిగా ఉన్న కోయ మహిళ నాగమ్మ లో నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రోత్సహించడం, దాంపత్య జీవితంలో స్త్రీల ఇష్టానికి విలువ ఇవ్వాలని, ఇష్టం లేని పెళ్లి నుండి బయట పడే హక్కు స్త్రీలకు ఉండాలని, ఆస్తి పంపకాలలో స్త్రీలకు కూడా వాటా అవసరమని... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిసందర్భంలోనూ తన గొంతులో స్త్రీల సమస్యలను వినిపించారు.
శాసనసభను వేదికగా చేసుకొని ఎన్నో సమస్యలపై గళం విప్పి మాట్లాడారు. శాసనసభలో ఉన్న మగవాళ్ళు రాజఠీవి ఒలకబోస్తూ మాట్లాడటం మనకి తెలిసిందే. స్త్రీల మరుగుదొడ్లు సమస్యలు, మంచి నీటి సమస్యలు, ప్రసూతి సౌకర్యాల గురించి ఎవరూ మాట్లాడరు. ''మరుగుదొడ్ల స్వరాజ్యం'' అని నిందలు పడడానికి వెరవలేదు. ఆడవాళ్ళ దైనందిన, దాంపత్య, లైంగిక జీవిత సమస్యలు లేవనెత్తిన ప్రతి ఒక్కరు నిందలు మోసినవారే. వారే చరిత్ర నిర్మాతలు అవుతారు. రమీజాబి ఘటనపై ఆమె స్పందించిన తీరు అత్యున్నత చైతన్యానికి నిదర్శనం.
ఆమె ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే హైదరాబాదులో రమీజాబిపై పోలీసుల అత్యాచార ఘటనపై పెద్ద ఉద్యమం సాగింది. బాధితుల్ని అపఖ్యాతి పాలుచేయడం ద్వారా చేసిన నేరాల నుండి తప్పించుకునే సంస్కృతి మన సమాజంలో బాగా వేళ్లూనుకుని పోయింది. ''రమీజాబి మంచిది కాదు అంట కదా'' అనే ప్రచారం ఊపందుకుంది. కొందరు ఆహౌరులో కొట్టుకుపోయారు కూడా. ఆమె వెరవలేదు. ఒక ఎమ్మెల్యేగా ఉద్యమంలోకి ఉరికింది. ఒకప్పుడు తుపాకీ పట్టి ఉరికినట్టే. అదీ ఆమె తెగువ, చిత్తశుద్ధి.
తెలంగాణ యాసలో ఆమె ఉపన్యాసాలు మనసుని తాకేవి. స్త్రీ జాతి గురించి చెప్తూ 'నెత్తి నిత్తు నేలరాలిందనక' అంటే నెత్తి మీద అక్షంతలు పడ్డప్పట్నుంచి స్త్రీ చాకిరీలో మగ్గిపోతుందని చెప్పేవారు. కార్యకర్తల్ని తయారు చేయాలన్న నిర్మాణ కర్తవ్యాన్ని 'లొట్టలు కట్టి బావిలో పడేయండి' అంటూ పిల్లలకి ఈత నేర్పిన పద్ధతిని చెప్పేవారు. ఇటువంటి అనుభవాలు ఎన్నో. సాయుధ పోరాట కాలంలో దళ నాయకురాలిగా పనిచేసిన అనుభవం ఆమె ప్రతి మాటలోనూ, చేతల్లోనూ కనిపించేది. మీనమేషాలు లెక్క పెట్టేది కాదు. నాన్చుడు లేదు. తప్పుగాని ఒప్పుగాని సునాయాసంగా నిర్ణయాలు చేసేది.
ఆమె జనారణ్యంలో గెరిల్లా. ఇక్కడ ఒక ఘటన చెప్పాలి. ఆమె ఎంఎల్ఎగా ఉన్న కాలంలో జరిగింది. ఒక రైతు బ్యాంకుకు అప్పు పడ్డాడు. బ్యాంకు ఆయన ఎడ్ల బండిని ఎడ్లతో సహా జప్తు చేసింది. బండిని పోలీస్ స్టేషన్లో పెట్టారు. రైతు వచ్చి ఎమ్మెల్యేగా ఉన్న స్వరాజ్యం దగ్గర మొత్తుకున్నాడు. పోలీస్టేషన్‌కు పోయి ఘర్షణపడ్డాది. పోలీస్ డిపార్మెంట్ వినదు కదా. 'చట్టం తన పని తాను చేస్తుంది' అని ముక్తాయిస్తుంది. 'మంచిది. ప్రజా నాయకురాలిగా నా పని నేను చేస్తున్న నీ ఇష్టం వచ్చింది చేసుకో' అని ఎడ్లతో సహా బండిని రైతుకు అప్పగించింది. ఇది స్వరాజ్యం గెరిల్లా తత్వం. ఇటువంటి అనుభవాలు ఎన్నో.
ఆమె గురించి చెప్పవలసిన మరో ముఖ్య విషయం ఏమంటే, ఆమె ఆంధ్ర- తెలంగాణ వారధి. తెలుగు భాష మాట్లాడే వారే అయినా జీవనవిధానంలో, పలికే భాషలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యక్షంగా నైజాం పాలనలో ఉంటే, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ స్వాధీనంలో ఉంది. అయినా జీవన సారం ఒక్కటే కదా. ఇరు ప్రాంతాల ప్రజలు ఒకరికొకరు చేరువ కావడానికి, అర్థం కావడానికి ఆమె ఉపన్యాసం, నాయకత్వం పని చేసింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర ప్రాంతం దన్నుగా నిలిచింది. పోరాట యోధుల్ని కడుపులో పెట్టుకొని కాపాడింది. ఆంధ్ర కమ్యూనిస్టు నాయకత్వం ప్రోత్సాహంతో చిన్నవయసులో స్వరాజ్యం ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో విస్తృతంగా పర్యటించినపుడు నిధులు సమీకరించి రూపాయల దండలు వేశారట. అంతెందుకు సుబ్బారెడ్డి స్టేడియంలో ఆమె ఉపన్యాసం ఇటీవలి చరిత్ర. 1992-93 మధ్యకాలంలో మద్య వ్యతిరేక ఉద్యమానికి నాంది నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రభుత్వం తలపెట్టిన సారా పాటలు ఆక్షన్ అడ్డుకోవడానికి వేలాది మందితో జరిగిన ప్రదర్శన. స్త్రీలు ట్రాక్టర్లు నడుపుతూ వచ్చారు. బహిరంగ సభలో స్వరాజ్యం ఉపన్యాసం ఉర్రూతలూగించింది. కర్తవ్యం బోధించింది. ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది.
స్త్రీలకు ఆస్తి హక్కు నిత్యం ఆమె నోట్లో నానుతూ ఉండే సమస్యల్లో ఒకటి. వారసత్వ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా వాటా కావాలన్నది మహిళా ఉద్యమం యొక్క చిరకాల లక్ష్యం. ఎన్టీ రామారావు హిందూ వారసత్వ చట్టానికి మార్పులు తెచ్చే క్రమంలో అసెంబ్లీ ఒక కమిటీని నియమించింది .ఆ కమిటీ సభ్యురాలిగా ఆమె రాష్ట్రమంతటా పర్యటించి వారసత్వ ఆస్తితోపాటు భర్త ఆస్తిలో కూడా వాటా కావాలనే మహిళా సంఘం డిమాండును కామ్రేడ్ సూర్యావతి, ఉదయం గార్లతో కలిసి ముందుకు తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం సారథ్యంలో 1985లో హైదరాబాదులో అసెంబ్లీ ఎదుట వేలాది మందితో సభ జరిగింది. ఆ సభలో వేలాది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఇచ్చాం. స్త్రీలకు మరుగుదొడ్లు, గర్భిణులకు అలవెన్సులు మొదలుకొని ఆడ పిల్లలకు ప్రత్యేక పాలిటెక్నిక్‌లు, కాలేజీలో కరాటే శిక్షణ వంటి అనేక డిమాండ్ల రూపకల్పనలో ఆమె భాగస్వామి అయ్యారు.
ఉత్తమ కమ్యూనిస్టుకు పదవులు తృణప్రాయం. అయినా ఆమె పదవీ బాధ్యతలు ఈ తరానికి తెలియాలి. ఆమె సారథ్యంలో 1980లో సూర్యాపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం రాష్ట్ర మహాసభలో అధ్యక్షురాలిగా ఉదయం గారు, కార్యదర్శిగా స్వరాజ్యం ఎన్నికయ్యారు. 1984లో మరల మిర్యాలగూడలో మహాసభ జరిగింది. ఆ సభలోనే మరో తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మను సన్మానించాం. మహిళా ఉద్యమ పునర్నిర్మాణంలో కామ్రేడ్స్ మానికొండ సూర్యావతి, మోటూరు ఉదయం గార్లతో కలిసి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పర్యటించారు. 1967లో గుంటూరు జిల్లా కాజలో రాజకీయ శిక్షణ తరగతులు, 1974లో ఖమ్మంలో రాష్ట్ర మహాసభ ఆ కోవలోవే.
స్వరాజ్యంలో ఉన్న విశేషం ఏమంటే.. ఆమె పుట్టింది భూస్వామి కుటుంబంలో. అయినా వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాలు ఆమెను ప్రేమిస్తాయి. భూమికోసం భుక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతినిధిగా ఆమెను భావిస్తారు. ఆమె పుట్టిన కులానికి ప్రతినిధిగా ఆమెను ఎవరూ చూడరు. దళితులతో సహా సబ్బండ వర్ణాలు ఆమెను ప్రేమిస్తారు. ఇందుకు కారణం వెట్టిచాకిరికి, కుల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి ఆమెను ప్రతినిధిగా చూడటమే. పై కులాల స్త్రీలతో సహా అందరు స్త్రీలు, స్త్రీల సంఘాల నేతలు ఆమెను అభిమానిస్తారు. సాధారణ స్త్రీల గళాన్ని ఆమె గొంతులో వినిపించడమే ఇందుకు కారణం కావచ్చు. మేధావులు కూడా ఆమెలో ఒక మేధావిని చూస్తారు. చదివింది మూడు నాలుగు తరగతులే. అది కూడా ఇంటి వద్ద అయ్యవారి పాఠాలే. బడి ముఖం చూడాలేదు. కానీ మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనే విశ్వవిద్యాలయం ఆమెకు అనేక పాఠాలు నేర్పింది. పోరాటం అనంతరం రైతు స్త్రీ జీవితం, పిల్లల్ని సాకుతూ, మట్టిలో దిగబడి సేద్యం చేసిన వ్యవసాయదారు జీవితం, స్వాతంత్రా నికి ముందు ఆ తర్వాత సమాజంలో వచ్చిన మార్పులు అన్నీ కలిసి ఆమెకు పీహెచ్డీ పట్టా ఇప్పించాయా అనిపిస్తుంది. ఆమెతో కలిసి పదేళ్ల పాటు పని చేశాను. నేను, ఆమె అధ్యక్ష కార్యదర్శు లుగా, అఖిలభారత కమిటీ ప్రతినిధులుగా కలిసి ప్రయాణం చేశాం. ఆప్యాయతలు పంచుకున్నాం. ఆలోచనలూ పంచుకున్నాం. తగాదాలు కూడా పడ్డాం. ఇప్పుడు ఆమె మనల్ని వదిలి పోయిందని ఏడవడం కాదు చేయాల్సింది. ఏడవడం ఆ మెకు నచ్చని పని. కర్తవ్యోన్ముఖులను చేయడమే ఆమెకు ఇష్టమైన పని. మనం చరిత్రను సృష్టించాలి అని తరచూ అంటుడేవారు. 80 సంవత్సరాల ఉద్యమ జీవితం ఆమె చరిత్రను లిఖించింది. చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మరో అధ్యాయం మొదలైంది.
- ఎస్. పుణ్యవతి