Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధానిగా మా నరేంద్రమోడీ ఉన్నారు కనుక సరిపోయింది. మన దేశం రష్యాను చూసి వణుకుతున్నదని అమెరికా అధినేత జోబైడెన్ అన్నాడు, అదే మరొకరు ఆ పదవిలో ఉండి ఉంటే భారత్ బట్టలు తడుపుకుంటున్నదని అనే వాడు అని ఒక బీజేపీ మిత్రుడు చలోక్తి విసిరారు. చాలా మంది నిజంగానే మోడీ గొప్పతనం గురించి అలాగే అనుకుంటున్నారు. దేశాన్ని ఇంతమాట అన్నా మోడీ మౌనం పాటించటాన్ని చూస్తే ఒక వేళ అంతమాట అన్నా మాట్లాడి ఉండేవారు కాదన్నది కూడా నిజమే కదా! నిజానికి వణుతున్నదని అన్నా ఆత్మగౌరవం గలవారికి అభ్యంతరకరమే... అదేమీ గౌరవ ప్రదమైన వ్యాఖ్య కాదు. సరే, నరేంద్రమోడీకి ఆ మాత్రం తట్టదా? మహానుభావులైన పెద్దల మౌనానికి పలు అర్థాలుంటాయి మరి. ''మోడీ ఏది చేసినా దేశం కోసమే'' అంటున్నారు కదా భక్తులు, మనమూ అందాం !
ఇదిగో ట్రంపూ కశ్మీరు సమస్యలో కాస్త మధ్యవర్తిగా ఉండి ఒకదారి చూపకూడదూ, బాబ్బాబూ నీ పుణ్యం ఊరికే పోదులే అని నరేంద్రమోడీ అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగా చెప్పిన అంశం తెలిసిందే. 2019 జూలై 22న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాషింగ్టన్లో డోనాల్డ్ ట్రంప్‌ను కలుసుకున్నాడు. ఆ సందర్భంగా ఖాన్‌తో కలసి ట్రంప్ విలేకర్లతో మాట్లాడాడు. భారత ఉపఖండంలో శాంతి స్థాపనకు అమెరికా పోషించాల్సిన పాత్ర ఏదైనా ఉందా అని ఇద్దరు నేతలను ఉద్దేశించి ఒక విలేకరి అడిగాడు. శాంతి చర్చల కోసం మేం ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ముందు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపాలంటూ భారత్ మావైపుకు బంతిని తోసి చర్చల పునరుద్ధరణకు అంగీకరించటం లేదు, ట్రంప్ ఆ క్రమాన్ని ముందుకు నెట్టగలరని ఇమ్రాన్ చెప్పాడు. వెంటనే ట్రంప్ మాట్లాడుతూ ఒసాకా జి20 సమావేశాలలో రెండు వారాల క్రితం నేను మోడీతో భేటీ జరిపినప్పుడు కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం లేదా తీర్పరి పాత్ర వహించమని నన్ను అడిగారు, మీరు కోరుకుంటే నేనా పని చేస్తా అన్నాడు. దీని మీద అబ్బే అలాంటిదేమీ జరగలేదని అధికారులు చెప్పారు తప్ప నరేంద్రమోడీ నోరు విప్పలేదు.
రెండవ సారి ఎన్నికల్లో పోటీ చేస్తూ 2020 అక్టోబరు 22న చర్చలో ట్రంప్ మాట్లాడారు. పర్యావరణంపై 2016 పారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించు కోవటం సరైనదే అని సమర్థించు కున్నాడు. అది వారిష్టం అని సరిపెట్టు కుందాం, కానీ ఆ సందర్భంగా చైనా, భారత దేశాల్లో గాలిని చూడండి ఎంత రోతగా ఉంటుందో... అలాంటి దేశాలకు ఆ ఒప్పందం ఉపయోగం అని నోరుపారవేసుకున్నాడు. అంతకు ముందు నెలలోనే హూస్టన్నగరంలో హౌడీమోడీ సభలో ట్రంప్-మోడీ చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తామెంత దగ్గరో అని ప్రవాస భారతీయుల ముందు ఒయ్యారాలను ఒలికించారు. అప్పుడు అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అలాంటి ట్రంప్ దేశాన్ని అవమానించినా నరేంద్రమోడీ నోరు విప్పలేదు. చిత్రం ఏమంటే ప్రభుత్వం కూడా నోరుమెదప లేదు. తాజాగా రష్యాను చూసి భారత్ వణుకుతున్నదని జోబైడెన్ అన్నా అదే మౌనం. చైనాను దెబ్బతీసే తమ దీర్ఘకాలిక పధకంలో భారత్ కీలక పాత్రపోషించాలని కోరుకుంటున్నది అమెరికా. బైడెన్ ప్రకటనతో నరేంద్రమోడీని ఇరుకున పెట్టినట్లయిందని, మరీ తెగేదాకా లాగకూడదనీ కావచ్చు. మరుసటి రోజు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకర్లతో మాట్లాడుతూ నష్ట నివారణకు ప్రయత్నించాడు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్) పథకంలో భారత్ తమకు అనివార్యభాగస్వామి అంటూ ఉబ్బేశాడు. రష్యాతో చారిత్రాత్మక రక్షణ సంబంధం ఉన్నప్పటికీ భారత్‌ను తమ భాగస్వామిగా ఎంచుకొనేందుకు అదేమీ ఆటంకం కాలేదన్నాడు. పాతికేండ్లుగానో ఇంకా ఎక్కువో మా రెండు దేశాల మధ్య రక్షణ, భద్రత సంబంధాలు మరింతగా పెరిగాయి, ఉమ్మడి ప్రయోజనాలలో భారత్ ఎంచుకున్న భాగస్వాములం మేము అన్నాడు. అంతకు ముందు రోజు జోబైడెన్ అమెరికన్ కార్పరేట్ల సిఇఓలతో మాట్లాడుతూ చతుష్టయ దేశాల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి మన వైఖరిని చెప్పనవసరం లేదు. ఒక్క భారత్ తప్ప, అది కొంతమటుకు వణుకుతోంది, జపాన్ ఎంతో గట్టిగా ఉంది, అదే విధంగా ఆస్ట్రేలియా, నాటో, పసిఫిక్ ప్రాంతంలో మేమంతా గట్టిగా ఉన్నాం అన్నాడు.
అమెరికా నేతలు ఇన్ని మాట్లాడుతున్నా నరేంద్రమోడీ మౌనం దాల్చటం భారత ప్రతిష్టకే భంగం. మూడు రోజులు దాటినా ఎలాంటి స్పందన లేదు. దీని గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం. రష్యాను చూసి భారత్ వణుకుతున్నదని బైడెన్ అనటం ''ఒక చిన్న చివాటు (మందలింపు)'' అని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి చిదానంద రాజఘట్ట ఒక విశ్లేషణలో వర్ణించారు. (అంతేగా మరి ఇష్టమైన వారు చావు దెబ్బలు కొట్టినా అబ్బే ప్రేమతో కొట్టిన తియ్యని దెబ్బ అనిపిస్తుంది.) దానిలోనే వ్యూహాత్మక వ్యవహారాల వ్యాఖ్యాత బ్రహ్మ చెల్లానే చెప్పిన మాటలను ఉటంకించారు. ''ఇక్కడొక వైరుధ్యం ఉంది. పూర్తి స్ధాయి యుద్ధ ముప్పుతో సహా చైనా సరిహద్దు దురాక్రమణను భారత్ ఎదుర్కొంటున్న సమయంలో ఆ దురాక్రమణ గురించి బైడెన్ తన నోరు విప్పడు. ఇంతే కాదు రెచ్చగొట్టేందుకు స్వయంగా తోడ్పడి ఎక్కడో దూరంగా జరుగుతున్న యుద్ధం గురించి భారత స్పందనను వణుకుతున్నదిగా మందబుద్ది బైడెన్ వర్ణించాడు'' అని చెల్లానే పేర్కొన్కారు. ''భారత్ మీద బైడెన్ చేసింది అవాంఛనీయ వ్యాఖ్య. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత రష్యా మీద అమెరికా విధానం ఊగిసలాడే పునాదుల మీద పడిపోనున్న కట్టడంలా ఉంది. ఇప్పుడది కూలిపోతున్నది. నాటోలోకి ఉక్రెయిన్ను రప్పించే అమెరికా అవివేకానికిి భారత్ ఎందుకు మూల్యం చెల్లించాలి? అమెరికా ఆంక్షలు మనలను దెబ్బతీస్తున్నాయి. వారిని మనం బలపరచాలా'' అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నారు. మౌనం గురించి మన దేశంలో పెద్ద చర్చే నడిచింది. మన్మోహన్ సింగ్‌ను మౌనముని అన్నారు. సింగ్ ఎందుకు మాట్లాడలేదంటే రిమోట్ కంట్రోల్లో ఉన్నారు గనుక అని కొందరు చెప్పారు. మరి నరేంద్ర మోడీ అలాకాదే! కానీ, ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా పెద్ద మౌన మునిలా ఉంటున్నారు! అంతర్జాతీయంగా పరువుపోతున్న అంశాలే కాదు, దేశీయంగానూ ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా అనేక అంశాలపై మౌనం. తాను మీడియాకు జవాబు దారీ కాదు, ఏదైనా ఉంటే జనానికే చెబుతా అనే సందేశాన్ని జనంలో చొప్పించేందుకు విలేకర్లతో మాట్లాడటమే మానుకున్నారు. నిపుణులు రూపొందించిన కొన్ని పథకాల్లో భాగంగా చేసిన అనేక విన్యాసాలను దేశం చూసింది. ఎంపిక చేసిన విలేకర్లతో, ఎంపిక చేసిన ప్రశ్నలతో ఎంపిక చేసిన పద్ధతిలో మాట్లాడటం కూడా దానిలో భాగమే. అంతే కాదు, ప్రధాని నరేంద్రమోడీ పనిలో ఉన్నారు. అనవసర ప్రశ్నలతో విలేకర్లు దాన్ని చెడగొట్టవద్దు అనే సందేశం ఇస్తున్నారు. మోడీ స్నేహితుడు డోనాల్డ్ ట్రంప్ ఏడాదికి సగటున 22 సార్లు విలేకర్లతో మాట్లాడితే జోబైడెన్ ఇంతరకు 15నెలల కాలంలో 11సార్లు మాట్లాడాడు. ఇవి అధికారిక సమావేశాలు, ఇతరత్రా వేరే సందర్భా లలో మాట్లాడిన వాటిని కలిపితే ఎక్కువే ఉంటాయి. వారు పనీపాటా లేక విలేకర్లతో మాట్లాడు తున్నారా? ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఏ దేశంలోనూ ఇలాంటి ప్రజా ప్రతినిధి ఇంతవరకు లేరంటే అతిశయోక్తి కాదు.
దేశం వణుకుతున్నదని అంటే ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించుకొనే వారికి విసుగు పుట్టి ఆలోచించటం మానుకోవాలే తప్ప మోడీ మాట్లాడరని తేలిపోయింది. అమెరికా రెచ్చగొడితే మనం రెచ్చిపోవాలా అని ఎవరైనా అనవచ్చు, ఇక్కడ రెచ్చిపోవటం కాదు, మనకూ 56అంగుళాల ఛాతీ ఉందన్న సందేశం అన్నవారికి ఇవ్వాలా వద్దా?
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288